ఐంద్ర కాండము
రెండవ అధ్యాయము
మొదటి ఖండము
ఋషులు :- 1. శంయు బార్హస్పత్యుడు. 2. శ్రుతకక్షి. 3. హర్యతుడు. 4,5. శ్రుతకక్షి. 6. ఇంద్రమాతలు దేవయాజమా ఋషికలు. 7,8. కాణ్వయనులు. 9. ఆంగిరస మేధాతిథి 10. కాణ్వప్రియమేథ.
1. స్తోతలారా! సోమము అభిషుతమైనంత పురుహూతుడు, శత్రుహంతయగు ఇంద్రుని గూర్చి సమూహగానము చేయండి. ఆ స్తోత్రము ఇంద్రుని శక్తి వంతుని చేయునదియు, గోవువలె సుఖము కలిగించునది అగును గాక.
2. శతక్రతు ఇంద్రా! యశోవంతమగు సోమము అభిషుతమైనది. సిద్దముగా ఉన్నది. దానిని సేవింపుము. ప్రసన్నుడవగుము. మాకు ధనము నిమ్ము. ప్రసన్నులను చేయుము.
3. గోవులారా! యజ్ఞమునకు విచ్చేయండి. యజ్ఞమునకు పాలు అవసరము. పాలు పుష్కలముగ ప్రసాదించండి. మీ చెవులకు బంగారు, వెండి ఆభరణములు ఉన్నవి.
4. శృతకక్షా! అశ్వములను గురించి పూర్తిగా పాడుము. గోవులను గురించి పూర్తిగా పాడుము. ఇంద్రుని ధామములను గురించి పూర్తిగా పాడుము, గానము చేయుము.
(ఋషి తనే సంబోధించు కొనుచున్నాడు.)
5. ఋత్విజులారా! ఇంద్రుడు మహా వృత్రహంత. అతనికి మీరు బలము కలిగించుచున్నారు. అట్టి ధనదాత యగు ఇంద్రుడు మాకు ధనములు కలిగించును గాత.
6. ఇంద్రదేవా! నీవు సాహసివి. గుండె బలమునకు ప్రసిద్దుడవు. వరదా! శ్రేష్ఠుడవగు నీవు ఫలప్రదుడవు అగుచున్నావు.
7. యజ్ఞము ఇంద్రుని వర్లిల్లచేసినది. ఇంద్రుడు అంతరిక్షమున వ్యాపించిన మేఘము నుండి భూమి మీద వర్షము కురిపించినాడు.
8. ఇంద్రా! నీవు ఒక్కడవే ధనములకు స్వామివి. నన్ను ధనవంతుని చేయుము. నేను స్తోతలను గోవంతులను చేయుదును.
9. అభిషోతలారా! ఇంద్రుడు వీరుడు. శూరుడు. అతనికి అడుగడుగున సోమము అర్పించండి.
10. ఇంద్రదేవా! నీవు అంతర్యామివి. ఇదిగో ఈ సోమము నీకు అర్పితము. దీనిని కడుపు నిండ త్రావుము.
రెండవ అధ్యాయము
ఋషులు :- 1. సుతకక్షుడు. 2. శౌనకుడు. 3. భరద్వాజుడు. 4. శ్రుతకక్షి. 5. మధుచ్చందుడు. 7. విశోకుడు. 8. వసిష్ఠుడు. 9,10.త్రిశోకుడు.
1. సూర్యరూప ఇంద్రా! నీ ధనము నిత్య దానయోగ్యము. నీవు వరుదుడవు. మానవ హితకారివి. నీ ఉదారత సకల దిశలందు ప్రసిద్దము.
2. ఇంద్రా! నీవు వృతహంతవు. సూర్యరూపివి. నేడు ఆకసమున ప్రకాశించుచున్న దంతయు నీ అధీనమున ఉన్నది.
