"ఎస్. మేడమ్..."
"మాట్లాడండి..."
భద్రాద్రి అనే డీలర్ విషయం చెప్పాడు.
"కనుక్కుని నేను ఫోన్ చేస్తాను వికాస్ గారూ... మరి నా సబ్ ఏజన్సీ గురించేం చేశారు..." పనిలో పనిగా అడిగాడు ఆ డీలర్.
"ఇంకా డిసైడ్ చెయ్యలేదనుకుంటాను."
"ఫైవియర్స్ ఎక్స్ పీరియన్స్ ఉందండీ ఈ ఫీల్డ్ లో... చూడండి సర్..."
"అలాగే..."
ఫోన్ పెట్టేసి- లిఖితవేపు తిరిగి-
"ఆ ఫోన్ ఎప్పుడొస్తుందో" అన్నాడు.
"మరి నే వెళతాను" అంది ఒకింత అసంతృప్తితో.
"ఎన్ని రోజులుంటారు..... ఇక్కడ...."
"చెప్పలేను" అంది నిర్లిప్తంగా.
"ఇక నుంచి రోజూ ఇలాగే ఉంటారా...."
"ఇలాగె అంటే.... గజిబిజీగా.... బిజీ బిజీగా...."
"ఉంటేనే వ్యాపారం ఉన్నట్టు లెక్క.... లేకపోతే వేరే ఈగిల్స్ డేర్... అన్నట్టే..."
"వేరే ఈగిల్స్ డేర్.... అంటే..."
"అది నేనుపయోగించే పదం.... ఈగలు తోలుకోవడమేనని..."
"మంచి పదమే కనిపెట్టారు...." నవ్వింది లిఖిత.
శివమూర్తి మళ్ళీ గదిలోకి రావడంతో బైటకొచ్చేసింది.
ఓ అరగంట తర్వాత రాజమండ్రి నుంచి ఫోనొచ్చింది.
"ఇక్కడ నాలుగు లారీలు తగలబడిన వార్త నిజమే. అని లోకల్ లారీలు కావు... ఎక్కడ నుంచి వస్తున్నదో తెలీదు.... లారీలు నామరూపాల్లేకుండా కాలిపోయాయి. డ్రైవర్లు పరారైపోయారు... అందులో రెండు లారీల్ని గోదావరిలో తోసేశారు. అవి పూర్తిగా మునిగిపోయాయి. ఇక్కడ ఏ విషయాన్నీ చెప్పడానికి పోలీసులెవరూ అందుబాటులో లేరు. అయినా ట్రై చేస్తాను... ఏవైనా ఇన్ఫర్మేషన్ తెలిస్తే చెప్తాను... ఇంకో విషయం..... ఇంకో నాలుగు లారీలు తప్పించుకుని ఈ దారిగుండా వెళ్ళిపోయాయట.... అవి కావొచ్చేమో....మీరు ఓ మనిషిని అక్కడ నుంచి పంపిస్తే బావుంటుంది.... ఇదీ విషయం. ఉంటాను సార్. మరి సబ్ ఏజన్సీ సంగతి మరిచిపోకండి సార్..."
ఫోన్ పెట్టేశాడు భద్రాద్రి.
లేచి పరుగు పరుగున శివమూర్తి దగ్గరకెళ్ళాడు.
విషయం చెప్పాడు.
"అయితే ఏం చేద్దాం...." కమగారు పడ్డాడాయన.
పదినిమిషాలు తర్జన భర్జనలు పడ్డాక-
"నా కారిస్తాను...చయనులుగారు ఆ లారీల కెదురెల్తే బావుంటుంది- ఆయనకు డ్రైవింగొచ్చా...."
"రాదు...." అని చెప్పి "డ్రైవర్ ఉన్నాడు లెండి" అని కిషన్ ని పిలిచాడు.
చయనులు కార్లో బయలుదేరాడు లారీల నెంబర్లతో.
"లారీలెక్కడ కనబడితే అక్కడ వెంటనే ఫోన్ చేసి చెప్పు.... నేను ఫోన్ దగ్గరే ఉంటాను."
ఆఘమేఘాల మీద కారెళ్ళి పోయింది.
