Previous Page
శుభోదయం పేజి 45


    "రాజారాం.... నీకు నచ్చితే వేరే అడగాలా? పిల్లవాడి మేనమామవి. నీదే పెద్దరికం. నీవెలా చెపితే అలా చేస్తాను" రాధాదేవి రాజారాంని చూస్తూ తృప్తిగా అంది.
    
                             26
    
    నెల తరువాత ఆరోజు శ్యాం, రేఖల వివాహం జరిగింది. ఉదయం రిజిస్ట్రార్ ఆఫీసులో సంతకాలు చేశారు. సాయంత్రం రిసెప్షన్. ఊర్లో చాలామంది మిత్రులు వచ్చారు. ఇదేదో ఆదర్శవివాహం అని చూడడానికి కొందరు కుతూహలంగా వచ్చారు.
    "నిజంగా మీది చాలా పెద్దమనసండి. నిజంగా మీరు సహృదయులు. తప్పకుండా అభినందించాలి" అని కొందరు ఆమెని పొగుడుతుంటే...
    "ఎందుకండీ మధ్య నా కభినంధన! చక్కటి భార్యని తెచ్చుకున్నందుకు మా అబ్బాయిని అభినందించండి...." అంటూ రేఖ భుజంచుట్టూ చెయ్యివేసి వారి మాటల అర్ధాన్ని మళ్ళించింది. ఇంకా ఎవరో ఏదో అంటూంటే రాధాదేవి వారిని పక్కకి పిలిచి "ప్లీజ్! నేనేదో పెద్ద ఆదర్శంగా ఈ వివాహం చేయించానని, మా అబ్బాయేదో త్యాగం చేశాడన్న భావం ఆ అమ్మాయికి రావడం నాకిష్టంలేదు. దయచేసి మామూలు వధూవరులను అభినందించినట్లు అభినందించండి" వారు నొచ్చుకోకుండా సౌమ్యంగా అంది.
    మాధవరావు ఆఖరికి రేఖ పెళ్ళికి మనస్ఫూర్తిగా అంగీకరించక తప్పలేదు. రేఖ ఏమయినాసరే చేసుకుంటానంది. శారదకూడా ఎంతో నచ్చచెప్పింది. కోపం తగ్గాక పదిరోజులు రాత్రింబవళ్ళు ఆలోచించాక తన అహం చంపుకుని శ్యాం ని అంగీకరించడం మినహా గత్యంతరం లేదని తెలుసుకున్నాడు. రేఖకి అబార్షనయింది. ఆమె పూరతిగా కోలుకున్నాక నెలా యిరవై రోజుల తరువాత పెళ్ళి నిర్ణయించారు. ఈ పెళ్ళిలో మనస్ఫూర్తిగా మాధవరావు పాల్గొనేటట్టు చెయ్యడానికి రాధాదేవి అనేకసార్లు కలసి మాట్లాడి వప్పించింది. రేఖ ఆమెపట్ల విజ్ఞత చూపుతూ పదేపదే ఆ మాట అంటూంటే రాధాదేవి ఆమెని మందలించింది. "రేఖా, శ్యాం పట్ల నీకుండాల్సింది ప్రేమగాని, కృతజ్ఞత కాదు. నాపట్ల వుండాల్సింది గౌరవం, అభిమానంగాని కృతజ్ఞతకాదు. నీవు మరోసారి అలా మాట్లాడి నిన్ను కించపరుచుకోకు" అని మందలించింది. రాధాదేవి మాటలు విన్నాక మాధవరావు ఆమె సహృదయతని మనసులో అంగీకరించక తప్పలేదు.
