"మద్రాస్ నుంచి మీకేమయినా ఆర్డర్స్ వస్తున్నాయా సర్?" ఓ దూరదృష్టి గల విలేఖరి అడిగాడు.
"అవునండీ! చిరంజీవిగారికి మా ఫస్ట్ కారు కావాలట."
"రెస్పాన్స్ అద్భుతంగా ఉన్నట్టుందే" ఇంకో విలేఖరి అన్నాడు.
"చెప్పండి" వారికి కూల్ డ్రింక్స్ ఆఫర్ చేస్తూ అడిగాడు వికాస్.
"మీ ప్రొడక్టు సక్సెస్ అయితే అన్ని రాష్ట్రాలకు కూడా వ్యాపార పరిధిని పెంచుతారా?"
"తప్పకుండా"
"విదేశాల నుండి మీకు ఆర్డర్స్ వచ్చాయనుకోండి."
"వస్తే ఆనందమే కదా."
"మీ కంపెనీ, ఒక్క స్ట్రీట్ రైడర్ నే ఉత్పత్తి చేస్తుందా? ఇంకా ఏవయినా ఉన్నాయా?"
"ఇంకా రెండు మూడు ప్రొడక్ట్సుని ఉత్పత్తి చేస్తాం. ఇంకా ఫైనలైజ్ చెయ్యలేదు. కానీ దేనికయినా మా మొట్టమొదటి కారు సక్సెస్ ఉత్సాహాన్ని యిస్తుంది కదా! దానికోసమే వెయిట్ చేస్తున్నాం."
"మీ కారుని డిజైన్ చేసిందెవారో చెప్పగలరా?"
"శివానీ గ్రూప్" టక్కున చెప్పాడు.
"మార్కెట్లోకి మీ ప్రొడక్టు రాకుండానే, మీ శివానీ మోటార్స్ కి అద్భుతమైన గుర్తింపు వచ్చింది. ఈ శివానీ మోటార్స్ వెనకనున్న వ్యక్తెవరో చెప్తారా?"
"మహా మేధావి ఉన్నారు. అసలు మూలం ఆయనే. సారీ- ఆయన పేరుని చెప్పలేను" అన్నాడు వికాస్ ప్రొఫెసర్ దొరను తలుచుకుంటూ అప్పుడు వికాస్ కళ్ళు తడిదేరాయి.
"ఇందులో మీ పాత్ర..." ఇంకో విలేఖరి అడిగాడు.
"నా కారుకి నేను డ్రైవర్ ని మాత్రమే..." నవ్వుతూ చెప్పాడు వికాస్.
"ఆఖరి ప్రశ్న.... ఇక్కడకు రాక పూర్వం మీరెక్కడ పనిచేశారు? మీరే జిల్లాకు చెందిన వారు? మీ గోల్ ఏమిటి? మీ ఇన్స్ స్ఫిరేషన్ ఎవరు?"
"ఏ వ్యక్తయినా తను ప్రపంచం దృష్టిలో గుర్తింపు పొందాలని ప్రయత్నిస్తాడు. అందుకు తగిన రంగాన్ని ఎంచుకుంటాడు. నేను యీ ఆటోమోబైల్స్ రంగంలోకి వచ్చింది మా మావయ్య చయనులుగారి ద్వారా.... ఒక బోయ్ గా... ఎప్పటికయినా నీళ్ళతో, గాలితో, సోలార్ తో నడిచే కారుని మార్కెట్ లోకి తేవాలని, భారతదేశానికి ఇంధన సమస్య తగ్గాలంటే రవాణా వాహనాలకు, ప్రత్యామ్నాయ ఇంధనం ఏర్పాటు ఎంతయినా అవసరం అని నేను నమ్ముతాను. అందుకే నా సర్వశక్తులూ కేంద్రీకరిస్తున్నాను. యూకలిప్టస్ ఆయిల్, గుర్రపు డెక్కతో కూడా కారు నడిపేలా చేయాలనే నా ప్రయత్నం."
ఆశ్చర్యంతో నోళ్ళు వెళ్ళబెట్టారు విలేఖరులు.
"మీరడిగిన ఆఖరి పాయింట్... ఎక్కడ పనిచేశానని.... జింఖానా కంపెనీలో ట్రైనీ ఇంజనీరుగా పనిచేశాను. నా మరో ఇన్ స్పిరేషన్ భానోజీరావుగారు" మార్కెట్ ని ఎలా పట్టుకోవాలో అనుభవమ్మీద నేర్చుకుంటున్నాడు వికాస్.
అందులో భాగంగానే ఈ ఇంటర్వ్యూ ఇచ్చాడు వికాస్.
