Previous Page Next Page 
జీవాత్మ పేజి 50


    "కుక్కలకి గాలిలో విహరించే ఆత్మల్ని చూడగల శక్తి వుంటుంది. అందుకే అది బయటికి తీసుకొచ్చిన ప్రతిసారీ యిటు చూసి అరిచేదట. ఈరోజు కూడా నేను గమనిస్తుండగా అలాగే అరిచిందది...."
    
    "పది పన్నెండు రోజులుగా అరుస్తోందని అన్నారు. ఆ విషయం మీకెలా తెలుసు?"
    
    "ఆ ఇంటి యజమానే చెప్పాడు"
    
    అభిరాంకి అతను చెబుతున్న విషయాలకి చెమటలు పడుతున్నాయ్.
    
    "నిన్న రాత్రి ఈ ఇంటిలో విన్పించిన విచిత్ర శబ్దాలు, మహదేవ్ బాబు ఒక్కరోజులో శుష్కించిపోవడం, ఆ కుక్క యిటే చూసి అరవటం... ఇవన్నీ కలుపుకుంటూ ఆలోచించండి.... ఈ యింటిలో ఆకారాలు లేని ఆత్మలేవో వున్నాయి."    

    వరప్రసాదం మాటలు వింటూనే ఒళ్ళు జలదరించింది అభిరాంకి.
    
    "మనం సాధ్యమైనంత తొందరగా ఈ ఇంటినుంచి మహదేవ్ బాబుని దూరంగా తీసుకుపోవాలి" అన్నాడు వరప్రసాదం.    

    అభిరాం తీవ్రంగా ఆలోచించసాగాడు.
    
    'ఎందుకు జరుగుతుందిలా? అన్నింటికంటే ఆశ్చర్యం.... వేటినయితే మహదేవ్ నమ్మడో అవే అతనిలో ప్రవేశించడం.....' అనుకున్నాడతను.
    
    "ప్రస్తుతం ఏం చేద్దాం?" తనకి తోచనట్టు వరప్రసాదంను అడిగాడు అభిరాం.
    
    "ఈ రాత్రికి చేయగలిగేదేమీ లేదు. ఉదయమే ఈ చోటునుంచి అతన్ని తీసుకుపోవాలి."
    
    "ఎక్కడికి తీసుకెళదాం?"
    
    "ఈ చోటు నుంచి ఎక్కడికయినా ఫర్వాలేదు"
    
    "మా యింటికి తీసుకుపోదామా?"
    
    "అక్కడికా?" ఆశ్చర్యంగా అడిగాడు వరప్రసాదం.
    
    "ఎందుకని అలా అడిగారూ?" అతని ఆశ్చర్యాన్ని గమనించి అడిగాడు అభిరాం.
    
    "అక్కడికొద్దు... అమ్మమ్మ భయపడొచ్చు.... ఇతన్ని వెన్నంటి ఏ గలయినా వచ్చి బీభత్సం సృష్టించిదంటే ఈ వయసులో అటువంటివి చూసి తను తట్టుకోలేకపోవచ్చు" అన్నాడు.
    
    "మరెక్కడికి తీసుకుపోదాం?"
    
    "అది మీరే ఆలోచించండి. ఇంకెవరూ తెలిసిన ఫ్రెండ్స్ లేరా?" అనడిగాడు వరప్రసాదం.    

    ఒక్కక్షణం ఆలోచించాడు అభిరాం.    

    తన ఎగ్జిక్యూటివ్స్ లో ఇద్దరు కుర్రాళ్ళు కలసి ఒక రూంలో వుంటున్నారు. వీలయితే అక్కడుంచచ్చు- అనుకున్నాడు.
    
    "మీరింక ఇంటికెళ్ళండి అభిరాం బాబూ! అమ్మమ్మ ఎదురు చూస్తూ వుంటుంది" అన్నాడు వరప్రసాదం.
    
    "లేదు! ఫోన్ చేసి పనిమీద బయటికి వెళ్ళాల్సి వచ్చిందని చెప్పేస్తాను. ఎదురింట్లోని వాళ్ళ పనిపిల్లని తోడుగా పడుకోమని చెప్పమంటాను. ఇంతకుముందు కూడా నేనామెని వదిలి వుండవలసి వచ్చినపుడు అలాగే చేశాను. మీరొక్కరూ ఇక్కడుండటం నాకెందుకో ప్రమాదమనిపిస్తోంది. ఇంత నీరసంగా కనిపిస్తున్న మనిషి కూడా నన్ను బంతిలా ఎలా విసిరేశాడో మీరే చూశారుగా..."
    