పదకొండు గంటల వరకూ ఆఫీసులో ఉండి, లాస్ట్ బస్ లో ఇంటికెళ్ళాడు శివమూర్తి.
ప్రతీ అరగంట కొకసారి ఫోన్ చేస్తూనే ఉన్నాడాయన.
ఫోన్ దగ్గరే, ఫోన్ వేపు చూస్తూ అలా కూర్చున్నాడు వికాస్.
పన్నెండు....
ఒంటిగంట... ఒంటి గంటన్నర...
కమ్ముకొస్తున్న మగత నిద్ర.
ఆ సమయంలో ఫోన్ గణగణమని మ్రోగింది.
గబుక్కున తల ఎత్తాడు.
"హలో.... తుని దగ్గర కనిపించాయి మన లారీలు... కంగారేం లేదు" చయనులు చెప్పాడు.
వెంటనే ఫోన్ చేసి శివమూర్తికి ఆ వార్త చెప్పాడు వికాస్.
అప్పుడు మనసు కుదుటపడింది వికాస్ కి.
* * * * *
ఉదయం ఐదుగంటలకే ఫ్యాక్టరీ నుంచి ఒక ఫోన్ వచ్చింది. ఆ కాల్ చేసింది ఎలక్ట్రికల్ ఇంజన్ డివిజన్ చీఫ్.
వికాస్ నిద్ర కళ్ళతోటే హడావిడిగా ఫ్యాక్టరీకి బయలుదేరి వెళ్ళిపోయాడు.
"ఈజ్ దేర్ ఎనీ ప్రాబ్లెమ్...." వికాస్ లో టెన్షన్ స్పష్టంగా తొంగి చూసింది.
"ఎస్ సార్... మన కారు స్పీడ్ ని రెగ్యులేట్ చేసేందుకు ఏం చెయ్యాలో తోచటం లేదు. అన్నీ సవ్యంగా, సక్రమంగా అమరాయి. కాని యిదొక్కటే సమస్యయి కూర్చుంది" అరవై యేండ్ల వయసున్న సీనియర్ ఇంజనీర్ మొఖంలో ఒకింత ఆందోళన.
వికాస్ మాట్లాడలేదు- మౌనంగా ఆలోచిస్తూండిపోయాడు.
"స్పీడ్ ని రెగ్యులేట్ చేయకపోతే చాలా ప్రమాదం సార్. మార్కెట్లోకి వెళ్ళగానే మన డీలర్స్, కస్టమర్స్ బాగా సఫరయ్యే ప్రమాదం వుంది. నేను ఈ రాత్రంతా కారుని రకరకాల టెస్ట్ లకు గురిచేస్తూ నడిపి చూశాను. అంతా సవ్యంగానే వుంది. కారు రిలీజ్ లేట్ అయినా, ఇది సాల్వ్ చేశాకే రిలీజ్ చేస్తే బావుంటుందేమో ఒక్కసారి ఆలోచించండి" వికాస్ పట్ల ఎంతో గౌరవాన్ని వ్యక్తం చేస్తూ మాట్లాడినా- అతని కంఠంలో ఒకింత ఆందోళన వ్యక్తమయింది.
చిన్నగా నవ్వాడు వికాస్ ముందు.
"సార్ మిస్టర్ ఛీఫ్.... ఈ విషయంలో మీరు నన్ను మన్నించాలి. నా సమస్యని మొట్టమొదటి మోడల్ కారుని తయారుచేసుకున్నప్పుడే ఎదుర్కొన్నాను. ఒక వారం ఆ సమస్యకి పరిష్కారం కనుక్కొనే ప్రయత్నంలో పిచ్చెత్తిపోయాను. చివరకు కనుక్కోగలిగాను. ఒకసారి నాతో రండి" అని సీనియర్ ఇంజనీర్ ని తను వాడుతున్న మోడల్ కారు దగ్గిరకు తీసుకెళ్ళి బాయ్ నెట్ ఓపెన్ చేసి చూపించాడు.
అయోమయంలో సీనియర్ ఇంజనీర్ ఇంజన్ ని దగ్గరగా చూశాడు. ఆయనకేం అర్ధం కాలేదు.