"మీ కారులోని ప్రత్యేకతలు?"
"పొల్యూషన్ ఉండదు- కెమికల్ పొల్యూషన్, సౌండ్ పొల్యూషన్..... ఏదీ ఉండదు. హైలీ కాన్ సన్ ట్రేటెడ్ బ్యాటరీని ఛార్జ్ చేయటం ద్వారానే కారు నడుస్తుంది. అన్నింటికీ మించి మా ఆకారు మధ్యతరగతి ప్రజలకు అందుబాటులోకి వచ్చే వాహనం. ఇకపై చాలామంది కారు ఒక కల అని భావించనక్కరలేదు. మా కారు కేవలం అన్ని ఏసెస్ రీస్ తో కలుపుకొని అరవై వేలే. శివానీ ఫైనాన్స్ అండ్ లీజింగ్ అనే మరో సిస్టర్ కన్ సర్న్ ని ఫ్లోట్ చేస్తున్నాం. సో... ఒక్కసారే కస్టమర్ కి 60, 000 కట్టే బాధ కూడా ఉండదు. త్వరలోనే మనదేశం ప్రపంచదేశాల కార్ల మార్కెట్ ని బీట్ చేస్తుందని నా విశ్వాసం. ఇకపోతే నా వెనుక మరో ఉత్తేజకరమైన శక్తి... వ్యక్తి ఉన్నారు. ఎవరన్నది కారు సక్సెస్ అయ్యాక చెబుతాను. తమ కాళ్ళమీద తాము నిలబడేందుకు ప్రయత్నించే మాలాంటి యువకులికే మీరు ఎక్కువ ప్రోత్సాహాన్ని కలిగించటంలో న్యాయం ఉంది. కాదంటారా? చాలామందిని తప్పుదారి పట్టించటం కోసం అంటున్నట్లుగా యువత చేతిలో అన్నీ లేవు. భారతదేశపు యువత చేతుల్లో శక్తి వుంది. యుక్తి ఉంది. శ్రమపడగల సత్తా ఉంది. కాని డబ్బులేదు.... సహకారం లేదు.... ప్రోత్సాహం లేదు. అలా చెప్పే రాజకీయ నాయకుల చేతుల్లో అధికారం ఉంది. రాజముద్ర ఉంది. ప్రభుత్వ ఖజానా ఉంది. వాటిని దేశ యువతకు అప్పజెప్పి చూడ మనండి. దేశం జపాన్ లా అయి తీరుతుంది."
ఎంతో ఉద్వేగంగా చెప్పుకుపోతున్న వికాస్ వేపు విస్మయంగా చూశారు విలేఖరులు.
ఆ పైన అభినందించి వికాస్ ని, కంపెనీని, కారుమోడల్ ని వివిధ కోణాల్లో ఫోటోలు తీసుకొని ఉత్సాహంగా వెళ్ళిపోయారు. వెళ్తున్న వారికేసి చూస్తూ.... అందులో తన భవిష్యత్ ని ఊహించుకున్నాడు.
* * * * *
ప్రేమకు 'ఫ్రం' అడ్రస్ ఉండదు.
అలాగే వికాస్ కి వచ్చే ప్రతి ఉత్తరం కూడా రెండు నెలల క్రితం మొదటి రోజు ఓ ఉత్తరం వచ్చింది వికాస్ పేరున. దస్తూరీ మల్లె మొగ్గల్లా ఉంది.
ఫ్రమ్ అడ్రస్ లేదు.
వికాస్ కి వచ్చేవన్నీ అఫీషియల్ ఉత్తరాలే. ఇప్పటికీ అతని పేరున ఓ ఉత్తరం కూడా రాలేదు. తన పేరున తనే ఎప్పుడైనా ఉత్తరం రాసుకోవాలేమో అనుకుంటూ నవ్వుకుంటుండేవాడు వికాస్.
ఆ రోజు ఆ ఉత్తరం విప్పి చూశాడు.
అల్లిబిల్లి పువ్వుల బొమ్మల ఉల్లిపొర కాగితమ్మీద అక్షరాలు.
మీ ఆశలు, ఆశయాలు స్పష్టంగా నాకు తెలీకపోయినా మిమ్మల్ని చూసినప్పుడు ఆ కళ్ళల్లో మీ ఆశలు స్ఫుటంగా గుర్తుకొస్తుంటాయి. నాకు కవిత్వం రాదు. కవిత్వమ్మీద ప్రేమ తప్ప మీ మీద లాగే, మిమ్మల్ని ప్రేమిస్తున్నానని మీతో చెప్పడం తేలికే. కానీ ఆ ఒక్క వెనక ఒక మూగ మనసుంటుంది. ఆ మూగ మనసు స్పందించినపుడల్లా మీకో ఉత్తరం.
