"ఓహ్... ఆమె సంగతే మరిచిపోయాను. సాయంత్రం ఆమె పనిచేసే ఆఫీస్ దగ్గర వెయిట్ చేసి నీ సమాచారం ఆమెకీ, ఆమె సమాచారం నీకూ చేరేస్తానులే" అభయమిచ్చాడతను.
అభిరాం అన్న మాటలకు మహదేవ్, వరప్రసాదంలు బిగ్గరగా నవ్వేశారు.
* * * * *
సమయం సాయంత్రం అయిదుగంటలు తూర్పు దిక్కుని చివరిసారిగా ఎర్రబరుస్తూ సూర్యుడు మెల్లగా కుంగిపోతున్నాడు.
ఒక్క మబ్బుతునక లేని నీలాకాశం ప్రైవసీ కోసం భగవంతుడు పరిచేసిన పరదాలా వుంది.
అప్పటికే వచ్చి పదినిమిషాలు అవటంతో అభిరాంకి కాస్త విసుగ్గా వుంది. 'ఈపాటికి బయటపడాలే' అనుకుంటూ దూరంగా కనిపిస్తున్న మనస్విని ఆఫీస్ వైపు చూశాడు.
అప్పుడే ఆఫీస్ మెట్లు దిగుతూ కనిపించింది మనస్విని. ఆమె తన దగ్గరికి వచ్చేంతవరకూ వేచి వున్నాడు అతను. ఎటూ చూడకుండా తిన్నగా బస్టాప్ వైపు సాగిపోతోందామె.
"మనస్విని!" తనని దాటిపోతున్న ఆమెని పిలిచాడు.
చటుక్కున చూసిందామె.
తన కారుకానుకుని కనిపించాడు అభిరాం.
అతన్ని చూడగానే ఆమె మొహంలో కాంతి!
"మహదేవ్ కెలా వుంది?" ఆత్రంగా అడిగింది.
"బాగుంది అతనేమో నీ గురించే కలవరిస్తున్నాడు. నువ్వేమో మీ పెళ్ళి జరగందే వాళ్ళింటికి రానంటావ్... అఫ్ లోర్స్ మహదేవ్ రమ్మని చెప్పలేదనుకో.... వస్తే తీసుకెళతాను" అన్నాడతను.
"వద్దు! చుట్టుపక్కలెవరైనా చూస్తే బాగుండదు...." అంది మనస్విని.
"సరే! చెప్పాల్సింది ఏమైనా వుందా?"
"టైమ్ కి తిని, మందులు వేసుకోమని చెప్పండి."
"సరే! వెళతాను" అన్నాడతను.
"అలాగే" అని ముందుకు సాగిపోయిందామె.
అతను కారులో కూర్చుని స్టార్ట్ చేసి వేగంగా దూసుకుపోయాడు.
* * * * *
అప్పుడు సమయం రాత్రి ఎనిమిది గంటలవుతోంది. కాస్త అలా తిరిగొస్తే బాగుంటుందనిపించింది వరప్రసాదానికి. అభిరాం, మహదేవ్ కి చెప్పి లేచి నడవసాగాడు. అతను హాల్లోంచి యింకా బయటకు రాకముందే పక్క ఫ్లాట్ నుంచి 'భౌభౌ.... భౌభౌభౌ....' మని అదేపనిగా అరుస్తోంది కుక్క.
"డాలీ షటప్.... షటప్ ఐ సే" అన్న మాటలు కుక్కని అదిలిస్తూ వినిపించాయి. అప్పుడే బయటికి అడుగుపెట్టాడు వరప్రసాదం.
అతనికి ఆశ్చర్యం కలిగించిన విషయం పక్కఫ్లాట్ లోని కుక్క ఇటుకేసి చూసే అరవడం.
శత్రువుని చూసినట్లు బిగ్గరగా అరవసాగింది. దానివంకే చూస్తూ కొన్ని క్షణాలు వుండిపోయాడతను. చీకటిలో దాని కళ్ళు మెరుస్తున్నాయి.
"దీనిని బయటకు తీసుకురావటం భయంగా ఉందే! రోజూ యిదే బాధ" అనుకుంటూ కుక్కతోపాటు ఆ యింటి యజమాని లోపలకు వెళ్ళాడు.
ఒకటీ ఒకటీ కలిపితే రెండు అన్నట్టు తన అనుభవంలోకి వచ్చిన విసేషాలన్నీ కలుపుకుంటే ఏదో లింకు ఏర్పడినట్టయిందతనికి.
ముందురోజు మహదేవ్ ఇంటిలోని శబ్దాలు, మరునాడు అతను ఒక్కసారిగా నీరసంగా అయిపోవడం, ఇప్పుడీ కుక్క మహదేవ్ ఇంటివైపే చూస్తూ అదేపనిగా అరవడంతో అతనికి ఓ విషయం అర్ధమైంది. 'మహదేవ్ ఇంటిని ఆశ్రయించుకుని ఏదో వుంది'
ఇంతలో పక్కింటి అతను మళ్ళీ బయట కనిపించాడు. వరప్రసాదం అతనివంక నడిచాడు.
పక్క ఫ్లాట్ లోంచి తనవైపు వస్తున్న అపరిచిత వ్యక్తిని అయోమయంగా చూస్తూ వుండిపోయాడతను.
"నా పేరు వరప్రసాదం. మహదేవ్ కి దూరపు బంధువుని..." తనని పరిచయం చేసుకున్నాడు.
"అలాగా! ఎప్పుడూ రాలేదా? ఇదేనా రావటం?" ప్రశ్నించాడతను.
"అవును!"
"మహదేవ్ గారు ఊరినుంచి వచ్చేశారా?"
"ఊరెళ్ళలేదు.... చిన్న ఏక్సిడెంట్ జరిగింది. ఇన్నాళ్ళూ హాస్పిటల్ లో వుండివచ్చాం."
"అయ్యయ్యో! మాకా విషయమే తెలియదు" బాధపడుతూ అన్నాడతను.
"ఫర్వాలేదు! ఒక్క విషయం"
"ఏమిటో చెప్పండి"
"మీ డాలీ... అదే కుక్క మా ఇంటివైపే చూస్తూ అరుస్తుందేమిటి?"
"నాకూ అదే అర్ధంకావటం లేదు. దాన్ని బయటకు తీసుకురావటమే భయంగా వుంది. మీ ఇంటిని చూస్తే చాలు ఒక్కటే అరుపులు"
"ఎప్పట్నుంచీ?"
"సుమారు ఓ పది పన్నెండు రోజుల క్రితం నుంచీనూ" అని అన్నాడతను.
"అలాగా!" అన్నాడు వరప్రసాదం.
"ఈ బాధ భరించలేక డాలీని మా చెల్లెలికిచ్చేద్దామని అనుకుంటున్నాం" చెప్పాడతను.
ఆ మాటకి బదులేం చెప్పాలో ఆ సమయంలో అర్ధంకాక అతని వద్ద సెలవు తీసుకుని బయటపడి సెంటర్ వరకూ వెళ్ళాడు వరప్రసాదం.
* * * * *
సరిగ్గా అరగంట తర్వాత తిరిగి మహదేవ్ ఇంటికి చేరుకున్నాడతను. అప్పటికింకా అభిరాం, మహదేవ్ లు ఏవో కబుర్లలోనే వున్నారు. వరప్రసాదం కూడా వాళ్ళ మాటల్లో పాలుపంచుకున్నాడు.