3. యదు, తుర్వరుసులను రాజులను శత్రువులు దూరదేశములకు తరిమినారు. ఇంద్రుడు తన నీతి కౌశలమున తిరిగి వారిని దేశములకు రప్పించినాడు. అట్టి యువతమా ఇంద్రుడు మాకు మిత్రుడు కావలెను.
4. ఇంద్రదేవా! రాక్షసులు సకల దిశల నుండి అస్త్రములు ప్రయోగింతురు. సర్వత్ర సంచరింతురు. వారు రాత్రులందు మా ముందునకు రాకుందురు గాత. వచ్చినచో నీ సాయమున మేము వారిని నష్టపరుతుము గాక.
5. ఇంద్రా! మా రక్షణకు గాను ధనమును ప్రసాదించుము. ఆ ధనము శత్రువును తిరస్కరించునట్టిది, శత్రువును ఓడించు నట్టిది కావలెను. అట్టి బహు ధనమును కలిగించుము.
6. ఇంద్రుడు శత్రు నాశనమునకు వజ్రము పట్టినవాడు. మేము కొలది ధనము కొరకును, మరింత ధనము కొరకును అట్టి ఇంద్రుని ఆహ్వానింతుము.
7. ఇంద్రుడు కద్రువుడు అను ఋషిచే అభిషుతము చేయబడిన సోమమును సేవించినాడు. 'సహస్ర బాహువు' అను శత్రువును వధించినాడు. అప్పుడు ఇంద్రుని పరాక్రమము ప్రశస్తమైనది.
8. వరప్రదఇంద్రా! నీవు వ్యాపకుడవు. మేము నిన్ను ఆశ్రయించినాము. నీ ముందు నిలిచినాము. నీకు ఎన్నో ప్రణామములు చేయుచున్నాము. మా కీర్తినములను గ్రహించుము.
9. మేము అభిముఖులము అయినాము. యువక ఇంద్రుడు అగ్నికి మిత్రుడు. అట్టి అగ్నిని వెలిగించుచున్నాము. అతనిని కుశలచే కప్పుచున్నాము.
10. ఇంద్రదేవా! ద్వేషించు శత్రువులను చెల్లాచెదరు చేయుము. వినాశము కల్పించు యుద్దములను నష్ట పరచుము. అట్లు లబించిన ప్రశస్త, ప్రసిద్ద ధనమును మాకు తెచ్చి ఇమ్ము.
మూడవ ఖండము
ఋషులు :- 1. ఘౌర కణ్వుడు. 2. త్రిశోక కాణ్వుడు. 3,9. వత్స కాణ్వుడు 4. కుసీద కాణ్వుడు 5. మేధాతిథి కాణ్వుడు. 6. శ్రుతకక్ష ఆంగీరసుడు. 7. శ్యావాశ్వ ఆత్రేయుడు. 8. ప్రగాథ కాణ్వుడు. 10. ఇరిమిఠి కాణ్వుడు.
1. మరుత్తుల చేతులందు కొరడాలు ఉన్నవి. వాటి ధ్వని నాకు ఇచట వినిపించుచున్నది. ఆ ధ్వని సంగ్రామములందు చిత్ర విచిత్ర పరాక్రమములను ప్రదర్శించుచున్నది.
2. ఇంద్రా! నీ కొరకు సోమము చేతపట్టి నిలిచినా వారు - పగ్గము పట్టి పశువుల కొరకు వలె- నిరీక్షించుచున్నారు.
3. తలలు వంచిన విశ్వజనులు ఇంద్రుని అనుగ్రహము కోరి - సముద్రమునకు సాగు నదుల వలె - వినమ్రులై నిలిచి ఉన్నారు.
4. దేవతలారా! మీరు సమస్త దిశలందు తేజరిల్లువారు. వరదులు. మహాపాలకులు. మీ పాలన సమస్త దిశల నుండి మమ్ము రక్షించవలెనని ప్రార్ధించుచున్నాము.
