"ఏం చెప్పావేమిటి?"
"ఆ కొత్తపిల్ల మంచంలో వున్న ఆ పదినిమిషాలూ భూతద్దం తగిలించు అన్నీ డబుల్ సైజులో కనిపిస్తాయన్నాను ఈ ట్రిక్ బాగా పనిచేసినట్టుంది. రెండోరోజే సద్దలు పంపించాడు"
లిఖితకి నవ్వాగింది కాదు.
"సరే- నే వెళతానమ్మా- అప్పుడప్పుడూ వస్తుంటాలే" అని లేచి వెళ్ళిపోయింది రంగనాయకి.
ఆమె వెళ్ళిపోయాక కళ్ళు మూసుకుని ఆలోచనల్లో పడింది లిఖిత
సతీష్ నుంచి విడిపోయాక జీవితం ఇబ్బందిగా ఉంటుందని భయపడింది కాని అంత భయానకంగా ఏమీలేదు. కానీ ఎంతకాలం యిలా? భర్త వుండడంవల్ల ఏమొస్తాయో అన్నీ ఆలోచించి ఒకటొకటిగా అవన్నీ అరేంజ్ చేసుకోవచ్చు, మరి ప్రేమ మాటేమిటి? ఎవరినైనా ప్రేమించకుండా, ప్రేమ పొందకుండా యిలా ఎండిపోయిన చెట్టులాగా ఉండడం సాధ్యమా? సాధ్యం కాదనే అనిపిస్తోంది. మరి ఎలా జీవించడం?
ఆమె ఆలోచనలకు ఓ రూపం వచ్చినట్టు అక్కడ ఓ అబ్బాయి ప్రత్యక్షమయ్యాడు.
ఆ అలికిడి ఆమె కళ్ళు విప్పింది.
తనకంటే రెండు మూడు ఏళ్ళు చిన్నగా ఉంటాడనిపించింది. ఎక్కడా చూసిన జ్ఞాపకం కూడా లేదు.
"ఎవరూ?" అని అడిగింది ఆశ్చర్యాన్నంతా కళ్ళలో నింపుకుని.
"మిమ్మల్ని ప్రేమించినవాడ్ని" అతను ఏ జంకూ లేకుండా ఆమె అడిగిందే తడవుగా చెప్పాడు.
ఆమె డీప్ షాక్ లో పడిపోయింది.
* * * * *
లిఖిత తన ఎదురుగా నిలబడ్డ యువకుడ్ని చూసి షాక్ లోంచి తేరుకునే టప్పటికి అయిదు నిముషాలు పట్టింది.
'ఎవరు నువ్వు' అని అడిగితే నిర్భయంగా 'ప్రేమికుడ్ని' అనగలిగిన వాడ్ని ఏమనాలి? మెడబట్టి గెంటేయాలా? ఒంటరిగా మేడమీదకి తీసుకెళ్ళి మాట్లాడాలా? అరిచి, నలుగుర్ని పోగేసి అతని భరతం పట్టాలా? లేక అంత గొప్ప ప్రేమికుడు లేడని బంగారు పతకాన్ని బహుకరించాలా? ఏం చేయాలి?
నడుము నిలబడలేనట్టు ఈజీ ఛెయిర్ లో కూలబడి పోయింది.
అతను మాత్రం కూర్చోలేదు. పైపెచ్చు నవ్వుతూ ఆమె కళ్ళలోకి చూస్తున్నాడు. ఆమెను చూడడం తప్ప తనకి మరో ఆనందించే విషయం లేనట్టు పెదవుల మీద చిర్నవ్వు మల్లెపూల తోరణంలా పరుచుకొని ఉంది.
"నేనడిగింది ఏమిటి? మీరు చెప్పిందేమిటి?" కోపంగా అడిగింది.
"ఖచ్చితంగా జవాబు చెప్పాను. అదే తప్పయితే క్షమించండి" అతని పెదవులమీద చిర్నవ్వు మల్లెపూల తోరణంలా పరుచుకొని ఉంది.
"ఇంతకీ ఎవరు మీరు?" మళ్ళీ అదే కోపాన్ని కంటిన్యూ చేసింది.
