"అరుణ! నాకు కవిత్వం రాదు. అందంగా మాటలు కూర్చి చెప్పేనేర్పులేదు సూటిగా అడుగుతున్నాను...... ఎన్నాళ్ళుగానో అడుగుదామని ఇంకా టైము రాలేదేమోనని సందేహిస్తూనేజాప్యం చేశాను. నీ హౌస్ సర్జన్సీ పూర్తిఅయ్యాక అడుగుదామని ఉపేక్షించాను. నీ మనసులో ఉద్దేశం తెలుసుకోవడానికి ఇన్నాళ్ళుగా తటపటాయిస్తున్నాను. అరుణా నీవు నన్ను వివాహం చేసుకుంటావా? నిర్మొహమాటంగా అడుగుతున్నాను. అలాగేనీవూ జవాబియ్యి. మన రెండేళ్ళపరిచయంలో ....... అందులో ఈ సంవత్సరంనుంచీనా మనసేమిటో నీవుగ్రహించే ఉంటావు. నీవు నాతోపరిచయం పెంచుకోవటంలో అర్ధం నీ సమ్మతేనని నమ్మాను. ఆ నమ్మకంతోనే ఇప్పుడు అడుగుతున్నాను." వేణుమాటలు తడబడ్డాయి.
అనుకున్నసమయం వచ్చేసరికి, వేణు అడిగేసరికి అరుణనోట మూగపోయింది. స్త్రీ సహజమైన సిగ్గు ముంచుకు వచ్చింది. వేణు చెప్పినంత సులువుగా తనెలాచెప్పగలదు?
"అరుణా మాట్లాడు ఈ నిశ్శబ్దం, ఈ మౌనం ఈ సస్పెన్స్ నేను భరించలేను. వెంటనే చెప్పు అరుణా" అరుణ చేయినొక్కుతూ ఉద్వేగంగా అన్నాడు వేణు.
"నేను అభ్యంతరం చెబుతానని నీవుఎలా అనుకున్నావు? నామనసు నీవుమాత్రం తెలుసుకోలేకపోయావా? అభ్యంతరమే ఉంటే నీతో ఇలా ఒంటరిగా షికార్లు చేస్తానా?" తలవంచుకుని వేణు మొహంలోకి చూడకుండానే అంది అరుణ.
"అరుణా!" ఆనందోద్వేగంతో అరుణని గుండెలమీదికి లాక్కుని హత్తుకున్నాడు వేణి, అరుణ నెమ్మదిగా విడిపించుకుని నవ్వింది.
"అమ్మయ్య ఈ మాట అడగడానికి ఎన్నాళ్ళబట్టిఎన్నిరకాలుగా రిహార్సల్స్ వేసుకున్నానో తెలుసా?" అరుణని వదిలి జేబులోంచి రుమాలు తీసి నుదుటపట్టిన చెమట ఒత్తుకుంటూ అన్నాడు వేణు.
"కాని వేణు ఒక షరతు."
"అడ్డుఇంక లేదు కనుక ఏ షరతులైనవినడానికి, చేయడానికిసిద్దం" తేలిగ్గా అన్నాడు వేణు.
"వేణూ!"
ప్రతిదానికి అంత సందేహం ఏమిటి? చెప్పు అరుణా!"
"వేణూ ఈ హౌస్ సర్జన్సీ అయ్యాక ఏదైనా పల్లెటూరిలో ప్రాక్టీసు పెట్టాలనుకుంటున్నాను. దానికి నీ సహకారం కావాలి, వేణూ మనిద్దరం వివాహం చేసుకుని, ఏదన్నా మంచి పల్లెటూరు చూసి ప్రాక్టీసు పెట్టి, వైద్య సదుపాయం లేని ఆ చుట్టుప్రక్కల గ్రామాలన్నింటికి డాక్టర్లమయి ఆదర్శంగా గడపాలని నా కోరిక. అదిగో అప్పుడే నా కళ్ళకి ఏం కనిపిస్తుందో చూడు....... ఓ నర్సింగ్ హోమ్ ఇద్దరం తెల్లకోట్లు తొడుక్కుని స్టెతస్కోపులు పట్టుకుని మగవాళ్ళకి నీవు, ఆడవాళ్ళకి నేను పరీక్షించి మందులుఇస్తున్నాం ఇద్దరం కలిసి ఆపరేషన్లు చేస్తున్నాం. కొద్ది కాలంలోనే మనిద్దరిపేరు చుట్టుపక్కల మార్మోగుతుంది. ఒక మంచిపనిచేస్తున్నామన్న తృప్తితో మన మనసులు ఆనందంతో....." అరుణకళ్ళు మూసుకుని ఆవేశంతో చెపుతూంది.
తెల్లబోతూచూశాడు వేణు "అరుణా ఏమిటంటున్నావు నీవు" అర్ధంకాక అడిగాడు.
