Previous Page Next Page 
సంకల్పం పేజి 44

  

     "పదిరోజుల్లో కావాలి...." చెప్పాడు వికాస్.
   
    ఆ తర్వాత వాళ్ళు, డైలీ పత్రికల్లో, వారపత్రికల్లో ఇచ్చే 'యాడ్స్' గురించి సైజుల గురించి చర్చలు జరిపారు. ఎప్పటి నుంచి 'యాడ్స్' ప్రారంభం కావాలో తేదీని నిర్ణయించారు.
   
    కొంత ఎడ్వాన్స్ చెల్లించాడు వికాస్.
   
                                     *    *    *    *    *
   
    మువ్వలవానిపాలెంలో ఇల్లు తీసుకున్నాడు వికాస్.
   
    తండ్రి అప్పటికీ, ఇప్పటికీ ఒక్కలాగే ఉన్నాడు- ఏమాత్రం మార్పు లేదు.
   
    ఇద్దరక్కలూ...
   
    ఉమ... వాణి...
   
    తండ్రి వికాస్ ని చూడగానే అభిమానంతో గట్టిగా పట్టేశాడు. బాధలతోనూ, కష్టాలతోనూ చాలా చితికిపోయాడు తండ్రి.
   
    దారిద్ర్యం పెంపకంలో ఎలా పెరుగుతారో అలాగే ఉన్నారు అక్కలు.
   
    ఇంట్లోకి దిగిన రోజే-
   
    అక్కలిద్దర్ని మల్లిఖార్జున షాప్ కి తీసికెళ్ళాడు.
   
    వాళ్ళ కిష్టమైన చీరలూ, జాకెట్లూ తెచ్చుకున్నారు. తండ్రికి మంచి పంచెలు, జుబ్బాలు కొన్నాడు.
   
    ఇంట్లో సామాగ్రి.
   
    కళకళలాడుతున్న ఆ ఇంటిని చూడడానికి మర్నాడొచ్చాడు చయనులు.
   
    "ఒరేయ్... వికాస్... ఎన్ని ఫ్యాక్టరీలు పెడితే.... ఇంత ఆనందం వస్తుందిరా.... నీ తండ్రిలో వచ్చిన మార్పు చూడు.... అక్కల ముఖాల్లో కనిపించే ఆ ఆనందం చూడరా..... ఒరేయ్... బాబీ.... అని నిన్ను పిలవడానికే ఇప్పుడు భయమేస్తుందిరా.... ఆ కార్లాఫీసులో నువ్వుఏమైనా కావచ్చు... నువ్వు నా మేనల్లుడివిరా.... చిన్న మూతలు ఏరి తల్లికి పంపి, బతుకుమీద అపార విశ్వాసాన్ని పెంచుకున్న నువ్వు ఈ చయనులు గాడి, ఈ ఆవారా చయనులుగాడి మేనల్లుడివిరా...
   
    ఈ ఏడాది ఈ ఇంట్లో ఓ శుభకార్యం జరగాలి. అది నీ పెద్దక్క ఉమ పెళ్ళి. నీకు నీ కారెంత ముఖ్యమో, నీ అక్కలంతే ముఖ్యం.... గుర్తుంచుకో..." చెప్పాడు చయనులు.
   
    తను తప్పకుండా చెయ్యాల్సిన బాధ్యతను ఎంత సున్నితంగా గుర్తుచేశాడు మావయ్య.
   
    అవును ఉమక్క పెళ్ళి చెయ్యాలి. పెళ్ళి కొడుకు?
   
    "ఈ కారు గనక మార్కెట్లో సంచలనం సృష్టిస్తే.... మొత్తం తన జీవితమే మారిపోతుంది" అనుకున్నాడు వికాస్.
   
    తన బతుకు కారు చీకటిలో ఓ కాంతి రేఖ తన కారు.
   
                                   *    *    *    *    *
   
    ఫోన్ గణ గణమని మ్రోగింది.
   
    "వికాస్... స్పీకింగ్..."
   
    "హలో.... వికాస్.... హౌ ఆర్ య్యూ...."
   
    ఆ గొంతు గుర్తుపట్టాడు వికాస్. మధుకుమార్ హైద్రాబాద్ నుంచి.
   
    "ఏమిటి విశేషాలు..."
   
    "ఒక వారంలో ఫస్ట్ కారొస్తుందండి...."
   
