Previous Page Next Page 
జీవాత్మ పేజి 49


    "స్స్....స్స్.....స్స్....." మనే ధ్వని వినిపించడంతో మాటలాపేసి చెవులు రిక్కించి వినసాగాడు వరప్రసాదం. స్పష్టంగా వినిపిస్తోంది గాలిని చీల్చుకుంటూ ఏదో కదలాడిన వింత ధ్వని.
    
    వరప్రసాదం లేచి ఆ ధ్వని వస్తున్న దిక్కుగా నడిచాడు. "స్స్... స్స్.... స్స్.... స్స్...." అతను నడుస్తున్న కొద్దీ మరింత తీవ్రంగా వినిపించసాగిందా ధ్వని.
    
    ఇక్కడినుంచే... ఇక్కడినుంచే వస్తుంది- హాల్లోకి చేరుకొని అనుకున్నాడతను. హాలు నలుమూలలా చూశాడు. ఏమీ కనిపించటం లేదు. ధ్వని మాత్రం వినిపిస్తోంది....ఈసారి తనకంటే ఎత్తు నుంచి ఆ శబ్దం రావటం స్పష్టంగా తెలుస్తుందతనికి.
    
    తలెత్తి చూశాడు. తెల్లని సీలింగ్ తప్ప ఏమీలేదక్కడ. ఆకారం లేని ప్రాణేదో అరుస్తున్నట్లు శూన్యంలోంచి శబ్ద తరంగాలు! ఈసారి ఆ శబ్దం మహదేవ్ గదివైపు సాగిపోవడం అతని చెవులకు సపష్టంగా వినిపించింది. గబగబా ఆ శబ్దాన్ని అనుసరిస్తూ ముందుకు సాగిపోయాడు వరప్రసాదం.
    
    మహదేవ్ గదిలో ప్రవేశించిన ఆ శబ్దం ఏ బిలంలోకో దూరిపోయి నట్టు శబ్దరహితమై పోయింది.
    
    అది కాదు అతడిని ఆశ్చర్యానికి గురిచేసింది. అప్పటివరకూ మామూలుగానే ఉన్న మహదేవ్ మొహం తెల్లగా పాలిపోవడం....!
    
    చిత్రంగా కనురెప్పలు ఆర్పుతూ-
    
    "ఇనీసా అర్మంద్.... ఇనీసా అర్మంద్" అంటూ నలుదిక్కులా చూడసాగాడతను. అభిరాంకి అతని ప్రవర్తన అర్ధం కాలేదు. కాని అతని శరీరంలో ఏవో మార్పులు రావటం మాత్రం గమనించాడు.
    
    వరప్రసాదం మహదేవ్ కెదురుగా నిలబడి అతన్నే తదేకంగా చూడసాగాడు.
    
    "వెరీజ్ ఇనీసా ఆర్మంద్....ఇనీసా ఓ యామ్ హియర్.... ఐ యామ్ హియర్" అంటూ రోదన మొదలుపెట్టాడతను.
    
    అభిరాం, వరప్రసాదం అవాక్కయి అతనివంక చూస్తుండిపోయారు.
    
    "ఇనీసా... ఇనీసా..." అంటూ జుట్టు పీక్కుంటూ, బట్టలు చించేసుకోసాగాడు.
    
    "మహదేవ్! ఏమైంది.... ఏమైంది మహదేవ్?" అతన్ని ఆపటానికి ప్రయత్నిస్తూ అతని రెండు చేతుల్నీ తన చేతిలోకి తీసుకున్నాడు అభిరాం.
    
    "హు ఆర్ యూ..." మహదేవ్ కంఠస్వరం చిత్రంగా వుంది. గరగరమంటూ ఏదో ఉక్కు చట్రాన్ని రాతికి రాస్తున్నట్టు.
    
    "మహదేవ్! నేను.....అభిరాంని" మరింత గట్టిగా అతని చేతుల్ని పట్టుకుని అన్నాడతను.
    
    "యూ ఫూల్ గెటవుట్ ఫ్రం హియర్" ఒక్క తోపు తోశాడు అభిరాంని అతను.
    
    గాల్లో విసిరేసిన రబ్బరు బంతిలా ఎగిరెళ్ళి గోడకు కొట్టుకున్నాడతను.
    
    అతఃని నుదురు గోడకి తగిలి నెత్తురు చిందింది. కళ్ళు తిరుగుతున్నట్టు అనిపించింది. బలంగా తల విదిల్చి..... నిలదొక్కుకుని లేచి నిలబడ్డాడు.
    
