ఒక్కక్షణం లోతైన నిశ్శబ్దం అలుముకుందక్కడ.
ఏదో సరదాగా మొదలైన సంభాషణ గంభీరతను సంతరించుకోబోతోంది.
చిన్న తర్కంతో - స్త్రీ పరమైన అస్థిత్వపు ప్రశ్నతో మొదలయిన అతి తేలికైన సంభాషణ అలా మలుపు తిరుగుతుందని, ఒక పెద్ద సంచలనానికి హేతువవుతుందని ఎవరూ ఊహించలేదు.
అలక, సురభి, నీలిమ విచిత్రమైన ఉద్వేగానికి గురయ్యారు. అది నిజమా? నిజంగా నిజమా? ముగ్ధ చాలా విషయాల్ని ఎంతో స్పోర్టివ్ గా తీసుకొనే ముగ్ధ, స్త్రీ పరమైన అస్తిత్వపు ప్రశ్న ఎదురయితే గంభీరంగా మారిపోతుంది- చాలా సీరియస్ గా తీసుకొంటుంది. గతంలో తమ నలుగురి మధ్య అలాంటి అనుభవాలు అప్పుడప్పుడు చోటు చేసుకున్నాయి.
పర్ణేష్ అనవసరంగా రెచ్చగొట్టాడా?
జస్ట్ కేజువల్ గానే అన్నాడా?
ఏమో ఏది ఏమైనా ముగ్ధ విధించబోయే నిబంధనలకు తాము ఒప్పుకుతీరాలి. అదీ తమ మధ్యనున్న స్నేహం, అనుబంధం.
అక్కడ పేరుకున్న నిశ్శబ్ధాన్ని బ్రద్దలుచేస్తూ ముగ్ధ తీవ్రస్థాయిలో ప్రశ్నించింది-
"ఏం నిర్ణయించుకున్నారు?"
మిగతా ముగ్గురు ఒకింత ఉలికిపాతుకి గురయి, వెంటనే తేరుకొని అంగీకార సూచకంగా తలలూపారు.
"ఓ.కే. గుడ్. ఇది బెట్ అనుకున్నా, ఛాలెంజ్ అనుకున్నా ఒక సంవత్సరం పాటు దీనికి కట్టుబడి వుండాలి. వుండగలరా." ముగ్ధ ముగ్గురు ముఖాలవేపు సీరియస్ గా చూస్తూ అడిగింది.
"నీలోనే కాదు. మాలోనూ కరేజ్ వుంది." అయిడియా చాలా అద్భుతంగా వుంది సురభికి- అందుకే ధైర్యంగా అంది.
"జీవితంలో గొప్ప సంఘటనలన్నీ, ఒక్క నిమిషంలో తీసుకున్న నిర్ణయాలవల్లే జరుగుతాయి. నో సైడ్ ట్రాక్స్. సవాల్ చెయ్యడంకాదు, ప్రాక్టికల్ లైఫ్ లో నిలబడగలగాలి. మరోసారి అడుగుతున్నాను మరోసారి ఆలోచించండి. ఇది ఎవరి కోసమో తీసుకుంటున్న నిర్ణయం కాదు. ఈ జనరేషనేకాదు, ఏ జనరేషన్ లో లేడీస్ అయినా 'షో పీసెస్' కాదని చెప్పడానికి మనమీ నిర్ణయం తీసుకుంటున్నామని గుర్తించుకోండి. ఇదొక ప్రయోగం. ఈ ప్రయోగంలో దేనికి భయపడగూడదు... మీకు ఆ ధైర్యముందా? చెప్పండి" ముగ్ధ ఉద్రేకంగా అంది.
"మాకూ గట్స్ వున్నాయి" అలక అంది స్థిరంగా.
"అయితే నాదో చిన్న డౌట్ వాటెబౌట్ అవర్ ఫరదర్ ఎడ్యుకేషన్" నీలిమ అడిగింది.
"ఒన్ ఇయర్ గడువు ఆ గడువు తర్వాత మళ్ళీ కంటిన్యూ చేయొచ్చు ఇష్టముంటే" ముగ్ధ అంది.
"మరి..." ఏదో ప్రశ్న వేయబోయింది మళ్ళీ నీలిమ.
"నోమోర్ క్వశ్చన్స్ ప్లానింగ్ నాది, ఆపరేషన్ అందర్దీ.... నేన్చెప్తాను వినండి." ముగ్ధ మాటల్ని ఆ ముగ్గురమ్మాయిలే కాదు, అక్కడున్న అబ్బాయిలు, అమ్మాయిలందరూ విచిత్రంగా వింటున్నారు. పర్ణేష్ కయితే మతేపోయింది.
"మన ఆపరేషన్ లో భాగంగా మన మలుగురం నలుగురు మగాళ్ళను ఎంచుకుంటాం ఆ నలుగురూ, నాలుగు భిన్నమైన మనస్థత్వాలకు చెందినవారై వుండాలి."
"మరి వాళ్ళని ఎలా ఎంచుకోవాలి రోడ్డుమీద చూసి పికప్ చేసుకోవాలా." గబుక్కుని ఉత్సాహాన్ని ఆపుకోలేక అడిగింది అలక. అలా బాయ్ ఫ్రెండ్ ని పికప్ చేసుకోవాలని ఎన్నాళ్ళనుంచో అలకకు కోరిక.
