Previous Page Next Page 
ఈ రేయి నీదోయి పేజి 5

 

    తల్లీతండ్రీ విషయం తెలియగానే కుయ్యో మొర్రో అన్నారు.... అయితే ఆమె అదృష్టమంతా ఏమిటంటే వాళ్ళకి ఆమె ఒక్కతే సంతానం కావడం.
    
    అందుకే కూతురు భర్తతో తెగతెంపులు చేసుకుని పుట్టింటికి వచ్చేసినా పెద్దగా బాధపడలేదు.
    
    ఆమె చాలా ధైర్యవంతురాలు. అంతకుమించి తెలివయింది... అందుకే పుట్టింటిలో అయినా సరే తల్లిదండ్రుల మీద ఆధారపడకూడదని నిర్ణయించుకుంది.
    
    నిజానికి ఆమెకు ఉద్యోగం చేయడం ఇష్టం. పెళ్ళయిన కొన్నిరోజులు తరువాత భర్తంటే బెరుకుపోగానే తనా మనసులోని మాట చెప్పింది.
    
    అయితే సతీష్ ఒప్పుకోలేదు "మనకు తక్కువేమిటి? నువ్వు సంపాదించే సొమ్మును నేనే సంపాదిస్తాను. నువ్వు కట్నంగా తెచ్చిన డబ్బును మా ఆఫీసులో వడ్డీలకిస్తాను. వడ్డీ రూపేణా వచ్చే సొమ్ము కూడా నువ్వు సంపాదించిందే అనుకో ఆ డబ్బంతా నీకే ఇచ్చేస్తాను" అని ఆమె ఎంత ప్రాధేయపడినా భర్త అధికారంతో వీటో చేశాడు.
    
    ఉద్యోగం చేయకపోవడం వల్లే భర్తకి తాను చులకన అయిపోయానని ఆమె గట్టి నమ్మకం.
    
    సతీష్ అలా అన్నాడే కాని ఏ రోజూ డబ్బు తెచ్చివ్వలేదు. నిజానికి ఆమెకు అలా వడ్డీకి డబ్బులు తిప్పడం కూడా ఇష్టం లేదు. అందుకే ఎప్పుడు ఆమె ఆ డబ్బులు తనకివ్వమని అడగలేదు.
    
    అందువల్లే పుట్టింటికి చేరగానే తన కాళ్ళమీద తను ఎలా నిలబడాలా అని ఆలోచించింది.
    
    ఆమె పుట్టిల్లు రాజుల కండ్రిగ. పెద్ద వూరే! వేయి గడపదాకా ఉంటుంది ఆమె మద్రాసులోనే ఎక్కువకాలం చదువుకుంది కాబట్టి వూర్లోవాళ్ళ గురించి పూర్తిగా తెలియదు. మద్రాసు నుంచి శలవుల్లో ఇంటి కొచ్చినా ఇల్లు విడిచి బయటికి వెళ్ళేది కాదు.
    
    వాళ్ళు ఓ మోస్తరుగా స్థితిమంతులే. తండ్రి వ్యవసాయమే చేసినా కుదురుగా కుటుంబాన్ని లాక్కొచ్చే రకం.
    
    లిఖిత వూరికి రాగానే తాను ఏం పనులు చేయొచ్చన్నది ఆలోచించింది డెయిరీ ఫామ్ పెట్టుకోవడం ఉత్తమం అనిపించింది.
    
    "పశువుల వల్ల లాభమే కానీ ఎందుకమ్మా రిస్కు? నేనున్నాగా వ్యవసాయం చాలు" అని కూతురు డెయిరీ ఫామ్ పెట్టుకుంటానని అన్నప్పుడు ఆమె తండ్రి విశ్వనాథం నిరుత్సాహపరిచాడు.
    
    కానీ భర్త దగ్గర ఓ గుణపాఠం నేర్చుకోబట్టి లిఖిత వెనక్కి తగ్గలేదు. డెయిరీ ఫామ్ పెట్టుకుంటానని ఖచ్చితంగా చెప్పింది.
    
    అందుకు కావలసిన డబ్బు కూడా విశ్వనాథమే ఇస్తానన్నాడు. దానిని కూడా ఆమె తిరస్కరించింది.
    
    ఆ వూర్లో సింగిల్ విండో ఉంది. దాని చైర్మన్ చెన్నారెడ్డి ఆమెకి చిన్నాన్నవుతాడు. ఆయనకు విషయమంతా చెప్పి లోన్ అడిగింది.
    
    ఆమె నిజాయితీ, ఆమె పట్టుదల, పనిమీద శ్రద్ద అన్నీ తెలిసిన ఆయన దగ్గరుండి పదిరోజుల్లో లోన్ యిప్పించాడు. మొత్తం ఏభయ్ వేల రూపాయలు.
    
    తమ ఇంటిపక్కనే ఖాళీ జాగాలో చిన్న షెడ్డు వేసింది లిఖిత. తండ్రి పొలంలో కొంత లీజుకు తీసుకుని గడ్డి నాటింది. మిగిలిన సొమ్ముతో మొత్తం నాలుగు సంకరజాతి పశువులను కొన్నది.
    
    ప్రస్తుతం అందులో ఒకటే పాలిస్తోంది. మిగిలినవి చూడివి.
    
    ఆరోజు ఉదయం యథాప్రకారం పశువుల్ని కడిగి వాటికి పచ్చగడ్డి వేసి రిలాక్స్ అవుతోంది లిఖిత.
    
