మరో వారం రోజులకు మరో ఉత్తరం.
"నీవే కావాలి.... నీవే... నీవే.... కావాలి.
ఇలా నా హృదయాన్ని అహరహాలు జపం చేయనీ.
ఇంతకన్నా నాకు వేరే ఏమీ వద్దు.
నా మనస్సు లాగే ఇతర కోర్కెలన్నీ శూన్యమైనవి.
వెలుగుకోసం వేదనను-
రాత్రి తనలో దాచుకున్నట్టు-
నా హృదయాంతరాలల్లో-
'నీవే కావాలి. నీవే కావాలి' అనే మంత్రాక్షరాలను దాచుకుంటాను.
ప్రశాంతిని చెదరగొట్టే తుఫాను ప్రశాంతిలోనే అంతమైనట్టు నీ ప్రేమపైనా తిరుగుబాటు కూడా నీ కోసమే నీవే... కావాలి...." అనే మంత్రమే జపిస్తుంది."
అంతవరకూ వచ్చిన ఉత్తరాలు అకస్మాత్తుగా ఆగిపోయాయి. నాలుగు రోజుల కొకసారి పని వత్తిడిలో కూడా ఎదురుచూసే వికాస్, రెండ్రోజులు వరసగా 'అనామిక' ఉత్తరాల కోసం ఎదురుచూడడం మొదలుపెట్టాడు.
ఒకరోజు చిన్న పార్శిల్ లాంటి ఉత్తరం.
గబగబా విప్పాడు వికాస్.
ఎండిపోయిన గులాబీ రేకులతో ఎగిరి వచ్చిన ఉత్తరం!
గబుక్కున ఆ ఉత్తరాన్నే మొదట తెరిచాడు.
వరసగా ఉత్తరాలు రాసి వేధించి, అకస్మాత్తుగా గడువిచ్చి బాధించినా-
మీరు నా ఉత్తరం కోసం ఎదురుచూస్తుంటారని నాకు తెలుసు.
ఎందుకో చెప్పండి.
నాలుగురోజులు వరసగా ఒకే టైమ్ లో వచ్చిన ఫోన్ కోసం అయిదవ రోజు కూడా ఎదురుచూడడం మానవ సహజం కదూ!
అందుకే-
నేనెవరని తెలుసుకోవడం కోసం మీరు ప్రయత్నాలు చేస్తున్నారు కదూ- అయినా దొరకను.
అర్దరాత్రి-
రెండుగంటల సమయం-
ఫ్యాక్టరీలో ఒక పక్క పని జరుగుతూనే ఉంది.
తన గదిలోకొచ్చి, ఆ ఉత్తరాన్ని తీసి నెమ్మదిగా చదువుకున్నాడు.
చదివేశాక- అన్నిటినీ భద్రంగా దాచేశాడు.
ఎవరు? ఎవరు? ఎవరు? ఎవరు?
ఆ ఉత్తరాల్ని ఇప్పటికి ఎన్నిసార్లు చదువుకున్నాడో, అలసట వచ్చినప్పుడు పాత జ్ఞాపకాలు ఒక ఓదార్పయితే- నీరసం వచ్చినప్పుడు ఇటీవల ఆ ఉత్తరాలు చదవడం ఒక ఆనందం.
అలాగే అక్కడే ఆలోచనల మధ్యన ఉక్కిరిబిక్కిరై, టేబుల్ మీద మొహం పెట్టుకొని నిద్రపోయాడు వికాస్.
* * * * *
ఆరోజు సాయంత్రం ఐదున్నర గంటలవేళ లిఖిత శివానీ మోటార్స్ కాంప్లెక్స్ లోకి అడుగుపెట్టింది.
ఇంజనీరింగ్ డిపార్ట్ మెంట్లోంచి వచ్చి, ఆఫీస్ రూమ్ లోకి వెళ్ళబోతున్న వికాస్ ఆమెవేపు చూసి పలకరింపుగా నవ్వాడు.
