Previous Page Next Page 
ప్రేమకు పెట్టుబడి కావాలి పేజి 45


    Love has only entrance not exit.
    Love do not alters once it enter.
    Love do not hate it love.
    Love do not forget once it remember.

 

    మీతో మాట్లాడుతున్నప్పుడు మీ సున్నితమైన భావుకత వెనక గల స్పందనల్ని, నా హృదయం ఎప్పుడూ రికార్డ్ చేస్తూనే వుంది.

 

    నాకు ప్రేమంటే ఫిజిక్ గానీ, స్టెయిల్ గానీ, డ్రస్సింగ్, కళ్ళు, చిరునవ్వు, ఆకారం ఇవేవీ కావు. ఒక మనసుకి మరో మనసు ఇచ్చే శాశ్వతమైన చిరునామాయే ప్రేమని నేననుకుంటాను.

 

    చప్పుడు చెయ్యని జలపాతాన్ని మీరెప్పుడైనా చూశారా? మేఘాల సైకత వేదికపై హాయిగా పడుకుని చల్లగా ప్రపంచాన్ని పలకరించే జాబిలి స్పర్శను ఎప్పుడైనా అనుభవించారా?

 

    తేటనీటి అలలమధ్య నుంచుని, ఆ అలల్లో మన ప్రతిబింబాన్ని చూసుకుంటున్నప్పుడు-

 

    మన మనస్సు మనకు కన్పించదూ!

 

    అద్దాలతో తయారుచేసిన మనిషిని మీరెప్పుడైనా చూశారా?

 

    నేను అద్దాలతో తయారుచేసిన మంసిహిని మీరెప్పుడైనా చూశారా?

 

    నేను అద్దాలతో తయారుచేసిన మనిషిని..... పారదర్శకంలా నాలో ఆపాదమస్తకం ప్రేమను మీరు చూడొచ్చు.

 

    మీరంటే నాకిష్టం.

 

    ఎంతఇష్టమో చెప్పటానికి ఒక్కొక్కప్పుడు మాటలు వుండవు. ఇప్పుడూ లేవు.

 

    దట్టమయిన అడవి మధ్యలో నించున్నప్పుడు ఎండ వెన్నెల్లా మెరుస్తుంది. వాన చినుకులు వజ్రపు తునకలు తళుకులీనుతాయి.

 

    ప్రేమంటే మనోకాంతి....

 

    ప్రేమంటే ఒక ఆత్మజ్యోతి.....

 

    ప్రేమంటే ఆనందమయి సంక్రాంతి....

 

    మళ్ళీ చెపుతున్నాను మీరంటే నాకిష్టం....

 

    నా పేరు లేకుండా నేనీ ఉత్తరాన్ని ఎందుకు రాస్తున్నానో తెలుసా? మీరు నన్ను గుర్తించగలరనే ఆశతో.

 

    ఆమాత్రం ఐ.క్యూ మీకుందని నాకు తెల్సు.

 

    మన ఫ్యూన్ ద్వారా ఈ ఉత్తరాన్ని మీకు పంపుతున్నాను.

 

    మీరు నన్ను అభిమానిస్తే ఈ రోజు సాయంత్రం నాలుగుగంటలకు కాలేజీ ఆడిటోరియం దగ్గరకు రండి.

 

    నేనెవరో మీకు తెలుస్తుంది.

 

    మీకోసం నిరీక్షిస్తూ."

 

    గమనిక:-

 

    డియర్ అన్వితా! కొన్ని నెలల క్రితం మీకు రాసిన ఉత్తరం ఇది- ఇది మీ చేతికి అందకుండా కాలేజీలో గందరగోళం రేపింది.

 

    అదే ఉత్తరాన్ని మళ్ళీ నేను మీకు పంపుతున్నాను.

 

    చాలా ప్రేమలు మధ్యవర్తులు ద్వారా విఫలమౌతాయి.

 

    నా విషయంలో కూసా అదే జరిగింది.

 

    మీ వ్యక్తిత్వాన్ని నేనెప్పుడూ కించపరచలేదు.

 

    మీ ప్రేమకోసం-

 

    నేను నా తల్లితో అబద్ధాలాడాను.. పిసినారితనము, కోపమే తప్ప ఆలోచనలేని నా తండ్రిని మోసగించాను.

 

    మైదానం నారాయణ అమాయకత్వాన్ని ఆసరా చేసుకుని డబ్బు సంపాదించాను.

 

    మీ ప్రతిక్షణం కదలికలు తెల్సుకుని, మీ అభిరుచులకు, అంచనాలకు ఇష్టా ఇష్టాలకు దగ్గరగా రావాలని అనుక్షణం తపించాను.

 

    అందుకు డిటెక్టివ్ ని వినియోగించాను.

 

    అతనే తేజ, రవితేజ!

 

    అతనూ మిమ్మల్ని దక్కించుకోవాలని నన్ను మోసం చేశాడు.

 

    పోనీలెండి....

 

    ప్రేమ, ప్రేమను ప్రేమిస్తుంది.

