Previous Page Next Page 
అరుణ పేజి 5

    కూతురి భవిష్యత్తు నిర్ణయం ఆమె మీదే వదిలేయవల్సి ఉంటుంది. డాక్టరు చదివిన కూతురు ఉద్యోగం చేయకుండాఇంట్లో కూర్చోదుకదా? ఆడపిల్ల అంత పెద్దచదువులు చదవడం. ఉద్యోగాలు చేయడం తమకుంటుంబంలో అలవాటులేదు. ఇన్ని ఆలోచించింది భార్య కొడుకులతో సంప్రదించారు ఆయన. ఎవరు మాత్రం ఏం అడ్డు చెప్పగలరు? అన్నింటికంటే అరుణ పట్టుదలకి అందరూ తల ఒగ్గక తప్పలేదు. కూతురు అభీష్టానికి ఏనాడూ అడ్డు చెప్పడం అలవాటులేని ఆయన. ఈనాడూ చెప్పలేకపోయారు. కూతురి ఉత్సాహాన్ని, అభిమతాన్ని త్రోసిపుచ్చలేక పోయారు. డాక్టరు చదివినంతమాత్రాన కూతురు తన మాట వినదని ఏముంది? ఇంకో డాక్టరును చూసి పెళ్ళిచేసే ఇద్దరూ ఉద్యోగం చేసుకుంటారు. అంతగా ఆమె ఇష్టం వచ్చినవాడినే ఎన్నుకుంటే అది ఓ నేరంగా ఈ రోజుల్లో చలామణి అవడం లేదుకదా? లోకంతోపాటే అని తనూసరి పెట్టుకోవచ్చు...... అనుకున్నారు.
    ఇంటర్లో ఫస్టుక్లాసు తెచ్చుకుని. సునాయాసంగా మెడిసన్ లో సీటు సంపాదించుకుంది అరుణ. ఉన్న ఊళ్ళోనే చదువుకొనక, ఆడపిల్లని పొరుగూరు పంపి చదివించాలన్న ఇబ్బందికూడా లేకపోయింది రామారావుగారికి మెడికల్ కాలేజీలో చేరిన దగ్గిరనించి అరుణకి ఒకటే ఉత్సాహంగా ఉండేది.. అయిదేళ్ళకోర్సు ఒక ఏడాదిలోనే చదివేసిడాక్టరు అయిపోవాలన్నంత ఉత్సాహంగా ఉండేది ఆమెకి. మెడికల్ కాలేజీలో చేరిన దగ్గిర నించి అరుణలో కాస్త మార్పువచ్చింది. స్వతహాగాముభావంగా అట్టేతొందరగా అందరిని మిత్రులను చేసుకొని అరుణ కూడా కొద్దిగా మారింది. చిన్నప్పటినుంచి డాక్టరు చదువుమీద ఉన్న అభిమానంవల్ల కాబోయే డాక్టర్లతో ప్రొఫెసర్లతో లెక్చరర్లతో అందరితో మాట్లాడాలని అందరితోనూ స్నేహం చేసుకోవాలని అభిలాష కలిగింది. ఆమె అందానికీ, ఆమె తెలివితేటలకి ఆకర్షితులైన వారితో, పరిచయం పెంచుకుందామని అభిలాషించే వారితో స్నేహం ఆరంభించడం అరుణకి అట్టే కష్టమనిపించలేదు.
