Previous Page Next Page 
జీవాత్మ పేజి 47


    "అవును! ఊరెళుతున్నానని రెండురోజులే సెలవు పెట్టాను. వారికి చెప్పాలి విషయం" అప్పుడు గుర్తొచ్చినట్లు అన్నాడు మహదేవ్.
    
    "ఆ విషయం నేను చూసుకుంటానులే"
    
    "అమ్మమ్మ ణ అగురించి అడిగే వుంటుంది ఏం చెప్పావు?" అభిరాంని అడిగాడు వరప్రసాదం.
    
    "అవును! మీ గురించి అడిగింది ఎవరో స్నేహితుల ఇంటికి వెళ్ళారని చెప్పాను. మహదేవ్ దగ్గరున్నారని అంటే మళ్ళీ అతనికి ఏక్సిడెంట్ అయినట్లు చెప్పాలి. ఏక్సిడెంట్ అన్న పదం వింటే అమ్మమ్మకి భయం!" అన్నాడు అభిరాం.
    
    కూతురూ, అల్లుడూ ఏక్సిడెంట్లో పోయిన దగ్గర్నుంచీ ఆ పదం వింటేనే ఆమె కంపించిపోతుందని తెలుసు మహదేవ్ కి వరప్రసాదం కూడా అర్ధం చేసుకున్నట్లు మౌనంగా తలూపాడు.
    
    మహదేవ్ కి నీరసంగా అనిపించి మంచంమీద వాలిపోయాడు. వరప్రసాదం రాత్రి సంఘటనల గురించే ఆలోచిస్తుండిపోయాడు. అభిరాం ఇంటినుంచి వస్తూ తనతో తెచ్చుకున్న పుస్తకం చదవసాగాడు. మహదేవ్ దృష్టి అతని చేతిలోని పుస్తకం మీద పడింది.
    
    "డియర్ అభిరాం!" పిలిచాడు మహదేవ్.
    
    నవల పఠనంలో మునిగిపోయిన అభిరాంకి అతని పిలుపు విని పించలేదు. వరప్రసాదం కూడా అభిరాం పుస్తక పఠనంలో మునిగి పోవడం, పరిసరాలని మరిచిపోయేంతగా దానిలో నిమగ్నమై పోవడం గమనించినా పట్టించుకోలేదు.
    
    "అభిరాం!" ఈసారి మరికొంచెం గట్టిగా పిలిచాడు మహదేవ్.
    
    "ఏమిటి?" ఉలిక్కిపడి అడిగాడతను.
    
    "నవల బాగుందా?" అడిగాడు మహదేవ్.
    
    "చాలా బాగుంది!" తనని ఏడిపించటానికే అలా అడుగుతున్నాడని తెలిసీ తన్మయత్వం నటిస్తూ మరీ చెప్పాడు జవాబు.
    
    "అన్ని రకాల నవలలు తెగ చదువుతావ్ కదా! మరి ప్రపంచంలోనే అతి ఎక్కువ పేజీలున్న నవలేమిటి?" అడిగాడు మహదేవ్.
    
    "బహుశా 'టాయ్ స్టాయ్" రాసిన 'వార్ అండ్ పీస్' అనుకుంటాను" బదులిచ్చాడతను.
    
    "పొరపాటు!" అన్నాడు మహదేవ్.
    
    "మరేమిటి?" అడిగాడు అభిరాం.
    
    "ఇంగ్లీషులో చాలా ఎక్కువ పేజీలతో నవలలు రాయడంలో 'మార్సెల్ ప్రోస్ట్'కి మంచి పేరుంది. ఆయనే సుదీర్ఘమైన నవలలు ఎక్కువగా రాశాడు. ఇప్పటివరకూ అయితే రేమాండ్ టాలిస్ అనే మరో రచయిత మార్సెల్ ప్రోస్ట్ రికార్డుని అదిగమించారు... 'డిల్యూస్' అనే నవల సగభాగమే ఆయనిప్పటి వరకూ రాశాడు. ఆ సగభాగం ఎంతుంటుందో వూహించగలవా?" అడిగాడు అభిరాం వంకే చూస్తూ.
    
    "సగభాగమా.... ఉంటే ఓ అయిదారు వందలుంటుందేమో" మామూలుగా అన్నాడు అభిరాం.
    
