అన్వితను తలనుకుని గాల్లోకి విసిరాడు. గుప్పిట్లో పడింది.
గుప్పిట మూశాడు.
ఆ గుప్పిటను తెరవడానికి భయంగా వుందతనికి.
నెమ్మదిగా తెరిచాడు.
బొమ్మ.... బొమ్మ... బొమ్మ....
తన కళ్ళను తనే నమ్మలేకపోయాడు మధు.
అతని కళ్ళల్లో అంతులేని వెలుగు..... కొండంత వెలుగు.
దిగుల్ని, నీరసాన్ని తరిమేసే ప్రేమమయమయిన వెలుగు.
ఇరవయ్యో కాయిన్ ని తీసుకున్నాడు.
ప్రేమ చిన్ననాటి ఫోటోవైపు చూశాడు.
ప్రేమ బతికే వుందా? ప్రేమ, తను ఎప్పటికైనా కలుసుకుంటారా?
అన్నీ చిత్రమయిన ప్రశ్నలు.
ఆ రూపాయి నాణాన్ని గాల్లోకి ఎగరేసి, పట్టుకుని, గుప్పిట మూశాడు.
భారంగా ఉచ్ఛ్వాసను వదిలి-
గుప్పిటను తెరిచాడు.
బొమ్మ.... బొమ్మ... బొమ్మ..
"య్యాహూ....." ఒకసారిగా అరిచాడు.
గోదావరి నీళ్లలో బుడుంగుమని మునిగి టెలి, ఒడ్డున వచ్చిన ఇసక మీద కబుర్లాడుకున్న చిన్ననాటి దృశ్యం-
ప్రేమ కలుస్తుందా?
నిజమా!
ఆ రెండు రూపాయి నాణాల్ని కళ్ళకద్దుకున్నాడు ప్రేమగా.
ఆర్ద్రంగా.....
అతని కళ్ళు అశ్రుపూరితాలయ్యాయి.
ప్రేమకు చాలా శక్తి వుంది.
ప్రేమ ఒక జలపాతమయితే, దాని పవర్ విద్యుత్ కన్నా గొప్పది.
ప్రేమ ఒక అందమైన పుష్పమైతే దాని సున్నితత్వం పరిమళం కన్నా గొప్పది.
యుగయుగాలుగా ప్రేమకోసం, నిజంగా పరితపించి ప్రాణాలు తీసుకుని, విఫల మనోరధానికి సమాధులుగా నిలిచినా ప్రేమికుల ఆత్మలే అందుకు సాక్ష్యాలు.
కాలం రకరకాలుగా ప్రేమకు భాష్యం చెప్పినా, ప్రేమకు ఎప్పుడూ సాక్షి ఆత్మే.... ఆత్మే దాని పెట్టుబడి.
చాలా ఉత్సాహంగా వుంది మధు మనసు.
అతని మనసుకు రెక్కలొచ్చాయి.
అవి ఊహల్లో ఎగురుతున్నాయి.
* * *
అన్నపూర్ణమ్మ దేవాలయానికి వెళ్ళింది శ్రావణిని తీసుకుని.
అన్వితకు మనసెందుకో బాగోలేదు.
అనవసరంగా వైజాగ్ వచ్చిందనుకుందామె.
మధు, రవి, తేజ, అనురాగ్, పరశురామ్...... ఇంతమంది మగవాళ్ళ మధ్య.
తను.....
మగ స్వరూపం అర్థమైపోయింది.
స్వార్థం...... నిలువెత్తు స్వార్థం.
అభిమానాన్ని, అర్థం చేసుకొని స్వార్థం.
వికృతమైన ఆలోచనల స్వార్థం.
ఆడది కామించే వస్తువే తప్ప, ప్రేమించే వస్తువు కాదా.....? ప్రపంచంలో మనసుతో, మనసుని ప్రేమించే నిజమయిన, శాశ్వతమయిన ప్రేమలేదా?
రకరకాలుగా వున్నాయి అన్విత ఆలోచనలు.
కాలింగ్ బెల్ మోగింది.
తనే స్వయంగా డోర్ తెరిచింది.
ఎదురుగా పరశురామ్.
అతని పెదవుల మీద చిన్న నవ్వు.
"నాన్నమ్మగారు లేరా?"
"లేరు. టెంపుల్ కి వెళ్ళారు....."
చాలా మంచి అవకాశం అనుకున్నాడు పరశురామ్.
సినిమాల గురించి, వరల్డ్ కప్ గురించి..... ఇలా పావుగంటసేపు మాట్లాడుకున్నాక-
తన మనసులో భావాన్ని చెప్పెయ్యాలనుకున్నాడు డాక్టర్ పరశురామ్.
సరిగ్గా అదే సమయంలో పోర్టికోలో కారాగింది.
అనురాగ్ కారుదిగి, పక్కనే వున్న మారుతీ కారు వేపు చూశాడు.
ఆ కారు పరశురామ్ డని అతనికి తెల్సు.
