దీనితో సంపాదన కూడా బాగా పెరిగింది. అంతేగాక డబ్బుకి నిర్భంధించకపోవడం అతని పేరుకి మరింతఖ్యాతి తెచ్చింది. వేలలో ఉంది అతనిఆర్జన. రుక్మిణి తరువాతవాడు వెంకటరమణమొదటినుంచి రమణది పెంకెస్వభావమే. తండ్రిలాగా పొడుగ్గా ఉంటాడు కాని, ఆయన గంభీరత ఏ కోశానా లేదు ఏ విషయమూ సీరియస్ గా తీసుకోడు. జీవితం అతనికో ఆటగా కనిపిస్తుంది. దేని గురించీ బాధపడడు. లేని దానిని గురించి విచారించడు. అసలు అన్ని విషయాలు అతనివిషయంలో అనుకున్నది అనుకున్నట్లు అలాజరిగిపోతున్నాయి, చిన్నప్పుడు ఏది కావాలంటే అది అమర్చారు తల్లిదండ్రులు. కోరుకున్న చదువుమంచి ఉద్యోగం, ఆశించినట్లు అన్ని విధాల తగినభార్య లభించాయి.
మనిషికి ఆశించినవి, కోరుకున్నవి లభ్యమవుతున్నంతకాలం జీవతం ఓ వినోదమైన ఆటలాగే ఉంటుంది. అదే రమణ ప్రస్తుతస్థితి, బరువులు, బాధ్యతలు అతనికి లేవు, ఎవరికీ ఎవరు అన్నట్లు అందరితో మాట్లాడుతాడు. అంతే, అక్కడి నించివెళ్ళి తక్షణంనించి వాళ్ళెవరో, తనెవరో అన్నట్లు ఇంటికి ఉత్తరం ముక్క అయినా రాయడు. రోజుకి ఒకసారయినా రామారావుగారు అనుకుంటారు "వీడు పెద్దకొడుకయ్యాడుగాడు, భగవంతుడు నా పట్ల దయ తలిచాడు" అని.
కృష్ణమూర్తి భార్య సరస్వతి ప్రస్తుతం మంచిదే. కాపురానికి వచ్చిన ఓ రెండేళ్ళ వరకు అత్తవారింట్లో అందరిని గౌరవిస్తూ అభిమానిస్తూనే వచ్చింది. తరువాత ఆమెలో మార్పు రాసాగింది. అత్తవారి ఇల్లు ఓ మాదిరిబందీఖానాగా కనిపించింది. చక్కగా అందరూ పెళ్ళిళ్ళయి, ఝమ్మని కొత్త కాపురాలు పెట్టుకొని ఏ పోరూ పొక్కూ లేకుండాహాయిగా ఉంటూంటే తనకి ఆ అదృష్టం లేదని అనిపించేది. ఏ పనీ స్వతంత్రించిచేయడానికి లేదనితనమాట పలుకుబడి ఆ ఇంట్లో ఏం లేవని అత్తచాటు కోడలుగా ఉండడం తప్ప తనకి ఓ హోదా, అధికారం, లభించడం లేదని అందరూ కొత్త మొగుడుపెళ్ళాలుగా సినిమాలకి, షికార్లకి ఇష్టం వచ్చినట్లు తిరగడానికి, అందరిలో ఉండడంవల్ల వీలవడంలేదని బాధపడేది. ఆ ఇంటిలో తనభర్త సంపాదించడానికి, తను చాకిరీకి మాత్రమే ఉన్నట్లు నొచ్చుకునేది.
తనఇంటిలో అక్కచెల్లెళ్ళు, వదినలు......అందరూ ఎవరికి వారు వేరింటికాపురాలు ముచ్చటగా చేసుకుంటూంటే తనొక్కర్తికే ఆ అదృష్టందక్కలేదని విచారించేది.