    "మిస్టర్ వికాస్... ఒక ముఖ్య విషయం. జింఖానా 1000 కారు 'యాడ్స్' కాంపైన్ ని అపోలో గ్రూప్ కిచ్చారు. నెక్స్ట్ మంత్ సెకండ్ వీక్ యాడ్ కాంపైన్ ప్రారంభమౌతుంది. మీ యాడ్ కాంపైన్ అంతకు వారం రోజుల ముందుంటే మంచిది. టీ.వీ ప్రెస్ 'యాడ్స్' వెరైటీగా ఉండేలా ప్లాన్ చెయ్యండి...." చెప్పాడు మధుకుమార్.
   
    వాళ్ళతో పోటీ మనకు లేదని- ప్రొడక్ట్ ని ఒకేసారి, ఒకే డీలర్ కి యిచ్చేస్తున్నామని చెప్దామనుకున్నాడు వికాస్. తొందరపడగూడదనుకున్నాడు.
   
    "యాడ్ కాంపైన్ ఫైనాన్స్ విషయంలో మీ హెల్ప్ అవసరం వచ్చేలా వుంది" అన్నాడు వికాస్.
   
    "ఎంత కావాలో చెప్పండి"
   
    ఫైనాన్స్ అవసరం ఎంత ఉంటుందో చెప్పాడు వికాస్.
   
    "ఓ.కే... ఎల్లుండు మార్నింగ్ కి మీకు చెక్కు పంపిస్తాను" ఫోన్ పెట్టేశాడు మధు.
   
    తర్వాత ఇంకో ఫోన్.
   
    బొంబాయి నుంచి అరవింద నాయర్.
   
    "ఎలా ఉంది ప్రోగ్రెస్ మైడియర్ యంగ్ మేన్."

    "ఎవ్వెరిథింగ్ ఓ.కే! సార్!"
   
    "ఇక్కడ కూడా కొన్ని కంపెనీలు మీ 'ఎలక్ట్రిక్ కారు' విషయమై చాలా 'ఇంట్రెస్టు' చూపిస్తున్నారు. ఆయిల్ మార్కెట్ ని నీ కారు చాలా దెబ్బ తీస్తుంది. ఇండస్ట్రీలో పెద్ద సంచలనం ఇది. శత్రువులు పెరుగుతారు. ఫ్యూచర్ లో నీ కారుకి బాగా గిరాకీ వుంటుంది.... అది తెల్సుకుని ప్లాన్ చెయ్యి.
   
    నీ ప్రయత్నాలు కేంద్ర ప్రభుత్వానికి కూడా తెలిసి బాగా ఆనందిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఆయిల్ దిగుమతి మూలంగానే మనకు విదేశీ కరెన్సీ కరువొచ్చిపడి దేశ ఆర్ధిక వ్యవస్థను అతలాకుతలం చేస్తోంది. అందుకే కేంద్ర ప్రభుత్వం నీకు వెంటనే లైసెన్స్ యిచ్చింది. దాని వెనుక మేధావి మన్ మోహన్ సింగ్ సహకారం చాలా వుంది. ఇండియాలోని మిగతా కార్ల కంపెనీలే కాదు- విదేశాలలో సయితం నీ ప్రయత్నాల గురించి తెలుసుకునేందుకు తహతహలాడుతున్నట్లు వార్తలొస్తున్నాయి. బీ కేర్ ఫుల్" అరవింద నాయర్ ఎక్సైటింగ్ గా అన్నాడు.
   
    వికాస్ బహుశా అంత ఆనందోద్వేగాన్ని ఎప్పుడూ అనుభూతించి వుండడు. కొద్ది క్షణాలకు ఆ అనుభూతి నుంచి తేరుకున్నాడు.
   
    "నేషనల్ లెవెల్లో ఇండియన్ ఎక్స్ ప్రెస్ కి, యాడ్స్ రిలీజు చేస్తున్నాము. సర్! ఆర్డర్స్ బాగుంటే... సెకండ్ బాచ్ ని కూడా మార్కెట్లో విడుదల చేస్తాం సర్!" చెప్పాడు వికాస్ ఆనందంగా.
   