"అవును వేణూ, ఈ చదువుచదివినందుకు చేతనయినంతగామానవసేవ చెయ్యడమే మన లక్ష్యం? సరియిన వైద్య సహాయం లభించక అవస్థపడే గ్రామాలలో..... మనలాంటివారి అవసరం ఎంతైనా ఉంటుంది. ఇలాంటి చోటుకంటే...... ఏమిటిఅలా చూస్తున్నావు?
నేచెప్పింది నచ్చలేదా?"
"నీవేం మాట్లాడుతున్నవో నాకేం అర్ధం కావటంలేదుహాయిగా ఉన్న ఊళ్ళో సదుపాయాలన్నింటిమధ్య ఉన్న ఉద్యోగాలని వదులుకుని నానా అవస్థలు పడుతూపోయి ఎక్కడో ప్రాక్టీసులు పెట్టడం ఏమిటి?"
"నీవూ అలాగే అంటావా?" హతాశురాలైచూసింది అరుణ.
"నేనేకాదు ఎవరైనా అదే అంటారు మన మేమన్నా ఇంగ్లండు, అమెరికాల్లో ఉన్నామనుకుంటున్నావా పల్లెలయినా పట్టణాలయినా సదుపాయాలు ఒక్కలాగే ఉంటాయనుకోవడానికి? దిసీజ్ ఇండియా మేడమ్ ఆ సంగతి మీరు మరిచిపోయినట్లున్నారు మైగాడ్: ఆ వెధవ పల్లెటూళ్ళలో ఎవరుండగలరు? ఓ సినిమానా, ఓ పుస్తకాలా, ఓ ఇల్లా రోడ్లాలైట్లా? లైఫ్ ఎంత మిజరబుల్ గా ఉంటుందో నీ కసలు ఐడియా ఉందా?"
"వేణూ అందరూ స్వసుఖమే చూసుకుంటేదేశం ఎప్పటికి బాగుపడుతుంది?" దీనంగా అడిగింది అరుణ.
"ఏమోబాబూ అంత పెద్దఆశయాలు ఆదర్శాలునాకు లేవు బాబూ అంత త్యాగాలు చేయడంనాకు చేతకాదు. అంత స్వార్ధరహితత్యాగాలు చేయడానికి మనం మానవమాత్రులమండీ, అరుణాదేవిగారూ, "ఆ సంభాషణ తమాషాగా జమకట్టి హాస్యంగా అన్నాడు వేణు.
అరుణ మొహం నల్లబడింది. కట్టుకున్న ఆశాసౌధలు కళ్ళముందే కూలిపోతూంటే పడే ఆవేదన ఆమెకళ్ళలో స్పష్టంగా మెదిలింది వేణుతోకలిసి ఎన్ని గాలిమేడలు కట్టింది అన్నీ ఇంతతేలిగ్గా ....... ఒక్క క్షణంతో తోసి పారేస్తాడని తనమాటలని తన నిర్ణయాలని తన ఆశయాలని గాలిలో ఎగరగొట్టేస్తాడని ఎదురుచూడని అరుణమనసు దెబ్బతింది వేణు మాటలతో. వేణూ ఒక డాక్టరయి ఉండి తనని తన ఆశయాన్ని అర్ధం చేసుకోకపోవడమే కాక హేళనచేస్తున్నాడు.
అరుణమొహం చూస్తూంటే ఇదేదో సర్దాకి అన్న మాటలుకావనిపించింది వేణుకి. ఆదుర్దాగా ఆ గుడ్డి వెలుగులో ఆమె ముఖంలో భావాలు చదవడానికి ప్రయత్నించాడు. "అరుణా కొంపదీసి నిజంగానే అంటున్నావా ఏమిటి?"
అరుణముఖంలో కాఠిన్యం అలుముకుంది "అబద్దాలు, అతిశయోక్తులు, హాస్యాలు చెప్పేఅలవాటు నాకులేదు.
అరుణగొంతు విని చకితుడైనవేణు అరుణ చాలాసీరియస్ గా మాట్లాడుతూంది అని గ్రహించాడు.
"అరుణా నీకీ ఉద్దేశ్యం ఎప్పుడు ఎందుకు కలిగింది? నీ ఈ ఆలోచన మాత్రం సరిఅయినది కాదు."
"ఏం ఎందుకు కాదు?"
"నోటితో చెప్పినంత తేలికకాదు ఈ విషయం. అసలు ప్రైవేటుప్రాక్టీసు అంటేనే బాధ్యతతో కూడినది, అదృష్టం మీద ఆధారం పడినదీనూ ముందు తగినంత ఆర్ధిక స్తోమత ఉండాలి. మన తెలివి తేటలమీదకంటే అదృష్టం మీద ఆధారపడాలి. ఇలాంటిపట్టణాలలో అయితే రోగాలు విపరీతంగా పెరిగిన ఈ కాలంలో పెరిగిన ఈ కాలంలో వీధికి నలుగురు డాక్టర్లున్నా బాగానే డబ్బు చేసుకోవచ్చు. ఆ గ్రామాలలో డబ్బిచ్చినీచేత వైద్యం ఎందరు చేయించుకుంటారు? అసలింతకీ ఆ ఊళ్ళలో....... ఏ సదుపాయాలు లేనిఊళ్ళలో...... నీవేంవైద్యం చేయగలవు? ఆపరేషన్లు చేస్తావా? ఎమర్జన్సీలు అటెండ్ కాగలవా? మహా అయితే దగ్గులు, జలుబులు, విరేచనాలకి మాత్రలు రాసి ఇస్తావు. అన్ని రంగునీళ్ళు పోస్తావు."
