Previous Page Next Page 
జీవాత్మ పేజి 43


    దాంతో గుండె జల్లుమందామెకి. "ఎంత ప్రమాదం నుంచి బయట పడ్డావ్?" అంది మనస్విని.
    
    "ఇక ప్రమాదమేం లేనట్టే మరో రెండు రోజుల్లో మహదేవ్ గారు ఇంటికెళ్ళిపోవచ్చని డాక్టర్లు చెప్పారు" ఆమెని ఊరడిస్తూ అన్నాడు వరప్రసాదం.
    
    అప్పుడు గమనించిందామె అతన్ని- ప్రశ్నార్ధకంగా చూసింది మహదేవ్ వంక.
    
    "అభిరాం వాళ్ళ అమ్మమ్మగారి వూరే! వీరూ, అభిరాం లేకపోతే నేనేమయిపోయేవాడినో" కృతజ్ఞతగా వరప్రసాదం, అభిరాంల వైపు చూసి అన్నాడు మహదేవ్.
    
    "అంత దూరం చేసి మాట్లాడకురా బాబు. ఎంత మరీ దగ్గర మనుషులు వచ్చినా" హాస్యమాడాడు అభిరాం.
    
    మనస్విని వరప్రసాదానికి నమస్కరించింది. అతను దీవిస్తున్నట్టు చెయ్యెత్తాడు.
    
    "మరి వెంటనే నాకెందుకు కబురు చేయలేదు?" మహదేవ్ వంక తిరిగి అడిగింది నిష్టూరంగా.
        
    "చిన్నదానికి అనవసరంగా నిన్నెందుకు ఖంగారు పెట్టడమని?" అభిరాం అన్నాడు.
    
    ఆమె మౌనం వహించింది.
    
    మహదేవ్ ఊరెళ్ళిన రోజే తన మనస్సు చెప్పలేని బాధతో గింగిరీలు తిరగడం గుర్తుకొచ్చిందామెకి.
    
    "ఏమిటి? సరదాగా మాట్లాడతావని నిన్ను పిలిపిస్తే రబ్బరు బొమ్మలా మాట్లాడవ్?" అన్నాడు మహదేవ్.
    
    వరప్రసాదం లేచి నిలబడ్డాడు.
    
    "కూర్చుని కూర్చుని కాళ్ళు లాగుతున్నాయ్. అలా తిరిగి వస్తాను" అన్నాడు.
    
    అభిరాం కూడా "మీరు మాట్లాడుకుంటూ వుండండి. ఇప్పుడే వస్తాను" అంటూ బయటికి నడిచాడు.
    
    "తలకి గాయం బాగా తగిలిందా?" ఆమె కంఠంలో ఆందోళనకి, దుఃఖానికి కదిలిపోయాడతను. ఆమెవంకే చూస్తూ ఉండిపోయాడు.
    
    "నేనడిగిన దానికి సమాధానం చెప్పవేం?"
    
    "లేదు మనస్విని"
    
    "మరింత పెద్ద బేండేజ్ వుంది?"
    
    "చెప్పానా?"
    
    "ఏమిటి జోకా?" చిరుకోపంగా అందామె.
    
    "అబ్బబ్బబ్బా... ఈ ఆడాళ్ళతో ఏదొచ్చినా తంటానే" విసుక్కుంటున్నట్లన్నాడతను.
    
    "నువ్వు వూరికి బయలుదేరిన రోజే నా మనస్సు ఏదో తెలియని బాధకీ, ఉద్వేగానికీ గురయింది. బహుశా యిందుకేనేమో...! దాన్నే ఈ ఎస్పీ అంటారు."
    
    "అంటే?" తెలియనట్లు అడిగాడతను.
    
    "జరగబోయేవి కానీ, జరిగినవి కానీ దూరంనుంచి తెలియడం" అన్నది మనస్విని.
    
    "అభిరాంగాడు చెప్పాడా?" వెటకారంగా అన్నాడు.
    