ఆ అసంతృప్తి మరిది పెళ్ళయ్యాకమరింత ఎక్కువయింది. మరిది, పెళ్ళాం, పెళ్ళికాగానే ఉద్యోగపుటూరికి వెళ్ళి కాపురం పెట్టుకుంటే, తామిక్కడే పడి ఉండవలసివచ్చిందని అసూయపడేది. ఆ అసంతృప్తితో అత్తవారి ఇంటిలో అందరిమీద అయిష్టం పెంచుకుంది. కమలమ్మ ఏనాడూ కోడలిని ఏ విషయంలోనూ ఆంక్ష పెట్టలేదు. చిన్నవాళ్ళు సరదాలుంటాయని, సినిమాలకి, షికార్లకి తిరగాలని ఉంటుందని తనేవెళ్ళమనేదివాళ్ళని. వంటా, పెత్తనం - అంతా కోడలికే అప్పగించింది ఆమె. అయినా, ఈ మధ్య కోడలు ఎందుకు అస్తమానూ మూతిముడుచుకుని ఉంటూందో ఆమెకి అర్ధం కాలేదు తరచు కొడుకు గదిలోంచి భార్యాభార్తల వాదనలు కాస్త వినిపించేవిరాత్రిళ్ళు. ఈ విషయాలేవీ రామారావుగారికి తెలియవు. సరస్వతి ఏదో వినయంగా భర్తని సతాయించడం ఆరంభించింది. "ఈ మాత్రం ప్రాక్టీసు ఇంకెక్కడా ఉండదా? దాని కోసం ఇక్కడే వుండాలా ఈచాకిరి అంతా నేను చేయలేను ఓ ముద్దు ముచ్చటలేదు. ఓ సినిమాకి ఇద్దరం వెళ్ళాలన్నా లేదు. ఎన్నాళ్ళీబందీఖానా మనకి? నాకు మాత్రం సరదాలులేవా? మీ తమ్ముడుచూడండి పెళ్ళాన్ని వెంటేసుకుని మర్నాడేవెళ్ళిపోయాడు. మనం ఇంతచేసినా మీ తమ్ముడు వచ్చేసరికి అందరూ ఎంతో సంతోషపడిపోతారు. పిండి వంటలు చేస్తారు. ఆ ముద్దులకోడలిని కాలు కదపనీయదు అత్తగారు. మనం ఇక్కడ ఉండి అందరికి లోకువ అయిపోయాం" అని రకరకాల సణగడం, దెప్పడం ఆరంభించింది.
భార్య అంటున్నది ఏమిటో గ్రహించలేకపోయాడు ముందు కృష్ణమూర్తి. తరవాత పోల్చుకున్నాడు. భార్యకి నచ్చచెప్పాడు. మంచీ చెడ్డావివరంగా చెప్పాడు. భార్యచేసే రగడనిచాలా సార్లు భరించి ఓ రోజు ఖచ్చితంగా చెప్పేశాడు. "రెండువేలు, మూడు వేలువచ్చే ప్రాక్టీసువదులుకుని, ఏ గుమస్తా ఉద్యోగమో చూసుకోమనీ సలహా అయితేఅలాగే చేస్తానుకాని ఇంకోచోట ఈ ప్రాక్టీసు ఉంటుందన్నభ్రమ మాత్రం వదులుకో: ఈ పేరు, పరపతినాన్నవని మరచిపోకు. ఇక్కడ నిన్నెవరో బాధలు పెడుతున్నట్లు బాధపడిపోవడం అది అనవసరం. బాగా ఆలోచించి ఏదో చెప్పు, ఇలాంటత్త మామలు తపస్సు చేసినా దొరకరని ఇప్పుడు కాకపోతే తరవాత అయినా తెలుసుకుంటావు.
నిన్నెవరు తక్కువగా చూస్తున్నారు? తమ్ముడు ఎప్పుడో ఒకనాడు వచ్చేవాడని అందరూ ఎక్కువ ఆసక్తి కనపరుస్తారు. నాలుగురోజులుండి పోయేవాళ్ళని ఆమె చేత ఏ పనీ చేయించరు. అంత మాత్రానికి నిన్ను హీనపరుస్తున్నట్టా? ఇక్కడ నీ ఇష్టానికి వ్యతిరేకంగా నిన్నెవరూ ఏం చెయ్యమనలేదు అంతా నీ చేతుల్లోనేపెట్టింది అమ్మ. ఇంతకంటే ఇంకెక్కడో ఏదో సుఖం దొరుకుతుందని ఆశించడం నీ తెలివితక్కువ.
