"నో.... నో-మీలాంటి కస్టమర్లు వస్తేనే.....అప్పుడప్పుడు మాలో ఆ మాత్రం కదిలికైనా ఉంటుంది" నవ్వేశాడు వికాస్.
విజిటర్స్ రూం వరకూ వచ్చింది లిఖిత.
"మళ్ళెప్పుడొస్తారు....?" చుట్టాన్ని అడిగినట్టుగా అడిగాడు.
"ఫోన్ చేస్తాన్లేండి-" షోరూం లోంచి బయటికొచ్చింది లిఖిత.
ఆమెవేపే అలా చూస్తూ నిలబడ్డాడు వికాస్.
* * * * *
డాల్ఫిన్ సెంటర్లో, బస్సెక్కి ప్రహ్లాదపురం వచ్చేసరికి రాత్రి పదయింది. ప్రహ్లాదపురంలో ఎడం పక్కన వరసగా కొత్తగా కట్టిన భవనాలు. అందులో ఓ ఇంట్లో మెడమీద వంటరి గది.... ఒక గది.... చిన్న వంట గది..... విశాలమైన డాబా.
తలుపు తీసుకుని లోనకెళ్ళాడు.
చిందర, వందరగా పుస్తకాలు.... పేపర్లు... అన్నీ ఆటోమోబైల్ ఇండస్ట్రీ గురించిన పుస్తకాలే.
అతనికెందుకో ఆకలెయ్యలేదు. ఉదయం వేడి పెట్టి ఉంచిన పాలు గ్లాసులో వున్నాయి.
తాగేసి-
గది మధ్య నున్న చాపమీద నడుం వాల్చాడు వికాస్. పక్కనున్న ఓ పుస్తకాన్ని అందుకున్నాడు.
అది అమెరికాలో ఆటోమోబైల్ ఇండస్ట్రీలో సంచలనం సృష్టించిన 'లీఅయకోకా' జీవిత చరిత్ర 'టాకింగ్ స్ట్రెయిట్....'
పేజీలు తిప్పగానే ఓ చాప్టర్ వచ్చింది. ఆసక్తిగా చదువుతున్నాడు.....అతనిలో కలిగే ప్రస్టేషన్ కీ, డిప్రెషన్ కీ, నిరాశక్తతకీ, నిర్లిప్తతకీ, అసంతృప్తికీ, దుఃఖ భాజనమైన ఆలోచనలకీ ఏకైక మందు ఆటోమోబైల్స్ గురించి ఆలోచించటం, చదవటం, చూడటం, కొత్త డిజైన్స్ కోసం కుస్తీ పట్టటం. అందుకే మనస్సు బావోలేనప్పుడు అలా చేస్తాడు.
Life is full of all sorts of cycles-night follows day. Fall follows summer, tides follow the moon. Those are the ones God takes care of. Then there are the ones people take care of, business cycles, energy cycles automotive cycles. Those we manage to screw up but good.
ఆ పేరా చదివి పుస్తకం పక్కన పెట్టేశాడు వికాస్.
అవును బ్రతుకో చక్రం.... విధి నిర్మించిన గతుకుల మాయా రోడ్లమీద బ్రేకుల్లేని వింత చక్రం జీవితం.....
ఒక్క సాహసి మాత్రమే ఆ చక్రానికి బ్రేకులు వేయగలడు...
వికాస్ పెద్ద పెద్ద కళ్ళమీదకు మగత నిద్ర.
సుడులు తిరుగుతున్న వలయాలు.... ఆ వలయాల్లో ఓ వలయం దగ్గర అతనాగిపోయాడు....
అప్పటికి అతని వయసు ఆరేళ్ళు....
చిన్న కర్రముక్క చేతిలో పట్టుకుని సైకిల్ చక్రాన్ని తిప్పుకుంటూ మట్టిరోడ్డు మీద పరుగెడుతున్నాడు.
* * * * *
If the hunter knows what's good for him, he'll leave the little ones alone.
వికాస్ వయస్సు ఆరేళ్ళు.
చిన్న కర్రముక్క చేతిలో పట్టుకుని, సైకిల్ చక్రాన్ని తిప్పుకుంటూ మట్టిరోడ్డు మీద పరిగెడుతున్నాడు.
