Previous Page Next Page 
జీవాత్మ పేజి 44


    "మాట్లాడావా? మహదేవ్ ఏమంటున్నాడు?" ఆతృతగా అడిగాడు అభిరాం.
    
    ఆమె చిన్నగా నవ్వేసింది.
    
    "అదీ... అలా వుండాలి. పద నిన్ను దింపి వస్తాను" అంటూ వరప్రసాదం కేసి చూశాడు వెళతామన్నట్టు.
    
    "వెళ్ళొస్తానండి" రెండు చేతులు జోడించి వరప్రసాదంతో అంది ఆమె.
    
    "మంచిదమ్మా!" అన్నాడతను.
    
    అభిరాంతో పాటు బయటికి నడిచిందామె. వరప్రసాదం మహదేవ్ గదికి వెళ్ళాడు.
    
                                                      *    *    *    *    *
    
    మెల్లమెల్లగా సంధ్యాకాంతులు చీకటిగర్భంలోకి ముకులించుకుపోతున్నాయి. పక్షులన్నీ హడావిడిగా గూళ్ళకి చేరిపోతున్నాయి. సైనిక్ పురీ కాలనీలోని ప్లాట్స్ అన్నింట్లో విద్యుద్దీపాలు వెలుగుతున్నాయి.
    
    కేవలం ఆ కాలనీ మొత్తంమీద ఒకింటిలోనే లైట్స్ లేకుండా నిశీధి ఒడిలో నిద్రపోతోంది.
    
    ఫ్లాట్ నెంబర్ నలభై ఒకటిలో వుంటున్న దంపతులు సినిమాకి వెళ్ళారు.
    
    అప్పుడా సమయంలో ఇంటిలో వున్నది ఒక్కరే! అతని పేరు వెంకట్రావ్. ఆ ఇంటి యజమాని తండ్రి ఏదో పల్లెటూరు ఆయనది. కొడుకుని చూడటానికి ఆ రోజే వచ్చాడతను.
    
    ఇంటిలో ఏం తోచక బయటికి నడవబోయాడు-
    
    "కుఁయ్... కుఁయ్" మంటూ మూలిగింది గొలుసుతో కట్టి వేయబడిన కుక్క డాలీ.
    
    ఉదయం వచ్చిన దగ్గర నుంచి అతనితో దానికి బాగా దోస్తీ కుదిరి పోయింది.
    
    "పాపం రోజంతా కట్టే వుంది. అలా బయటికి తీసుకెళదాం" అనుకుని పోర్టికోలోకి నడిచాడతను డాలీ గొలుసు విప్పి చేత్తో పట్టుకుని.
    
    హాల్లోంచి బయటికి వచ్సినంత వరకూ బాగానే వుంది. సరిగ్గా పోర్టికోలోకి రాగానే తమ పక్కింటి వైపు చూసి "భౌభౌ.... భౌభౌ..." మంటూ గొంతు చిరిగిపోయేలా మొరగసాగింది. కుక్క అరుపులకి అతనూ దానితోపాటే అటు చూశాడు.
    
    దట్టమైన చీకటి ఆవరించుకుని వుందక్కాడ.
    
    "ఎందుకిదిరా అరుస్తోంది? అక్కడెవరూ వున్న జాడ కూడా లేదే" అనుకున్నాడతను.
    
    "ఊర్కో డాలీ.... ఊర్కో" సముదాయించాడతను. ఏమీ లాభం లేకపోయింది. ముందు కాళ్ళు పైకెత్తి నిటారుగా నిలబడి మరీ అరుస్తోంది.
    
    ఇక దాన్ని నిలువరించటం సాహ్ద్యం కాదని తెలుసుకుని బలవంతంగా దాన్ని ఈడ్చుకుంటూ తిరిగి లోపలికి వెళ్ళిపోయాడతను.
    
    లోపలికెళ్ళాక కూడా కొద్దిసేపు అరిచి అతను గట్టిగా అదిలించేసరికి 'గుర్ర్ర్ర్ ర్ర్' మంటూ వుండిపోయింది.
    
    "ఏమిటో పట్నం కుక్కలు.... దొంగలని చూసి అరవవు చెట్టు పుట్టల్నీ చూసి అరుస్తాయ్' మనసులో అనుకున్నాడతను.
    