    చదువుతో, స్నేహితులతోరోజులు నిమిషాలుగా గడిచిపోయాయి అరుణకి. తను డాక్టరయింది అన్నరోజు అరుణసంతోషానికి అవధులు లేవు" డిగ్రీ తీసుకుంటూంటే చేతులు వణికాయి, కళ్ళు చెమర్చాయితను కన్న కలలుఈనాటికి ఫలించాయి అనుకుంది. ఇంకొక్క సంవత్సరం. హౌస్ సర్జనీ కూడా పూర్తయితేతను డాక్టరయిపోతుంది. అప్పుడు...... అప్పుడింక రోగులకి యధోచితంగా తనుసహాయపడవచ్చు. తనూ ఓ మంచిపనిచేస్తున్నానన్న తృప్తి పొందవచ్చు. అరుణ ఆశయం అదే.    అరుణలక్ష్యసిద్ది అదే. ఏదో చెయ్యాలి......అందరిలాగ కాక ఏదో ప్రత్యేకతతనకు ఉండాలి. అరుణఆలోచన అది:
    రామారావుగారికీ చాలా ఆనందంగానే ఉంది. కూతుర్ని చదివించడానికి ముందు సందేహించినా, చదువులో ప్రవేశపెట్టక ఓ మంచిపని చేశానన్న తృప్తి కలిగింది ఆయనకి. డాక్టర్ల అవసరం ఎంతో ఉన్నదేశానికి ఒక డాక్టరుని అందజేసినా అదీ ఒక సహాయమే అనిపించేది. తెల్లచీరకట్టుకుని మెడలో స్టెతస్కోపు వేలాడేసుకుని నిరాడంబరంగా, నిర్మలంగా కాలేజీకి వెళ్ళే అరుణని చూస్తూంటే ఏదో తెలియని గర్వంతో, ఆనందంతో ఆయన మనసు నిండిపోయేది. కాలేజీనించి రోజూవచ్చి కొత్త కొత్తకేసులు, రోగాల గురించి, డయాగ్నసిస్ గురించి అరుణ చెబుతూంటే ఆసక్తిగా వినేవారు రామారావుగారు. చెపుతున్నప్పుడు అరుణ కళ్ళలో తళుకుకనిపించేది ఆయనకి.
    ఆమె ఆసక్తిని ఆమె ఉత్సాహాన్ని చూస్తే తప్పకుండా అరుణ ఒకనాటికి మంచిడాక్టరవుతుందని, పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటుందని పించేది రామారావుగారికి. కూతుర్ని చూసింది పొంగిపోతూంటే కమలమ్మ కాస్తనవ్వుతూ 'ఈనాటికి మీ రొక్కరే కన్నట్లున్నారు కూతుర్ని...... అంతలా ఏదో ఘనకార్యం మీ రొక్కరే చేసినట్లు పొంగిపోతున్నారు' అంటూ దెప్పుతుంది. "కూతుళ్ళని అందరూ కంటారు. మనఅరుణ లాంటి కూతుళ్ళనికన్న వాళ్ళు ఎంతమందోచెప్పుదూ?' అంటూ నవ్వుతూ సవాలు చేస్తారాయన. 'బాగుందిసంబరం' అంటుంది కమలమ్మవిసుగు నటిస్తూ.
       చిన్నప్పటినించి అరుణకి తల్లి కంటేతండ్రి దగ్గిర చేరికెక్కువ. ఆయనంటే పూజ్యభావంఉండేది. తండ్రిశక్తి సామర్ధ్యాలమీద, ఆయన అభిప్రాయాలమీద అపారమైన గురి అరుణకి. తండ్రిసర్వజ్ఞుడని అభిప్రాయం. తల్లి ఎన్నోసార్లు చెప్పినా చేయని పని తండ్రి ఒక్కసారి చెప్పగానే, ఆయన నోట్లో మాట ఉండగానే చేసేది.... ఆయన చెప్పింది, ఆయన చేసేది అనుసరించడమే తనకర్తవ్యం అన్నట్టుండేది. చిన్నతనంలో తండ్రి రోజూ పూజచేయడం ఎందుకో అర్ధంకాకపోయినా, ఆయనతోపాటులేచి, పూలుకోసి ఉత్సాహంగా అందించేది పూజచేసుకుంటున్న తండ్రిని చూస్తే ఇప్పటికి అరుణకి దేవుడి కంటే తండ్రికి నమస్కరించబుద్ది వేస్తుంది.