    "నాకెవరూ చెప్పలేదు. నువ్వు మీ అమ్మ దగ్గరకి వెళతానన్న రోజే నా మనస్సు ఇదీ అని చెప్పలేని విషయంలో ఆందోళన పడింది. పాపం మా హాస్టల్ వార్డెన్ మేడం ప్రమీలాదేవిగారు నన్ను తమ మాటలతో ఉత్తేజపరుస్తూ నా బాధని పోవాలని ఆ రోజంతా నాతో మాట్లాడుతూ వుండిపోయారు. మళ్ళీ ఈ రోజుదాకా ఏ బాధ లేదు" అందామె.
    
    "కో- ఇన్సిడెంట్ అంతే! నీకూ అభిరాంగాడి జబ్బే వున్నదన్న మాట" వస్తున్న నవ్వుని ఆపుకుంటూ అన్నాడు మహదేవ్.
    
    "అభిరాంకి కూడా ఇలానే అన్పించిందా?" ఎంతో ఆశ్చర్యంగా అంది మనస్విని.
    
    "అలాగే ఏం అన్పించలేదుగానీ ఎప్పుడూ దెయ్యాలూ, భూతాలంటూ వుంటాడు. మానవాతీత శక్తులున్నాయనీ, మంత్రాలు, తంత్రా లున్నాయనీ బుర్ర తినేస్తాడు" అన్నాడు మహదేవ్.
    
    "అంటే నీ ఉద్దేశ్యంలో అవి లేవనా?"
    
    "ఖచ్చితంగా!"
    
    "పొరబడుతున్నావ్"
    
    "నో!" స్థిరంగా అన్నాడతను.
    
    "సర్లే... ఆ విషయం గురించి మన మధ్య చర్చలెందుకు?" అందామె.
    
    "ఇంకో రెండు రోజుల్లో డిశ్చార్జి చేస్తామన్నారు డాక్టర్లు" అన్నాడు మహదేవ్.
    
    "అయితే నేను ఆఫీస్ కి లీవ్ పెట్టేస్తాను."
    
    "ఎందుకు? ఏకంగా రిజైన్ చేసెయ్!"
    
    "ఎందుకు?" అంది మనస్విని.
    
    "ఇంకెందుకు? ఇలా అమ్మకి చెప్పడం- అలా మన పెళ్ళి జరిగి పోవటమే... నాకు తగ్గిన వెంటనే గుంటూరు వెళ్ళి అట్నుంచి గ్రీన్ సిగ్నల్ తో వచ్చేస్తాను. మీవాళ్ళ విషయం ఏమిటి?" అన్నాడతను.
    
    "మా వాళ్ళు అవునన్నా కాదన్నా నా నిర్ణయం ఒకటే. ఒకసారి నేనొక నిర్ణయానికి వస్తే ఇంకంతే.... దాన్నెవరూ మార్చలేరు" స్థిరంగా అందామె.
    
    "దట్స్ గుడ్!" అన్నాడతను.
    
    ఎనిమిదిన్నర వరకూ మహదేవ్ తో అలా ఏదో విషయం మాట్లాడుతూనే వుండిపోయింది. ఒకరి సాంగత్యాన్నొకరు వీడలేనట్టు యుగాల కలయిక తర్వాత కలిసినట్టు అతన్ని వీడి ఆమె వెళ్ళలేక పోతుంది.
    
    కానీ మరీ లేటయితే బావుండదని...
    
    "ఇక వెళతాను. రేపుదయం వస్తాను. సాయ్మత్రం ఈ టైందాకా వుంటాను" అందామె.
    
    భారంగా ఆమెకి వీడ్కోలిచ్చాడు మహదేవ్. బయట కూర్చున్న అభిరాం, వరప్రసాదం ఆమెని చూసి సోఫాలోంచి లేచి నిలబడ్డారు.

 Previous Page Next Page