Previous Page Next Page 
గోడచాటు ముద్దు పేజి 4

    భార్గవి కాలిన చెంపల మీద నుంచి కన్నీటి చుక్కలు నెమ్మదిగా జారుతున్నాయి ఆమెలో కరుడుగట్టుకుపోయిన బాధని కరిగిస్తూ.
   
    "కానీ ఈ నా పరిస్థితికి కారణం....." తలగడ పక్కనున్న హేండ్ బ్యాగ్ ను అందుకుని నెమ్మదిగా జిప్ తీసి అందులోంచి ఒక కవర్ని తీసి మయూష చేతిలో పెట్టింది భార్గవి.
   
    "ఈ ఉత్తరం చదువు మయూషా, నేను దారుణమైన మోసానికి, అన్యాయానికి గురయ్యానని నీ కనిపిస్తే నాకు న్యాయం చెయ్యి__మనిషి చచ్చిపోయాక ఉన్నవాళ్ళు కోరికలు తీరిస్తే చనిపోయినాకా, ఆత్మ సంతృప్తి చెందుతుందని అంటారు. కానీ నాకా నమ్మకం లేదు.
   
    నేను చచ్చిపోయాక ఎప్పుడయినా నన్ను తల్చుకుంటానని చెప్పు. చాలు హాయిగా....అంటూ బాధగా పక్కకు తిరిగింది భార్గవి.
   
    "అంత మాటనకు భార్గవీ. నీ కోసం నేను నిలబడతాను. నీకు జరిగిన అన్యాయానికి ఎదురు తిరిగి మన ఫ్రెండ్స్ అందరి సహాయంతో న్యాయం కోసం నేను పోరాడుతాను. నువ్వేం బాధపడకు. చచ్చిపోతానని పిరికిదానిలా ఆలోచించకు. జరిగినదేదో జరిగిపోయింది......" అంటూ చేతిలోని కవర్ని విప్పబోతూ భార్గవి ముఖంలోకి చూసి కెవ్వుమని కేకలేసింది మయూష.
   
    అకస్మాత్తుగా అప్పుడే పక్కకు తల వాల్చేసిన భార్గవి ముఖం వికృతంగా కన్పిస్తోంది__
   
    పరుగు పరుగున వచ్చిన లేడీ డాక్టర్ భార్గవిని టెస్ట్ చేసి "సారీ మయూష. షి ఈజ్ నో మోర్....." అందా డాక్టర్ బాధగా.
   
    రెండు నిమిషాల సేపు అలా భార్గవి తెరచి వున్నా కళ్ళవేపే చూసింది మయూష.
   
    ఎప్పుడూ తన కుటుంబ పరిస్త్య్తుల గురించి కానీ, తన గురించి కానీ చెప్పుకోకుండా ఉల్లాసంగా ఆనందంగా మాత్రమే ఉండడానికి, కన్పించడానికి ప్రయత్నం చేసిన భార్గవి వెనక-
   
    తనకు తెలియని కథ ఒకటి ఉందంటే ఆశ్చర్యంగా వుంది మయూషకు.
   
    అప్పటికే భార్గవి వార్త తెల్సి వరసగా స్టూడెంట్స్, లెక్చరర్స్ ప్రవాహంలా నర్సింగ్ హోమ్ కు రావడం మొదలు పెట్టారు.
   
    భార్గవి రాసిన ఉత్తరం మయూష చేతిలో రెపరెపలాడుతోంది. డ్యూటీ డాక్టర్ రూమ్ లోకి నడిచి ఉత్తరాన్ని విప్పి చదవడం ప్రారంభించింది మయూష.
   
    డియర్ మయూషా!
   
    అందరు ఆడపిల్లల్లా నేను పెరగలేదు. తండ్రి పోయిన క్షణం నుంచీ నా తల్లి నన్ను కంటికి రెప్పలా పెంచింది. ఎవరూ లేని ఏకాకితనంలోంచి పెరిగిన నేను బాగా డబ్బు సంపాదించాలని నా వాళ్ళను ఆదుకోవాలని వాళ్ళను నిలబెట్టాలని, వార్ని ఒడ్డున పడెయ్యాలనుకున్నాను.
   
    హాస్టల్లోని నా కోలీగ్ ఇచ్చిన సలహా మేరకు ఒక ప్రయివేట్ కంపెనీలో ఏ రికమండేషన్ లేకుండా నాకు ఉద్యోగం దొరికింది. పెద్దకంపెనీ. మంచిజీతం.
   
    నాకొచ్చిన జీతంలో కొంత భాగం ఇంటికి పంపిస్తూ కాలాన్ని, అవసరాల్ని, ఎలాగో అతి కష్టం మీద నెట్టుకొస్తున్న క్షణంలోనే నా జీవితం ఒక అనుకోని మలుపు తిరిగింది.
   
    ఎప్పుడూ బిజీగా టూర్స్ లో వుండే ఆ కంపెనీ ప్రొప్రయిటర్ ఆఫీస్ కు రావడం, నన్ను పిలవడం జరిగింది.
   
    అప్పుడు తెల్సింది ఆయనెవరో మన రాష్ట్రంలో పేరు ప్రఖ్యాతులున్న పెద్ద ఇండస్ట్రియిలిస్ట్ జ్వాలాముఖిరావు.
   
    ఆరోజు, ఆయన రూమ్ లో, నా తండ్రి వయసున్న ఆయనను చూస్తూ, ఆశ్చర్యంగా నిలబడిపోయాను.
   
    కాసేపు నా వివరాలు అడిగిన తర్వాత__
   
    ఏ రికమండేషన్ లేకుండా నీకు ఉద్యోగం ఎలా వచ్చిందో తెలుసా? అని ఆయన ప్రశ్నించాడు.
   
