Previous Page Next Page 
గాడ్స్ గిఫ్ట్ పేజి 4

    "దుర్యోధన, దుశ్సాశన, రావణ, మైరావణ, వీళ్ళ భార్యలు ఆకుచాటు పూలులా ఎంతో హాయిగ పురుషుడు కన్నెత్తి చూడకుండా పళ్ళికిలిస్తూ మాట్లాడకుండా, నిండు సభలో ద్రౌపదిలా అవమానం పాలు కాకుండా, సీతలా శీలపరీక్ష అగ్ని పరీక్షలకి గురికాకుండా నిశ్చింతగ సర్వ సుఖశాంతులతో సంసారం సాగిస్తూ జీవితాంతం వుండొచ్చు"
   
    "స్వామీ! మీరు పెదవి కదపకండి, మీరడగబోయే ప్రశ్న ఏమిటో మాకర్ధమైంది. ఈ రాక్షసులంతా యుద్దాలలో చివరికి దిక్కుమాలిన చావులు చావలేదా! అనేకదా మీ అనుమానపు ప్రశ్న! డానికి మా సమాధానంవకటే యుద్ధం చేస్తూ చనిపోతే వీరమరణం కిందకి వస్తుంది వాళ్ళంతా వీరులు శూరులు"
   
    "అంతేకాదు సీతాదేవి కాని, ద్రౌపదికాని భర్తలవల్ల సుఖపడలేదు. మాంచి వయసులో వున్నప్పుడు అష్టకష్టాలు పడి జీవిత చరమాంకంలో భారంగ రోజులు గడుపుతూ మరణంకోసం ఎదురుతెన్నులు చూస్తూ కాలం వెళ్ళబుచ్చారు."
   
    "మేము చెప్పిన రాక్షసుల భార్యలు మాత్రం నిశ్చింతగ ఉన్నన్నాళ్ళు కాలం గడిపారు. చీరలు నగలు, తిండి నిద్ర సరదాలు, ఎన్నో దక్కాయి. వాళ్ళకి ముఖ్యంగ పరపురుషుడి బాధలేదు. అవమానాలు, అభినందనలు శీలపరీక్షలు అసలుకే లేవు."
   
    "కాలమంతా హాయిగ గడిపి పుటుక్కున గుటుక్కుమని చావటం వేరు జీవితాంతం చచ్చేచావు చస్తూకాలాన్ని ఈడుస్తూ ఈసురోమని చావటం వేరు. చావు తప్పనప్పుడు ఎలా చస్తేనేమి?"
   
    గడగడ...టకటక...ఆడవాళ్ళంతా వారి వారి అభిప్రాయాలు చెప్పి నారద మునీంద్రుల వారు మళ్ళీ పెదవి కదపకుండా ఎంతోముందు జాగ్రత్త వహించి మళ్ళీ పెదవులు కదిపారు.
   
    "అలలున్నది ఆట పోట్లకి. అతివలున్నది అగచాట్లకి అంటే మేము వప్పుకోము. ఆడదాని మనోబలం ముందు మగవాడి శరీరబలం అల్పం"
   
    "అంతేకాదు, మగవాళ్ళ అహంకారమే స్త్రీల హాహాకారానికి కారణం."
   
    "పెళ్ళి నూరేళ్ళ పంటకాదు నిత్యం రగిలేమంట."
   
    "శీలం అనేపదాన్ని సృష్టించి దాన్ని స్త్రీజాతికే పరిమితం చేసింది ఎవరో కాదు ఓ శీలం లేని పురుషుడు"
   
    "ఆడది నమ్మకూడని జంతువు మగాడు"
   
    "చాలా మంది మొగాళ్ళకి ఇన్ఫ్ రియారిటి కాంప్లెక్స్ రోగులు అందుకే కావచ్చు భార్య హై పొజిషన్ లో వుంటే వారి ప్రామినేన్స్ అగాధంలో కలసిపోతాయని ఏదేదో వాగి భార్యల నోళ్ళు నొక్కాలనిచూస్తారు మగ మహారాజుననే అహం."
   
    "చాలామంది మగాళ్ళు పశువులు. కట్నానికి అమ్ముడు పోయి కుమ్మటమే వాళ్ళ పశుబుద్ది."
   
    "స్త్రీని బానిసగ చూస్తూ ఎదగనీయని భర్త భర్తకాదు సాక్షాత్తూ యముడు."
   
    "యుగాలు మారాయి నాగరికతపెరిగింది కాని మొగవాడి బుద్దిమాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే పడి వున్నట్లు వుంది."
   
    "ఒక్క తెలివిగల ఆడది ముగ్గురు మగ మేధావుల్ని బోల్తాకొట్టించ గలదు అది స్త్రీ శక్తి."
   
