Previous Page Next Page 
త్రినేత్రుడు-2 పేజి 4


    అతని కాళ్ళు గిరుక్కున ఆవేపుకు తిరిగాయి. ఆమెకు దగ్గరగా వస్తుండగానే ఆమె కూర్చున్న తీరునుబట్టి తను ఫోన్ లో విన్నది నిజమేనని నిర్ధారించుకున్నాడు.

    ఆమె వాలు కుర్చీలో ఓ ప్రక్కకు ఒరిగిపోయివుంది. ముడివిడిన పొడవాటి జుత్తు ఆమె మోమంతటా పరుచుకుంది- ఆమె మానసిక స్థితిని పరోక్షంగా తెలియపరుస్తూ.

    ఆమెను ఆ స్థితిలో అతనెప్పుడూ చూడలేదు.

    ఎప్పుడూ ప్రశాంతంగా, నిండు గోదారిలా గంభీరంగా కనిపించే ఆమె ఇప్పుడు అనాదిగా స్త్రీకి జరిగే అవమానానికి ప్రతీకలా వుంది.

    అతని అడుగుల చప్పుడు ఆమె వింది. నిస్సత్తువతో జేరగిలబడ్డ ఆమె మృదువైన శరీరం ఒకింత కుదుపుకు లోనయింది.

    "ఏం జరిగింది?" అతని కంఠంలో కుత్తుకల్ని తెగటార్పే ఆవేశం.

    తానాశించింది నిజమైనందుకు ఆమె నిట్టూర్చింది.

    అతనామె సమాధానం కోసం ఎదురుచూస్తున్నాడు- అలా అని ఆమెకీ తెలుసు.

    అక్కడ పరుచుకున్న స్మశాన నిశ్శబ్దాన్ని అతను భరించలేకపోతున్నాడు.

    ఆమె తలెత్తింది.

    అప్పటికే పరుచుకున్న మసక వెలుతురులో ఆమె మోములోని ఏ సంకేతాన్నీ అతనికి అందించలేకపోయాయి.

    ఒకింత వ్యాకులతతో పరిశీలనగా ఆమె మోములోకి చూశాడు.

    పరిపూర్ణతను సంతరించుకుని కనిపించే ఆమె మోములోని భావాలు అరుదైన, అనన్య సామాన్యమైన ఆకర్షణ ఇప్పుడు కనిపించడంలేదు. భావ శూన్యంగా వుండిపోయింది.

    "నేను విన్నది నిజమేనా?" అతని గొంతులో అసహనం తొంగి చూసింది.

    ఆమెకి మాట్లాడక తప్పదనిపించింది.

    "ఈ నిజం ఇక్కడ నా ద్వారానే కాదు- ఈ ప్రపంచంలోని ఏ స్త్రీ ఎక్కడ వున్నా తరచూ నిరూపించబడుతుంటుంది" ఆమె కంఠంలో అదో రకమైన నిర్లిప్తత.

    త్రినాధ్ గుప్పిళ్ళు బిగుసుకున్నాయి. రక్తం ఆవేశంతో ఉప్పొంగింది. పళ్ళు పటపటా కొరికాడు.

    అతనిలో వస్తున్న మార్పును ఆమె పసిగట్టింది.

    "ఈ పురుషాహంకార వ్యవస్థలో ఓ స్త్రీకి ఉత్తేజం జలిగిమ్చే లక్షణం వుండడం నేరం. అందుకు మొగవాడి ఇగో అసూయపడుతుంది- ఆవేశ పడుతుంది- అంతమొందించాలని చూస్తుండి. ఇప్పుడదే జరిగింది..."

    "ఏమో! అవన్నీ నేనిప్పుడు ఆలోచించే స్థితిలో లేను. దెబ్బకు దెబ్బ. హింసకు హింస... అంతే" అతను ఆవేశంగా ప్రక్కకు తిరిగాడు.

    "నీలో పగ, ప్రతీకారం భౌతికపరమైన చర్యకు అంకురార్పణ జరిపితే నీవు మనిషివే కావన్న నీ అస్థిత్వానికి సంబంధించిన ప్రశ్నకు సమాధానం చెప్పుకోలేవు త్రినాధ్..." ఆమె గొంతులో జీర.

    గుండె కలుక్కుమంది త్రినాధ్ కి.

