సడన్ అడ్డు వెళ్ళి నుంచున్నాడు అనురాగ్.
"మిస్టర్ రవి! నిన్ను నేను సపోర్టు చెయ్యడం ఒక నాటకం.... తప్పమ్మా- రోడ్డుమీద రోమియోకి, ఒక కోటీశ్వరురాలిని వదిలేసేటంత అమాయకుడు, పిచ్చివాడు కాదు ఈ అనురాగ్. అందుకే నా జాగ్రత్తలో నేనున్నాను. ఇప్పుడే ఐజికి ఫోన్ చేశాను. మరొక్క క్షణంలో మీరిక్కడ నుంచి వెళ్ళకపొతే..... కటకటాలు లెక్కపెట్టాల్సి వస్తుంది."
తమతో కల్సికట్టుగా వుంటూ, అన్వితను తనకిచ్చి చేయటానికి ఐదులక్షలు తీసుకున్న అనురాగ్ నమ్మకద్రోహానికి బైర్లు కమ్మాయి రవికి, మిగతా బృందానికి.
జరుగుతున్న పరిణామాలకు నిర్ఘాంతపోతున్నాడు మధు.
అక్కడ్నించి ఎలా తప్పించుకోవాలో ఆలోచిస్తుంది అన్విత.
* * *
తనమీద పోలీస్ రిపోర్ట్ ఇచ్చారని, మరికాసేపట్లో అక్కడకు వస్తారని తెలీని తేజ, మైక్రోఫోన్ పనిచెయ్యకపోవడంతో, వర్షానికి పాడైందనుకుని కారెక్కి బైనాక్యులర్ ఆ దృశ్యాన్ని చూస్తూ ఆనందిస్తున్నాడు.
వాళ్ళూ-వాళ్ళూ కొట్టుకు చస్తారు.
'ఆఖరికి అన్విత తనకు దక్కుతుంది' అనుకున్నాడు చాలా ఆనందంగా.
* * *
"అన్వితా! రెండే రెండు నిమిషాలు టైమిస్తున్నాను ఆలోచించుకో" అరచి చెప్పాడు రవి.
"అంత సీన్ లేదు! ఇదిగో చూడు" అంటూ జేబులోంచి ఓ పాకెట్ తీసి, అందులోంచి పెళ్ళికార్డుల్ని తీసి అందరివైపూ విసిరి-
"పెళ్ళికార్డులు కూడా వేయించేశాను..... అన్విత నాది" అన్నాడు అనురాగ్.
ఎక్స్ రేలోలా బయటపడుతున్న ఒక్కొక్క వ్యక్తిత్వం వెలిజిముతున్న విషంకన్నా ప్రమాదకరంగా వుంది.
"అన్వితా- మర్యాదగా నాతోరా! లేకపోతే" అంతవరకూ బనీన్లో దాచిన పిస్టల్ తీసి, అనురాగ్ కి గురిపెట్టాడు.
"అనురాగ్! నువ్వు తప్పుకో..... ఇప్పటికే నామీద రెండు మర్డర్ కేసులున్నాయి" క్రూరంగా నవ్వుతూ అన్నాడు రవి.
అన్విత ఆ పిస్టల్ చూసి భయపడి, వెనకడుగు వేయబోయింది.
"అన్వితా! కదిలితే కాల్చేస్తాను" అన్నాడు రవి.
మధు అన్వితవైపు, రవివైపు ఒకసారి చూసి బాణంలా ముందుగా దూసుకొచ్చి, పిస్టల్ ని ఎగిరి తన్నాడు. ఆ పిస్టల్ ఎగిరి స్విమ్మింగ్ ఫూల్లో పడిపోయింది.
ఆ పిస్టల్ ను అందుకోడానికి ముందుకు పరుగెత్తి మధుమీద పడ్డాడు రవి. అనురాగ్ పరుగెత్తాడు. అతన్ని అడ్డుకున్నారు రమణ, షాజహాన్, బుచ్చిబాబు.
మధు మీదపడి కాళ్ళతో కుమ్ముతున్నాడు రవి.
మధు ప్రతిఘటిస్తున్నాడు.
"అన్వితా..... వెళ్ళిపో..... ఇక్కడుండటం క్షేమం కాదు" అరుస్తున్నాడు మధు.
అయినా షాక్ లో వుండి ఆమె వెళ్ళలేదు.
ఒక్క ఉదుటున రవిని పక్కకు తోసేసి, అన్వితవేపు పరుగెత్తి, ఆమె చెయ్యి పట్టుకొని, కిందకు వెళ్ళబోయిన మధుని వెనక్కి లాగాడు.
వరండామీద పడిపోయాడు మధు.
అతని జేబులోని ఉత్తరం, ఏవో కాగితాలు, రూపాయినోట్ల కింద పడిపోయాయి.