    "యు ఆర్ రాంగ్.... ఆయన రాసిన ఆ సగం నవలే మూడువేల పేజీలుంది. గత పాతికేళ్ళుగా ఆయన నవల రాస్తూనే వున్నాడు"
    
    "ఓహ్...!" ఆశ్చర్యంగా అన్నాడు అభిరాం.
    
    "మిగతాభాగం ఈ జన్మలోనే పూర్తిచేయాలి అంటున్నాడాయన. మాంచెష్టర్ యూనివర్శిటీలో జీరియాట్రిక్ విభాగం ప్రొఫెసర్ గా, సాల్పోర్డ్ హాఫ్ హాస్పిటల్ సీనియర్ కన్సల్టెంట్ గా ఆయన విధులు నిర్వహిస్తున్నాడు. వైద్యశాస్త్రానికి సంబంధించి ఆయన సుమారు 130 పుస్తకాలు రాశాడు.
    
    డిల్యూస్ నవల రెండు విభిన్న మనస్తత్వాల కలయిక. 1940లో పుట్టి 1989లో మరణించే ఇద్దరి కథ. అందులో ఒకరు కంప్యూటర్ సంస్థాధిపతి. మరొకరు డాక్టర్. ఆ పాత్రల పేర్లు పెన్ మాన్, రాబర్ట్ ఆల్ స్టాన్.
    
    జీవితంలో అనుభవమే అన్నిటికీ మూలమని నమ్మే వ్యక్తి పెన్ మాన్ అయితే ఆల్ స్టాన్ దృక్పథం వేరు. జీవితం అంతా శూన్యం అని నమ్మే వ్యక్తతను. రెండు పాత్రలకి ఎక్కడా పొంతన వుండదు. కానీ రెండూ పాఠకుల సానుభూతిని పొందుతాయి.
    
    "ఆ రెండు పాత్రలూ తన అనుభవంలోంచి పుట్టినవే" అంటాడు రచయిత రేమాండ్ టాలిస్. సగభాగం పూర్తయిన ఈ నవలలో సుమారుగా ఎన్ని పదాలు వుంటాయంటావ్?" అడిగాడతను.
    
    "ఊహకు అందటం లేదు."
    
    "ఏడులక్షల పదాలు"
    
    "హారిబుల్"
    
    ఇద్దరి సంభాషణా మౌనంగా వింటూ కూర్చున్నాడు వరప్రసాదం.
    
    "నవలలో ఈ పాత్రలు రెండూ మరణిస్తాయి. ఒకరు గుండె పోటుతో మరణిస్తే, ఇంకొకరు ఆత్మహత్య చేసుకుంటారు. ఫ్రాయిడ్, మార్క్స్, టి.ఎస్.ఇలియట్ ళ సాహిత్యాన్ని అభిమానించే టాలిస్ వారానికి అరవైగంటలపాటు కేవలం ఫిలోసఫీయే చదువుతాడట. అదే ఆయన అభిమాన సబ్జెక్టట.... నీకు దెయ్యాలూ, భూతాల సబ్జెక్ట్స్ నచ్చినట్టు" నవ్వుతూ అన్నాడు మహదేవ్.
    
    "అంటే.... మీకు వాటిమీద నమ్మకంలేదా?" ఆశ్చర్యంగా అడిగాడు వరప్రసాదం మహదేవ్ ని.
    
    "ఇసుమంత కూడా లేదు"
    
    ఆశ్చర్యంగా చూశాడు వరప్రసాదం. "ఇంకా రాత్రి నాకేవో శబ్ధాలు వినిపించాయి. మీకూ వినిపించాయా?" అనడుగుదామనుకున్నాడతను. అతడలా అనేసరికి ఆ ప్రస్తావన తేకూడదని నిర్ణయించుకున్నాడు.
    
    "ఆ పుస్తకం పక్కన పెట్టి మాతో మాట్లాడరా బాబూ! ఇదేమైనా గ్రంథాలయం అనుకుంటున్నావా? ఎవరితోనూ మాట్లాడకుండా 'నిశ్శబ్దమును పాటించవలెను' అని లైబ్రరీల్లో వేలాడే బోర్డుకు న్యాయం చేకూరుస్తూన్నట్టూ, నవ్వునూ."
    
    అతని మాటలతో పుస్తకం మూసేసి-
    
    "ఏం మాట్లాడనురా...?" అన్నాడు అభిరాం.
    
    "మనస్విని దగ్గరకు వెళ్ళావా?"

 Previous Page Next Page