    "ఓంతో విద్యాభ్యాసానికి శ్రీకారం చుట్టి పెద్ద పెద్ద విద్యా సంస్థలలో విద్యనార్జించే నేటి విద్యార్ధి లోకానికి తమ గురుదేవులకు అవమానం జరిగితే చూస్తూ మిన్నకుండే అల్పత్వం- కృతజ్ఞతారాహిత్యం వుంటే వుండుగాక- ఎలా బ్రతకాలో చెప్పి నన్నో మనిషిని చేసిన గురుదేవులకు జరిగిన అవమానానికి ప్రతీకారం తీర్చుకుని ఆ విధంగా నా అస్తిత్వానికో అర్ధం కల్పించుకుంటాను. ఇదే నా తుది నిర్ణయం..." అంటూనే ఆమె రియాక్షన్ కోసం ఆగకుండా బయటకు దూసుకుపోయాడు.


                                        *    *    *    *


    స్టేట్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ బిల్డింగ్... స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ యూనిట్స్ ఆర్గనైజేషన్ కి అప్పుడు ఎలక్షన్స్ జరగబోతున్నాయి.

    దాదాపు ఐదారు వందలమంది చిన్న పారిశ్రామికవేత్తలు అక్కడ సమావేశమయ్యారు.

    యోగేష్ అక్కడున్నాడని తెలుసుకున్న త్రినాధ్ సరాసరి అక్కడికే వచ్చాడు.

    త్రినాధ్ ని చూస్తూనే ఐదారుగురు అతనెవరయిందీ గుర్తించేశారు.

    "ఇంతాలస్యమా?" ఒకతను అన్నాడు.

    అంటే తను ఇక్కడికి వస్తానని ముందే వూహించారా?!

    అంతలో గుప్తా వచ్చేసాడు అక్కడికి.

    "సరీగ్గా సమయానికి వచ్చారు. రండి... రండి... ఓటింగ్ మొదలు కాబోతోంది" అంటూ త్రినాధ్ ని దాదాపు లాక్కెళ్ళాడు.

    త్రినాధ్ కొంతఅరకు ఆ సందర్భాన్ని ఊహించగలిగాడు.

    తన ఆఫీస్ కి ఇన్విటేషన్ అంది వుంటుంది. తను వేరే పనిమీద వచ్చినా, తను వచ్చింది ఆ సమావేశానికి అటెండ్ కావడానికన్నట్లు వాళ్ళు భ్రమిస్తున్నారు. ఆలోచిస్తూనే యోగేష్ కోసం చిరుతపులిలా గాలిస్తున్నాడు.

    గుప్తా ఒక ఫారాన్ని తెచ్చి త్రినాధ్ ని దానిమీద సంతకం చేయమనడం- తను సంతకం చేయడం అంతా క్షణాలలో జరిగిపోయింది.

    అదెందుకున్నది త్రినాధ్ కింకా తెలియదు. చూస్తుండగానే హాలంతా నిశ్శబ్దం పరుచుకుంది. స్టేజ్ మీదకు బ్యాలెట్ పెట్టెను తెచ్చారెవరో. మరొకరు దానిచుట్టూ వుడ్ పార్టిషన్ అరేంజ్ చేశారు. ఈలోపు మరికొందరు స్లిప్స్ పంచుతున్నారు ఆడిటోరియమ్ అంతా తిరిగి.

    "ఇప్పుడు చిన్న పారిశ్రామికవేత్తల అసోసియేషన్ కి సెక్రటరీ పదవి కోసం ఓటింగ్ జరగబోతోంది. ఆ పదవి కోసం పోటీపడుతున్నది ఇద్దరు" గుప్తా మెల్లగా అన్నాడు.

    "ఎవరా ఇద్దరు?" అన్యమనస్కంగానే ప్రశ్నించాడు త్రినాధ్.

    "ఒకరు యోగేష్... మరొకరు..." గుప్తా మాటల్ని మధ్యలోనే ఖండించాడు త్రినాధ్.

    "ఎక్కడవాడు?" ఉరిమినట్లుగా అడిగాడు.

    త్రినాధ్ ప్రవర్తనకు విస్తుపోయిన గుప్తా క్షణాలలో తనను తాను సంభాళించుకొని "ఇక్కడే ఎక్కడో వుండాలి" అన్నాడు నెమ్మదిగా.

    సభ్యులొక్కొక్కరు తమ చేతుల్లోని స్లిప్స్ ని పరికించి చూస్తూ బ్యాలెట్ బాక్స్ వైపుకు వెళుతున్నారు వరుస క్రమంలో.

    ఉద్రేకం కట్టలు తెంచుకు ప్రవహిస్తున్నా, చుట్టూ కొన్ని వందలమంది ఉండటంతో బలవంతాన తనను తాను నిగ్రహించుకుంటూ యోగేష్ కోసం వెతుకుతున్నాడు.