కిందపడిపోయిన మధుని, అన్వితవైపు వెళ్ళకుండా కాళ్ళని లాగి ఈడుస్తున్నాడు రవి.
"అన్వితా! పారిపో..... పారిపో....." అరుస్తున్నాడు మధు.
భయవిహ్వలిత అయిపోయి నిలబడిపోయిందామె.
సరిగ్గా-
అప్పుడు-
మధు జేబులోంచి నేలమీద పడిన ఉత్తరం, మిగతా వస్తువులవైపు చూసింది. గాలి కెగురుతూ, తడుస్తున్న ఆ ఉత్తరం పైభాగంలో 'అన్వితకు' అన్న అక్షరాలు ఆమెకు కన్పించగానే-
ఆ ఉత్తరాన్ని అందుకుందామె.
మధు స్విమ్మింగ్ ఫూల్ లోని పిస్టల్ ని అందుకుని, అందరివైపు గురిచూసి-
"కిందకు దిగండి...... లేకపోతే కాల్చేస్తాను."
అతని వంటినిండా నెత్తురు మరకలు. నీళ్ళలో తడుస్తున్నాడు.
ఈ ఆకస్మిక పరిణామానికి బిత్తరపోయిన రవి, అనురాగ్, రమణ షాజహాన్, బుచ్చిబాబు-
మహారుద్రుడిలా నుంచున్న మధువేపు చూస్తూ మెట్లు దిగుతున్నారు.
"మీరు పోలీసులకి ఫోన్ చెయ్యండి" అరిచాడు అన్నపూర్ణమ్మ వైపు చూస్తూ.
అన్విత ప్రస్తుతం ఈ లోకంలో లేదు.
ఆ ఉత్తరం చదవడంలో నిమగ్నమైపోయింది.
"హలో.... పోలీస్ స్టేషన్" అన్నపూర్ణమ్మ భయంగా అరుస్తున్న గొంతు ఆ వర్షంలో ప్రతిధ్వనిస్తోంది.
* * *
మారుతీకారు పక్కనే పోలీస్ వ్యాన్ ఆగడం, అందులోంచి డాక్టర్ కాళీ, సర్కిల్- ఇన్ పెక్టర్, పోలీసులు దిగడంతో వాళ్ళని చూసిన డిటెక్టివ్ తేజా, కారుమీంచి దూకి ముందుకు పరుగెత్తబోయాడు.
కాని సర్కిల్ ఇన్స్ పెక్టర్ ఒక్క ఉదుటున లంకించుకుని తేజను పట్టుకుని జీపులోకి తోసేశాడు.
వాచ్ మెన్ పరుగు, పరుగున లోపల్నుంచి రావడం, డాక్టర్ కాళీతో జరుగుతున్న విషయం చెప్పడంతో-
"హర్రీయప్ మిస్టర్ ఇన్స్ పెక్టర్" బిల్డింగ్ వైపు పరిగెత్తాడు కాళీ.
* * *
"ఒరేయ్ రవీ, మిస్టర్ అనురాగ్..... మీరు ప్రపంచంలో ప్రతీ వస్తువూ డబ్బుకు వచ్చేస్తుందనుకునే వాళ్లు..... తల్లి పాలను కూడా డబ్బుతో కొనగలిగే ధీమా మీది. మీకు ప్రేమ విలువ తెలీదు.....
జన్మ జన్మలకి తెలీదు.....
ఇవాళ చెప్తున్నాను అన్వితా, అన్నపూర్ణమ్మగారూ.... అందరూ వినండి-
I LOVE ANVITA..... అవును, అన్వితను నేను నా తల్లీ, తండ్రీకంటే ఎక్కువ ప్రేమించాను- ప్రేమిస్తున్నాను- ప్రేమిస్తాను. ఆవిడ నన్ను ప్రేమించకపొయినా ఫర్వాలేదు. ఈరకంగా అన్వితకు డైరెక్ట్ గా స్పష్టంగా నా మనసులోని భావాన్ని, ధైర్యంగా చెప్పగలిగే అవకాశం ఇచ్చినందుకు మీకందరికీ థాంక్స్."
ఒకపక్క ఉత్తరం చదువుతూనే క్రీగంట మధువైపు చూస్తోంది అన్విత.
"ఒరేయ్ రవీ! మారణాయుధాలతో మనుషుల్ని శాసించాలనుకోవడం నీ పిచ్చితనానికి నిదర్శనం.
ప్రేమించడం గొప్పకాదు- ప్రేమను ఆరాధించు.