5. బ్రహ్మణస్పతీ! నేను సోమమును అభిషవించువాడను. ఉశిజ పుత్రుడగు 'కక్షీవంతుడు' దేవతలందు ప్రముఖుడు అయినట్లు నన్ను దేవతలందు ప్రకాశవంతుని చేయుము.
6. ఇంద్రుడు వృత్రుని వధించినాడు. అందువలన అతని కొరకు అనేక దేశములందు సోమము సిద్దమైనది. అతడు మా కోరికలను తెలిసి కొనును గాత. "శృణోతు శక్ర ఆసిషమ్" శక్రా! మా స్తుతులను ఆలకింపుము.
7. సూర్యదేవా! మాకు సుపుత్ర సహిత ధనమును ప్రసాదించుము. మా దుస్వప్నములను దూరము చేయుము.
8. వరదుడు, యువకుడు, తలవంచని ఇంద్రుడు ఎచట ఉన్నాడు? ఇది ఎవరికి తెలియును? ఏ ఋత్విజుడు అతనిని పూజించగలడు?
9. పర్వత ప్రదేశములందును, నదుల సంగమ స్థానములందును స్తుతించినప్పుడు మేధావి ఇంద్రుడు ప్రత్యక్షమగును.
10. ఇంద్రుడు మానవులకు సామ్రాట్టు. స్తోతవ్యుడు. నేత. శత్రుహంత. పమదాత. అట్టి ఇంద్రుని అధికముగ కీర్తించండి.
నాలుగవ ఖండము
ఋషులు :- 1,6,7. శ్రుతకక్షి. 2.మేధాతిథి, 3. గోతముడు 4. భరద్వాజుడు. 5. బిందు పూత దక్షుడు. 8. వత్సుడు. 9,10. శునశ్శేపుడు.
1. ఇంద్రుడు సుందర శిరస్త్రాణము కలవాడు. "సుదక్షుడు' ను ఋషి యవలతో సోమము చేసినాడు. అట్టి సోమమును ఇంద్రుడు సోమపత్రముల నుండి రాలుచుండగా పానము చేసినాడు.
2. ఇంద్రా! నీవు అధిక ధనశాలివి. మా స్తుతులు నీ దిశగా - గోవులు దూడల వద్దకు వలె - పరుగులిడుచున్నవి.
3. కదలిక గల చంద్రుని యందు రాత్రులందు సహితము సూర్యకిరణములే ప్రకాశించుచున్నవని చెప్పుచున్నారు.
4. ఇంద్రుడు అధికతమ వర్షము కలిగించువాడు. అతడు భూమండలమునకు వర్షజలమును పంపుచున్నాడు. అప్పుడు పూషదేవత ఇంద్రునకు సహాయపడుచున్నాడు.
5. ధనవంతులగు మరుత్తుల తల్లి, వారి రథమును లాగు గోవు అన్నము అందించగోరి అందరి పూజలు అందుకొను చున్నది.
6. ఇంద్రా! నీవు సోమస్వామివి. సోమము సిద్దముగా ఉన్నది. హర్యశ్వ సహితముగా విచ్చేయుము. "ఉపవో హరిభిః సుతం"
7. మా యజ్ఞమున ఇంద్రుని వర్దిల్ల చేయదలిచినాము. మా హోతలు అవభ్రుత పర్యంతము తమ తేజమున- ఇంద్రునకు ఆహుతులు అర్పించుచున్నారు.
8. నేను పాలకుడగు ఇంద్రుని మనసును గ్రహించినాను. అందువలననే సూర్యుని వలె - ప్రకాశించుచున్నాను.
9. అన్నములు కలిగిన మేము మా గోవులతో మురియుచున్నాము. ఇంద్రుడు సహితము మావలె హర్షించిన మా గోవులు దుగ్ధవంతలు, బలవంతలు కాగలవు.
10. దేవతలందు రథికుడగు సోముడు, పూష, మానవులు అర్పించు హవిస్సులు గ్రహింతురు గాత.