Previous Page Next Page 
ఆరోరుద్రుడు పేజి 4

 

     "వాళ్ళు నీకోసం వెతుకుతున్నారు. వాళ్ళలో ఒకడు నువ్వు నాతో మాట్లాడడం చూసాడు బాబూ.... వెళ్ళిపో....నువ్విక్కడ నుండి వెళ్ళిపో నువ్వు....నువ్వు నీ ప్రాణాల్ని రక్షించుకో బాబూ-" ఆదుర్దాగా చెప్పాడు స్టేషన్ మాస్టర్ ఆ మాటలకు శ్రీకర్ హృదయం గుబగుబలాడింది. భయంగా లేచి నిలబడ్డాడు. బయటకు రాబోయి ఆగిపోయాడు.
    
    దానిక్కారణం-
    
    ఇంటిముందు ఆగిన జీప్.... ఆ జీప్ హెడ్ లైట్ల వెలుగులో, జీప్ లోంచి ఒక్క ఉదుటున కిందకు దూకి లోనికొస్తున్న-
    
    శ్రీరాములు నాయుడు.... ఆ వెనక నలుగురు వ్యక్తులు.
    
    తెల్లటి డేగల్లా ఉన్నారు వాళ్ళు!    
    
    శ్రీరాములు నాయుడ్ని చూడగానే, శ్రీకర్ బయటకు రాబోయిన వాడల్లా లోనికి పరుగెత్తాడు.
    
    అప్పటికే సమయం మించిపోయింది.
    
    శ్రీరాములు నాయుడు చేతిలోని పిస్టల్ పేలింది.... వరసగా....వరసగా...నిప్పులు వెదజల్లుతున్న బుల్లెట్లు.
    
    చీకట్లో... మిన్ను ముట్టిన హాహాకారాలు.
    
    శ్రీకర్ పెనుకేక వేసుకుంటూ, ద్వారబంధం మీద పడిపోయాడు.
    
    అతన్ని రక్షించడానికి అడ్డుగా వెళ్ళిన స్టేషన్ మాస్టర్.....గుండెల్లోంచి కూడా..... ఓ బుల్లెట్ దూసుకొని పోయింది.
    
    విహ్వలంగా అరుస్తూ, ఆయన నేలకూలిపోయాడు.
    
    గదిలో లైటు వేసారెవరో.
    
    ద్వారబంధమ్మీద నిలబడ్డ శ్రీరాములు నాయుడు- బాధతో అరుస్తూ, రక్తస్రావంతో, క్రింద పొర్లుతున్న శ్రీకర్ వైపు చూసాడు. ముందుకువెళ్ళి కుడికాలుని అతని మెడమీద పెట్టి, అదుముతున్నాడు.
    
    బలంగా...
    
    అతని కళ్ళు....బ్రీఫ్ కేసు కోసం....వెతుకుతున్నాయి....నల్లగా, స్తంభం పక్కన పడిపోయిన బ్రీఫ్ కేసు.
    
    దాన్ని అందుకున్నాడు అందులోని....రెండు ఫైల్స్ ని బయటకు తీసాడు.

    సిగరెట్ లైటర్ ని తీసి, వాటిని వెలిగించాడు. ఫైల్స్ మండుతున్నాయి.
    
    ఆ మంటలో, కొన ఊపిరితో కొట్టుకుంటున్న రెండు జీవాలు!
    
    ఆ రెండు జీవాలు, రెండు శవాలుగా మారడానికి, మరో రెండు నిమిషాలు మాత్రమే పట్టింది.
    
    "శవాల్ని ఏం చెయ్యమంటారు సార్...." పక్కనున్న అనుచరుడు అడిగాడు.
    
    "కాల్చెయ్యండి, కాల్చి బూడిద చేసెయ్యండి ఇంటిని తగలబెడితే ఆటో మేటిగ్గా, శవాలు కూడా తగలబడి పోతాయ్. కరెంట్, షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగిన ప్రమాదం అగ్ని ప్రమాదం అర్ధమైందా...." పెద్ద పెద్ద అంగలతో, జీపువైపు వెళ్ళాడు శ్రీరాములు నాయుడు.
    
    మరో అయిదు నిమిషాల తర్వాత-
    
    ఆ ఇంట్లో మంటలు లేచాయి.
    
    కర్తవ్యం కోసం, ఆఖరి క్షణం వరకూ పోరాడిన శ్రీకర్.
    
    మానవత్వం కోసం, చివరి ఊపిరి వరకూ నిలిచిన స్టేషన్ మాస్టర్ రాఘవేంద్రరావ్.
    
    ఇద్దరూ....అనాధల్లా మాడిపోతున్న చప్పుడు.
    
    ఈదురు గాలులు తగ్గుముఖం పట్టాయి.
    
    వర్షం ధారలు తగ్గుముఖం పట్టాయి.
    
    చెలరేగిన ఒక ఉన్మాదానికి, వికటాట్టహాసం చేసిన ఒక బీభత్సానికి, కరడుగట్టిన నిప్పుల హోమానికి ప్రత్యక్షసాక్షిగా మౌనంగా....మంటల వెలుగుల్లో కన్పిస్తోంది-
    
    రైల్వేస్టేషన్.
    
