Previous Page Next Page 
శుభోదయం పేజి 43


    "ఇప్పుడిప్పుడే యీ విషయాలు పునఃపరిశీలించి స్త్రీలకి మరిన్ని రక్షణలు కల్పించి న్యాయం చేకూర్చడానికి కొన్ని న్యాయసూత్రాలు తిరిగి మార్చాలని పార్లమెంటులో అలజడులు జరుగుతున్నాయని వార్తలొస్తున్నాయి. చూద్దాం ఏం చేస్తారో. ఈ మధ్య.... యీ ఏడాదిలో విపరీతంగా మానభంగాలు జరుగుతున్నాయి. పేపరులో కనీసం రోజుకి రెండుమూడు వార్తలు కనిపిస్తున్నాయి. మూక ఉమ్మడిగా కూడా ఇళ్ళల్లో జొరబడి వీరవిహారం చేస్తున్న రేపిస్టుల పైశాచికత్వం తెలిసి యావత్ మహిళాలోకమేకాక పురుషులూ భయపడి ఆందోళన పడుతున్నారు. రాధా... యిలాగే కొన్నాళ్ళు జరిగితే ఆడది గడపదాటి బయటికి రావడానికే భయపడుతుంది. ఎక్కడ వేసిన గొంగళి సామెత మాదిరిగా, పూర్వపు రోజుల్లో మాదిరి స్త్రీ నాలుగుగోడలమధ్య వుండేరోజులు వస్తాయనుకుంటాను, యీ మానభంగాలు యిలాగే కొనసాగితే."
    "స్టాపిట్ రాజారాం, ప్లీజ్ ఫర్ గాడ్ సేక్! డోంట్ యూజ్ దట్ వర్డ్." "మానభంగం" అనే పదమే అసలు అవమానకరమైన పదం అంటారు. ఆ మాటే స్త్రీలని మరింత నెర్వస్ చేస్తుందని నా ఉద్దేశం. 'మానభంగం' అనగానే స్త్రీ ఏదో విలువయిన మానం పోగొట్టుకుని, అపవిత్రురాలై, అంటరానిదయి, అందరిచేత తిరస్కరించబడి, అందరిచేత అసహ్యించుకోబడుతుంది అనే భావంకైగి తనలోతాను లజ్జితురాలై, దిగులుతో, భయంతో, అవమానంతో క్రుంగి, కృశించిపోతుంది. 'మానం' అనేమాటకి మనవాళ్ళు యుగయుగాల నుంచి అతి ఎక్కువ ప్రాముఖ్యత యిచ్చి అనేక పతివ్రతల కథలతో స్త్రీల నరనరాల్లోకి వెళ్లేటట్టు ఆ మనం కాపాడుకోవలసిన అవసరం గురించే నూరిపోశారు. శీలం గొప్పది అన్నది కేవలం స్త్రీని అణచడానికే వాడుకున్నారు. ఆ మానంపోయిన స్త్రీ ఎందుకూ పనికిరానిదానిలా చిత్రించి భయపెట్టారు. నన్నడిగితే ముందుగా ఆ 'మానభంగం' అనే మాట వాడకూడదని ఆంక్ష విధించాలంటాను" రాధాదేవి ఆవేశంగా అంది.
    "నిజమేనేమో? 'రేప్' అనేదానికి మనం 'మానభంగం' అంటున్నాం రేప్ అంటే బలవంతంగా సెక్స్ అనుభవించడం అని అర్ధం వస్తుందని మానానికి భంగం అని అర్ధం సరిఅయింది కాదనుకుంటాను" రాజారాం సాలోచనగా అన్నాడు.
