Previous Page Next Page 
మరో ప్రస్థానం పేజి 4


                                          ఝంఝ

 

 ఘోషించాను
మంచిగా ఉండండర్రా అంటూ
గోలపెట్టాను
అమాయకుల జోలికి పోకండర్రా అంటూ
కల్మషాలని మానసాలలోంచి
కడిగేసుకొండర్రా అన్నాను
కళ్ళల్లో కాంతులు
పోగేసుకొమ్మన్నాను
గతాన్ని నెమరేసుకోవడం
మానేసుకొమ్మన్నాను
మొరపెట్టాను
మొత్తుకున్నాను
మెత్తగా బతిమాలుకున్నాను    
విన్నారు కారు
వేలాడుతున్నారు
భూతకాలం చూరుపట్టుకొని
విలువలకి వింత వ్యాఖ్యానాలు చేస్తున్నారు
పాతని బతికించడానికి
కొత్త చిట్కాలు వెదుకుతున్నారు
కొత్తవి హతమార్చడానికి
పాత కత్తులు నూరుతున్నారు
ఊరుకుంటానా నేను    
కసిగా కసాయిగా
ఉపద్రవంలాగ ఉవ్వెత్తుగా లేచి
సంహారాన్ని స్యందనం చేసి
ఉద్రేక తరంగాలే తురంగాలుగా
ఆగ్రహం కొరడాని చేబూని
సాయుధ విప్లవ బీభత్సుని సారథినై
భారత కురుక్షేత్రంలో
నవయుగ భగవద్గీతా ఝంఝని ప్రసరిస్తాను
మంటల చేత మాట్లాడించి
రక్తం చేత రాగాలాపన చేయిస్తాను

                                                                                        

                                                                          రచన : 16 - 8 - 70
                                            ముద్రణ : సృజన మాసపత్రిక - సెప్టెంబరు, 1980
                       పునర్ముణ : 1. ఝంఝ, విరసం కవితా సంకలనం- అక్టోబరు, 1970
                                               2. మరో ప్రస్థానం, విరసం ప్రచురణ - మే, 1980.

 

 Previous Page Next Page