    "ఐనో మిస్టర్ వికాస్! యూ కెన్ డూ ఎనీథింగ్.... బట్ ఏ ఏ కంపెనీల దగ్గర్నించి నువ్వు కాంపోనెంట్స్ గానీ, మెటీరియల్ గానీ తెచ్చుకుంటున్నావో, వాళ్ళతో ఫైనాన్స్ విషయంలో జాగ్రత్తగా వుండు. క్రెడిట్ అనేది లేకుండా చూసుకో! ఎప్పుడయితే క్రెడిట్ స్టార్టయిందో, మంచి గిరాకీ వున్న సమయంలో నువ్వు రిస్క్ లో పడతావు. ఆటోమోబైల్ ఇండస్ట్రీ, చైన్ ఇండస్ట్రీ, అన్ని చక్రాలూ సరిగ్గా నడిస్తేనే నీ కారు చక్రం సరిగ్గా నడుస్తుంది. అర్ధమైందా?"
   
    "థాంక్యూ ఫర్ యువర్ కైండ్ ఎడ్వైజ్ సర్."
   
    "కారు డిమాన్ స్ట్రేషన్ చాలా ఎట్రాక్టివ్ గా ప్లాన్ చెయ్యి."
   
    "ఓ.కే. సార్."
   
    "ఉంటాను. శివమూర్తిగారిని అడిగానని చెప్పు."
   
                                     *    *    *    *    *
   

    "ఎవరో ప్రెస్ రిపోర్టర్లట మీకోసం వచ్చారు. పంపించమంటారా?" సెక్యూరిటీ గార్డు కిషన్ ఫోన్ చేశాడు.
   
    "చూడు కిషన్! ప్రెస్ వాళ్ళను ఎప్పుడూ ఆపకూడదు. వాళ్ళని లోనికి రాకుండా ఆపేశావనుకో- మనకి ప్రపంచంతో సంబంధం తెగిపోయినట్టే లెక్క. అర్ధమైందా? వాళ్ళని చాలా రెస్పెక్ట్ గా లోనికైనా, బయటికయినా పంపించాలి" చెప్పాడు వికాస్.
   
    ఇంకా పత్రికలలో ప్రకటనలు రాలేదు. టీ.వీ.లో ప్రకటనలు రాలేదు. ఏ పత్రిక్కూడా ఇంటర్వ్యూ యివ్వలేదు.
   
    కానీ-
   
    శివానీ మోటార్స్ ఆధ్వర్యంలో ఎలక్ట్రిక్ కారు 'వస్తోందని' ఆ కారుని అద్భుతంగా డిజైన్ చేస్తున్నారని పుకార్లు.
   
    ఆ పుకార్ల వెనకే విలేఖరులు.
   
    విలేఖరులు తలుపు తోసుకుని వరసగా లోనికొచ్చారు.
   
    వాళ్ళకు స్వాగతం పలికాడు వికాస్.
   
    అదే సమయంలో ఓ ఫోన్-
   
    మద్రాసు నుంచి-
   
    "ఈజ్ ఇట్ శివానీ గ్రూప్?"
   
    "మేనేజింగ్ పార్టనర్ వికాస్ స్పీకింగ్"
   
    "మెగాస్టార్ చిరంజీవి పి.ఏ.ను మాట్లాడుతున్నానండీ! మీ కంపెనీ ఎలక్ట్రిక్ కారుని తయారుచేస్తోందిట. ఆ డిటైల్స్ కావాలంటున్నారు చిరంజీవి గారు. చెప్పగలరా?"
   
    అన్నీ వివరంగా చెపుతున్నప్పుడే ఎదురుగా ఉన్న విలేఖరులు తమ కలాలకు పనిపెట్టారు.   
   
    "మీరు తయారుచేసే ఫస్ట్ కారు చిరంజీవిగారి కివ్వగలరా?" అడిగాడు పి.ఏ.
   
    "మా ప్రొడక్ట్ కి అదో అద్భుతమైన ఆఫర్ కదా! వారికి ఇంటరెస్ట్ వుంటే... మా కంపెనీ ఫస్టు కారుని ఆయనకే అమ్ముతుంది...." చెప్పాడు వికాస్.
   
    "మీరు రేటు చెప్పండి. మా వ్యక్తి మిమ్మల్ని కలుస్తాడు. ఎప్పుడు పంపించమంటారు?"
   
    "మీ యిష్టం."
   
    "మళ్ళీ ఫోన్ చేస్తాను."
   
    ఫోన్ పెట్టేశాడు వికాస్.

 Previous Page Next Page