ఆంద్రదేశంలోని, ఓ వెనుకబడిన జిల్లాలోని ఓ మారుమూల గ్రామం. అంతా మూడువేలమంది జనాభా.
గ్రామం జబ్బుపడి కోలుకుంటున్నట్టుగా వుంటుంది. అయిదారు మలుపులు తిరిగే, ఓ పొడవాటి రోడ్డుకి అటూ ఇటూ ఇల్లు- అదే వూరు- ఊరుకి మొదట విశాలమైన నేల నుయ్యి... ఊరుకి చివర చల్లగా పారేఏరు...
కరువు వాతపడ్డ వూరు, ప్రతీ ఏటా మనుషుల్ని కాటు వేస్తూనే వుంది. అనాదిగా ఆ వూరినే నమ్ముకుని, అష్టకష్టాలు పడుతున్న కుటుంబం ఒకటుంది.
అది విశ్వనాధం కుటుంబం. ఉన్న కొద్దిపాటి పొలం మీద వచ్చే ఆదాయం సన్నగిల్లింది. దాంతో వున్న భూములూ హారతి కర్పూరంలా హరించుకు పోయాయి. పాడుబడ్డ శివాలయంలో, భక్తులు లేని శివుడికి పూజారి బ్రతుకైంది విశ్వనాధానిది. ఏ పనయినా చేసి కుటుంబాన్ని బ్రతికించుకోవటానికి అర్ధం లేని పరువు ప్రతిష్టలు... మా తాతలు నేతులు తాగారు... మా నాన్న పూలమ్మినచోటు.... నేనెలా ఏ పని బడితే ఆ పని చేస్తాను....? బద్ధకం....సోమరితనం....ఆత్మవంచన.... చరిత్ర పుటల్లో ఉన్న పురాతన వైభవాన్ని స్మరణ చేసుకుంటూ వర్తమానానికి సమాధి కట్టుకుంటున్న విశ్వనాధం మనదేశంలో చాలామంది రూపంలో చాలాసార్లు కనిపిస్తూనే ఉంటారు.
విశ్వనాధానికి అయిదుగురు ఆడపిల్లలు. చివరివాడు వికాస్. ఎవరికీ పెళ్ళిళ్ళు చేయలేకపోయాడు ఆయన. ఇంట్లో దీపపు సెమ్మెల్లా తిరిగే ఆడపిల్లల్ని చూస్తూ, వాళ్ళని వాళ్ళ వయసు ఎలా తీసుకెళ్తుందోనని ఆలోచిస్తూ, నుక్షణం రంపపు కోతతో బతుకుతున్నారు దంపతులు.
"ఒరేయ్.... బాబీ...." ఆ కేకకు ఆగిపోయాడు వికాస్. అతని చేతిలో చక్రం కూడా ఆగిపోయింది. ఆ కేక తండ్రిది. గజగజ వణికిపోయాడు వికాస్. చెమట్లు కక్కుకుంటూ నిలుచుండిపోయాడు.
"బడి కెళ్ళమని చెప్తే- పోరంబోకు ఆటలు ఆడుతున్నావా..." పక్క వూరి నుంచి చిన్న పని చేసుకుని వస్తున్నాడాయన-పై పంచకు కట్టిన బియ్యం.....
పరుగు పరుగున వచ్చి, వికాస్ జుట్టుని పట్టుకుని, దబదబా బాది, నేలమీద ఈడ్చి కొట్టి-
"తగలడురా... తగలడు..... ఆడముండలలా తగలడ్డారు... నువ్వూ తగలడు.... ఇలాగే తిరిగితే.... నాకు ఇదైనా దొరుకుతోంది..... నీకదీ దొరకదు...." జుట్టు పట్టుకుని ఇంటి దాకా ఈడ్చుకొచ్చాడు కొడుకుని, విశ్వనాథం.
వళ్ళంతా, దెబ్బల్తో తండ్రి నుంచి విడిపించుకొని తల్లి చాటుకెళ్ళి, అక్కడి నుంచి ఓ మూలకెళ్ళి పోయాడు వికాస్.