 

    దూరంగా వెళ్ళిపోతాను.

 

    సుదూరంగా....

 

    మీరు నా ప్రేమని నా నుంచి దూరం చెయ్యగలరుగానీ, నా జ్ఞాపకాల్ని చెయ్యలేరుకదా...

                                                                                                          

                                                                                                                 మీ    
                                                                                                                మధు.

    
    ఆ ఉత్తరాన్ని మరోసారి చదువుకున్నాడు.

 

    అతనికిప్పుడు చాలా సంతోషంగా వుంది.

 

    "ఇదే నీ ఆఖరు నిర్ణయమా....? అడిగాడు సుల్తాన్.

 

    "అవును......." అన్నాడు మధు.

 


                                          *    *    *

 

    సోఫాలో చేరబడి పడుకుంది అన్నపూర్ణమ్మ. అంతవరకూ ఆమె చేతిలో వున్న కుక్కపిల్ల కిందకు గెంతి అటూ ఇటూ పరిగెడుతోంది.

 

    "రాములమ్మా...... దీనికి పాలుపట్టు......." పనిమనిషికి వినబడేటట్టుగా అరిచింది అన్నపూర్ణమ్మ.

 

    రాములమ్మ కుక్కపిల్లని పట్టుకోడానికి దానివెనక పరుగులు తీస్తోంది.

 

    డ్రాయింగ్ రూమ్ లో అటూ ఇటూ పరుగెడుతూ, గోడపక్కన నక్కింది కుక్కపిల్ల.

 

    అక్కడ గోడమీద చిన్న మచ్చలు వున్న వస్తువేదో కనిపించడంతో గోటితో దాన్ని గీకడంతో, అది కిందపడింది.

 

    దానిలోంచి 'బర్, బర్' మని చప్పుడు వస్తుండడంతో పనిమనిషి భయంగా నుంచుండిపోయింది.

 

    "అమ్మా...." అని అన్నపూర్ణమ్మను పిలిచింది.

 

    అదే సమయంలో మేడమీంచి దిగుతున్న అన్విత, కుక్కపిల్ల వేపు తిరిగి కిందపడిన బటన్ ని అందుకుని చూసింది.

 

    ఆమెకు కొంతలో కొంత అర్థమైంది.

 

    ఏదో మాట్లాడబోతున్న అన్నపూర్ణమ్మను, రాములమ్మను వారించి నెమ్మదిగా పైకివెళ్ళి, కిటికీలోంచి రోడ్డువైపు చూసింది.

 

    ఆమె అంచనా కరెక్ట్!

 

    గబగబా కిందకొచ్చి. ఆ బటన్  దొరికిన ప్రాంతంలో చూసింది ఇంకో బటన్ వుంది.

 

    అన్ని గదుల్నీ వెతుకుతోందామె.

 

    తన బెడ్ రూమ్ లో రెండు బగ్స్  కనిపించడంతో ఆమెకు విషయం అర్థమైపోయింది. బగ్స్ ని అక్కడే వుంచి-

 

    సెక్యూరిటీ వాచ్ మెన్  రూమ్ లోకి వెళ్ళి-

 

    డాక్టర్ కు ఫోన్ చేసింది.

 

    ఆయన పావుగంటలో అక్కడకొచ్చాడు.

 

    అన్విత చెపుతున్నదేమిటో ఆయనకు మొదట అర్థంకాలేదు.

 

    తర్వాత మారుతీకారుని ఆ కారులో కూర్చుని మేసేజాస్ ని రిసీవ్ చేసుకుంటున్న తేజను చూపించడంతో-

 

    ఆయన ఒక్కక్షణం ఆశ్చర్యపోయి-

 

    వాచ్ మెన్  రూమ్ లోంచి తనకు తెల్సిన త్రీటవున్ సర్కిల్ ఇన్స్ పెక్టర్ కి ఫోన్ చేశాడు డాక్టర్.

 

                                                           *    *    *

 

    సాయంత్రం నాలుగు గంటలు.....

 

    ఆటో దిగి అన్విత ఇంట్లోకి అడుగుపెట్టాడు మధు.

 

    "ఏం బాబూ! నీ నిర్వాకం ఇంకా ఒకటుండిపోయిందా? నువ్వు దేనికొచ్చావ్?" లోపలికి అడుగుపెడుతూనే భీకరంగా వినిపించిన ఆ ప్రశ్నకు ఒకింత అవాక్కయ్యాడతను.

 

    సోఫామీద  కూర్చుని, కోపంగా తనవైపే చూస్తున్న అన్నపూర్ణమ్మవైపు చూశాడు.

 

    "అన్వితను కల్సుకోడానికొచ్చాను....." అన్నాడు మెల్లగా.

 

    "అన్వితకు మీ స్నేహలేవీ అక్కర్లేదు! ఎవర్నీ కలవదు- వెళ్ళు" ఖరాఖండీగా చెప్పిందామె.

 

    అలాగే నిలబడ్డాడు మధు.

