Previous Page Next Page 
జీవాత్మ పేజి 45


    గేటు తాళాలు తీశాడు అభిరాం మహదేవ్ చేతిలోంచి కీ బంచ్ అందుకుని! ఆ తర్వాత ఇంటి తలుపులు కూడా అతనే తీశాడు.
    
    చాలా రోజులుగా ఎవరూ లేకపోవటంతో దుమ్మూ, ధూళీ పట్టేశాయ్. మహదేవ్ తన గదిలోకి నడిచాడు. అతని తలకి ఇంకా బేండేజ్ అలాగే వుంది. పన్నెండు కుట్లు వరకూ పడ్డాయతని తలకి. ఆ విషయం మనస్వినికి తెలియనివ్వలేదు ఎవ్వరూ.
    
    "బాగా చెత్తపట్టి వుంది ఇల్లు! క్లీన్ చెయ్యాలి" అన్నాడు అభిరాం.
    
    "బహుశా నేను వూర్నించి ఇంకా రాలేదనుకుని వుంటుంది పనిపిల్ల. రేపు వస్తే శుభ్రంగా క్లీన్ చేయిస్తాలే" అన్నాడు మహదేవ్.
    
    "అప్పటిదాకా ఇలా దుమ్మూ, ధూళీతో నిండిన ఇంట్లో వుంటే తగ్గే గాయాలయినా తగ్గవు. మన పని మనమే చేసుకోవటంలో - తప్పు లేదు" అని అభిరాం చీపురు వెదికి తెచ్చాడు.
    
    "ఏమిటి ఇల్లు నువ్వు ఊడుస్తావా?" ఆశ్చర్యంగా అన్నాడు మహదేవ్.
    
    "ఫర్వాలేదులే" అంటూ గబగబా సాలెగూళ్ళని ముందు దులిపి, తరువాత నేలంతా చీపురుతో వూడ్చేశాను. మహదేవ్ అభిరాం వంక అభిమానంగా చూస్తుండిపోయాడు.
    
    బీరువాలోంచి కొత్త దిండు, దుప్పటీ తీసి మహదేవ్ కి పక్క రెడీ చేసి అతన్ని పడుకోబెట్టారు.
    
    "మీ ఋణం తీర్చుకోలేను నేను" అభిరాం, వరప్రసాదం ఇద్దరి వంకా చూస్తూ అన్నాడతను.
    
    "అలా అంటారేమిటి మహదేవ్ బాబూ?" అతన్ని వారిస్తూ అన్నాడు వరప్రసాదం.
    
    అప్పుడు టైం మధ్యాహ్నం పన్నెండవుతోంది.
    
    "ఓకే! అయితే నేను భోజనం చేసేసి, మీ ఇద్దరికీ తెచ్చేస్తాను" అంటూ బయటకు నడిచాడు అభిరాం.
    
    అక్కడ మహదేవ్, వరప్రసాదం ఇద్దరే మిగిలారు.
    
                                                            *    *    *    *    *
    
    అభిరాం కారియర్ లో తెచ్చిన భోజనం చేశారు మహదేవ్, వరప్రసాదం. మాటల్లో పడ్డారు ముగ్గురూ.
    
    కాలమే తెలియలేదు చీకటి హరికేన్ లా లోకాన్ని చుట్టుముడుతోంది. అభిరాం లేచి లైట్ స్విచ్ ఆన్ చేశాడు. ట్యూబ్ లైట్ కాంతి గదంతా పరుచుకుంది.
    
    "రాత్రి భోజనం మాటేమిటి?" అడిగాడు అభిరాం.
    
    "ఏదో ఒకటి తినేస్తాను నేను. పాపం వరప్రసాదంగారే అస్సలెటూ కదలకుండా నా దగ్గరే ఉండిపోయారు. నాకేం ఫర్వాలేదు. మీరిద్దరూ ఇంటికెళ్ళి రెస్ట్ తీసుకోండి" అన్నాడు మహదేవ్.
    
    "ఒక పనిచేద్దాం" ఇద్దరివంకా చూస్తూ అన్నాడు వరప్రసాదం.
    
    "ఏమిటన్నట్టు" చూశారిద్దరూ.
    
    "వంట పాత్రలుంటే నేనే వంట చేస్తాను. అప్పుడు అభిరాంగారికి తిరుగుడు బాధ వుండదు కదా" మహదేవ్ వైపు చూసి అన్నాడతను.
    
