నాకు బాగా భయం వేసింది. ఇంకెప్పుడూ ఏడవను అమ్మా అనను అన్నాను. ఆ తర్వాత వాళ్ళెప్పుడూ నన్ను కొట్టలేదు. రెండుపూట్లా అన్నం మాత్రం పెట్టేవాళ్ళు. ఎవరూ మాట్లాడే వాళ్ళు కాదు.... గదిలోంచి బయటకు రానిచ్చేవాళ్ళు కాదు. గుండుగాడు ఎప్పుడూ గది బైటనే ఉండేవాడు. మీరంతా గుర్తుకు వచ్చినా పైకి ఏడిచేవాడిని కాను. రాత్రిళ్ళు పడుకున్నప్పుడు ఏడ్చేవాడిని.
రాత్రి పడుకున్నాను కదా వచ్చి లేపాడు... లేచాను. "చొక్కా వేసుకో" అన్నాడు "ఎందుకు?" అన్నాను. "నీ పంట పండిందిరా బచ్చా" అన్నాడు. నాకు ఏమీ అర్ధం కాలేదు. చొక్కా వేసుకున్నాను. "పద" అన్నాడు....ఇంకేదన్నా అడిగితే తిడతాడని మాట్లాడకుండా గదిలోంచి బైటకి వచ్చాను.
"నిన్ను మీ యింటి దగ్గర దిగబెడతాను అంధక కళ్ళకి గుడ్డ కడతాను" అని కళ్ళు కనిపించకుండా కళ్ళ చుట్టూతా గుడ్డకట్టి కొంతదూరం నన్ను ఎత్తుకు వచ్చాడు. మరి కొంతదూరం చేయి పట్టుకుని నడిపించాడు. చివరికి ఇక్కడ దించి వెళ్ళిపోయాడు. ఇది మన ఇల్లే. వెంటనేతలుపు కొట్టాను."
కున్నా వాడికి చేతనైన విధంగా జరిగిందంతా చెప్పాడు.
"దేముడు నన్ను, నా బిడ్డని చల్లగా చూశాడు" గుణవంతి ఆనందంతో కళ్ళు తుడుచుకుంటూ అంది.
"నా పిచ్చి తండ్రీ, ఎప్పుడూ వంటరిగా పడుకొని ఎరగవు. ఎంత భయపడ్డావో కదరా నాయనా" బాలమ్మ వాపోయింది.
"ఇది ఆ గాడిద లాల్ గాడి పనే. యిప్పుడెందుకో వదిలాడు అంటే వాడి పీకమీదకి ఏదో వచ్చి వుంటుంది" రామ్ దేవ్ అన్నాడు.
"ఇదంతా శక్తిమాయి చలువ. ఆమె మన పాలిట కనపడని దేవత" ఆనందయ్య అన్నాడు.
అది నిజమో అబద్దమో ఆ పై వాడికి తెలియాలి....వకటిమాత్రం నిజం. కున్నా విచిత్రంగా మాయం అయ్యాడు. అంతకన్నా విచిత్రంగా క్షేమంగా తిరిగివచ్చాడు.
అంతే.
6
ఉదయం
తొమ్మిదింబావు అయింది.
బన్సీలాల్ ఇన్ స్పెక్టర్ కి ఫోన్ చేసి చెప్పాడు. రాత్రి మీరు చెప్పినట్లే చేశాను.
అవతల ఇన్ స్పెక్టర్ కంగారుపడిపోయాడు. ఏమిటి సంగతి ఉదయాన్నే ఫోన్ జేసి మరీ చెపుతున్నారు జోక్!
"జోకేమిటి?" తెల్లబోయాడు బన్సీలాల్.
"నైట్ న నేను చెప్పానా! ఎప్పుడు, ఎక్కడ?"
"ఫోన్ లో" బన్సీలాల్ చిరాకుగా చెప్పాడు.
"నేను మీకు ఫోన్ చేశానా!"
"లేదు నేను చేశాను....మీరు చేయమన్నారు కదా!"
"నేను ఫోను చెయ్యమన్నానా! ఎప్పుడు? ఎక్కడ? ఎవరితో?"
"కవరు ఇచ్చి అర్దరాత్రి రాజు, రమణని పంపించారు కదా!"
"నేను పంపించానా?"
"ఎస్ మీరే."
"రాజు రమణలని...."
"అవును మహానుభావా! కవరు యిచ్చి పంపారు...వెంటనే నేను మీరు చెప్పి పంపిన విధంగానే మీకు ఫోన్ చేశాను."
"మీరు నిజమే చెబుతున్నారు కదూ?"
"ఎస్!"
"కొంప మునిగింది లాల్ జీ! ఇప్పుడు నేను చాలా బిజీగా వున్నాను...ఉన్న ఫళంగా మీరు యిక్కడికి రండి."
ఇన్ స్పెక్టర్ కంఠంలోని ఆందోళన గుర్తించాడు బన్సీలాల్.
"వస్తున్నాను అసలేం జరిగింది?"
"మీరింకేమీ చెప్పొద్దు రండి" అంటూ ఇన్ స్పెక్టర్ ఫోన్ దించేశాడు.
ఇప్పుడు బన్సీలాల్లో ఆందోళన ప్రారంభమయింది. ఏదీ జరగకపోతే ఇన్ స్పెక్టర్ అలా మాట్లాడడు. ఏం జరిగి వుంటుంది? జరగరానిది ఏదో జరిగుంటుంది అంతే.
బన్సీలాల్ గాభరా దాచుకుని వెంటనే తయారయి క్రిందకి వచ్చాడు.
డ్రైవర్ ఖాన్ అడిగాడు. "కారు తియ్యమంటారా జీపు తియ్యమంటారా?"
"జీపు" ముక్తసరిగా చెప్పాడు బన్సీలాల్.
"ఖాన్ షెడ్ లోంచి జీపుని బయటికి తెచ్చాడు."