చదువుకుని పారేయకండి. దాచి ఉంచండి. ఎప్పుడో నేనెవరో తెల్సి నప్పుడు మీరు నాకిచ్చే మొదటి కానుక. నేను మీకు రాసే ఈ ఉత్తరాలే! ఇక చదవండి-
"నీవు నన్ను అనంతంగా సృష్టించావు. అది నీ విలాసం తాకితే చాలు పగిలిపోయే ఈ పాత్రను నీవు మాటిమాటికి ఖాళీచేసి మళ్ళీ కొత్త జీవితంతో నింపుతూ ఉంటావు. ఈ చిన్ని వేణువును ఊదుతూ కొండలూ, కోనలూ తిరుగుతావు. నిత్య నూతనమైన మధుర గీతాలు ఆలపిస్తావు.
నీ మృదుల కరాల అమృత స్పర్శ సోకితే చాలు. నా చిన్నారి గుండెలో ఆనందం పరుగులు తీస్తుంది. ఏవో మాటలు నాలో పెల్లుబుకుతాయి.
ఇలాగ యుగాలు గడిచిపోతాయి. అయినా నీవు క్రొత్త జీవితాన్ని పాడుతూనే ఉంటావు. క్రొత్త పాటలు పాడుతూనే ఉంటావు" అయినప్పటికీ మళ్ళీ ఈ పాత్రను నింపడానికి ఖాళీ ఉంటుంది."
క్రింద సంతకం లేదు.
అప్పటికి లిఖితతో పరిచయం అంతంత మాత్రమే.... అప్పటికి ఆనంది పరిచయమై కొన్ని రోజులు మాత్రమే.
తనకు తెల్సిన అమ్మాయిలు వీళ్ళిద్దరే.
వీళ్ళిద్దర్లో ఎవరు? ఇంత కవితాత్మకంగా తనని ప్రేమిస్తుందని......వికాస్ హృదయపు రహస్యపు పొరలలో ఆ ఉత్తరాలపట్ల అంతులేని మమకారం ఏర్పడింది.
మళ్ళీ ఇంకో ఉత్తరం.
"నీ సజీవ స్పర్శ ఎల్లప్పుడూ నా శరీరంపై ఉంటుందని తెలిసి నా శరీరాన్ని దేవాలయంలా పరిశుద్దంగా ఉంచుకోడానికి యత్నిస్తాను. అసత్యాన్ని మనస్సులో అడుగుపెట్టనివ్వక అల్లంత దూరంలో ఉంచుతాను. నా మనో మదిరంలో హేతుజ్యోతిని వెలిగించిన సత్యానివి నీవు.
నా హృదయాంతరంలో నీ పీఠం ఉన్నదని తెలిసి, దుష్టత్వాన్ని చేరనివ్వక నా హృదయాన్ని ఎల్లప్పుడూ నవవసంత ప్రేమారామంగా ఉంచుకుంటాను.
నేను చేసే ప్రతి పనిలో నీవే ప్రతిఫలించాలని నా కోరిక. నీకు ప్రతి ఫలిస్తేనే కదూ- నాకు ఏపని చేయాలన్నా శక్తి కలిగేది."
ఒక్కొక్క ఉత్తరం వెనక ఒక్కొక్క స్పందన.
కర్తవ్య దీక్షతో పయనించే వికాస్ అలసట హృదయానికి ఎంతో సేద!
మరో వారం రోజులకు...
సెంటు వాసన గుభాళింపులతో మరో ఉత్తరం.
నీవు నాతో ఒక్క మాటైనా మాట్లాడకపోతే, ఆ నిశ్శబ్దంతోనే నా హృదయపు పాత్రను నింపుకుని దానిని భరిస్తాను.
నిశ్చలంగా, నిశ్శబ్దంగా, తారలతో నిండిన ఈ రాత్రి బరువుగా తల వంచుకుని ఉదయం కోసం శాంతంగా వేచినట్టు నీకోసం వేచి ఉంటాను. తెల్లవారుతుంది- చీకటి విచ్చిపోతుంది. నీ గొంతుక ఆకాశంలో నుంచి బంగారు రంగుల ప్రవాహాలుగా పారుతుంది. అప్పుడు నీ మాటలకు నా గూళ్ళలోని ప్రతి పక్షి మేలుకుని పాటలను మారు పలుకుతుంది. నా అడవిలోని ప్రతి పొదలో, రెమ్మరెమ్మలో, కొమ్మ కొమ్మలో నీ మధురగీతి పూలు పూస్తుంది."