    తెలీదని జవాబు చెప్పాను.
   
    ఆయన చిన్నగా నవ్వి-
   
    నీ అందం, నీలో మెరిసిపోయే అందమే, నీకీ ఉద్యోగాన్ని, ఎక్కువ జీతాన్నీ తెచ్చి పెట్టింది అని అన్నారాయన__
   
    ప్రపంచంలో నాకు చాలా దేశాల్లో చాలా మంది అందగత్తెలతో పరిచయాలున్నాయి. నిన్ను చూడగానే ఇష్టపడింది అందుకే. నేను అందాన్ని ప్రేమిస్తాను తప్ప ఆడపిల్లను ప్రేమించను__అందుకే నాకు అతి తక్కువ మంది అమ్మాయిలు మాత్రమే నచ్చుతారు.....సో....ఐ లైక్ యూ__
   
    ఫ్రాంక్ గా చెప్పేస్తున్నాను. నువ్వేమిటో నీ ఫామిలీ బ్యాక్ గ్రౌండ్ ఏంటో మొత్తం రికార్డు తెప్పించాను. ఇలాంటి పరిస్థితుల్లో నీకు నాలాంటి పవర్ ఫుల్ మేన్ సపోర్టు అవసరం కాదంతావా అని ప్రస్నించాడు,
   
    నాకు ఏం జవాబు చెప్పాలో అర్ధంకాక విస్మయంగా ఆయనవేపు చూస్తూ ఊరకుండిపోయాను. ఆయనన్న దాంట్లో కూడా నిజం లేక పోలేదు.
   
    అర్ధం కాలేదా బేబీ. నాకు కావలసిన అందాన్ని నువ్విచ్చావనుకో..... నీకు కావాల్సినదానిని నువ్వు కోరుకున్న దానికంటే ఎక్కువే నేను ఇస్తాను.....నీకేం కావాలో నాకు తెల్సు తండ్రిలేని నీ కుటుంబాన్ని అదుకోటానికి__నీ తమ్ముళ్ళకు, చెల్లెల్లకు చదువు చెప్పించటానికి__వారి పెళ్ళిళ్ళు చేయటానికి నీకు చాలా డబ్బు కావాలి. నేను భార్యలేని వాడిని ఆలోచించుకో__
   
    అతను చెప్పిన చివరి వాక్యం తర్వాత అతని కోరిక ఏమిటో నాకు అర్ధమైంది__రెండు రోజుల తర్వాత__నా అవసరాలు నన్ను బాగా కలవరపరిచాయి. నా అవసరాల్ని అయన బాగానే ఊహించాడు. హాస్టల్ కి కారొచ్చింది__ఆ కారు నన్ను దిల్ షుక్ నగర్ గెస్ట్ హౌస్ కు తీసికెళ్ళింది.
   
    ఆయన డబ్బు, ఆయన ఐస్వర్యం, ఆయనకున్న పేరు ప్రతిష్టలూ....ఇవన్నీ నాలో ఆశలు రేపాయి. ఆరోజు నేనాయనకు లొంగిపోయాను గెస్ట్ హవుస్ నుంచి వచ్చే ముందు నా పర్స్ లో పదివేల రూపాయలను పెట్టాడాయన.
   
    నన్ను డబ్బుతో ఆయన కొనుక్కోవడం ప్రారంభించాడు. ఆ డబ్బుతోటే నేను ఆ కుటుంబాన్ని ఆదుకోవటం ప్రారంభించాను.
   
    ఆయన నెలకు రెండుసార్లు హైదరాబాద్ ఆఫీసుకు విజిటింగ్ కు వస్తాడు. ఆ సమయంలో నేను ఆయన గెస్ట్ హవుస్ కి వెళ్ళేదానిని__ఇలా మూడు నెలలు గడిచాక__
   
    ఒకసారి ఆయన తన భార్య ప్రసక్తి తీసుకువచ్చాడు. నాలో తన భార్యను చూసుకుంటున్నానని అన్నాడాయన....ఆ మాటకు నేను చాలా పొంగిపోయాను. అంతే......ఆ రోజు నుంచి__
   
    అనధికారికంగా ఆయన భార్యలా స్వేచ్చగా నేను ఆఫీసులో ప్రవర్తించసాగాను.
   
    అప్పటికే నా గురించి ఆఫీసులో గుసగుసలు మొదలయ్యాయి.
   
    ఒకరోజు ఆఫీసులో నా సీనియర్ కొలీగ్ ఒకావిడ అడిగింది__
   
    ఏమిటీ! చైర్మన్ చూపు నీమీద పడిందా....అని.ఆ మాటకు నాకు చిరుకోపం వచ్చింది.
   
    చూపు పడడమేమిటి! నన్నాయన పెళ్ళి చేసుకుంటున్నారు....అని అన్నాను చాలా ఆత్మవిశ్వాసంతో.
   
    ఆ కొలీగ్ వెకిలిగా నవ్వింది-
   
    పిచ్చిపిల్లా....కోటీస్వరుడికి భార్య కావాలంటే మరో కోటీశ్వరురాలే దొరుకుతుంది- నువ్వక్కర్లేదు-నీలాంటి అందమయిన ఆడపిల్లల్తో ఆడుకోవడం, ఆటయ్యాక బెడ్ రూమ్ లోనే వదిలేసి వెళ్ళిపోవడం మగాడి సరదా....జాగ్రత్త ....భ్రమల్లో బతకొద్దు.....అని క్యాజువల్ గా హితోపదేశం చేసి వెళ్ళిపోయిందావిడ.
   
    పది రోజుల తర్వాత__
   
    జ్వాలాముఖిఠావుతో గెస్ట్ హవుస్ లో వున్న సమయంలో అడిగాను.

 Previous Page Next Page