నెమ్మదిగా ముందుకు నడిచాడు. కిటికీలోంచి డ్రాయింగ్ రూమ్ వేపు చూశాడు.
వెలుతురులో వున్న వాళ్ళిద్దరూ, చీకట్లో వున్న అనురాగ్ కి కన్పిస్తున్నారు.
సరిగ్గా అదే సమయంలో పరశురామ్, తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నాడు.
"చూడండి.... అన్వితా.... నేను మీతో ఒక విషయం చెప్పాలను కుంటున్నాను. కొన్నినెలలుగా అన్ని విధాలుగా ఆలోచించిన మీదట చెపుతున్న విషయం ఇది...... మీకు నా ప్రపోజల్ నచ్చితే 'ఎస్...' అని చెప్పండి. నచ్చకపోతే 'నో' అని చెప్పండి. ప్రేమ ఎప్పుడూ ముసుగులో వుంచిన బొమ్మ కాకూడదు."
అతను ఏం చెప్పబోతున్నాడో చూచాయగా అర్థమైనా, పరశురామ్ నోటి నుంచి ఎలాంటి విషయం వస్తుందోనన్న ఆందోళన ఆమెలో చోటుచేసుకుంది.
"నేను కుంటివాడిని..... కానీ డాక్టర్ గా జీనియస్ ని. నేనొకప్పుడు పేదవాడిని...... కానీ ఇప్పుడు లక్షాధికారిని. ఒక ఆడపిల్లకు ఏం కావాలో నాకు తెలుసు. డబ్బు కావాలి..... ఇంకొకటి..... డాక్టరుగా ఎంతోమంది స్త్రీల మనస్తత్వాలు నాకు తెల్సిన మీదట చెపుతున్న విషయం.
స్త్రీలు కోరుకునేది మగతనం.
సుఖం దొరకని స్త్రీ పిచ్చిదయిపోతుంది. స్త్రీ కోరుకునే లైంగిక సుఖం అందకపోతే, డబ్బును నీర్థ్వంద్వంగా తిరస్కరిస్తుంది" చెప్పడం ఆపి, ఆమె ముఖంలోకి చూశాడు డాక్టర్ పరశురామ్.
"ఇవన్నీ నాకెందుకు చెపుతున్నారు?" అడిగింది అన్విత. అతను చెపుతున్న మాటలు అసహ్యంగా వున్నాయి ఆమెకు.
"నాలో అద్భుతమైన మగతనం వుంది. స్త్రీ తానకు తానుగా పరిపూర్ణంగా ఆవిష్కరించుకునే అద్భుతమైన పురుష శక్తి నా దగ్గరుంది. ఇదంతా ఎందుకు ఇంత స్పష్టంగా చెపుతున్నానంటే.... మీతోనే చెప్పాలి గనుక. మీకు తెలియాలి గనుక. సమయం, సందర్భం వచ్చింది కనుక. నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను గనుక. మీరు లేకపోతే నాజీవితం చీకటి అయిపోతుంది కనుక....." ఆవేశంగా చెప్పుకుపోతున్నాడు డాక్టర్ పరశురామ్.
ఎర్రని అన్విత ముఖం ఎన్నెన్నో భావాలు చోటుచేసుకున్నాయి.
జవాబు ఎలా చెప్పాలో తెలీని ఆ సందిగ్ధ పరిస్థితి.
"మిమ్మల్ని నేనెప్పుడూ అలా భావించలేదు.... మీరు, డాక్టర్ కాళీ అంకుల్ ఒక్కటే అనుకున్నాను....." సాధ్యమైనంతగా తనను తాను కంట్రోల్ చేసుకుంటూ అంది అమె.
బయట నుంచి ఆ మాటలన్నిట్నీ వింటున్న అనురాగ్, సరైన సమయం కోసం ఎదురుచూస్తున్నాడు. అన్విత ప్రమాదంలో పడితే తను రక్షించాలని అతని తపన.
పరశురామ్ లేచి నిలబడ్డాడు.
"మిస్.... అన్వితా... You are always on my heart. without you every thing is dark to me" ముందు నడుస్తూ అన్నాడు.
"Don't behave like a illiterate fool......" వెనక్కి జరుగుతూ అంది.
పరశురామ్ ఆ తిరస్కారాన్ని భరించలేకపోయాడు.
"చూడు..... అన్వితా..... నేను చాలా ఫస్టేషన్ లో వున్న వ్యక్తిని. నిన్నెలా దక్కించుకోవాలో నాకు తెలుసు. నీకోసం మర్డర్ చేస్తాను..... ఎవర్ని చేస్తానో తెలుసా?"
"ఎవర్ని? నన్నా!" అంది భయంగా అన్విత.
మనుషులు ఎంత క్రూరంగా వుంటారో ఆమెకు అర్థమైపోయింది.