ఒకసారి నడిపి చూడమన్నాడు వికాస్.
సీనియర్ ఇంజనీర్ డ్రైవింగ్ సీట్లో కూర్చుని నాలుగు రౌండ్స్ వేసి ఆశ్చర్యపోయాడు. ఒక క్రమపద్దతిలో కారు స్పీడ్ రెగ్యులేట్ అవుతున్నట్లు గమనించాడు.
"మిమ్మల్ని నమ్మకకాదు, మన స్టాఫ్ ని విశ్వసించకకాదు- ఈ కారుకి స్పీడ్ రెగ్యులేటర్లే ప్రాణం. వాటి గురించి ముందే తెలియపరిస్తే ట్రేడ్ సీక్రెట్ లీక్ అవుతుందనే భయంతో ఆ విషయం మీకు చెప్పలేదు. నన్ను క్షమించాలి" అన్నాడు వికాస్ నెమ్మదిగా.
"ఎలా...? ఎలా...? ఎలా రెగ్యులేట్ చేశారు?" దిగ్ర్భాంతి నుంచి తేరుకుంటూ అడిగాడు ఇంజనీర్.
"ప్యాన్ కి ఉపయోగించే రెగ్యులేటర్లనే డెవలప్ చేసి, పటిష్టపరిచి మన కంపెనీలోనే సీక్రెట్ గా మన కారుకు ఉపయోగపడేలా స్పీడ్ రెగ్యులేటర్లని తయారుచేసి వుంచాను. లాస్ట్ మినిట్ లో వాటిని మన కార్లకు ఫిట్ చేసి రిలీజ్ చేద్దాం.
సారీ... ఆఖరిక్షణం వరకు వాటి గురించి మీకు చెప్పకపోవటం మిమ్మల్ని నమ్మలేక కాదు- నాలో వున్నా భయంకొద్ది" ఒకింత సిగ్గు పడుతున్నట్లుగా అన్నాడు వికాస్.
కార్ల ఇంజన్ల మధ్యే తన జీవితాన్ని పండించుకున్న ఆ ఇంజనీర్ వికాస్ మేధస్సుకు అప్రతిభుడే అయ్యాడు.
* * * * *
ఇంజనీరింగ్ డిపార్ట్ మెంట్ నుంచి వచ్చిన రిపోర్ట్ చూస్తున్నాడు వికాస్. ఇంజనీరింగ్ డిపార్ట్ మెంట్లో తయారౌతున్న తన చిరకాలపు కల, తన ఆశలకు రూపం- తన STREET RIDER... క్రమంగా ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించేందుకు ఊపిరి పోసుకుంటోంది.
* * * * *
కొన్ని వారాలు సాగిన స్ట్రీట్ రైడర్ మహాయజ్ఞం....అందులో సమిధలు....వికాస్ మేథస్సు, శ్రమ, పట్టుదల, ప్రతీకారం, దీక్షాదక్షత, సుఖాలు, విశ్రాంతి, ప్రశాంతత, సర్వస్వం అందులో సమిధలయిన వేళ...
గుట్టలు దాటి, రప్పలు దాటి, పచ్చికదారి వెంబడి నిశ్శబ్దంగా పరుగు తీసి, మెత్తని సముద్రపొద్దు ఇసుక మీద సరసరా జారి, ఎన్నెన్నో 'డెడ్ కార్నర్స్'లో మలుపులు తిరిగి, తేటనీటి ఏటిపాయల్ని చీల్చుకుని పరుగెత్తి, అతి వేగంగా, అమిత మెల్లగా, పరుగెత్తి, పరుగెత్తి- చూపరుల్ని దిగ్ర్భాంతికి గురి చేసింది స్ట్రీట్ రైడర్.....
విశాఖ రోడ్లవెంబడి బారులుగా ప్రయాణం చేసి-
శివానీ మోటార్ కాంప్లెక్స్ వాకిట నిల్చున్న 'స్ట్రీట్ రైడర్' కార్ల వరుసను చూసి కళ్ళు చెమర్చాయి వికాస్ కు-
'స్ట్రీట్ రైడర్' కారు ప్రవేశోత్సవం అద్భుతంగా జరిగింది.