    నుదుట చందనం. మధ్యఎర్రటి కుంకుమ, తెల్లపట్టుపంచ, పైన ఉత్తరీయం, వెలిగించినజ్యోతుల నీడలుకళ్ళలో ప్రతిఫలిస్తూంటే గంభీరంగా చేతులుజోడించి దైవప్రార్ధన చేసే తండ్రిని, ధూప దీప నైవేద్యాలతో, పూవులతో వెలిగే విగ్రహాలను చూస్తూంటే...... ఆ గదిలో అడుగు పెట్టగానే అరుణ అప్రయత్నంగా నమస్కారంచేసేది. పూజ అయ్యాక తండ్రి అందించినా హారతి కళ్ళకద్దుకుని, ప్రసాదం తీసుకునేది. డాక్టరు చదివిన అరుణ...... మనిషిని, మనిషిలో యంత్రాలని చూశాక ఒక్కొక్కటీ తెలుసుకుంటూంటే భగవంతుడు అన్నవాడు ఉన్నాడా అనేసందేహం వచ్చేది ఒక్కోసారి..
    
    సైన్సు, విజ్ఞానం ఇంత పురోగమించినా మనిషికి తెలియనిది, మనిషికి అందనిది, అర్ధంకానిది చాలా ఉంది. బహుశాదాన్నే దైవం అంటారేమో? ఏదో మానవాతీతశక్తి ఉందని అందరూ ఒప్పుకోవాలి. బహుశా దాన్నేమన 'దైవం' అంటున్నాంగాబోలు అనుకునేది అరుణ. ఈ విషయాలు తండ్రితో చర్చించాలనివున్నా భగవంతుడి పట్ల ఆయనకున్న అపారమైన భక్తివిశ్వాసాలు తెలుసు గనక ఈ చర్చ ఆయనకి కష్టం కలిగిస్తుందని ఆ ప్రశ్నలువేయలేకపోయేది అరుణ. ఒక్కోసారి ఈ పూజా పునస్కారాలూ అర్ధరహితంగా కన్పిస్తున్నా, తండ్రిమీద భక్తికొద్దీచిన్నప్పటిలాగే ఇప్పటికీ పూలు అందించడం, ప్రసాదం తీసుకోవడం యథాప్రకారం చేస్తూనే ఉంటుంది.
    "అరుణా, ఏమిటా దీర్ఘాలోచన?"    
    తలవంచుకుని ఇసుకలో పిచ్చిగీతలుగీస్తూ పరధ్యానంగా ఉన్న అరుణని చూస్తూ అడిగాడు వేణుగోపాల్. బీచిఅంతా సంజ చీకట్లు అలుముకుంటున్నాయి. జనం కొందరు లేచిఇళ్ళకు బయలుదేరారు. తదియ చంద్రుడు అప్పుడే ఉదయిస్తున్నాడు కెరటాల హోరు, గాలిరొద, రేడియో సంగీతం, పిల్లల అరుపులు అన్నీ కలిసి అదోరకంగోలగా తయారయింది. జనానికి దూరంగా ఓ పడవచాటున కూర్చున్నారు అరుణ వేణుగోపాల్. ఆ ఉదయం తండ్రితో సంభాషణ తర్వాత తన అభిప్రాయాలు వేణుతో కూడా చెప్పాలని ఆరాటంగా ఉంది అరుణకి. తన అభిప్రాయాలు వివరించి, తన ఆశయాలని వెల్లడించి వేణుసహాయ సహకారాలుకోరాలని ఆతృతగా ఉంది. వేణు విని తనని ఎంత మెచ్చుకుంటాడో? అలాంటి ఐడియా వచ్చినందుకు అభినందించడా? కాని, సంభాషణ ఎలా ఆరంభించాలో అర్ధంకాక ఆలోచిస్తూంది అరుణ. వేణుకి తనకి పరిచయంఅయి రెండేళ్ళు పైన అయింది. ఈ రెండేళ్ళలో తమ పరిచయం అనేక మలుపులు తిరిగింది. పరిచయం, స్నేహం ....... తరువాత......ఈ ఏడాదినించి తమస్థితిని ఏమనుకోవాలి? వేణు అంటే తనకి ఉత్త స్నేహభావంమాత్రమే కాదు. అయినా, ఇప్పటివరకూ ఒకరి అభిప్రాయం ఒకరికి వెల్లడించలేదు: ముందు చదువుకావాలి.