"ఎందుకంత తొందర... ముందు జాగ్రత్తగా వినండి. మనుషుల మనస్తత్వాలు రకరకాలు ఏ మనసులో ఏ ఇష్టంవుందో తెలీదు సురభిని చూడండి. ఇన్నాళ్ళుగా మనమధ్యే తిరుగుతున్నా, దాని మనసులో అంతర్లీనంగా వున్న ఇష్టఇష్టాలు మనకు తెలీవు. పెళ్ళయిన శ్రీధర్ వేపు తన ఆకర్షణను పెంచుకొంటోందాని మనకు తెల్సా తెలీదు సురభిని అటువేపు డ్రైవ్ చేసిందేమిటి? ప్రేమా, కోరికా, ఆకర్షణా, కాదు ఏదో సాధించాలనే శ్రీధర్ స్వభావం. అందువల్ల వాళ్ళిద్దరి మధ్యా వయోభేదం వున్నా, అది కాదు మనకు ముఖ్యం, మనస్సు. కానీ, ఎవరి అభిరుచికి తగ్గట్టు, వాళ్ళని ఎంచుకుని, ప్రేమించడంలో థ్రిల్ లేదని నా అభిప్రాయం. ఉదాహరణకు నన్నే తీసుకోండి. నాకు రఫ్ కేరక్టర్స్ ఇష్టం. కానీ నేను సాత్వికంగా ఉంటాను. రేపు నేను ప్రేమించే వ్యక్తి సాఫ్ట్ గావుంటే నేను భరించలేను. అమాయకంగా ఉంటే భరించలేను. అలాగే నీలిమ, అలాగే అలక ఎవరి మనస్తత్వాలు వారివి.
అందువల్ల మనం భిన్న మనస్తత్వాల వివరాలతో నాలుగుచీటీలు తయారుచేద్దాం. ఆ నాలుగింటిని నలుగురు తీసుకుందాం. ఎవరికి ఎలాంటి కేరక్టర్ వస్తే ఆ వ్యక్తిని మన ప్రపంచానికి అనువుగా మలచగలగాలి. ఆ వ్యక్తి ఒక గొప్ప ప్రయోజనాన్ని సాధించాలి. సాధించేటట్టు మనం చెయ్యాలి. చీటీలో మనకు నచ్చిన వ్యక్తిని ఎంపికచేసుకోగానే ఒక నెలరోజులు లోపల వాళ్ళ వ్యక్తిత్వం గురించి, మంచిచెడ్డల గురించి, ఆస్తిపాస్తులగురించి చదువుసంధ్యల గురించి, అలవాట్లూ అభిరుచుల గురించి దర్యాప్తు చేస్తాం. మనం వాళ్ళని ఏ వేపుగా మలచుకోగలం అన్నది ఇక్కడ పాయింట్. అలా మలచడమే కాకుండా మనం తయారుచేసే ఆ వ్యక్తి ఈ దేశంలో ఒక అద్భుత విజయాన్ని సాధించాలి. అట్లా అతన్ని మలచడమే మన బెట్, మన ఛాలెంజ్.
వాళ్ళ నలుగుర్నీ అబ్జర్వ్ చేశాక మనం నాలుగురిపోర్టులు తయారుచేసుకుంటాం. మనం ఫైనల్ గా ప్రోగ్రామ్ ని చకౌట్ చేసుకుంటాం. మన బెట్ గురించి వాళ్ళకు చెప్పాల్సిన అవసరంలేదు. అదేకాకుండా మన బెట్ మన లవ్, మన మారేజ్ ఈ విషయాలన్నీ కాన్ఫిడెన్ షియల్ గా వుంచాలి.
గడువు ఒన్ ఇయర్. ఈ ఏడాది మనకు మన ఇళ్ళతో సంబంధాలుండవు మనం ఎక్కడున్నామో, ఏం చేస్తున్నామో వాళ్ళకు గానీ, మిగతా ప్రపంచానికిగానీ తెలియాల్సిన అవసరంలేదు. సి.బి.ఐ. డిపార్టుమెంట్లో మనకు ఉద్యోగాలొచ్చాయని, అందులో ఉద్యోగాలు చేస్తున్న విషయం రహస్యంగా ఉంచాలని, ఒక సంవత్సరం తర్వాత కలుస్తామని మన ఇళ్ళకు ఉత్తరాలు రాసేస్తే సరిపోతుంది" చెప్పడం ఆపింది ముగ్ధ.
"ఇక్కడ్నించి ఇలా ఎటో వెళ్ళిపోయినా, మా ఇంట్లో ఎవ్వరూ ఏమనరు." అలక ఆనందంగా అంది.
"నీ గురించి కాదు. వాళ్ళిద్దరుకూడా వున్నారు కదా!" ముగ్ధ అంది సీరియస్ గా.
"డోన్ట్ వర్రీ వుయ్ కెన్ మానేజ్" హామీ ఇచ్చింది నీలిమ.
"మరి, మనగురించి ఓ.కే. మనం ఎంచుకున్న వ్యక్తులకు మనం నచ్చకపోతే." సందేహం వ్యక్తంచేసింది సురభి. ఆ మాటకు నవ్వింది ముగ్ధ. తెరలు-తెరలుగా నవ్వింది.