Previous Page Next Page 
శుభోదయం పేజి 44


    "దాన్లో చిన్నగొడవ వుంది రాదా! స్త్రీ తనకోసం, పగ తీర్చుకోవడానికి ఎవరినో ఈ వంకతో కంప్లయింట్ చేస్తే అన్యాయంగా నిర్దోషి శిక్షించపడడా?"
    "రాజారాం, చూడు.... ఎంత సిగ్గులేని స్త్రీ అయినా తనని ఓ పురుషుడు బలప్రయోగంతో అనుభవించాడని చెప్పుకోవడానికి సిగ్గుపడుతుంది. అలాంటిది కావాలని ఎవరినో ఇరికిస్తే అందులో తన మర్యాద పోతుందని గ్రహించదా? ఎక్కడో, ఎవరో నూటికో కోటికో అనవసరంగా ఏదో కక్షతో అలా చెప్పేవాళ్ళు వుండవచ్చు. అలాంటప్పుడు అతను నిజంగా ఆ పనిచేసింది లేనిది ఎలిబీలనిబట్టి గ్రహించవచ్చు."
    "భేష్ రాధా..... నిజంగా నీవో మంత్రిణివయితే బాగుండేది. ఎమెండ్ మెంట్స్ అన్నీ మార్చి రాయాలని పార్లమెంటులో అలజడి లేవదీసేదానివి" హాస్యంగా అన్నాడు రాజారాం.
    "హాస్యం కాదు రాజారాం, ఇందులో ప్రతి అక్షరం సిన్సియర్ గా నేను ఫీలయి చెపుతున్నానంటే నా ఆవేదన, ఆవేశం అర్ధం చేసుకో."
    "కాదనలేదు రాధా... నీది ఉత్తి ఆవేశం కాదని రేఖని నీ కోడలుగా చేసుకోవడానికి నిర్ణయించుకున్నప్పుడే అర్ధంఅయింది. ప్రతీ ఆడదీ నీలాగే ఆలోచిస్తే మీ ఆడవాళ్ళ కథలు మారేవి. నీవు పురుషులనే ఎందుకు నిందిస్తావు? శీలం పోయిన స్త్రీని కోడలిగా అంగీకరించే స్త్రీలు ఎందరున్నారు చెప్పు?"
    "అవును, స్త్రీలలో ఆ భావం కల్గించింది ఎవరు? యుగయుగాలుగా పురాణాలనిండా శీలం కాపాడుకోవాలి. ప్రాణంకన్నా మనం గొప్పదంటూ పతివ్రతల కథలు చెప్పి ఆ భావం నరనరాల్లో జీర్ణించుకుపోయేట్టు చేశారు. స్త్రీ యిప్పుడిప్పుడు గదా వంటింటి గడపదాటి బయటికి వచ్చి ప్రపంచం చూస్తూంది. చదువుకోని పాతకాలం స్త్రీ భావనలు అలా వున్నాయంటే అదంతా మన ప్రాచీన సంస్కృతినుంచి నేర్చుకున్నదే గదా. ఆడదానికి ఆలోచించే స్వేచ్చ ఈ తరంలో యిప్పుడిప్పుడే గదా వస్తుంది. అలాంటప్పుడు అంతకంటే ఆలోచించేశక్తి ఎక్కడనించి వస్తుంది కిందటి తరం స్త్రీకి."
    "అబ్బ! ఆడవాళ్ళని ఒక్కమాట అంటే ఒప్పుకోవు. ఎంత ఉపన్యాసం యిచ్చావు బాబూ!" రాజారాం భయం నటిస్తూ  అన్నాడు.
    "నేనన్న మాటల్లో నిజం లేదంటావా.... ఆడవాళ్ళలో అజ్ఞానం తొలగి పోవడానికి కావలసిన చదువు ఎందరిలోవుంది? యిప్పటికి నూటికి తొంభై శాతం చదువుసంధ్యలు లేని మూర్ఖులుగానే మిగిలారు. ముఖ్యంగా అలాంటి స్త్రీలమీదనే ఎక్కువగా అత్యాచారాలు జరుగుతున్నాయి. చదువుకుని పట్టణాలలో వున్న స్త్రీలమీద జరిగే అత్యాచారాలు చాలా స్వల్ప౦. అంటే కాస్త తెలివితేటలు చదువు సంస్కారాలున్న ఆడవాళ్ళమీద అత్యాచారం జరపడానికి భయపడతారన్నమాట పురుషులు. బలహీనులను ఎదుర్కొన్నట్టుగా సముజ్జీలను ఎదుర్కొనేముందు కాస్త జంకుతారు గదా ఎవరన్నా అంటే స్త్రీ పురుషుడితో సమానస్థాయికి రాగలిగినప్పుడు ఇలాంటి అన్యాయాలు చాలావరకూ తగ్గుతాయని ఆశించవచ్చు. ఏమంటావు?"
    "ఏమిటో నాకేం నమ్మకంలేదు. పురుషుడేప్పుడూ శారీరకంగా బలవంతుడు కూడా. ఎంత చదివినా పురుషాధిక్యతకి స్త్రీ ఎప్పుడూ తలవొగ్గే వుండాల్సి వస్తుంది."