    అప్పటికి అరగంటైంది ఓటింగ్ మొదలై.

    "మీ వంతు వచ్చింది. యోగేష్ తప్పక కనిపిస్తాడు. ఇప్పుడు మీ పాలిట పడనున్న అర్భకుడు అతనే కావచ్చు. కాని మీరిప్పుడు బాధ్యతా యుతమైన పారిశ్రామికవేత్త. మీకేదన్నా కసి, కోపం, పగ లాంటివి వున్నా తెలివిగా లౌక్యంతో అవతలివాడు సయితం అచ్చెరువందే రీతిలో తీర్చుకోవాలి. ఇప్పుడా స్లిప్ తీసి చూడండి- ఎవరికి ఓటేయాలో నిర్ణయించుకోండి" అతని కంఠంలో పెద్దరికం తొంగిచూసింది. అది త్రినాధ్ ని సున్నితంగా మందలించే ప్రయత్నం చేసింది.

    త్రినాధ్ చేతుల్లో వున్న స్లిప్ తీసి చూశాడు.

    అప్పుడతని గుండె లోతుల్లోంచి తన్నుకొచ్చిన ఆనందోద్వేగాన్ని కంట్రోల్ చేసుకోవడం బ్రహ్మ ప్రళయమైంది. మెరుస్తున్న కళ్ళతో గుప్తా వేపు చూశాడు. అతని కళ్ళలో ఇది నిజమేనా అన్న సందేహం. మీరింత మేలు చేశారా అన్న కృతజ్ఞతాభావం. ఉక్కిరిబిక్కిరయిపోయాడు త్రినాధ్.

    గుప్తా త్రినాధ్ భుజాల్ని ఆప్యాయంగా నిమురుతూ కళ్ళతోనే బ్యాలెట్ బాక్స్ చూపించాడు.

    అసలిదంతా ఎప్పుడు జరిగింది?

    గుప్తాగారు ఇంత జీనియస్సా?

    ఆ ఎక్సైట్ మెంట్ తోనే త్రినాధ్ బ్యాలెట్ బాక్స్ దగ్గరకు వెళ్ళి ఓటు ముద్ర వేసేందుకు తన గుప్పిట్లో బిగుసుకుపోయిన బ్యాలెట్ స్లిప్ ని విడదీశాడు.

    అందులో ఇద్దరి పేర్లే ఉన్నాయి.

    ఒకటి : త్రినాధ్!
   
    రెండు : యోగేష్!

    అప్పటివరకు ఆ పోటీకి తన పేరు ప్రతిపాదించటమే గొప్ప అనుకున్న త్రినాధ్ కిప్పుడు మరో సందేహం తలెత్తింది- ఒకవేళ ఈ పోటీలో తాను ఓడిపోతే? ఇకపైన ఆలోచించుకోలేకపోయాడు.

    గుప్తామీద కృతజ్ఞతా భావంతో కళ్ళు తడిదేరిపోయాయి- ఓట్ మార్కింగ్ వుడ్ పీస్ ని పైకిలేపి లిప్తపాటు ఆగిపోయి, ముద్ర వేశాడు. ఆ తర్వాత వడివడిగా వచ్చేశాడు.

    కౌంటింగ్ మొదలైంది.

    అందరూ ఉత్కంఠతతో ఎదురుచూస్తున్నారు.

    అప్పుడు కనిపించాడు యోగేష్ త్రినాధ్ కి దగ్గరలో. ఒక్కక్షణం అతని పిడికిళ్ళు బిగుసుకున్నాయి. కాని ఏం చేయలేకపోయాడు గుప్తా ప్రక్క నుండడంతో.

    యోగేష్ త్రినాధ్ వైపు చూస్తూనే కనుబొమ్మల్ని వంకరగా కదిలించాడు.

    స్టేజిమీద నలుగురు సభ్యులు కౌంటింగ్ వ్యవహారంలో వున్నారు.

    గుప్తా ఒకింత ఆందోళనగా అటూ, ఇటూ పచార్లు చేస్తున్నాడు.

    ఐదు నిముషాల్లో కౌంటింగ్ పూర్తయింది.