 

    ఇన్ని నెలలు ధైర్యం వున్నా, బయటకు చెప్పలేక సమస్యల్లో ఇరుక్కున్న నీకు ఇప్పటికీ పిరికితనం పోదా?

 

    రా....పిరికితనంలోంచి బయటికి రా.....

 

    మొహమాటంలోంచి బయటకు రా.....

 

    కమాన్..... నీలో ఆత్మవిశ్వాసం లేదా?

 

    మనసు వెక్కిరిస్తోంది మధును.

 

    "నేను అన్వితను కలిసే ఇక్కడనుంచి వెళతాను...." మెట్లవేపు చూసి అన్నపూర్ణమ్మ వారిస్తున్నా విన్పించుకోకుండా మెట్లపైకి పరుగెత్తాడు మధు-

 

    "ఏయ్..... అతన్ని..... ఆపండి......" అరుస్తోందామె.

 

    సముద్రం నుంచి వచ్చే గాలి  చల్లగా వుంది.

 

    మబ్బులు పట్టిన ఆకాశం ఏ క్షణంలోనైనా వర్షం కురవడానికి సిద్ధంగా వుంది. అన్నపూర్ణమ్మ చేసిన కేకకు, తన బెడ్ రూమ్ లోంచి బైటకొచ్చిన అన్విత మెట్లెక్కి వస్తున్నా మధువైపు బిత్తరపోయి చూసింది.

 

    సంపెంగ రంగుచీర, జాకెట్టు, లిప స్టిక్  పూసుకున్నట్లున్న పెదాలు.....

 

    "అన్వితా! మీకంభ్యంతరం లేకపోతే, ఒకే ఒక విషయాన్ని చెప్పడానికొచ్చాను...." ఆమె కళ్ళల్లోకి సూటిగా చూస్తూ అన్నాడు మధు.

 

    "దయచేసి నాకేం చెప్పొద్దు! నాకు వినే ఓపిక లేదు. దయచేసి క్షమించండి" అది రెండు చేతులూ ఎత్తి నమస్కరిస్తూ- ఆ విషయంలో ఆమెకు చాలా బాగా అలిసిపోయింది.

 

    "ప్లీజ్! ఒక్కక్షణం....." అభ్యర్థించాడతను.

 

    సరిగ్గా అదే సమయంలో వర్షం కురవడం ప్రారంభమైంది. సన్నగా కురిసిన వర్షం అంతలోనే దట్టమైంది.

 

    బెడ్ రూమ్ వరండాలో అన్విత నిలబడింది.

 

    స్విమ్మింగ్ ఫూల్ ఒడ్డున మధు నించున్నాడు.

 

    అతను వర్షంలో తడుస్తున్నాడు.

 

    "వాచ్ మెన్! ఇతడ్ని బయటికి గెంటెయ్" అరుస్తూ పైకి రాబోయిన అన్నపూర్ణమ్మకు-

 

    పోర్టికోలోకి రెండు కార్లు వచ్చి ఆగడం, అందులోంచి బిలబిలమంటూ రవి, రమణ, షాజహాన్, బుచ్చిబాబు, అనురాగ్ దిగడం వాళ్ళు లోపలికి గబగబా వచ్చి మెట్లెక్కడంతో-

 

    ఏం జరుగుతుందో తెలీక  ఆశ్చర్యంగా నిలబడిపోయిందామె.

 

    "వీడు కూడా టైమ్ కి ఇక్కడే వున్నాడు" అని మధుకి కొంచెం దూరంలో నిలబడ్డాడు రవి.

 

    ఆ పక్కన రమణ, షాజహాన్, బుచ్చిబాబు..... కొంచెం దూరంలో అన్వితకు దగ్గరగా అనురాగ్.

 

    వర్షం కుండపోతగా కురుస్తూనే వుంది.

 

    "అన్విత.... దిసీజ్ లాస్ట్ డే........దాగుడుమూతలు కట్టేసెయ్. అన్ని ఏర్పాట్లు చేసొచ్చాను. బట్టలు మార్చుకో" అన్నాడు రవి.

 

    "దేనికి?"

 

    "రిజిష్టర్ ఆఫీస్ లో మన పెళ్ళికి...." కఠినంగా  వుంది అతని గొంతు.

 

    "నాన్సెన్స్! నీతో నా పెళ్ళేమితి?" అరిచింది అన్విత.

 

    "అనురాగ్ కూడా ఒప్పుకున్నాడు....." అన్నాడు రమణ.

 

    "అసలుమీరంతా ఎవరు? మీకు నామీద ఉన్న  హక్కేమిటి?"

 

    "నిన్ను ప్రేమించడమే నాహక్కు" అన్నాడు రవి!

 

    "ప్రేమ.... అసలు ప్రేమంటే.... అర్థం తెలుసా?" ఆగ్రహావేశాలతో అంది అన్విత.

 

    "మర్యాదగా పద...." ఆమె చెయ్యి పట్టుకోడానికి ముందుకు నడిచాడు రవి.

 Previous Page Next Page