"వావ్... వాట్ సర్ ప్రైజ్.... అద్భుతంగా డెవలప్ చేశారు" చుట్టూ చూస్తూ అంది లిఖిత.
పింక్ కలర్ యూనిఫారమ్ లో తిరుగుతున్న ఉద్యోగులు- ఖాకీ దుస్తుల్లో వున్న వాచ్ మెన్...
ఆఫీసు ముందు అందంగా తీర్చిదిద్దిన లాన్- చుట్టూ పూలమొక్కలు- ఎడం చేతివైపు సైకిల్ స్టాండ్- ఆఫీసువరకూ పొడిగించిన ఆర్టీసీ సిటీబస్సు- ఇంతకు ముందు ఆ దారిలో లైట్లు లేవు- ఇప్పుడు వెలుగుల తోరణంలా దీపాలు.
లిఖిత చూపు ఆఫీసు రూమ్ కి ఎడమవైపున పెట్టిన పెద్ద 'హోర్డింగ్' మీద పడింది.
అతిత్వరలో శివానీ మోటార్స్ మార్కెట్లోకి లాంచ్ చేస్తున్న 'స్ట్రీట్ రైడర్' పెయింటింగ్... టెమ్ట్ చేస్తున్నట్టుగా వుంది.
హాల్లోకి నడిచారు. హాల్లో అటూ ఇటూ విజిటర్స్ కోసం లేటెస్ట్ మోడల్ కుర్చీలు వరుసగా క్యూబిక్స్...
ఒకటి వికాస్ ఛాంబర్- రెండోది శివమూర్తి- మూడోది జగన్....
ఎడంవేపున వరుసగా కొన్ని గదులు ఎకౌంట్స్.... డిపార్ట్ మెంట్-
ఇంజనీరింగ్ డిపార్ట్ మెంట్.... సేల్స్ డిపార్ట్ మెంట్ సిబ్బంది అక్కడున్నారు.
"జీవితాంతం ఇక్కడేనా...." కూర్చుంటూ అంది లిఖిత.
"ఎప్పుడొచ్చారు హైద్రాబాద్ నుంచి?" అడిగాడు వికాస్.
"పొద్దున్నే వచ్చాను.... రాగానే మీకు ఫోన్ చేశాను.... ఎంగేజ్.....హైద్రాబాద్ నుంచి ఎన్నిసార్లు మీకు ఫోన్ చేశానో తెల్సా?"
"ఉన్నది ఒకే ఫోన్.... నేను బయటకు ఫోన్ చెయ్యాలన్నా వీలవదు.....అంత బిజీ..."
"పిబిఎక్స్ పెట్టుకొండి.... అవసరం కూడా కదా...."
"అంచెలంచెలుగా డెవలప్ చేస్తేనే అందం...." అన్నాడు వికాస్.
బాయ్ రెండు కూల్ డ్రింక్స్ తెచ్చాడు.
"చలికాలంలో కూల్ డ్రింక్స్ ఆఫర్ చేస్తారా ఎవరైనా...." బాయ్ వెళ్ళిపోయాక అంది లిఖిత.
"పోనీ హాట్ డ్రింక్స్ తాగుతారా?"
"మీరిస్తే తాగుతాను."
"ఆహా" నవ్వాడు వికాస్.
"ఇందాక నేనడిగిన ప్రశ్నకు జవాబు చెప్పనేలేదు"
"ఏమడిగారు?"
"జీవితాంతం ఇక్కడేనా....?"
"అంతవరకూ కాదులెండి..... కొంతవరకే... చెప్పండి.... సడన్ గా వస్తారు.... రెండ్రోజులు ఉక్కిరిబిక్కిరి చేస్తారు.... వెళ్ళిపోతారు.... అసలు మీరేం చేస్తుంటారు?" ఎప్పుడో అడగాల్సిన ప్రశ్న- ఎప్పుడు అడుగుదామనుకుంటున్న ప్రశ్న-
అనుకోకుండా అడిగేశాడు.