    "ఇనీసా డార్లింగ్.... ఇనీసా డార్లింగ్" రెండు చేతులతో మొహం దాచుకుని ఏడవసాగాడు మహదేవ్.
    
    అభిరాంకి అతని పరిస్థితి ఆందోళన కలిగించింది. అభిరాంని మాటాడొద్దన్నట్టు సైగచేశాడు వరప్రసాదం అభిరాం మౌనం దాల్చాడు.
    
    "కృపస్కయ... హే కృపస్కయ..." ఎర్రని చింత నిప్పుల్లా మారిన కళ్ళతో అన్నాడతను.
    
    అభిరాంకి వరప్రసాదానికి ఆ సమయంలో ఏం చెయ్యాలో అర్ధం కాలేదు. పదినిముషాల పాటు చిన్నపిల్లాడిలా ఏవేవో కలవరిస్తూ ఏడ్చి, తరువాత సోషొచ్చి పడిపోయిన వాడిలా మంచంమీద వెనక్కి పడి పోయాడు అమాంతంగా.
    
    "ఇదంతా ఏమిటి? కొంపతీసి ఏక్సిడెంట్ ప్రభావంవల్ల అతని మతిస్థిమితం తప్పలేదు కదా?" భయంగా అన్నాడు అభిరాం.
    
    అతని నుదుటి నుంచి రక్తం వస్తూనే వుంది. అది గమనించి "రక్తం తుడుచుకోండి అభిరాం... మీతో కొన్ని విషయాలు మాట్లాడాలి" అన్నాడు వరప్రసాదం.
    
    "ఏమిటీ?" ఆతృత, భయం కలగాపులగమై వణుకుతున్న స్వరంతో అడిగాడతను.
    
    "నిన్న రాత్రి నాకు నిద్దుర పట్టలేదు. ఎందుకో తెలుసా" అన్నాడు వరప్రసాదం.
        
    "కొత్త ప్రదేశం అవటం వల్లని మీరే అన్నారుగా"
    
    "కాదు! ముందు బాగానే నిద్రపట్టింది. అయితే మధ్య రాత్రిలో హఠాత్తుగా మెలకువ వచ్చింది..."
    
    వరప్రసాదం చెప్పే విషయాన్ని ఆశ్చర్యంగా వినసాగాడు అభిరాం.
    
    "ఎందుకు మధ్యలో అంత హఠాత్తుగా మెలకువ వచ్చిందో నాకే అర్ధం కాలేదు. ఇంతలో ఏవో ధ్వనులు వినిపించాయ్. గాలిలో ఆకారంలేని నీడలేవో కదులుతున్నట్లూ, గాలిలోనే స్వైర విహారం చేస్తున్నట్లు శబ్దాలు వినిపించాయ్. నేనున్నా దిక్కుగా ఎవరో నడిచి వస్తున్నట్టు అడుగుల ధ్వని....
    
    అంతే రాత్రంతా యిలాగే గడిచిపోయింది.
    
    ఉదయం లేచి యిల్లంతా అణువణువూ శోధించినా ఏమీ కనపడలేదు. రాత్రి మామూలుగానే ఉన్న మహదేవ్ బాబు మాత్రం లంఖణాలు చేసినట్లు కృశించిపోవటం నీకూ తెలుసు..."
    
    "మరి ఎందుకని చెప్పలేదు మీరు?"
    
    "ముందు ఆ శబ్ధాలు రావటం అవీ నా భ్రమేమో అనుకున్నాను. ఉదయం నుంచీ మామూలుగానే వున్న మహదేవ్ బాబుని చూశాక నామీద నాకే అనుమానం వేసింది. నేను నిజంగా ఆ శబ్దాలు విన్నానా లేదా? అనుకున్నాను. అయితే ఇందాక నేను బయటికి వెళుతుండగా మరో సంఘటన జరిగింది."    

    "ఏమిటది?" అతని మాటలు పూర్తి కాకుండానే అడిగాడు అభిరాం.
    
    "గత పది పన్నమేడు రోజులుగా మన పక్క ఫ్లాట్ లో ఉన్న యింటిలోని కుక్క మహదేవ్ బాబు యింటిని చూస్తూనే అరుస్తోందట.... అంటే దానికి కారణం ఏమిటో తెలుసా?"
    
    "ఏమిటి?" అడిగాడు అభిరాం.

 Previous Page Next Page