    "స్త్రీ శక్తికి జై"
   
    "స్త్రీ శక్తికి జైజై"
   
    "స్త్రీ శక్తికి రెడ్ స్యాల్యూట్"
   
    నలుదిక్కులూ పిక్కటిల్లేలా జైజై ధ్వనులు చేశారు.
   
    "నారాయణ! నారాయణ!" అన్న నామం స్మరించటం వాళ్ళ ముందు మరచిపోయిన నారదుడు "నాతల్లులారా! నాతల్లులారా! మీ నినాదాలతో నాతల తిరిగిపోతున్నది. ఆ మహా పతివ్రతలు..." అంటూ ఏదో చెప్పబోయాడు.
   
    "నారద మునీంద్రా! అన్ని యుగాలనుంచి ఈ కలియుగంవరకు పతివ్రతల పేర్లు అనంగానే సీత, సావిత్రి, ఇలా కొందరి పేర్లు ఎత్తుతారేంటి? లక్ష్మి సరస్వతి పార్వతి ఏం పాపం చేసుకున్నారు? వాళ్ళ పేర్లు ఎత్తరేమి? పద్మశ్రీ బిరుదులాగా సీతాదేవి మహాపతివ్రత సుమతి మహామహా పతివ్రత అనటం వినటం తప్పించి...." లాయర్ కాబోయి కాలేని లాయర్ సుహాసిని లా పాయింట్ లాగుతూ ఇంకా ఏదో అనబోతుండగ మిగతా ఆడవాళ్ళు అడ్డుతగిలి వాళ్ళ నోళ్ళకి పని కల్పిస్తూ గడ గడ గడబిడవాగారు.
   
    "ఏ కాలంలోను ఇంకా పతివ్రతలే లేరా?"
   
    "మా బామ్మలు, అమ్మమ్మలు, వాళ్ళ బామ్మలు అమ్మమ్మలు వాళ్ళ బామ్మలు అమ్మమ్మలు ఇంకా ఆ పైవాళ్ళు పతివ్రతలు కదా?"
   
    "మా అమ్మలు పతివ్రతలు కాదా? మా అత్తలు పతివ్రతలు కాదా?"
   
    "అంతదాకా ఎందుకు? మేము పతివ్రతలం కాదా?"
   
    "పతివ్రత అని పిలవబడటానికి పెళ్ళయి తీరాలని రూలేంలేదు కదా! నేనూ పతివ్రతనే! అనివార్య కారణాలవల్ల అరవైఏళ్ళు వచ్చినా పెళ్ళికాని వృద్ధకన్య చూడామణి రవ్వంత సిగ్గుతో అంది.
   
    నారదులవారి బుర్ర వేగంగా పనిచేసింది.
   
    రంగనాయకి జాలిపడటం సంతోషమ్మ సంతోషం ప్రకటించటంతో మిగతా ఆడవాళ్ళు తగ్గిపోయారు. మళ్ళీ అంతా కూడబలుక్కున్నారు సరేనంటే సరేననుకున్నారు.
   
    "ఆడవాళ్ళకే ఈ కష్టాలెందుకు?" మళ్ళీ మొదటికొచ్చి తీవ్రంగా ప్రశ్నించింది లీడర్ లీలారాణి.
   
    "స్త్రీలు పడినన్ని కష్టాలు పురుషులు పడరు ఒప్పుకుంటున్నాను తల్లీ! అయితే ఆ కష్టాలన్నవి రకరకాలు మీరు ఏ కష్టం గురించి ప్రశ్నిస్తున్నారో తెలిస్తే సమాధానం చెప్పగలను" నారదుడు చిరతలు వాయించినంత తేలిగ్గా మాట మారుస్తూ తిప్పి అడిగాడు.
   
    పాపం అసలు కష్టం ఏమిటో నారదమునీంద్రులంతటి వాడికే తెలియదని బోలెడు జాలిపడి చివరికి ఆ కష్టం ఏమిటో చెప్పారు.
   
    "అంట్లు, ముట్లు, కడుపులు కాకరకాయలు పుష్పవతులు పురుళ్ళు పురిటి నొప్పులు ఇవి మా ఆడవాళ్ళ కెందుకు రావాలి?" లీడర్ లీలారాణి అడిగింది.
   
    అంతే తలోమాట అడిగేశారు.
   
    "సుఖం మా ఆయనగారిదీను, పిల్లల భారం నాదీను, తొమ్మిది నెలలు ఉప్పుబస్తాలనీ మోసినట్లు మోసి నాలుగేసిరోజులు పురిటి నొప్పులు తీసి ఇప్పటికి ఎనిమిది మందిని కన్నాను. సంపాదించేవాడ్ని నేనుండగా ఏడాదికో బిడ్డను కనటానికేం తీపరం! అంటాడు. కనటం అంటే కంచంలో అన్నం పెట్టినంత తేలికనుకుంటున్నాడు" సంతానలక్ష్మి భారంగా బారెడు నిట్టూర్పు వదిలి చెప్పింది.

 Previous Page Next Page