Previous Page Next Page 
నీలికనుల నీడల్లో పేజి 5

    "ముసలయ్యా!" అక్కడి నుంచే గట్టిగా కేకవేశాడు బన్సీలాల్.
   
    ముసలయ్య మొదటి పిలుపుకే పరిగెత్తుకుంటూ వచ్చాడు.
   
    ముసలయ్య పేరు వరకే ముసలయ్య. భుజబలం దేహబలం మెండుగా దండిగా వున్నా నమ్మకమయిన నౌకరు...వయసు ముప్పయి పైన నలభై మధ్య....చూసి రమ్మంటే కాల్చి వస్తాడు.
   
    "మరో గంటలో రెండో కంటికి తెలియకుండా నీవో పని చేసి రావాలి" బన్సీలాల్ అన్నాడు.
   
    "అలాగే చెప్పండి...." ముసలయ్య చేతులు కట్టుకుని వినయంగా అన్నాడు.
   
    బన్సీలాల్ చెప్పటం మొదలు పెట్టాడు.
   
    సరీగా గంటలో...
   
    బన్సీలాల్ చెప్పిన పని చేసి చెయ్యి దులుపుకున్నాడు ముసలయ్య.
   
    అంతా సవ్యంగా జరిగింది.
   
                                                             5
   
    "అమ్మా!"
   
    "అమ్మా!" అంటూ తన చిన్న చేతులతో తలుపు తడుతూ కున్నా పిలిచాడు.
   
    అర్దరాత్రి చుట్టూ చిమ్మ చీకటి...అందరూ గాఢ నిద్రలో వున్నారు.
   
    కున్నాకి ఆరేళ్ళు....అన్ని ఇళ్ళూ తలుపులు బిగించి వున్నాయి. ఏ మూలనో వున్న కుక్క వుండి వుండి అరుస్తున్నది కుయ్యోమని అయినా కున్నాకి భయం వేయలేదు. తన ఇంటి ముందు వున్నానన్న సంతోషంతో వాడిచిన్నారి బుర్రకి ఇంకే ఆలోచన రావటం లేదు.
   
    తలుపులు తెరచుకోలేదు.
   
    ఈతఫా కున్నా ఇంకా గట్టిగా తలుపులు తట్టుతూ ఇంట్లో అందరిని పిలిచాడు.
   
    కున్నా పిలుపు విని ఉలిక్కిపడి లేచింది గుణవంతి. "కలకన్నాను" నిరాశగా అనుకుంటుంటే మళ్ళీ "అమ్మా" అన్న పిలుపు వినపడింది.
   
    రామ్ దేవ్ ని తట్టి లేపుతూ "కున్నా వచ్చాడు నా కున్నా వచ్చాడు" ఆనందంగా అంది గుణవంతి.
   
    "నీ ముఖం ఏదో కల కనివుంటావు" అనబోయిన రామ్ దేవ్ ఈతఫా కున్నా పిలుపు చెవులారా వినటంతో గబుక్కున పైకి లేచాడు.
   
    సరిగ్గా అప్పుడే ఆనందయ్య, బాలమ్మ లేచారు.
   
    నలుగురూ ఒక్కసారిగా తలుపు దగ్గరకు వచ్చారు.
   
    రామ్ దేవ్ తలుపు తీశాడు.
   
    తలుపులుతీస్తూనే నలుగురూ కున్నాని చూశారు.
   
    కున్నా లోపలి దూసుకువచ్చినట్లే వచ్చేశాడు. ముందుగా తల్లిని చుట్టేశాడు. ముందుగా తల్లిని చుట్టేశాడు. అంతేకాదు అమ్మా! అంటూ రాగం తీశాడు.
   
    కున్నాని చూడగానే నలుగురి కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి...అది ఆనందమో దుఃఖామో వాళ్ళకే తెలియాలి.
   
    ముందుగ తేరుకొన్న ఆనందయ్య గబుక్కున వీధి తలుపు గడియపెట్టాడు.
   
    "పదండి లోపలికెళ్ళి మాట్లాడుకుందాం" అన్నాడు.
   
    కున్నానితీసుకుని నలుగురూ లోపలిగదిలోకి వెళ్ళారు.
   
    పది నిమిషాల తర్వాత...
   
    అందరూ తేరుకున్నారు.
   
    కొడుకు వంటిమీద దెబ్బలు ఏమన్నా ఉన్నాయేమోనని గుణవంతి వాడివంటిమీద చొక్కావిప్పి వళ్ళంతా తడిమి చూసింది....పిల్లాడు నలిగి వున్నాడుగాని వంటిమీద దెబ్బలు మాత్రం లేవు.
   
    అందరి ముద్దులు అయిన తరువాత తలో ప్రశ్నా వేశారు వాడిని.
   
    "ఇన్నాళ్ళూ ఎక్కడి కెళ్ళావురా కున్నా?"
   
    "నేను వెళ్ళలేదు."
   
    "ఎక్కడ వున్నావు!"
   
    "నాకు తెలియదు ఓ గదిలో వున్నాను అంతే..."
   
    "నిను ఎవరు తీసుకెళ్ళారు?"
   
    "ఎలా తీసుకెళ్ళారు?"
   
    "వాళ్ళు ఎంతమంది ఉన్నారు?"
   
    "నిన్ను ఏమన్నా అన్నారా?"
   
    "కొట్టారా?"
   
    "అన్నం పెట్టేవాళ్ళా?"
   
    తలో ప్రశ్నా వేశారు...అప్పుడైతే వాడు అన్నీ ఒకేసారి చేపుతాడని అన్ని రకాల ప్రశ్నలు వేశారు.
   
    "నేను ఆడుకోవటానికి వెళ్ళి తిరిగి వస్తుంటే మా వూళ్ళమ్మ గుడిదగ్గర ఎవరో పిల్లలందరికి బోలెడు బిళ్ళలు పంచిపెడుతున్నారని చెప్పారు. ఆ మనిషిని నేను ఎప్పుడూ చూడలేదు. బిళ్ళల కోసం గుడిదగ్గరకు వెళ్ళాను. మావూళ్ళమ్మ గుడి దగ్గర ఎవరూ లేరు....ఆ వచ్చినాయన నన్ను లోపలి రమ్మన్నాడు....గుడిలోకి వెళ్ళాను. బోలెడు బిళ్ళలు నాకిచ్చి ఈ రెండూ దేముడి నైవేద్యం ముందు తినమన్నాడు. పంచదార బిళ్ళలేకదా అని తిన్నాను ఆ తర్వాత ఏమైందో తెలియదు.
   
    తర్వాత ఎప్పుడో లేచాను....నేను ఒక గదిలో వున్నాను. లావుపాటి బోండాం బొజ్జగాడువున్నాడు. వాడికి బోడిగుండు పెద్దమీసాలు ఉన్నాయి. చేతిలో దుడ్డుకర్ర కూడా వుంది. ఇంతింతలావు ఎర్రటికళ్ళు కూడా వున్నాయి. అమ్మకోసం ఏడుస్తుంటే కొడతాను ఏడ్చావంటే అన్నాడు. నేను యింకా యింకా ఏడిచాను. నా నోరు ముక్కు గట్టిగా మూశాడు. భలేభయం ఏసింది, ఏడ్చినప్పుడల్లా చెవి మెలిపెట్టేవాడు. కళ్ళల్లో సూదులు గుచ్చుతానని అనేవాడు.

 Previous Page Next Page