    "స్త్రీమీద 'అత్యాచారం' జరిగిందనవచ్చు. 'బలప్రయోగం' జరిగిందనవచ్చు. హిందీలోకూడా 'ఇజ్జత్ లూట్ లియా' అంటే అభిమానాన్ని, గౌరవాన్ని దోచుకున్నారని వుంటుంది. స్త్రీని అవమానపరిచారనడంలో వున్న అర్ధం సరిఅయింది. 'మానభంగం' అన్నదానికంటే.... యీ మానభంగం అన్నపదం ముందు వదిలేయాలి మనం. అలా వదిలేస్తే బలప్రయోగం జరిగిందంటే స్త్రీకి ఏదో పోగొట్టుకున్నానన్న భావంరాక కాస్త ధైర్యం వుంటుంది, ఏమంటావు" రాధాదేవి ఉత్తేజితురాలై అంది.
    అంగీకారంగా తలవూపాడు రాజారాం. "అంతేకాదు, అలా బలాత్కారం చేసిన పురుషులని షూట్ ఎట్ సైట్ అన్నంతవరకు శిక్షిపడితే ఆ భయంతోనైనా కొంత తగ్గవచ్చు. స్త్రీలపై అత్యాచారం చేసిన పురుషులని ఎక్ స్ట్రీమ్ స్టెప్ కి వెళ్ళే శిక్షలు వెయ్యాలి. అప్పటిక్కాని యీ అన్యాయాల్ని అరికట్టలేం. రేపిస్టులను సంఘంనుంచి బహిష్కరించాలి. వారి ఉద్యోగాలు పీకేసి, ఎక్కడి కెళ్ళినా వాడో రేపిస్ట్ అని లోకానికి తెలిసేటట్టు వాడి మొహంమీద, పోనీ మొహాన కాకపోతే ఏ చేతిమీదనో ముద్ర.... చెరిగిపోని ముద్రకొట్టి వదలాలి. ఆ ముద్రచూసి ఎవడూ ఉద్యోగం యివ్వకూడదు. పని యివ్వకూడదు. ఆఖరి కూలి అయినా యివ్వరాదు...." రాధాదేవి ఆవేశంగా అంది.
    "నీ ఉద్దేశాలన్నీ చక్కగా ప్రధానమంత్రికి రాసేయి. ఆవిడా స్త్రీ కనక నీ బాధ, ఆవేదన అర్ధం చేసుకుంటుంది. వెంటనే అమలులో పెట్టేస్తుంది. తమాషాగా నవ్వుతూ అన్నాడు.
    "హాస్యంకాదు రాజారాం. నిజంగా రాస్తాను. అంతే కాదు.... అంటే బలాత్కారానికి గురి అయిన స్త్రీకి ప్రభుత్వం రక్షణ యివ్వాలి. ఆ స్త్రీ శీలం కోల్పోయిందని, భర్త, అత్తవారు హింసించి వదిలేస్తే ఆ స్త్రీ గతి ఏమిటి. నాకు అదృష్టవశాత్తు ఉద్యోగం వుంది కనుక నా బతుకు నేను బతికాను అలా లేని స్త్రీ ఏమయిపోతుంది? బతికే దారిలేక ఏ వ్యభిచారగృహాలో పట్టిపోవాలా? ఏ కన్నెపిల్లకో అలా జరిగితే వివాహం ఆడడానికి ఎవడూ ముందుకురాక అలా కన్నెపిల్లగా మిగిలిపోవలసిందేనా? అలా భర్తచేత పరిత్యజించబడిన స్త్రీలకి ప్రభుత్వరక్షణ యివ్వాలి. ఈ ఉమెన్స్ వెల్ ఫేర్ బోర్డులు, మహిళా మండలలు ఇలాంటి విషయాలలో ఎక్కువ శ్రద్ద కనపరిచి ఆ స్త్రీల జీవనోపాధికి మార్గం కల్పించాలి. అలా పెళ్ళి కాకుండా వుండిపోయిన అమ్మాయిలకి చదువులు చెప్పించి ఉద్యోగాలు చూపాలి. అలాంటి స్త్రీలని చేపట్టేందుకు ముందుకు వచ్చిన పురుషులకి ధనసహాయంగాని, ఉద్యోగం ఆశగాని చూపాలి. అలా బలాత్కరింపబడి గర్భం దాల్చిన స్త్రీలకి గర్భవిచ్చిత్తి ఉచితంగా చేయించాలి. లేదంటే అలా పుట్టిన పిల్లలని ప్రభుత్వం భరించాలి...." ఒక్కొక్క ఆలోచన మాటలరూపంలో చెప్పింది.