                                                           *    *    *    *    *
    
    మరుసటి రోజు ఉదయం వచ్చేసింది మనస్విని. ఆమె చేతిలోని బ్యాగునిండా ఏపిల్స్, బ్రెడ్, జామ్ వంటి సరంజామా వుంది.
    
    "ఇక్కడికి పెద్ద ఎత్తునే వచ్చాడే" అన్నాడు మహదేవ్. అప్పటికే అక్కడున్న అభిరాం, వరప్రసాదం పెద్దగా నవ్వేశారు. ఏపిల్ కోసి అందరికీ అందించిందామె. తరువాత బ్రెడ్ పై జామ్ పూసి తలా ఒక్కటి పంచుతూ వుండిపోయింది మనస్విని.
    
    మధ్యాహ్నం అభిరాం, వరప్రసాదం ఇంటికెళ్ళి  భోజనం చేసేసి ఓ కారియర్ లో అభిరాంకీ, మనస్వినికీ తెచ్చారు. కాస్సేపు కూర్చుని ఇద్దరూ పనుందని వారికి ఏకాంతం కల్పిస్తూ జారుకున్నారు.
    
    మహదేవ్, మనస్వినిలు కబుర్ల కడలిలో తేలిపోయారు. ఒకరి సన్నిధిలో ఒకరు ఆర్తి పుష్పాలందుకున్నారు. కాలం పంచకళ్యాణిలా పరుగులు తీసి సాయంత్రం ఇట్టే అయిపోయింది. భారంగా ఒకరి కొకరు వీడ్కోలు చెప్పుకున్నారు.
    
                                                      *    *    *    *    *
    
    "ఈరోజు మీ ఫ్రెండ్ మహదేవ్ గారిని డిశ్చార్జి చేసేస్తాం! ఈ మందులు మాత్రం వాడమనండి. ఎందుకయినా మంచిదని మళ్ళీ ఓసారి బ్రెయిన్ స్కానింగ్ కూడా చేశాం. ఎటువంటి ప్రాబ్లమ్స్ లేనట్లే" అన్నాడు మహదేవ్ ని ట్రీట్ చేసిన డాక్టర్.
    
    అభిరాం మొత్తం బిల్లు చెల్లించేశాడు.
    
                                                      *    *    *    *    *
    
    మహదేవ్ మనస్విని ఈ లోకంలో లేరు. స్వప్నంలో వున్నట్టు, ఏదో ట్రాన్స్ లో వున్నట్లూ పరిసరాలని మరచిపోయి అనురాగ స్వరాలు మీటుకుంటూ వున్నారు. అదే సమయంలో బయట తలుపు చప్పుడయింది. "కమిన్" అన్నాడు మహదేవ్.    

    అభిరాం, వరప్రసాదం లోపలికి వచ్చారు.
    
    "అన్నీ సర్దుకున్నారా? మనం వెళ్ళిపోవాలి. ఇవాళే" అన్నాడు అభిరాం.
    
    "గుర్తుంది. ఈ నాలుగుగోడల మధ్యలో విసిగిపోయాను. నువ్వూ ప్రసాదంగారూ, మనస్విని లేకపోతే..... నేనేమయిపోయేవాడ్నో...
    
    ఏదేమయినా హాస్పిటల్ లో మందుల వాసనల నుంచీ, బంధిఖానా జీవితం నుంచి ఇంటికెళుతున్నానంటే ఆనందంగా వుంది" అన్నాడు.    

                                                     *    *    *    *    *
    
    అభిరాం కారు సైనిక్ పురీ కాలనీలోని మహదేవ్ ఇంటిముందు ఆగింది. కారులోంచి అభిరాం, వరప్రసాదం, మహదేవ్ లు దిగారు. వస్తూ వస్తూ ముందు మనస్వినిని ఆమె హాస్టల్ కి దగ్గర్లో దించేశారు.
    
    తమ వివాహం కాకుండా అతనింటికి వెళ్ళదలుచుకోలేదామె. మహదేవ్ ది కూడా అదే ఆలోచన. అందుకే ఆమెని దించేసి వాళ్ళు వచ్చారు.

 Previous Page Next Page