    ఆ స్టేషన్ కు దూరంగా, చీకట్లో తారురోద్దుమీద, వెలుతురుని చిమ్ముకుంటూ తడిరోడ్డువైపు వెళ్ళిపోతుంది జీపు.
    
    ఆ జీపులో కూర్చున్న శ్రీరాములు నాయుడు గర్వంగా నవ్వుకున్నాడు.
    
    ఆ నవ్వు ఆకలి తీరిన పెద్దపులి ఆవలింతలా ఉంది.
    
    అప్పుడు రాత్రి- సరిగ్గా    
    
    సరిగ్గా రెండు గంటలైంది.
    
                                       *    *    *    *    *
    
    ఇంకా పూర్తిగా తెల్లవారలేదు.
    
    బంజారా హిల్స్ లోని రోడ్ నెం. 12 సందడిగా ఉంది.
    
    రాష్ట్ర చీఫ్ మినిస్టర్ త్రిభువనేశ్వరీదేవి రెసిడెన్స్ పార్టీ ప్రముఖుల్తోనూ, అధికారులతోనూ, అనధికారులతోనూ, పోలీస్ ఆఫీసర్స్ తోనూ సందడిగా ఉంది.
    
    రెసిడెన్స్ ముందు విశాలమైన రోడ్డంతా, కార్లతో నిండిపోయింది.
    
    సి.ఎమ్. పర్సనల్ సెక్యూరిటీ చీఫ్....డి.సి.పి. హోదా కలిగిన ఆఫీసర్ పరశురామ్ వరండా మీద అటూ ఇటూ పచార్లు చేస్తున్నాడు.
    
    దూరంగా, స్పెషల్ కమెండోలు....రైఫిల్స్ ను శుభ్రం చేసుకునే కార్య క్రమంలో ఉన్నారు.
    
    అదే సమయంలో గేట్ లోంచి దూసుకొచ్చిందో వైట్ అంబాసిడర్ కారు...
    
    ఆ కారులోంచి దిగాడు నలభై అయిదేళ్ళ హేమాద్రి శర్మ....పర్సనల్ సెక్రటరీ టు....సి.ఎమ్.
    
    సీనియర్ ఐ.ఎ.ఎస్. ఆఫీసర్ హేమాద్రి శర్మను చూడగానే, సెక్యూరిటీ చీఫ్ పరశురామ్ విష్ చేసాడు.
    
    వరండాలో అటూ ఇటూ కూర్చున్న పార్టీ లీడర్స్ ను చూస్తూ కొంతమంది నమస్కారాల్ని అందుకుంటూ-
    
    లోనికి నడిచాడు హేమాద్రిశర్మ చేతిలో ఫైలుతో.
    
    అప్పుడే ఆయన దగ్గరకు పరుగు పరుగున వచ్చాడు ఎక్సైజ్ డిపార్టు మెంట్ కు చెందిన డి.ఎస్.పి. ప్రసాదబాబు.
    
    "సి.ఎమ్.గార్ని అర్జంటుగా కలవాలి సర్."

    "మధ్యాహ్నం....మూడు గంటలకు సి.ఎమ్. పేషీకి రండి..." సీరియస్ గా చెప్పేసి ముందుకు వెళ్ళిపోయాడు హేమాద్రిశర్మ.
    
    ఆ జవాబుకి ప్రసాదబాబు ముఖంలో రంగులు మారిపోయాయి.
    
    ఆఫీసు రూమ్ దాటి హాల్లోకి అడుగుపెట్టాడు హేమాద్రిశర్మ.
    
    ఎక్కడా, ఎవరూ లేరు.
    
    అంతటా నిశ్శబ్దం.
    
    ఎంతటి ప్రముఖుడైనా ఆఫీస్ రూమ్ దగ్గర ఆగిపోవాల్సిందే.... ఒక్క హేమాద్రిశర్మ మాత్రమే హాల్లోకి వెళ్ళగలడు.
    
    గోడ గడియారంవైపు చూసాడు హేమాద్రిశర్మ.
    
    అయిదూ- నలభై అయిదు నిమిషాలైంది!
    
    అదే సమయంలో-
    
    ఆ హాలుకి-
    
    మూడు గదుల తర్వాత-
    
    అరగంటసేపు "యోగా" ని పూర్తి చేసిన త్రిభువనేశ్వరీదేవి అలసటగా వచ్చి ఈజీ చైర్ లో కూర్చుంది.
    
    కళ్ళు మూసుకొని కూర్చున్న త్రిభువనేశ్వరి....గాజుల చప్పుడుకి తలెత్తి చూసింది.
    
    ఎదురుగా చేతిలో పాలగ్లాసుతో పిన్ని సుందరమ్మ.
    
    పాలగ్లాసు అందుకొని, సుందరమ్మ ముఖంలోకి చూసింది త్రిభువనేశ్వరి.
    
    సుందరమ్మ ఏదో చెప్పాలను కొంటోంది.
    
    కానీ ఆవిడకు నోట్లోంచి మాటలు బయటకు రావడం లేదు.

 Previous Page Next Page