    "రాధా నీ పిచ్చిగాని! ఆ డబ్బుకోసమో, ఆ ఉద్యోగం కోసమో ఆదర్శవంతుడిలా నటించి పెళ్ళి చేసుకుంటాడు. తరువాత ఆ స్త్రీనికాల్చుకు తినడని ఏముంది? ఎన్ని బిల్లులు ప్రవేశపెట్టినా కట్నాలు తీసుకోవడం మానుతున్నారా, కట్నంలేని వాళ్ళని ఎన్ని హింసలు పెడుతున్నారు? ఈ సంస్కరనోద్యమాలన్నీ కాగితాలమీద బాగుంటాయి. ఆచరణలో వీగిపోతాయి. సంస్కరణ అన్నది వ్యక్తిగతంగా ఎవరికి వారికి రావాలిగాని రూల్సు, బిల్లులు చేసినంత మాత్రాన మనుష్యుల మనస్తత్వం మారదు రాధా..."
    "అవును, ప్రతి పురుషుడూ నీతి, శీలం అన్నది మనసుకిగాని శరీరానికి గాదన్నది గుర్తించాలి. శరీరం ఎవరో ఏదో చేసినంత మాత్రాన ఏం కొంపమునగదని, నీతి నిజాయితీగా ఆ స్త్రీ తనని ప్రేమిస్తున్నది లేనిది గుర్తించాలి. తమలాగే ఈ స్త్రీ మనిషని, తమకంటని అవినీతి స్త్రీకి మాత్రం ఎందుకు అంటుతుందన్న జ్ఞానం, ఆ పరివర్తన ఎవరికి వారికి కలగాలి... కాని... ఆ పరివర్తన ఎన్నాళ్ళకో, ఎన్నేళ్ళకో వచ్చేవరకు ఆ స్త్రీల గతి ఏమిటి, పురుషుడి దయాదాక్షిణ్యాలమీద ఆధారపడి యింట్లోంచి తరిమితే ఆ స్త్రీ ఏమవుతుంది? అందుకే అలాంటి స్త్రీల రక్షణకి ప్రభుత్వం పూనుకోవాలంటున్నాను. అలాంటి పరిస్థితిలో పడిన స్త్రీని హీనంగా చూసేవారిని శిక్షించాలి. అదేదో ఘోర అన్యాయం జరిగినట్టు ఎవరు మాట్లాడినా స్త్రీలెవరూ ఊరుకోకూడదు. అంతేకాదు అసలే జరిగినదానికి బాధపడ్తుంటే ఆ వార్తలు పేపర్లలో బట్టబయలుచేసి ప్రచురిస్తారు. అత్యాచారం జరిగిన స్త్రీ గురించి, ఆ వివరాలు, ఫోటోలు పేపరులో ప్రచురించరాదని, అలాంటికేసులు కోర్టులో నమోదు కాగానే.... ఆ కేసు ప్రొసీడింగ్స్ అంతా రహస్యంగా జరగాలని, ఏళ్ల తరబడి కేసు జరగకుండా ప్రయారిటీ యిచ్చి వెంటనే ఒక నెలలోపల ఆ కేసు విచారణ పూర్తి చెయ్యాలని ప్రభుత్వం ఆజ్ఞ జారీ చెయ్యాలి. పాత పద్ధతులకి అంటే రక్కులు, కారకులు వుంటే రేప్ జరిగినట్లు కాకుండా స్త్రీ అనుమానితురాలిగా కంప్లయింట్ చేస్తే వారిమీద చర్య తీసుకోవాలి."

 Previous Page Next Page