Previous Page Next Page 
మధుమాసవేళలో ... పేజి 6

 

    ఆలోచించదల్చుకోలేదు మదన్ గోపాల్. టకీమని జేబులోంచి పర్స్ తీసి మూడొందలు వైజయంతి చేతిలోపెట్టాడు.
    
    "ఇదన్యాయం అద్దె పెంచిందిగాక మూడునెల్ల ఎడ్వాన్స్ కూడా పుచ్చుకోటం" అని జాలితల్చింది. అలా తల్చింది కదా అని తిరిగిచ్చే పిచ్చిపని చేయలేదు. మూతిమూడు వంకరలు తిప్పింది.
    
    "మూతి అలాతిప్పుతుంటే ముద్దొస్తూవుంది" అని అనుకుని "వెళ్ళొస్తానండి. మంచిరోజు చూసుకుని వస్తాను" అన్నాడు మదన్ గోపాల్.
    
    "వెళ్ళిరండి" అంది వైజయంతి.
    
    ఈపిల్ల దానితో జాగ్రత్తగా వుండాలి" అనుకున్నాడు మదన్.
    
    "ఈ పిల్లవాడితో జాగ్రత్తగా వుండాలి. వినయంగా కనుపడుతున్నాడుగాని... కనపడనంత వినయవంతుడు కాక పోవచ్చు" అనుకుంది వైజయంతి.
    
    మదన్ గోపాల్ రోడ్డెక్కాడు.
    
    వైజయంతి గుమ్మంలోనే నుంచుని అతగాడు కొంత దూరం వెళ్ళింతరువాత వెనుతిరిగి తన్ను చూస్తాడని వూహించింది. అలాగనక అతను చూస్తే తన అంచనా కరెక్ట్ అని, మగాళ్ళ బుద్దే అంతని, పెళ్ళికాని కుర్రాళ్ళకదో రోగమని... ఇలా ఎన్నో అనుకోవాలనుకుంది.
    
    మదన్ గోపాల్ తిరిగి చూడకుండా ముందుకుసాగి కనుమరుగయ్యాడు.
    
    ఫెడేల్ మంటూ తలుపు లేసింది వైజయంతి.

 

                                                    3
    
    "మదనా...మదనా...మదనా..." అంటూ పెద్ద గొంతుకతో పాటందుకుంది త్రిలోకసుందరి.
    
    పాటింటున్న వైజయంతి "నోరుముయ్యి" అంది.
    
    పాటాపి "ఎవరిది?" అంది త్రిలోకసుందరి.
    
    "పాతజోకు లెయ్యకు" అని కోప్పడి "పక్కభాగంలో అద్దెకి దిగారె బామ్మగారు మనవడు వాళ్ళని గుర్తుంచుకో మన్నానా?" అంది వైజయంతి.
    
    "గుర్తుంది."
    
    "మరయితే ఈ పాటేమిటి? అతనిపేరు మదన్ గోపాల్ అని తెలుసుకదా! మదనా...! మదనా....! అంటూ పాడావంటే తన్నే పిలిచాననుకుని పరుగెత్తుకువస్తాడు."
    
    "నాకు పాటలంటే ప్రాణం అని తెలుసుకదా?" అంది త్రిలోకసుందరి బోలెడు బాధపడిపోతూ.
    
    "నిన్నెవరు పాడవద్దన్నారు. మదనా... మదనా... పాట మానేసెయ్యి."
    
    "ఆ పాటంటే నాకు ప్రాణమే!"
    
    "నీ ప్రాణాన్ని యముని వేషంలోవున్న యన్.టి.ఆర్ ఎత్తుకెళ్ళా" అంటూ ముద్దుగా కోప్పడింది వైజయంతి.
    
    త్రిలోకసుందరి వైజయంతి స్నేహితురాళ్ళు, వైజయంతి వాళ్ళ ఇంట్లోనే ఓ భాగంలో అద్దెకుండి త్రిలోకసుందరి తనవాళ్ళతో గత్యంతరం లేక సగంలో కాలేజీ చదువు ఆపుచేసి దొరికిన వుద్యోగంలో చేరిపోయింది. ఇరువురు ప్రాణస్నేహితురాళ్ళయిన అద్దెలే ఆధారంగా బతుకుతున్న వైజయంతి స్నేహితురాలివద్ద అద్దె తీసుకుంటున్నది. ఫస్టుతారీఖు సాయంత్రం ఇంట్లో కాలుపెడుతూనే ముందు అద్దె డబ్బులు వైజయంతి అమ్మగారికిచ్చి ఆపై తన వాటాలో కాలు పెడుతుంది త్రిలోకసుందరి. ఇన్ని వసతులతో ఇంత చౌకగా ఈ వూరి మొత్తంమీద ఇలాంటి అద్దెయిల్లు దొరకదని త్రిలోక సుందరికి బాగా తెలుసు.
        
    
    "మదనా....మదనా.....పాడొద్దన్నావు. గోపాల బాలా నందగోపాలా పాడినా తన్నే పిలిచాననుకోవచ్చుకదా ఆ మన్మధుడు?" లా పాయింట్ లాగింది త్రిలోకసుందరి.
    
    "ఏడ్చినట్లువుంది" విసుక్కుంది వైజయంతి.
    
    "మదన గోపాల రెండుపేర్లతోనే సరిపుచ్చుకున్నాడు ఓ పాతికదేముళ్ళ పేర్లు కలిపి పెట్టుకుంటే చచ్చేదాన్ని ఏ పాటపాడాలో తెలియక ఏడ్చినట్లేమిటి? నిజంగా ఏడ్చే దానిని...."

 Previous Page Next Page