    "మీరు వంట చేస్తారా?" ఇద్దరూ ఒకేసారి అన్నారు.
    
    "ఏం చెయ్యకూడదా?" తిరిగి ప్రశ్నించాడు వరప్రసాదం.
    
    "అలా అని కాదు కానీ..."
    
    "మహదేవ్ బాబూ! స్టవ్, కొన్ని వంటపాత్రలూ వుంటే చెప్పండి"
    
    ఇద్దరినీ కమాండ్ చేస్తున్నట్లు అన్నాడు వరప్రసాదం.
    
    "వంట పాత్రలయితే వున్నాయి. స్టవ్ రిపేర్ వచ్చింది. అదే ప్రాబ్లం" అన్నాడు మహదేవ్.
    
    "అయితే ఈ రాత్రికి కూడా మీ ఇద్దరికీ కారియర్ నేనే తెచ్చేస్తాను. రేపు మాత్రం కొత్త స్టవ్ కొనుక్కుని మనం వండుకోవచ్చు" అన్నాడు అభిరాం.
    
    'అలాగే'నన్నట్టు చూశారు మహదేవ్, వరప్రసాదం లిద్దరూ అభిరాం వాళ్ళకి భోజనం తేవటానికి వెళ్ళాడు.
    
    "నావల్ల అభిరాంకి బాగా ఇబ్బందవుతుంది. అలాగే మీక్కూడా" నొచ్చుకుంటున్నట్లన్నాడు మహదేవ్.
    
    "ఇందులో ఇబ్బందేం వుంది?" అన్నాడు వరప్రసాదం.
    
    ఇద్దరూ మాటల్లో పడ్డారు. పావు తక్కువ తొమ్మిది అవుతుండగా అభిరాం భోజనాలతో వచ్చాడు.
    
    వాళ్ళిద్దరూ భోజనం చేస్తున్నంతసేపూ అలా మాట్లాడుతూనే వున్నాడు.
    
    ఇద్దరూ భోజనం చేశాక, మహదేవ్ వేసుకోవలసిన మందులు అందించాడు.
    
    గ్లాసుతో మంచినీళ్ళు తీసుకొచ్చి వరప్రసాదం ఇచ్చాడు.
    
    మహదేవ్ మందులు వేసుకున్నాక-
    
    "అయితే ఏం చేద్దాం?" అడిగాడు.
    
    "మీరు ఇంటికెళ్ళండి. అమ్మమ్మ ఒక్కతే వుంటుంది కదా! నేను మహదేవ్ బాబుతో పాటు అతనికి పూర్తిగా నయమయ్యేదాక ఇక్కడే వుంటాను" అన్నాడు వరప్రసాదం.
    
    "బాగుంది మీరన్నట్టు అలాగే చేద్దాం" అన్నాడు అభిరాం.
    
    "పాపం! వీరినెందుకు ఇబ్బంది పెట్టటం" అన్నాడు మహదేవ్.
    
    "నేనెక్కడున్నా ఒకటే ణ అగురించి ఆలోచించకండి" అన్నాడు వరప్రసాదం.
    
    తొమ్మిదిన్నరతుందనగా "ఇక నేను వెళతాను. ఇంటిదగ్గర అమ్మమ్మ నాకోసం ఎదురుచూస్తుంటుంది" అన్నాడు అభిరాం.
    
    మహదేవ్ సరేనన్నట్లు తలూపాడు.
    
    "రేపు ఉదయం ఎనిమిదింటికల్లా వస్తాను" అంటూ బయటికి నడిచాడు అభిరాం.
    
    "నేను కింద పడుకుంటాను" అన్నాడు వరప్రసాదం.
    
    "అదేం? డబుల్ కాటేగా ఇద్దరికీ సరిపోతుంది" అన్నాడు మహదేవ్.
    
    "అది కాదు సమస్య- నిద్దట్లో మీ తలకి నా చెయ్యి తగిలితే మళ్ళీ లేనిపోని బాధ" అన్నాడు దుప్పటి దిండూ పరుచుకుని.
    
    "మీ యిష్టం నాకయితే ఎటువంటి అభ్యంతరం లేదు" అన్నాడు మహదేవ్.
    
    "ఫర్వాలేదు" తనే ట్యూబ్ ఆఫ్ చేసి, బెడ్ ల్యాంప్ వెలిగిస్తూ అన్నాడు వరప్రసాదం.

 Previous Page Next Page