"కాదు- నేను డాక్టర్ని కదా- మీ నాన్నమ్మకు త్ర్రేట్ మెంట్ చేస్తున్న డాక్టర్ని. నిన్ను బ్లాక్ మెయిల్ చేస్తేనే గానీ నువ్వు లొంగవు. తప్పదు. నా ప్రేమను దక్కించుకోవడం కోసం మర్డర్ తప్పదు. మీ నాన్నమ్మ స్లోగా, స్లో పాయిజన్ కు గురవుతుంది. గుర్తుంచుకో. అదీ రెండు గంటలలోపు నీ నిర్ణయం నాకు చెప్పకపోతే- వస్తా-" అంటూ వెనుదిగిగాడు పరశురామ్.
ఏదో చెప్పబోయి ఆగిపోయింది అన్విత.
ఎదురుగా అనురాగ్!
అనురాగ్ ఏమాత్రం ఆలస్యం చేయకుండా పరశురామ్ దగ్గరికి సూటిగా దూసుకొచ్చి అతని కలర్ ని పట్టుకుని-
ఫడేల్, ఫడేల్మని అతని చంపల్ని వాయించేసి, మెద పట్టుకుని గేటు వరకూ బరబరా లాక్కొచ్చి-
"వాచ్ మెన్" అని కేకశాడు.
వాచ్ మెన్ పరుగు పరుగున వచ్చాడు.
"వీడిని, ఆ కారుని బయట పడేయండి" అరిచాడు.
ఆ దృశ్యాన్ని విస్తుపోతూ చూస్తోంది అన్విత.
"సీ మిస్టర్! ఐ విల్ సీ యువర్ ఎండ్" అరుస్తూ కారెక్కి స్టార్ట్ చేశాడు పరశురామ్.
అప్పటివరకూ కర్ర సహాయంతో, అంగవైక్యలం ఉన్నవాడిలా, కుంతివాడిలా నడిచిన డాక్టర్ పరశురామ్ అనురాగ్ అతనితో ఘర్షణ పడగానే చంకలో వున్న ఊతాన్ని గాల్లోకి విసిరేసి ఠీవిగా, దర్జాగా నడుచుకుంటూ వెళ్ళిపోయాడు, అంటే .....తను పరశురామ్ కి అంగవైకల్యం వుందని తెలిస్తే ఆ జాలితో తనను ప్రేమిస్తానని ఆశించి వుంటాడు. ఎంత దారుణం? ఎంత మోసం? ఎంత దగా? ఓ అమ్మాయిని సొంతం చేసుకోవటానికి ఒక మగవాడు ఇన్ని నాటకాలాడతాడా? ఆ క్షణాన ఆమెకు చాలా బాధ పడింది.
మరికొద్ది నిమిషాల్లో ఆ కారు గేటు బయటకు వెళ్ళిపోయింది.
వెళ్ళిపోతున్న ఆ కారువేపు ఒక్కక్షణం చూసి వెనుదిరిగి అన్విత దగ్గరకొచ్చి-
"నేను రాకపోతే ప్రమాదంలో చిక్కుకునేదానివి అవునా? ఇప్పటికైనా చెప్పు నన్ను పెళ్ళి చేసుకుంటానని" అన్నాడు అనురాగ్.
ఒక్కొక్కడూ ఒక్కో మేకవన్నెపులిలా అన్పించాడు ఆమెకు.
అందుకే ఆమె అనురాగ్ ప్రశ్నకు సమాధానం చెప్పకుండా మౌనంగా వుండిపోయింది.
"సాయంత్రం వస్తాను అటో ఇటో తేలిపోవాలి" అంటూ విసురుగా బయటికెళ్ళిపోయాడు అనురాగ్.
సరిగ్గా అదే సమయంలో ఇంటి ముందు ఆగిన ఆటోలోంచి అన్నపూర్ణమ్మ దిగింది.
* * *
ఎవరికీ అనుమానం రాకుండా వైట్ కలర్ మారుతీ కారులో కూర్చుని, ఆ ఇంటికి రెండిళ్ళ జంక్షన్లో, క్లోజ్ చేసిన విండోస్ మధ్య, ఆ సంభాషణంతా విన్న తేజ మనసు ఆనందంతో ఉప్పొంగిపోతోంది.
అవసరమైతే అన్వతని కిడ్నాప్ చేసైనా తను దక్కించుకోవాలి. నిర్ణయానికొచ్చాడతను.
సూట్ కేస్ లో భద్రంగా దాచిన ఆ ఉత్తరాన్ని తీశాడు మధు.
ఆసాంతం చదివాడు.
ప్రియమైన మీకు అని ఉన్నచోట అన్వితకు అని రాశాడు.
మిమ్మల్ని నేను మొట్టమొదటిసారిగా చూసిన క్షణంలోనే అభిమానించాను. ఆ అభిమానం ఆరాధనగా మారడానికి కొన్ని గంటలే పట్టింది. ఆ ఆరాధన ప్రేమగా మారడానికి కొన్నిరోజులే పట్టింది.
ప్రేమమీద నాకు స్పష్టమైన అభిప్రాయం వుంది.
ఆ విషయాన్ని తెలుగులోకంటే, ఇంగ్లీషులోనే చెపితే బావుంటుందని ఎక్కడో చదివినా కొటేషన్ ని రాస్తున్నాను.