"ఇదిగో.... ఈ గిద్దెడు గింజల్..... దొరికాయి..... వండి తగలెట్టు....." భుజమ్మీద పైపంచ మూటని పెళ్ళాం వేపు కోపంగా విసిరేశాడు. మూట విడిపోయి, ఆ కాసిన్ని గింజలూ అరుగుమీద చెల్లా చెదురైపోయాయి.
ఆ గింజల్ని ఆత్రంగా ఏరుతోంది విశ్వనాధం భార్య.
* * * * *
గోదావరి ఎక్స్ ప్రెస్ లో, ఫస్ట్ క్లాస్ కంపార్ట్ మెంట్లో, కిటికీ పక్కన కూర్చున్నాడు వికాస్.
వచ్చే ముందు ఏరియా మేనేజర్ చెప్పిన మాటలు గుర్తుకొచ్చాయతనికి. అతనికి నలభై ఎనిమిదేళ్ళు, భయస్తుడు.
"ఒక ట్రైనీని, చైర్మెన్ పిల్చాడంటే... నా యిన్నాళ్ళ సర్వీసులో ఇలాంటి విచిత్రం ఎప్పుడూ జరగలేదు...అంతా నీ మంచికేలే....చూద్దాం కానీ వికాస్....ఒక మాట... ఈ యూనిట్ గురించి ఏమైనా అడిగాడనుకో.... ఏం చెప్తావ్....భూతద్దాల్లోంచి చూస్తూ అమాయకంగా అడిగాడాయన.
"నాకు తెల్సు కదా సార్...." నవ్వుతూ అన్నాడు వికాస్.
"ఏవో.... చిన్న చిన్న గొడవలుంటాయి. నేను సీనియర్ మేన్ని గనక సర్దేస్తున్నాను. నీకా విషయం తెల్సు.... నిన్ను రిక్రూట్ చేసేటప్పుడు నువ్వెవరో నాకు తెలీనే తెలీదు గదా.... వున్నన్నాళ్ళూ మనిషి మంచిగా బతికేస్తే చాలదూ....ఏమంటావ్?" ఆయన ఏం చెప్పదల్చుకున్నాడో అర్ధమైంది వికాస్ కి.
"మీరు చెప్పినట్లే నడుచుకుంటాను-ఓ.కె.నా సార్" అన్నాడు.
"నాకు తెల్సనుకో.... బైదిబై.... ఇంకో ఇంపార్టెంట్ న్యూస్.... నువ్వు హైదరాబాద్ వెళ్ళడం యిదే మొదటిసారి కదూ.... నువ్వు ఏ ట్రైన్లో వస్తున్నావో, ఏ కంపార్టుమెంట్లో ఉంటావో హెడ్ ఆఫీస్ వాళ్ళకి మెసేజ్ యిచ్చాను. మన కంపెనీకి చెందిన ఓ మనిషి నిన్ను రిసీవ్ చేసుకుంటాడు. కంగారుపడకు....ఇంకో విషయం.... నీట్ గా వుండడం, తక్కువగా మాట్లాడటం, డిసిప్లెన్ మన చైర్మెన్ కి ఇష్టమయిన విషయాలు.... గుర్తుంచుకో."
ఆయన ఛాదస్తానికి నవ్వొచ్చింది వికాస్ కి.
చైర్మెన్ తననడిగే ప్రశ్నలెలా ఉంటాయి? వాటికి సమాధానం ఎలా చెప్తాడు? మనసులోనే రిహార్సల్ చెసుకుంటున్నాడు.
ఆ సమయంలో-
చటుక్కున-
లిఖిత జ్ఞాపకానికొచ్చింది.
చైర్మెన్ తనకు ప్రమోషన్ ఇస్తే, లిఖితతో తన స్నేహం ప్రేమగా మారితే అద్భుతమైన ఓ కారుకి తను రూపకల్పన చేయగలిగితే... అది సెన్సేషన్ క్రియేట్ చేయగలిగితే....?
వండ్రఫుల్... అందమైన ఆలోచనలను నెమరువేస్తున్నాడు వికాస్.
రైలు వేగం అందుకుంది.
* * * * *
జోడెడ్ల బండి నెమ్మదిగా యింటిముందుకొచ్చి ఆగింది. అందులో నుంచి దిగాడు చయనులు.