    "సభ్యులంతా సామరస్యంతో మన అసోసియేషన్ ఎన్నికలలో పాల్గొన్నందుకు మా ధన్యవాదాలు. ఎన్నికైన కార్యదర్శి మన చిన్న తరహా పరిశ్రమల తరపున కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో సత్ సంబంధాలు ఏర్పరచుకొని మన సమస్యల్ని పరిష్కరించే ప్రయత్నంలో అకుంఠిత దీక్షతో, చిత్తశుద్ధితో వ్యవహరించాల్సి వుంటుంది. ఇప్పుడు రిజల్ట్స్ ప్రకటిస్తున్నాను..."

    అందరూ ఊపిరి బిగపట్టారు.

    "త్రినాధ్ కి నా హృదయపూర్వక అభినందనలు."

    అంతే! హాలంతా చప్పట్లతో మారుమ్రోగిపోయింది.

    ఎవరు గెలిచిందీ అందరికీ అవగతమైపోయింది.

    త్రినాధ్ ఉప్పొంగిన కృతజ్ఞతాభావంతో గుప్తాని ఆప్యాయంగా తన అక్కున చేర్చుకున్నాడు. సభ్యులు గుంపులు, గుంపులుగా త్రినాధ్ వేపుకి దూసుకు వచ్చి కరచాలనం చేసి అభినందనలు తెలుపుతున్నారు.

    గుప్తా మనసు ఆనందంతో గంతులేసింది. అందుక్కారణం తను ప్రపోజ్ చేసిన త్రినాధ్ గెలిచినందుకే కాదు. తన శత్రువు సుదర్శన్ రావు కొడుకు ఓడిపోయినందుకు.

    అన్యమనస్కంగా అందరితో కరచాలనం చేస్తూనే "గుప్తాజీ... నాకిప్పుడు యోగేష్ కావాలి. పగ తీర్చుకోవడం కోసమే కాదు. మర్యాద కోసం పరామర్శించడానికి..." అన్నాడు నెమ్మదిగా త్రినాధ్.

    గుప్తా మరి ఇద్దరితో కలిసి హడావిడిగా యోగేష్ కోసం వెతుకుతుండగా అతను వడివడిగా గేటువైపు సాగిపోతూ కనిపించాడు.

    అంతే... గుప్తా చటుక్కున స్టేజ్ ఎక్కి "యువపారిశ్రామికవేత్త శ్రీ యోగేష్ స్టేజీమీదకు రావాల్సిందిగా నూతన కార్యదర్శి త్రినాధ్ అభ్యర్ధిస్తున్నారు" అన్నాడు.

    తప్పదు. ఇష్టం లేకపోయినా సభ్యత పాటించాలి.

    యోగేష్ స్టేజి దగ్గరకు వచ్చేసరికే త్రినాధ్ స్టేజి ఎక్కేశాడు.

    ఓ సభ్యుడు చేతిలో పూలదండతో హుషారుగా వచ్చి త్రినాధ్ కి వేసేందుకు ప్రయత్నించబోతుండగా త్రినాధ్ మృదువుగా అతన్ని వారించి మెల్లగా ఏదో అన్నాడు.

    ఆ సభ్యుడు తల పంకించి యోగేష్ దగ్గరకు వెళ్ళి అతని చేతికి దండ అందిస్తూ "మీ చేతులమీదుగానే మొదటి దండ వేయించుకోవాలని త్రినాధ్ ముచ్చటపడుతున్నాడు. వాటే గ్రేట్ మేన్... కమాన్... రండి" అన్నాడు అందరికీ వినిపించేలా.

    మొహాన నెత్తురుచుక్క లేదు యోగేష్ కి ఆ క్షణంలో.

    అందరూ అతని వైపే చూస్తున్నారు. తప్పలేదు యోగేష్ కి.

    మొహానికి నవ్వు పులుముకుని త్రినాధ్ దగ్గరకు వచ్చి అతని మెడలో దండవేస్తూ అతనికి మాత్రమే వినిపించేలా "నాది త్రాచుపాము పగ. గెలిచానని ఆనందించకు. దెబ్బతినేందుకు సిద్ధంగా వుండు" అన్నాడు.

    అంతే! త్రినాధ్ లో పగ పులిపంజా విప్పింది.

    యోగేష్ కి మర్యాదపూర్వకంగా షేక్ హేండ్ ఇచ్చేందుకు చేయి చాచాడు త్రినాధ్.

    ఆ చేతి బలాన్ని అంచనా వేయలేని యోగేష్ మామూలుగానే తన చేతిని అందించాడు. అప్పటికే త్రినాధ్ చేయి ఉక్కుపిడికిలయింది. తన చేతిలోకి వచ్చిన యోగేష్ చేతిని చటుక్కున బంధించేశాడు.

 Previous Page Next Page