"ప్రశ్న అదే అయితే జవాబు అదే. కానీ వేరే జవాబు ఆశిస్తున్నారు కాబట్టి చెబుతున్నాను నా పేరు జితేంద్ర ముద్దుగా అందరూ 'జీతూ' అంటారు. మీరూ అలా పిలిపిస్తేనే నేను ఆనందిస్తాను"
ఆమె ఆలోచనల్లో పడింది. జితేంద్ర అనే కుర్రాడు తనకి ఇంతకు ముందు తెలియదు. చూడడం కూడా ఇదే మొదటిసారి. మరి తనను ప్రేమిస్తున్నాడంటున్నాడేమిటి? పిచ్చి కాదు కదా!
"ఏం చేస్తుంటావ్?" అతన్ని బహువచనంతో పిలవాలని ఆమెకి అనిపించడం లేదు. తనకంటే చిన్నవాడుగా కనిపిస్తున్న అతన్ని మీరు అని సంబోధించడం ఎబ్బెట్టుగా ఉంటుంది.
"ఎప్పుడు? ఇప్పుడయితే మిమ్మల్ని ప్రేమిస్తున్నాను అనే అంటాను"
ఏమిటి తల తిక్క జవాబులు? ఇక మర్యాదగా ఉండక్కర్లేదు. కానీ ఎక్కడో అందుకు విరుద్దంగా మనసు తిరగబడుతోంది.
"చదువుకుంటున్నావా?"
"లేదు బంగారు నగల వ్యాపారం చేసేవాడ్ని ఇప్పుడు అదీ వదిలేశాను"
"ఎందుకు?"
"బంగారు నగల దుకాణం కంటే మీరు విలువైన వాళ్ళుగా అనిపించారు కాబట్టి"
ఆమెకి ఏమీ అర్ధం కావడంలేదు.
ఎదుటి మనిషికి కోపం రాకుండా ఉండాలంటే మన మాటల్లో నిజాయితీ తొణికిసలాడాలి. తనకి కోపం రాకపోవడానికి అదే కారణమా? ఆమె ఆలోచిస్తోంది.
"నెల ముందు ఈ వూరొచ్చాను మీ కోసం. రోజూ మిమ్మల్ని దూరంగా చూడడమే. ఈ రోజు ధైర్యంచేసి మీ ముందుకొచ్చాను" అతను తప్పు చేసినట్టు తలవంచుకొన్నాడు.
"నెల అయిందా నువ్వొచ్చి?" ఆమె ఆశ్చర్యపోయింది.
"ఆ"
"ఎందుకొచ్చావు?"
"మీకోసం మీరు ఎక్కడ వుంటే అక్కడే ఉంటాను. మరో దగ్గర ఉండడానికి మనస్కరించదు"
"ఇక్కడ ఎక్కడుంటున్నావ్?"
"ఈ వూర్లో తెలిసిన వాళ్ళెవరూ లేరు మీరు తప్ప వచ్చిన రోజు బడిలో తలదాచుకున్నాను. ఉదయం అయితే స్కూలు మొదలయ్యేది కాబట్టి అక్కడ కూడా వీలు కాలేదు. చివరికి స్వామి ఇంట్లో స్థిరపడ్డాను"
"స్వామి అంటే నాదస్వరం ఊదుతాడే ఆ స్వామేనా?"
"ఆ! రోజూ వాళ్ళ పశువుల పాచి పూడ్చాలి ఇలా ఊడ్చినందుకు గాను ఆ పశువుల కొట్టంలో నేను ఉండడానికి అనుమతించాడు. అలా ఆయన పశువుల పాకలో సెటిలయ్యాను"
"మరి భోజనం?"
"భోజనం కూడా అక్కడే అందుకుగాను వాళ్ళ సేద్యం పనులు చేయాలి. ఇంతకు ముందు అలవాటు లేదు కాబట్టి మొదట్లో కష్టంగా ఉండేది. కానీ ఇప్పుడిప్పుడే అలవాటవుతోంది"
ఆమెకి అనాలోచితంగా కళ్ళలో నీళ్ళు తిరిగాయి. తన కోసం ఓ కుర్రాడు అన్ని ఇబ్బందులు పడుతున్నాడంటే గుండె పలచబడి, రక్తం చిక్కబడినట్లుంది.
"అలా కూర్చో" స్టూలు చూపించింది.
'అతను ఆజ్ఞను శిరసావహిస్తున్నట్టు వెంటనే కూర్చున్నాడు.
"వంకరగా మాట్లాడకుండా ఇంతకీ నువ్వెవరో చెప్పు..." తనూ ఆవేశపడకుండా నింపాదిగా అడిగింది.