"పోనీ ఆమాత్రం, ఆ రంగునీళ్ళయినా లేకుండా బాధపడేవారికి ఆ మాత్రం సహాయం చేయగలిగినా ఆనందమేగా?" పట్టుదలగా అంది అరుణ.
"అరుణా డాక్టరు మానవాతీతుడు కాదు. ఇబ్బందులతోత్యాగాలు చేయమనిఎవరూ అనరు: డాక్టరయినా మానవసేవతో పాటు బ్రతుకు తెరువూ ఉండాలి. కేవలం ఆశయాలనే నమ్ముకుని ఎవరు బ్రతకగలరు? అసలు 'సర్వీస్ టు హుమానిటీకి దగ్గర తోవ గవర్నమెంటు ఆసుపత్రులే...... తెలుసా? ఎన్ని వేలమందిరోగులు వస్తారు రోజునీ మానవ సేవా భావం వాళ్ళ మీద చూపించి, రోగులని దయగా, శ్రద్దగా పరీక్షించు. శ్రద్దాసక్తులతో వారి రోగాలని నిర్మూలించడానికి పాటుపడు. అదే మానవసేవ. దానికి ఇలాంటి ఆసుపత్రులలో కంటే రోజుకి ఇద్దరో ముగ్గురో పేషెంట్సు వచ్చే ఆ ఊళ్ళలో ఎక్కువ అవకాశం ఎంత మాత్రం ఉండదు."
"కాని ఇలాంటిచోట మానవసేవచేయడానికి నాలాంటివారు చాలామంది ఉంటారు. నా స్థానంలో క్షణంలో ఇంకొకరు వచ్చి నిలుస్తారు. నేను లేనంతమాత్రాన ఇక్కడి మానవ సేవకి లోపం ఉండదు. కాని, నాలాంటివాళ్ళు ఒక్కరైనా ఒక్కగ్రామ ప్రజలని ఆదుకున్నా నలుగురికి పనికివచ్చినా, నా చదవుకి అర్ధం ఉంటుందేమో? అదే నిజమైనమానవసేవ అవుతుందేమో?" సవాల్ చేసినట్లు చూసింది అరుణ జవాబు తట్టక నిస్సహాయంగా చూశాడు వేణు "ఏమో? నీ ఉద్దేశాలతో నేనేకీభవించలేకపోతున్నాను. ఉన్న ఉద్యోగం వదులుకుని ఠికాణాలేని ఏ పల్లెటూరిలోనో ప్రాక్టీసుపెట్టి మానవసేవ చేయడం నా తరం కాదు. అసలు అన్ని ఇబ్బందులుసహించి అక్కడ ఉండలేను. ఉండడంలో అర్ధమూ కనబడడంలేదు. "గంభీరంగా అన్నాడు.
"నీవనుకున్నంత ఘోరంగా ఉండదు అక్కడ పరిస్థితి. వేణూ! పల్లె అంటే అది ఇరవై గుడిసెలు ఉండే ఊరు కాదు. ఏ రెండువేలు, మూడువేలు జనాభా ఉండే ఊరు చూసుకుందాం. ఆ మాత్రం ఊరికి ఎలక్ట్రిసిటీ ఉండే ఉంటుంది చుట్టుప్రక్కల గ్రామాలు కూడా రెండుమూడు చూస్తే బ్రతుకు తెరువుకి ఏం లోటు ఉండదు. వేణూ ఇద్దరం ఉంటే మైనరు ఆపరేషన్లు చేయగలం. ముఖ్యమైన ఎక్విప్ మెంట్ క్రమక్రమంగా మనమేకూర్చుకోగలం. అప్పుడింకచుట్టినట్టు ఊళ్ళో వారందరూ మనదగ్గరికే రావడం ఆరంభిస్తారు. ఇదంతా నీవనుకున్నంత కష్టంకాదు. ఎటొచ్చీ నీ సహాయ సహకారాలు ఉంటే మనం చెయ్యలేనిది ఏదీ ఉండదని నా నమ్మకం." నచ్చచెబుతున్నట్లుఆశగా అంది అరుణ. వేణుమాట్లాడలేదు. ఈ సంభాషణ వేణు కేంరుచించడం లేదు "ఏమంటావు వేణూ?" సారీ అరుణా నీ ఆలోచనలతో నేనెందుకో ఏకీభవించలేకపోతున్నాను. నీ అంత ఉన్నత హృదయం నాకు లేదు. ప్రాక్టికల్ గా ఆలోచించడం మానేసి ఊహల్లో బ్రతకటం ఆశలతో జీవించడం నాకు సాధ్యం కాదు. అరుణా, నీవు కలవారి అమ్మాయివి.