    ఇంట్లో కంటే ఎక్కువకాలం ఆ పశువుల పాకలోనే గడుపుతుంటుంది.
    
    ఈజీ చెయిర్ లో కూర్చుని టౌన్ నుంచి పాలబ్బాయి చేత తెప్పించుకున్న పేపర్ చదువుకుంటూ ఉండగా రంగనాయకి వచ్చింది.
    
    "ఏం లిఖితా! బావున్నావా? నువ్వొచ్చావని తెలిసినప్పట్నుంచీ నిన్ను చూడడానికి రావాలనే. కానీ వీలయింది కాదు" అని ఎదురుగా ఉన్న స్టూల్ మీద కూర్చుంది రంగనాయకి.
    
    ఆమెకి నలభయ్ అయిదేళ్ళుంటాయి. ఆమె వయసులో ఉన్నప్పుడు ఏ మగాడు కంటినిండా నిద్రపోయి ఉండడని ఆమెను చూస్తూనే అనిపిస్తుంది.
    
    నిజం కూడా అదే! ఆమె పొందుకోరి, స్నేహం చేయాలనే ఆరాటంతో మగాళ్ళు నిద్రపోయేవాళ్ళుకారు. ఆమె ఎక్కడ పట్టు తప్పుతుందేమోనని ఆమె భర్త నిద్రపోయేవాడు కాడు. ఈ కారణం చేతే కాబోలు ఆమె భర్త యాభయ్ ఏళ్ళకే టపా కట్టేశాడు.
    
    ఇక అప్పట్నుంఛీ రంగనాయకి ఒంటరిగా కాలం గడుపుతోంది. ఆమె ఆ వూర్లో లేడీ డిటెక్టివ్. చదువు తెలిసినవాళ్ళు, తెలియనివాళ్ళు- అందరూ ఆమెను డిటెక్టివ్ రంగమ్మ అనే పిలుస్తారు. ఏ ఆడపిల్ల ఎవరితో తిరుగుతుందో ఎ మగాడు ఎవరికీ సైట్ కొడుతున్నాడో ఆమె దగ్గర లేటెస్ట్ సమాచారం ఉంటుంది.
    
    తన భార్యో, చెల్లెలో, మరదలో - ఇలా తమ ఇంట్లోని స్త్రీలు ఎవరితోనయినా చాటుమాటు వ్యవహారాలు నడుపుతున్నారని అనుమానం వస్తే ఆ వ్యక్తి రంగనాయకి దగ్గరికి పరిగెడతాడు.
    
    "రంగమ్మా! దానిమీద అనుమానంగా ఉంది. నిజమైతే దాని వ్యవహారం సాక్ష్యాధారాలతో సహా నిరూపించాలి" అని అడుగుతారు.
    
    అప్పుడు రంగనాయకి రంగంలోకి దిగుతుంది. ఆ గుట్టు అంతా సాక్ష్యాధరలతో సహా బయటకు లాగుతుంది. వాటిని ఈ పని పురమాయించిన వ్యక్తికి అందిస్తుంది. తన ఫీజు కింద రెండు బస్తాల వడ్లు వసూలు చేస్తుంది అదే ఆమె జీవనాధారం.  

 

    ఇలా డిటెక్టివ్ పనిచేసే రంగమ్మ మనిషి మాత్రం మహా మంచిది.
    
    "ఆ రహస్యాలన్నీ సాక్ష్యాలతో సహా యిస్తాను. అయితే వీటిని బయటపెట్టి ఆ ఆడపిల్లను హింసించకూడదు. ఆ పిల్ల ఏ కారణం చేత ఇలా చేస్తూ వుందో తెలుసుకొని ఆమె బాధల్ని తీర్చి, దారికి తెచ్చుకొంటే నా అభ్యంతరం ఉండదు" అని తన దగ్గర కొచ్చిన క్లయింట్సుకు స్పష్టంగా చెబుతుంది. దానికి ఒప్పుకుంటేనే కేసు టేకప్ చేస్తుంది. లేకపోతే లేదు.
    
    రంగనాయకి గురించి లిఖితకి కొంత తెలుసు కాని పూర్తిగా తెలియదు.
    
    "భర్త నుంచి విడిపోయి వచ్చావట కదా" రంగనాయకి అడిగింది.
    
    ఆమె దగ్గర ఏ విషయాన్ని దాచడం దండగ. అందుకే జరిగినదంతా చెప్పింది.
    
    "ఈ మగ వెధవలంతా అంతే! ఆడదాన్ని కేవలం పడక సుఖం యిచ్చే యంత్రంగా చూస్తారు తప్ప మనిషిగా చూడరు. మొన్నటికి మొన్న పొట్టి రామయ్య నా దగ్గరికి వచ్చాడు ఓ సమస్యతో"
    
    "ఏమిటట?"
    
    "మనిషి మొత్తం అయిదడుగులు కూడా ఉండడు. వాడికి వేరే సెటప్ కావలసి వచ్చింది. అయితే వాడికి ఓ అనుమానం వచ్చిపడింది. తను పొట్టిగా వుంటాడు కదా! తనలాగే తన అవయవాలు కూడా పొట్టిగానే ఉన్నాయని ఆ కొత్తపిల్ల కనిపెడుతుందేమోనని వాడి భయం. దీనికి పరిష్కారం చెప్పమని నా దగ్గరికి వచ్చాడు. పది ముంతల సద్దలు యిస్తే చెబుతానన్నాను"

 Previous Page Next Page