    "అదిగో, అలా మాట్లాడకు. నాకు వళ్ళు మండుతుంది" రాధాదేవి కోపంగా అంది.
    "అబ్బే, యిది నా అభిప్రాయం కాదు. లోకరీతి చెపుతున్నాను రాధా."
    "అవును, లోకరీతి ఎందుకవదు? ఏ కథ చదివినా అలా బలవంతుడైన పురుషుడి చేతిలో ఘోరంగా చెరచబడిన స్త్రీ.... తరువాత అందరిచేత తిరస్కరింపబడి, సంఘంచేత వెలివేయబడి, అవమానం, హింస, లజ్జ భరించలేక ఏ ఆత్మహత్య చేసుకున్నట్టో, లేక వళ్ళమ్ముకుని, బతికినట్టు చూపిస్తారు. ఏ సినిమా చూసినా రేప్ సీన్ లేని సినిమా వుందా? అదిచూసి లేనివాళ్ళకి కూడా ఆ ఉద్దేశాలు కలిగేటట్టుంటాయి. ఆ రేప్ కి కావలసిన ఉపాయాలూ, వలవేయడం, అన్నింటికి దారులు చూపి నేర్పుతున్నారు. మన సినిమాలు, కథలు అలా శీలం పోగొట్టుకున్న స్త్రీ ఎందుకూ కొరవడదు అని చూపిస్తుంటే, నిజజీవితంలో ఓహో అలాగే చెయ్యాలి. కాబోలనుకుని పురుషులు ఆ స్త్రీని అలా హింసించేందుకు అవకాశాలు లేవంటావా? నల్లమేకని కుక్క కుక్క అని పదిసార్లంటే అనుమానం వచ్చినట్టు పదేపదే అదే చూస్తుంటే ఆ భావాలే మనసులో తిరగవా? అలా కాకుండా ఏ సహృదయుడో అలాంటి స్త్రీని చేపడితే అతనేదో ఘోరం చేసినట్టు దుయ్యపట్టే మనుషులమధ్య ఆ పురుషుడు తను చేసింది తప్పని అనుకోడా. నన్నడిగితే యీ సినిమాలలో పుస్తకాలలో అసలు 'రేప్' సీనులని బ్యాన్ చెయ్యాలంటాను. సినిమాలలో రేప్ సీన్సు వున్న సినిమాలను సెన్సార్ చెయ్యరాదంటాను. ఇప్పటివరకు ఏ సినిమాలోనన్నా రేప్ చెయ్యబడిన స్త్రీ లోకానికి భయపడకుండా ఎదిరించి నిలబడి తన వ్యక్తిత్వం నిరూపించినట్లు చూపించిందా? తనకేం జరగలేదని, మొరిగేకుక్కలని లెక్కచెయ్యకుండా ఆత్మవిశ్వాసంతో సమాజానికి ఎదురీదినట్టు చూపిస్తే తాము నడవవలసిన రీతి యిది అని స్త్రీకి, అలాంటి స్త్రీని పరిత్యజించనక్కరలేదని పురుషుడిని ఒకరోజు కాకపోయినా కొన్ని రోజులలో నైనా మనసుకి ఎక్కడా? మనమీద సినిమాకున్నంత ప్రభావం దేనికీలేదు. అందులో చదువుసంధ్యలులేని వాళ్ళకి కూడా అందుబాటులోవున్న సాధనం  సినిమా! అందులో మంచి చూపితే నేర్చుకోవడానికి, అనుసరించడానికి స్వల్ప కాలం పడుతుంది. అంటే, పుస్తకాలు చదివి, సినిమాలు చూసి మనుషులు మారిపోతారా అంటే.... నిజమే ఒక్కరోజులో అంతా బుద్దిమంతులై పోరు. సమాజంలో చెడు గుర్తించి అది తొలగించడానికి సినిమాని మించిన సాధనం మరోటి లేదు. కనక స్త్రీల వ్యక్తిత్వం నిరూపించే ప్రవర్తనగల సినిమాలు వస్తే ప్రజల మనసుల్లోకి ఆ విషయాలు సులువుగా ఎక్కుతాయి. ఆ మంచిమార్పు ఈ తరంలో కాకపోతే మరో తరానికైనా రాదంటావా?" రాధాదేవి ఉపన్యాసం యిచ్చినట్టే ఆవేశంగా అంది.
    రాజారాం "వెల్ సెడ్... వెల్ సెడ్" అంటూ నవ్వుతూ చప్పట్లుకొట్టాడు. "లెక్చరర్ పదవి చేస్తున్నందుకు చక్కటి లెక్చర్ యిచ్చావు. నిజం రాధా.....నీవన్న యీ మాటలన్నీ అమలులోకి వచ్చినరోజున అందరికంటే ముందు ఆనందించేది నేను రాధా.... నీలా ఆలోచించే స్త్రీలు నూటికి ఒకరన్నా వుంటే, మరుతరంలోనే కాదు, యీ తరంలోనే స్త్రీల చీకటి జీవితాలకి 'శుభోదయం' కలుగుతుంది. ఆ... యింక ఈ ఉపన్యాసాలు చాలుగాని చూడు, శుభలేఖలకి ఈ కార్డులు నచ్చాయేమో చూడు. ఆర్డరిస్తా" అన్నాడు.

 Previous Page Next Page