ఈ మాత్రం ఆలోచన లేని మూర్ఖురాలివని అనుకోలేదు నేనెన్నడూ!" అంటూ చీవాట్లు పెట్టాడు. సరస్వతికి మాత్రం మనసులో తెలియదా" ఈ సంపాదన, ఈ ఆస్తి అంతా మామగారిపరపతి అని నిజానికి అత్తమామలు ఏ విషయంలో తనని అడ్డారు? తన అభీష్టాలని ఇక్కడ తీర్చుకోవద్దని ఎవరన్నాడు? భర్త అన్నట్టు పైకి ఎక్కడికో వెళ్ళి ఆర్ధికంగా ఇబ్బందిపడేకంటే ఈ ఇల్లేతన ఇల్లని ఎందుకనుకోకూడదు? కన్న కూతురిలా చూసుకునేఅత్తమామలని వదిలి వెళ్ళి బావుకునే దేముంది? సరస్వతి మనస్సు క్రమంగా మారింది. అందరి తలలో నాలుకల ఉండి, అందరి మెప్పు పొంది ఇలాంటికోడళ్ళు అరుదు అనిపించుకోవడంలో ఉండే ఆనందం వేరింటికాపురంలో లభ్యమవుతుందా? సరస్వతి ఆ రోజు నించిమనస్పూర్తిగా పెద్దకోడలిబరువు బాధ్యతలునెత్తిన వేసుకుని అందరి అభిమానానికి పాత్రురాలయింది. ఇప్పుడు సరస్వతిని కూడ ఓ కూతురుగా భావిస్తారు తప్ప, కోడలని ఆ ఇంటిలో ఎవరూ అనుకోరు.
వెంకటరమణ భార్య వాసంతి బాగాకలవారి పిల్ల. అందం, చదువు అన్నీ ఉన్నాయి. ఆమెలాగే ఆమె భావాలు ఆధునికంగా ఉంటాయి. అత్తవారిఇంట్లో ఏ ఏడాదికో వచ్చినాలుగు రోజులుండి వెళ్ళడం తప్ప. అక్కడ ఉండే అవసరం లేకపోవడంవల్ల ఆమెకి అత్తవారింటిమీద ఇష్టం. అయిష్టం ఏం లేదు. ఉన్న నాలుగు రోజులు సరదాగా ఉండి వెళ్ళడం--అంతే. ఇంటిలోనూ అంతే. నాలుగు రోజులుండివెళ్ళేవారని అంతా ఆప్యాయత కనపరుస్తారు.
అందరికి ఆఖరిది అరుణ వెంకటరమణ తరువాత పదేళ్ళకిపుట్టింది అరుణ అంటే రామారావుగారుకి ప్రాణం కన్నా ఎక్కువ. అందరిలోకి చిన్నది. చాలా రోజులకిపుట్టిందని అందరికీఅభిమానమే అరుణ అంటే, అది ఒక్కటేకాదు అభిమానానికికారణం, అరుణది చాలామంచి మనసు. అతి సున్నిత స్వభావం, చాలా వరకు తండ్రిపోలికలతో పొడుగ్గా, సన్నగా నాజూగ్గా విరియబోయేజాజి మొగ్గలా ఉంటుంది. ఆమెని చూసిన అందరికి ఏదో ప్రత్యేకత కనిపిస్తుంది. ఇరవై నిండిన అరుణ రామారావుగారికి ఇంకా పసిపాపలాగే కనిపిస్తుంది. పదేళ్ళవరకు తన కంచంపక్కన కంచం పెట్టించి అన్నం తినిపించేవారు. తన మంచం పక్కన మంచం కూతురికి. అరుణఆడింది ఆట, పాడిందిపాట ఇంటిలో కూతురిఅందం, తెలివితేటలు చూసుకుని రోజల్లా మురిసిపోయేవారు ఆయన. మరీ ముద్దుచేస్తున్నారనిభార్య కేకలు వేసినా,అ అయన పట్టించుకొనేవారుకారు.
