"హాయిగా ఆరునెలలు పుట్టింట్లో వున్నాను. ప్రాణం హాయిగా వుంది. మళ్ళీ తాళాల గొడవ మొదలైంది. అడగడం మర్చిపోయాను.... అసలు ఈ తాళాల పిచ్చి ఎలా వచ్చిందండీ మీకు" అడిగిందావిడ కప్పను తెచ్చిస్తూ.
"శ్రీకృష్టుడెక్కడ పుట్టాడు?"
"జైల్లో."
"నేనూ అక్కడే పుట్టాను. పుట్టగానే పట్టుకున్నది తాళం కప్పనట.... అలాగే అన్నప్రసాన టైంలో కూడా తాళం కప్పనే పట్టుకున్నానట -ఇంకా...." ఏదో చెబుతుండగా-
ఫోన్ మోగింది.
"చూడు - తాళాలు బాగుచేసేవాడిని రమ్మన్నాను. వాడైతే అర్జంటుగా వచ్చేయమను" చెప్పాడాయన.
"తాళాలు వాడు కాదండీ- పెద్దపాడు నించు భీమవరం సోమరాజుగారు" అని చెప్పి, ఆ ఫోన్ డబ్బాని తీసుకొచ్చి, రిసీవర్ని నారాయణకు అందించిందామె.
"ఏరా- బాగున్నావా?" నారాయణ కంఠం.
"అదే నీ డబ్బుల విషయం మాట్లాడదామని-"
"ఇస్తున్నావా?"
"ఇంకా అబ్బాయి బిజినెస్ కుదుటపడలేదు కదా.....?" అన్నాడు సుల్తాన్.
"అదే పడుతుందిరా సోమరాజు! నీలాంటి కోటీశ్వరుడికి అప్పివడం ఎంత గొప్ప విషయంరా.... ఇంట్లో వెయ్యి తాళాలు కప్పలు ఉన్నంత ఆనందంగా వుంది" అంటూ గుమ్మంలోకి అప్పుడే వచ్చి నిలబడిన వ్యక్తి వైపు చూసి, కళ్ళు మిటకరించి చూస్తున్నాడు మైదానం నారాయణ.
"నువ్వు?" అన్నాడు.
"నేనేలేరా..... ఏదో పనిమీద వచ్చాను. ముందు ఫోన్ మాట్లాడు" అని కుర్చీలో కూర్చున్నాడు ఆ వ్యక్తి.
"ఒరేయ్.... భీమవరం సోమరాజా.......?" గట్టిగా అరిచాడు మైదానం నారాయణ.
"ఆఁ..... నేనే..... ఏంటా అరుపు....." అట్నుంచి గొంతు వినబడింది.
నారాయణ రిసీవరువైపు, తన ఎదురుగా కూర్చున్న వ్యక్తివైపు, బొమ్మలా తలతిప్పి చూస్తున్నాడు.
జుట్టు పీక్కుంటున్నాడు.
"ఒరేయ్- భీమవరం సోమరాజా" నారాయణకు ఏడుపు ఒక్కటే తక్కువైంది.
"ఎదురుగా నన్నుంచుకుని- అలా ఫోన్లో కుక్కలా మొరుగుతావేంట్రా...." ఎదురుగా కూర్చున్న భీమవరం సోమరాజు అయోమయంగా అన్నాడు.
"ఫోన్ లో ఒక భీమవరం సోమరాజు..... ఎదురుగా ఒక భీమవరం సోమరాజు- నాకంతా కన్ ఫ్యూజింగ్ గా వుంది. కలియుగంలో గందరగోళం అంతా గందరగోళం..... గోళం"
ఆ మాటలు ఫోన్ లో స్పష్టంగా విన్పించగానే, సుల్తాన్ ఫోన్ కట్ చేశాడు.
"కొంప మునిగింది" అన్నాడు పక్కన వున్న మధుతో.
"మీ నాన్న మైదానం నారాయణ ఇంట్లో" చెప్పగానే మధు గుండె ఒక్కసారి స్పీడ్ బ్రేకర్ ని గుద్దుకున్న లారీలా 'ధడ్' మంది.
"ఇప్పుడెలారా?" నీరసంగా అన్నాడు మధు.
* * *
మధుని ప్రేమించి, అతన్ని వదిలేసి ఇంకో వ్యక్తితో తను తిరుగుతున్నానని తేజ చెప్పిన మాటలు చాలా బాధ పెట్టాయి అన్వితను.
మధు అలా ప్రచారం చేసే వ్యక్తి కాదు.
ఒకవేళ ప్రచారం చేస్తే ఎందుకు చేస్తాడు? ఒకవేళ చెయ్యకపొతే- ఎవరు చేశారు?