    అది కూడా నిజమే అనిపించింది  వరప్రసాదానికి.
    
    "ఒక పనిచేద్దాం. నేను ఫోన్ చేసి వచ్చేవరకూ మీరొక్కరూ ఈ గదిలో వుండద్దు. ఏదయినా ప్రమాదం జరిగే అవకాశం వుంది. అందుకని ఈ గది తలుపులు మూసివేద్దాం. మీరు హాల్లో కూర్చోండి. నేను ఫోన్ చేసి అమ్మమ్మకి ఈరోజు అర్జంటు పనిమీద వెళుతున్నానని చెప్పి వస్తాను" అన్నాడతను.
    
    "అలాగే!" అన్నాడు వరప్రసాదం.
    
    మరుక్షణం మహదేవ్ ఉన్న గది తలుపు మూసి గొళ్ళెం పెట్టి హాల్లోకి నడిచారు యిద్దరూ.
    
    అభిరాం బయటకి వెళ్ళిపోయాడు.
    
    వరప్రసాదం హాల్లోని సోఫాలో కూర్చున్నాడు.
    
    ఇల్లంతా నిశ్శబ్దంగా- రానున్న తుఫానుకు ముందటి ప్రశాంతతని తలపిస్తోంది. క్షణాలు భారంగా దొర్లుతున్నాయి.
    
    వరప్రసాదం కళ్ళు మూసుకుని ఆలోచిస్తున్నాడు.
    
    'మహదేవ్ నోట్లోంచి వచ్చిన పదాలకి అర్ధమేమిటి బహుశా వ్యక్తుల పేర్లా? అయితే ఇనీసా ఎవరు? కృపస్కయి అంటే...' అతను ఆలోచనలలో వుండగానే అభిరాం వచ్చేశాడు.
    
    "ఫోన్ చేశారా?" అడిగాడు వరప్రసాదం.
    
    "ఆఁ..." అన్నాడతను.
    
    ఇద్దరూ మెల్లగా నడుస్తూ వెళ్ళి చప్పుడు కాకుండా మహదేవ్ గది తలుపులు తెరిచారు.
    
    ఒక్కక్షణం ఉలిక్కిపడ్డారు. ఎదురుగా కనిపించిన దృశ్యం చూసి.
    
    మంచంమీద కూర్చుని వున్న మహదేవ్ అగ్నిగోళాల్లాంటి కళ్ళతో, బుగ్గల నుంచీ, చేతుల నుంచీ కారుతున్న నెత్తురుతో భయానకంగా కనిపించాడు. లోపలికొస్తున్న ఇద్దరివంకా రౌద్రంగా చూశాడు.
    
    వరప్రసాదం అభిరాంని ఆపేశాడు.
    
    "హౌ ఆర్ యూ" అని తీవ్రంగా అడిగాడు ముందుకొస్తున్న అభిరాంని చూసి.
    
    "ఐ యామ్ అభిరాం.... మే ఐ నో యువర్ గుడ్ నేమ్ ప్లీజ్" శాంతంగా అన్నాడు అభిరాం. అప్పుడతను చెప్పిన పేరు విని యిద్దరూ స్థంభించిపోయారు.
    
                                                            *    *    *    *    *
    
    అది జటాఝాటధారి నివాసం!
    
    అలసిన శరీరాలు సొక్కి సోలిపోయి ఆత్మలుగా మారే ఆవాసం. భ్రష్ట రోదనలతో, అపశ్రుతులు నిండిన వికృత సంగీత సామ్రాజ్యం.
    
    వెలుగెరుగని మసిబారిన చిక్కని చీకట్లు నిండిన ప్రదేశం. అది మొదలుకుని అంతంవరకూ చివరికి శూన్యంతో కలిపి ఎక్కడా లేని గాలి ఆ ప్రదేశంలో చేరి బ్రహ్మప్రళయం వచ్చినట్లు రొద.... చెవులు తెగి కింద పడిపోతాయేమో అన్నంతగా...

 Previous Page Next Page