అరుణది చిన్నప్పటినుంచి వింత మనస్తత్వమే. చిన్న పిల్ల అప్పటినించి అట్టే మాటకారికాదు. చిన్న క్లాసులలోకూడా ఎవరూ చదువుకోమని చెప్పకుండానే ఎప్పుడూ పుస్తకాలు ముందేసుకునికూర్చునేది. సాయంత్రాలయినా తన ఈడు ఆడపిల్లలు ఆడుకునే బొమ్మలాటలూ అవీ ఆడేది కాదు. ఇంటిలోకూర్చుని ఏ బొమ్మలపుస్తకాలో చూసేది. లేకపోతేతోటలో మొగ్గలు, పువ్వులు పరీక్షించేది. ఎగిరే సీతాకోక చిలుకల వెంట వెంట తిరుగుతూ ఆసక్తిగా చూసేది. లేకపోతే ఏ ఎగిరే కాకినో, వీధిలో అరిచే కుక్కనో, ఇంటిలో ఆవుదూడల్నో పరీక్షగా చూస్తూండేది. తండ్రిరాగానే సాయంత్రం వీధివరండాలో తండ్రిపక్కన చేరి ఏవో ధర్మసందేహాలుబయట పెట్టి జవాబులు అడిగేది. సాయంత్రం కూడా ఇంట్లో పెద్దవాళ్ళదగ్గిర కూర్చుంటావేం? పోయి ఆడుకో' అని తల్లి కేకలేసేది. ఆడపిల్లలు ఆడుకునేఆటలంటే అరుణకిచిరాకు. వాళ్ళతో కలిసిబొమ్మలాట, వంటలు, చెమ్మచెక్కలు ఆడడం ఏమిటో నామోషి అనిపించేది. అంతచిన్న వయస్సునించే, ఏదన్నా అనుకుంటే అది జరిగేవరకు నిద్రపోయేదికాదు. ఒక్కసారి అన్నాక మంచి అయినా, చెడు అయినా ఆ పనేచేసేది.
చిన్నప్పటినించి చదువులో ఎంతో చురుగ్గా ప్రతి క్లాసులో తప్పకుండా ఫస్టు వచ్చేది. ఆమె తెలివితేటలని, ఆమె శ్రద్దాసక్తులని ఇంట్లో తండ్రేకాక స్కూలులో మాస్టార్లుకూడా ఎంతో మెచ్చుకునేవారు అరుణ కాస్త జ్ఞానం వచ్చిందగ్గిరనించి. అంటే హైస్కూల్ లో చదివే రోజులనించి తమ అక్కగారిలా కాక బాగా పెద్ద చదువులు చదవాలని, డాక్టరు కావాలని కోరుకునేది. తమ వీధిలోంచే డాక్టరు చదివే పిల్లలు.
హౌస్ సర్జన్ లు తెల్లబట్టలుకట్టుకుని, తెల్లకోట్లు వేసుకుని, మెడలో స్టెతస్కోపు తగిలించుకొని వెడుతూంటే వాళ్ళవైపు కళ్ళార్పకుండా చూసేది. తెల్లకొంగళ్ళా....... అబ్బ ఎంత బాగున్నారో అనుకునేది. తనుకూడా పెద్దయ్యాక తెల్లకోటు తొడుక్కుని. స్టెతస్కోపు తగిలించుకుని కాలేజీకి వెడితే ఎంతబాగుంటుంది అని ఊహించుకునేది రోజూ వాళ్ళు వెళ్ళే టైముకి వీధి గుమ్మంలో కాచుకు నిలుచునేది చిన్నతనంనించి డాక్టర్ కావాలన్న అరుణ కోరిక ఆమెతోపాటు పెరిగి పెద్దదయింది. తండ్రినిఅడిగే ధర్మంసందేహాలలో మూడు వంతులురోగాలు, డాక్టర్లు మందుల ప్రశ్నలే ఎక్కువగా ఉండేవి.
రామారావుగారు కూతుర్ని డాక్టర్ కోర్స్ చదివించాలని ముందెప్పుడూ అనుకోలేదు. పెద్దకూతురిలాగకాక, ఈ రోజుల ప్రకారం డిగ్రీ చదివింది పెళ్ళిచేయాలని ఆయన అనుకున్నారు. కూతురికి డాక్టరు చదువుమీద అంతమోజు, ఇష్టం ఉన్నాయని ఆయనకి తెలీదు. అరుణ మెట్రిక్ కాగానే బై.పి.సి గ్రూపు తీసుకోవటానికి కారణాలు వివరించేవరకు. అప్పుడు రామారావుగారు కాస్త ఆలోచించారు. ఎమ్.బి.బి.ఎస్ అంటే చాలాకాలంపడుతుంది. ఏదో డిగ్రీ కోర్సు అంటే మూడునాలుగేళ్ళలో అవుతుంది. అప్పటికి పెళ్ళీడుకు వస్తుంది. ఏదన్నా మంచి సంబంధంచూసి చేయాలని ఆయన నిశ్చయించుకున్నారు. కూతురు అభిలాష విన్నాక ఏం చెయ్యాలా అనితటపటాయించారు. డాక్టరు చదివిన కూతురు తన చెప్పుచేతల్లోంచి దాటిపోవచ్చు. పెళ్ళి విషయంలో తనఇష్టాయిష్టాలు పనిచేయకపోవచ్చు.