    రిసెప్షన్ అయి... అందరూ యింటికి వచ్చి కూర్చున్నారు. "అమ్మా...మనకు ఓ మంచి శుభవార్త, మంచి బహుమానం యిస్తాను... కళ్ళు మూసుకో" అన్నాడు సంతోషంగా శ్యాం. "నీ పెళ్లిని మించిన శుభవార్త, రేఖని మించిన బహుమానం యింకేం వుందిరా..." అంటూ నవ్వుతూనే కళ్ళు మూసుకొని, కుతూహలంగా చేయి చాచింది. ఆ చేతిలో ఒక ఉత్తరం పెట్టాడు శ్యాం. 'అమ్మా, ప్రధానమంత్రి శ్రీమతి ఇందిరాగాంధీ స్వయంగా నీకు రాసిన ఉత్తరం... చదువమ్మా...యింతకంటే పెద్ద శుభవార్త యింకేం కావాలమ్మా" అన్నాడు ఆనందంగా. రాధాదేవి కళ్ళువిప్పి సంభ్రమాశ్చర్యాలతో.... "నిజం" అంటూ ఆరాటంగా ఇంగ్లీషులో వున్న ఉత్తరం చదువసాగింది.
    "శ్రీమతి రాధాదేవి గార్కి-
    మీ సుదీర్ఘమైన ఉత్తరం, మీ కుమారుడి వివాహ ఆహ్వానపత్రిక అందుకున్నాను. మీ ఉత్తరంలో ఆవేదన, ఆవేశం, మీరనుభావించిన మనఃక్లేశం అన్నీ అర్ధంచేసుకున్నాను. మీరు, కుమారి రేఖ పొందిన అవమానం మీ ఇద్దరిదేకాదు యావద్భారత స్త్రీ జాతిది! ఈ ఇరవయ్యో శతాబ్దపు ఉత్తరార్దంలో కూడా స్త్రీకి సమాజంలో రక్షణ లేకపోవడం మనదేశానికే సిగ్గుచేటు అన్నది మేమూ గుర్తించాము. అత్యాచారాలకి గురి అవుతున్న స్త్రీల సంఖ్య నానాటికీ పెరిగి ఆందోళన కలిగిస్తుందని అందరూ అంగీకరిస్తున్నారు. ఈ అత్యాచారాల నివారణకు తీసుకోవాల్సిన అంశాల గురించి ప్రభుత్వం తీవ్రంగా ఆలోచించి స్త్రీల రక్షణకు తీసుకోవాల్సిన కొత్తచర్యలను త్వరలో ప్రవేశపెట్టబోతున్నాం. పార్లమెంటులో కొత్త న్యాయసూత్రాల బిల్లుని ప్రవేశపెట్టి స్త్రీల పరిరక్షణకు తగిన ఏర్పతులు చేస్తున్నాం అని తెలియచెప్పడానికి ఆనందిస్తున్నాను. మీరు చేసిన సూచనలు మాకు యెంతో ఉపయోగపడ్డాయి. ఈ వార్త మీకు, స్త్రీలందరికీ ఎంతో ఊరట కల్గించుతుందని నా ఆశ. నేను ప్రధానమంత్రిగా కాక ఓ స్త్రీగా, తోటి స్త్రీగా మీ ఆవేదనని పాలుపంచుకుంటున్నాను. ప్రధాన మంత్రిగా చేయదగిన సహాయం చేస్తానని హామీ యిస్తున్నాను. స్త్రీగా తోటి స్త్రీ బాధ అర్ధం చేసుకుని ఆమెకి అన్యాయం జరగకుండా చూడడంకోసం ఆమెని కోడలిగా చేసుకుంటున్న సహృదయతకి, సంస్కారానికి నా జోహార్లు! ప్రతి స్త్రీ మీలా ఆలోచిస్తే స్త్రీ చీకటి జీవితాలకి "శుభోదయం" వచ్చేలా చెయ్యడానికి పాటుపడదాం! అభినందనలతో
    
                                                                                                      ఇందిరాగాంధీ
                                                                                                            జైహింద్.
    
    రాధాదేవి ఆ ఉత్తరం పదేపదే ఆనందంగా చదువుకుంది. చదివినప్పుడల్లా కళ్ళు చెమ్మగిల్లేవి. ఆ నీటిపొరలమధ్య "శుభోదయం"లో మెరిసే తొలికిరణాలు తళుక్కుమనేవి!
    
    
                              * * * *సమాప్తం* * *  *

 Previous Page