ఎందుకు?
తేజతో మధుకి ఎక్కడ పరిచయమయింది? ఎందుకు పరిచయమయింది?
తేజ నిజంగా ఎలక్ట్రీషినేనా?
రెస్టారెంట్ దగ్గర తేజ ఎక్కుతున్న కారుని చూసిన అన్వితకు ఆ కారును ఎక్కడో, ఎప్పుడో చూసినట్టుగా జ్ఞాపకం వచ్చింది.
ఎక్కడ?
త్రీవంగా జ్ఞాపకం తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తోందామె.
కాసేపటికి గుర్తుకొచ్చింది.
వెంటనే వాచ్ మెన్ కి ఫోన్ చేసింది. వాచ్ మెన్ పరుగు పరుగున వచ్చాడు.
"మనింటి పరిసరాల్లో అంటే గోడ దగ్గర బ్లాక్ అంబాసిడర్ కారు ఆగడం నువ్వెప్పుడైనా చూశావా?" అడిగిందామె.
"రెండు మూడుసార్లు చూశాను మేడమ్."
"ఆ కారులో ఎవరెవర్ని చూశావు?"
"ఎప్పుడూ అద్దాలు వేసుండేవి మేడమ్."
"నాకెందుకు చెప్పలేదు?"
"ఎప్పుడూ చాలా కార్లు ఈ రోడ్డులో పార్క్ చేసి వుంటాయి కదా మేడమ్."
తేజ ప్రవర్తన మీద చాలా అనుమానంగా వుంది అన్వితకు.
"ఆ కారెప్పుడయినా ఆగితే నాకు చెప్పు" చాలా సీరియస్ గా చెప్పిందామె.
వెళ్ళిపోయాడు వాచ్ మెన్.
* * *
సరిగ్గా అదేసమయంలో, ఆ ఇంటివెనక భాగంలో చెట్టుకింద నున్న బ్లాక్ అంబాసిడర్ కారులో కూర్చుని, ఆ సంభాషణంతా వింటున్న తేజ ముఖం మాడిపోయింది.
అన్వితలో ఇంత షార్ప్ నెస్ వుందనుకోలేదు తేజ.
అన్వితకు తనమీద అనుమానం వచ్చిందా?
తనమీద అన్వితకు ఎవరు చెప్పి వుంటారు?
మధు అయి వుంటాడు?
బ్లాక్ అంబాసిడర్ కారుని మార్చేస్తే ఎవరికీ అనుమానం రాదు. నిర్ణయించుకున్నడతను.
* * *
అప్పుడే క్లాస్రూంలోంచి బయటికొచ్చి, స్టాప్ రూమ్ వైపు వెళుతున్నాడు మైదానం నారాయణ.
"మాస్టారూ!"
వెనక్కి తిరిగి చూశాడాయన.
రవి అండ్ బ్యాచ్.
"ఏవయ్యా- మీరందరూ రెగ్యులర్ గా క్లాస్ లకి రారా...... అందరూ ఎక్కడికి వెళ్ళిపోతున్నారు?" అడిగాడాయన.
"తర్వాత చెప్తాం. ముందు నా ప్రశ్నలకి జవాబు చెప్పండి."
"అడగండి" క్యాజువల్ గా అన్నాడాయన.
"మధు మీకు బాగా క్లోజ్ అవునా?"
"అవును."
"వాడు వైజాగ్ లో ఏం చేస్తున్నాడో తెలుసా?"
"బిజినెస్."
"ఏ బిజినెస్- లవ్ బిజినెస్సా?"
"లవ్ బిజినెస్సేమిటి?"
"అదే వాడక్కడ బిజినెస్ చెయ్యడం.... ఆ అన్వితను లవ్ ట్రాప్ లో వెయ్యడం కోసం వేలకు వేలు ఖర్చు పెట్టుకుని తిరుగుతున్నాడు."
"రోమియెలా తిరుగుతున్నాడా?"
"అవును."
"వాడు తిరగడంవల్ల నీకొచ్చిన నష్టం ఏమిటి?"
"నష్టమే. అన్వితను నేను ప్రేమించాను. నేను పెళ్ళి చేసుకుంటాను. మీరు చెయ్యల్సింది మా ఇద్దరికీ అద్దం రావద్దని ఏలూరు వచ్చెయ్యమని మధుకి చెప్పండి. ఇదే లాస్ట్ వార్నింగ్ అని చెప్పండి. లేకపోతే..... నా గురించి మీకు తెలుసు."
"నాకెందుకు తెలీదు చెప్తాను. రాత్రికి ఫోన్ చేసి చెప్తాను."