విచిత్రంగా చూసింది వికాస్ వేపు లిఖిత.
"మొన్నటివరకూ నేనెవరో నాకు తెలీదు- కానీ నేడు నేనేం చెయ్యాలో తెల్సుకొని ఇక్కడ కొచ్చాను...." నర్మగర్భంగా అంది లిఖిత.
"హైద్రాబాద్ లో జ్ఞానోదయం అయిందన్న మాట."
ఆ మాటకు లిఖిత నవ్వేసింది.
"ఏం చెయ్యాలని వచ్చారు....?" మళ్ళీ అడిగాడు వికాస్.
"మీమీద నిఘా..." తండ్రి మాట గుర్తుకొచ్చి అంది లిఖిత.
"నిఘా.... అంటే..." అనామిక ఉత్తరాలు జ్ఞాపకానికొచ్చాయి వికాస్ కు.
"మిమ్మల్ని సీరియస్ గా ఓ విషయం అడగడానికొచ్చాను" అంది లిఖిత.
"అడగండి... చెప్తాను..."
"ఇక్కడ కాదు.... అక్కడ మనిద్దరమే ఉండాలి... మన ఎదుట సముద్రం ఉండాలి... సముద్రపు అలల అస్పష్టపు రొదలో మీతో నేనో మాట చెప్పాలి..."
"కోరిక బాగానే వుంది కానీ.... అది కుదరదనుకుంటాను...." అన్నాడు వికాస్ మొహమాటంగా.
"ఏం.... ఎందుకని..."
"మా శివమూర్తి గారొస్తున్నారు.... ఆయనొస్తే నన్ను వదలడు గనక..."
శివమూర్తి తలుపు తెరుచుకుని వచ్చాడు.
"నేనేం మిమ్మల్ని డిస్ట్రబ్ చేయడం లేదు కదా."
"నో... నో... సర్. ప్లీజ్ కమిన్" అన్నాడు వికాస్.
"ఆ డన్ లప్ వాళ్ళు టైర్లు పంపుతున్నట్టు మెసేజ్ వచ్చి రెండ్రోజులయింది. స్పేర్స్ బొంబేలో బయలుదేరి రెండు రోజులైంది. మనకింకా చేరలేదు- రాజమండ్రి దగ్గరో, ఎక్కడో ఓ నాలుగు లారీల్ని తగలెట్టేశారని ఓ వార్త వచ్చింది... ఎంత లేటైనా ఇంత లేటు కాదుకదా.... ఏం చేద్దాం?" అడిగాడు శివమూర్తి.
గుండెలు గుభేలుమన్నాయి వికాస్ కి.
"ఆ లారీ నెంబర్లున్నాయా... ఇలా ఇవ్వండి..."
తన ఛాంబర్ లోకెళ్ళి ఆ లారీ నెంబర్లను రాసి తెచ్చిచ్చాడు శివమూర్తి. ఆ నెంబర్లను చూస్తూ రెండు నిమిషాలు ఆలోచనలో పడ్డాడు వికాస్.
"ఒక పని చేద్దాం.... భద్రాద్రి అని రాజమండ్రి నుంచి ఓ డీలర్ వచ్చి కలిశాడు గుర్తుందా... ఆయన ఎడ్రసుండాలి..."
బాయ్ చేత జగన్మోహన్ దగ్గర ఆయన ఎడ్రసు తెప్పించి చూశాడు.
"భద్రాద్రికి ఫోన్ చేద్దాం... ఆయన కనుక్కొని మనకు చెప్తాడు" ట్రంకాల్ బుక్ చేశాడు వికాస్.
"అదేదో ఇవాళ తేలిపోతే బాగుంటుంది" అంటూ వెళ్ళిపోయాడు శివమూర్తి.
"ఇవాళ మీ కోరిక నెరవేరేటట్టు లేదు..." నవ్వుతూ అన్నాడు వికాస్.
అదే సమయంలో ఫోన్ మోగింది.
"రాజమండ్రి కాల్ బుక్ చేశారా..."