    తక్కిన విషయాలు తరవాత గదా అని తొందర ఎందుకు అనుకుంది. వేణు పైకిచెప్పకపోయినా అతనిమనసులో తనకెలాంటిస్థానం ఉందో ఎన్నో సందర్భాలలో తను గ్రహించింది, తన సామీప్యం కోసం వేణుపడే ఆరాటం, తనతో మాట్లాడాలన్న అతని తహతహతన సమక్షంలో వేణుకళ్ళలో కనిపించేమెరుపు....... వాటి అర్ధంఏమిటో తెలియనంతచిన్నపిల్లా కాదుతను. ఉత్త స్నేహమే అయితే, తామిద్దరి మధ్య ఈ అనుభూతులకి తావుండదు.
    వేణు, తను వివాహంచేసుకుని ఓ మంచిఊళ్ళో ప్రాక్టీసు పెట్టిఒక డాక్టరుకి ఇంకో డాక్టరు తోడయినిలిస్తే, అక్కడి ప్రజలకుచేతనయినంతగా సహాయపడుతూ......ఓహ్! ఎంతబాగుంటుంది!! వేణుసాహచర్యం తనకుతోడయితే తనుఏదైనా సాధించగలదు. వేణు తనకు జతగానిలిస్తే తను చేయలేనిది ఏముంటుంది?
   అరుణ ఊహల మేడల అంతస్తులు పెరుగుతున్నాయి.  
    "అరుణా! ఏమిటంతలా ఆలోచిస్తున్నావు? నాకూ చెప్పకూడదూ?" వేణు మళ్ళీ పిలిచాడు.
    తలఎత్తి అతని వంకచిరునవ్వుతో చూసింది అరుణ, ఏదో చెప్పబోయితటపటాయించింది.
    మూగనోముపట్టావా? పోనీ సంజ్ఞలన్నాచేయి" నవ్వుతూ అన్నాడు.
    "ఊఅది కాదు వేణూ నీతోఒకటి చెప్పాలని......."
    "అరేనేనూ నీతో ఒకటి చెప్పాలనుకుంటున్నాను. గమ్మత్తుగా ఉందికదూ, ఇద్దరం ఒకే టైము చూసుకోవడం?"
    అరుణగుండె ఒక క్షణం లయతప్పింది. వేణుచెప్పబోయేది ఏదో తెలిసిపోయినట్టయింది.
    "చెప్పు అరుణా! ఏమిటి చెప్పాలనుకున్నావు?" ఆరాటంగా అడిగాడు వేణు.
    'ఊహు ముందు నీవే చెప్పాలి" తడబడుతూ అంది అరుణ.
    వేణుమొహం ఒక్కక్షణం ఎర్రబడింది. అరుణనించిచూపు పక్కకి మరల్చాడు. పక్కనే నడిచి వెడుతున్న జంటవైపు చూశాడు. చెప్పదలచింది సులువుగా చెప్పేమార్గం కనిపించినట్లయింది. హఠాత్తుగా చేయిచాచి అరుణ చేయిపట్టుకున్నాడు. బొంబురుపోయినట్లున్న కంఠంలో....." అరుణా చూడుఅలా...... అలా ఆ జంటలామనమూ జంటగా షికార్లు తిరిగే సమయం ఎప్పుడొస్తుందా అని అడుగుతున్నాను" అన్నాడు. అరుణ తనువంతా ఒక్కసారిగా జలదరించింది, వేణూ చేతిలోని ఆమె చేయి కంపించింది, ఆమె చేతివేళ్ళు వేణుచేతివేళ్ళతో బిగుసుకున్నాయి.

 Previous Page Next Page