"రాత్రికి మీకు నేను ఫోన్ చేస్తాను" చెప్పి వెళ్ళిపోయాడు రవి.
అప్పటికే మధు. వాళ్ళ నాన్న-
భీమవరం సోమరాజు పేరుతో బడద్ధాలా, తన దగ్గర డబ్బు తీసుకోవడం విషయం తెలిసిపోయిందతనికి.
సోమరాజు చిందులు తొక్కుతూ వూరెళ్ళిపోవడం, మధుకి ఫోన్ చేసి, ఏలూరుకు రమ్మని చెప్పమని మైదానం నారాయణకు చెప్పి వెళ్ళిపోయాడాయన.
అలాంటి సమయంలో రవి హెచ్చరిక.
ఆ అమ్మాయి కోసం వీడు కోరి కష్టాలు తెచ్చుకుంటున్నాడన్న మాట. ఎందుకైనా మంచిది. తనొకసారి వైజాగ్ వెళితే..... రెండురోజుల్లో వైజాగ్ వెళ్ళడానికి నిర్ణయించుకున్నాడాయన.
* * *
అప్పుడప్పుడూ జేబులో మిగిలిపోయిన చిల్లరను ఒక ప్లాస్టిక్ డబ్బాలో వేయటం అలవాటు మధుకి. ఆ చిల్లరలో రూపాయి బిళ్ళల్ని ఏరి ఒకచోట పెట్టాడు. దాదాపు ఇరవై వుంటాయి.
గోడకున్న అన్విత ఫోటోలవైపు చూసి ఆ ఫోటోల్ని లెక్కపెట్టాడు.
సరిగ్గా పందొమ్మిది ఫోటోలున్నాయి.
ప్రేమ ఫోటోతో కలిపి ఇరవై.
బొమ్మా, బొరుసా ఆట గుర్తుకొచ్చింది.
మనిషి తన మేధస్సు, శక్తి, ఆలోచన ఇక పనికిరావని తేల్చుకున్నాక, తన సమస్యను యిక భగవంతుడే పరిష్కరించాలని నిర్ణయించుకున్నాక-
భగవంతుడ్ని విశ్వసించడం, గుళ్ళకు, గోపురాలకు వెళ్ళడం చేస్తాడు.
పూజలు, పునస్కారాలు చేస్తాడు.
అంతవరకూ పిచ్చి అనుకున్న నమ్మకాలకు ప్రాధాన్యం ఇవ్వడం ప్రారంభిస్తాడు.
జాతకచక్రాలు, జ్యోతిష్యం, చిలక జోస్యం, వాస్తు, వుంగరాలు, వాటికి పెట్టుకునే రాళ్ళు.
సైంటిఫిక్ గా ఆలోచించే ప్రతివాడూ, కష్టానికే ప్రాధాన్యత యిస్తాడు.
పరాజయాన్ని సవాల్ గా తీసుకుని, విజయం కోసం ప్రాక్టికల్ గా ఆలోచించి, అందుకనుగుణంగా తన కృషిని మలుచుకుంటాడు.
బొమ్మ పడితే, తనకు అన్విత దక్కుతుంది.
బొరుసు పడితే, తనకు అన్విత దక్కదు. అనుకుని ఒక రూపాయి నాణాన్ని తీసి, గాల్లోకి విసిరిపట్టుకున్నాడు.
నాణెం గుప్పిట్లో వుంది. గుప్పిట విప్పితే బొమ్మ, బోరుసో తెలుస్తుంది.
భయం భయంగా విప్పాడు.
బొరుసు.....
అన్విత ఫోటోవైపు చూశాడు.
రెండో కాయిన్ తీశాడు. మళ్ళీ గాల్లోకి ఎగరేసాడు.
మళ్ళీ బొరుసు.
భారంగా వూపిరి పీల్చి వదిలాడు.
నరల్లోకి ప్రవహిస్తున్న నిరాశ...... అంతులేని నిరాశ.
మళ్ళీ మూడోసారి...... నాలుగు...... అయిదు..... వరుసగా పద్దెనిమిదిసార్లు బొరుసే పడింది.
చిత్రంగా ఒక్కసారి కూడా బొమ్మ పడకపోవడం వింతగానూ ఆశ్చర్యంగానూ వుంది.
తను దురదృష్టవంతుడు.
తన ప్రేమకు విలువలేదు.
స్వచ్ఛమయిన ఆరాధనే పెట్టుబడి అనుకున్న తన ప్రేమ విలువ శూన్యం.
దాదాపు ఏడుపు వస్తున్నట్లుగా వుందతనికి.
పందొమ్మిదో రూపాయి నాణాన్ని తీశాడు.