మై డియర్ ఫ్రెండ్స్..... మీకు కూడా చెప్పే సలహా ఇది" ఆవేశంగా చెప్పి, కళ్ళెత్తి ఒకసారి అన్వితవైపు చూసి-
"అన్విత! గుడ్ బై" అంటూ చేతిలోని పిస్టల్ ను విసిరేసి, వెనక్కి తిరిగాడు మధు.
అదే సమయంలో పోలీస్ సర్కిల్ ఇన్స్ పెక్టర్, డాక్టర్ కాళీ, వాచ్ మెన్ లోపలికి ప్రవేశించారు.
* * *
ఉత్తరం పూర్తిచేసిన అన్విత కిందకు చూసింది. ఆ ఉత్తరంలోని ఆర్థ్రతకు ఆమె హృదయం చలించిపోయింది.
కిందకు వంగింది. మిగతా కాగితాలు అందుకుంది.
ఆ కాగితాల మధ్య బ్రౌన్ కలర్లో చిన్న కవర్. ఆ కవర్లోంచి బయటకు తొంగిచూస్తున్న చిన్న ఫోటో.
ఆసక్తిగా ఆ ఫోటోని బయటకు తీసింది.
అది ప్రేమ ఫోటో....
మధు చిన్ననాటి "సీగానా ప్రసూనాంబ' ప్రేమ ఫోటో.
ఎప్పుడో మధు గుండెల్లో దాగిన జ్ఞాపకాల బాల్య పారిజాత పరిమళం-
అన్విత కళ్లంట నీళ్ళొచ్చాయి.
"నాన్నమ్మా" ఆమె ఉద్వేగం ఆపుకోలేకపోతోంది.
"మధూ- మధూ- మధూ....." పిచ్చిగా అరిచింది.
గబగబా మెట్లు దిగింది.
డ్రాయింగ్ రూంలోని మనుషుల్ని తోసుకుని పోర్టికోలో కొచ్చింది.
వర్షం.... వర్షం.... వర్షం ధారలుగా కురుస్తున్న వర్షం.....
సముద్రాన్నీ, ఆకాశాన్ని కలిపేస్తున్న వర్షం.
ఆ వర్షంలో దూరంగా-
నిర్జనమైన రోడ్డుమీద నడిచివెళ్ళిపోతున్న మధు.
"మధూ...." పిలుస్తూ పరిగెడుతోంది.
రోడ్డుకి ఒక చివర మధు. రెండో చివర అన్విత.
ఈదురుగాలిని చీల్చుకుంటూ వచ్చిన ఆ పిలుపుకి తలతిప్పి చూశాడు మధు.
అతనికి ఆశ్చర్యంగా వుంది. అతని మనసులో వర్షం.
అతని కళ్ళల్లో కన్నీటి వర్షం.....
నీళ్ళ ముద్దలా వెళ్ళి మధు ఎదురుగా నుంచుంది అన్విత.
ఆమెకు గొంతు పెగలడం లేదు. మాటలు రావడంలేదు.
ఆమె కనురెప్పలు వర్షానికి ఆల్చిప్పల్లా మెరుస్తున్నాయో, కన్నీళ్ళలో తడిసి ఆల్చిప్పళ్ళా మెరుస్తున్నాయో తెలీదు.
ఆమె చేతిలో వున్న చిన్న ఫోటోవేపు చూశాడతను.
"మధూ.... మధూ....
నేను.... నేను..... ప్రేమను..... ప్రేమాన్విత..... అన్వితను.....
నీ చిన్ననాటి ప్రేమను."
ఆమె గొంతు బొంగురుపోయింది.
మధు గుండెల మీద వాలిపోయింది.
వాళ్ళిద్దరూ వర్షంలో తడుస్తున్నారు.
"నువ్వు..... నువ్వు....."
ఉద్వేగాన్ని తట్టుకోలేకపోతున్నాడు మధు.
"ప్రేమవా..." ఆ మాటలు ఆ గొంతులో కొట్లాడుతున్నాయి.
ఆ క్షణంలో భాష మూగదైపోయింది.
భావం మూగదైపోయింది.
ఒక్కసారి ప్రేమను గుండెలకు హత్తుకున్నాడు మధు.
వర్షం కురుస్తూనే వుంది.
అతని పెదాలు, ఆమె పెదాలను సుతారంగా తాకాయి.
ఆ స్పర్శకు ప్రకృతి పులకించింది.
ప్రేమ ఒక తేజస్సు..... అనంతమైన హృదయకాంతితో ప్రపంచానికి వెలుగునిచ్చే శాశ్వతమైన హేతువు ప్రేమ. ప్రేమ మార్కెట్ లో దొరికే ముడిసరుకు కాదు. నిజమైన ప్రేమకు నిలయం హృదయం.
ప్రేమకు అసలైన పెట్టుబడి స్వచ్ఛమైన మనసే.....
LOVE IS GOD
GOD IS HEART
(శుభం)