రాధాదేవి అతనివంక తిరస్కారంగా చూసింది. "మాధవ్! నీవు నిజంగా తండ్రివయితే, ఆమె మేలు కోరేవాడివయితే.... ఈ వచ్చిన అవకాశాన్ని ఆనందంగా ఉపయోగించుకుని నాకు కృతజ్ఞత చూపేవాడివి. నేను చేస్తున్నది త్యాగమనుకున్నావు కనక నన్నభినందించు. నేను చేసేది ఏమయినా శ్యామ్ ని మాత్రం నీవు సంస్కారవంతుడిగా అంగీకరించక తప్పదు. ఎవరికి పుట్టినా, ఎలా పుట్టినా శ్యాం సంస్కారాలున్నవాడు కాబట్టే ఒక ఆడపిల్లకి జరిగిన అన్యాయానికి తనకు చాతనయినంతగా న్యాయం చేకూర్చాలనే తపనతో ఆమెని చేపట్టి మానవత్వం నిరూపించడానికి వప్పుకున్నాడు. నీలా గొప్ప తండ్రికి పుట్టలేదు. గొప్ప కులస్థుడికి పుట్టలేదు. కాని నీ కన్నా గొప్పగుణం వుంది అని గర్వంగా చెప్పగలను. మాధవ్, నీవేమనుకున్నాసరే మేం చేసేది త్యాగం అనుకోలేదు. ఎవరో ఏదో చేసిన నేరానికి రేఖ బలి అవడం నాకిష్టం లేక, ఓ ఆడపిల్ల జీవితం చక్కపరచాలని ఈ నిర్ణయానికి వచ్చాం. ఆమోదించేది, మానేది మీ యిష్టం. రేఖా.... నీవూ ఆలోచించుకో. పరిస్థితి విడమరచి చెప్పాను. నీవు కోల్పోయిన మనశ్శాంతి దొరకాలంటే... నీ జీవితానికో భద్రత వుందని నీవు నమ్మాలి. నీవూ అందరి స్త్రీలలాగే భర్తతో సుఖంగా వుండగలవని, తల్లివవగలవని నమ్మకం కల్గించడానికి శ్యాం నీకు చేయూత యివ్వడానికి సిద్దంగా వున్నాడు. ఆ చేయి అందుకునేది మానేది నీ యిష్టం. ఎవరి యిష్టాయిష్టాలకి నీ జీవితాన్ని బలిపెట్టకు. నీవు మరీ చిన్నపిల్లవి కావు. మైనారిటీ తీరినదానివి..."
"రాధా... నా కూతురికి యివన్నీ నేర్పిపెట్టి నానుంచి దూరం చేయాలని చూస్తున్నావు. దానికిప్పుడు పెళ్ళి తొందరలేదు. నీ సహాయానికి థాంక్స్. పెళ్ళి అవసరం అనుకున్నప్పుడు.... నా కూతురికింకెవరూ మొగుడు దొరకనప్పుడు వస్తాంలే...." హేళనగా అన్నాడు.
రాధాదేవి సహనం ఆఖరిమెట్టుకు వచ్చింది. "అప్పుడు నా కొడుకు నీకందే స్థితిలో వుండడు మాధవ్. శ్యామ్ కి తెలుసు మీరిలా మాట్లాడి అవమాన పరుస్తారని. అందుకే వెళ్ళవద్దన్నాడు. రేఖకోసం వచ్చాను. వస్తాను రేఖా.... నీకీ ఆంటీతో ఏ అవసరంవున్నా నిరభ్యంతరంగా రా అమ్మా."
"ఆగండి ఆంటీ.... నేను శ్యాం ని చేసుకుంటాను. నా కిష్టమే. నన్ను చేసుకోవడానికి ముందుకొచ్చిన శ్యాం ఔదార్యం నాకర్ధం అయింది. శ్యాంలాంటి భర్త, తల్లిలాంటి మీ నీడ దొరకడం అదృష్టం అనుకుంటాను" రేఖ స్థిరంగా అంది.
"రేఖా...." మాధవ్ ఏదో అనబోయాడు.
"డాడీ! నన్ను నా యిష్టానికి వదిలేయండి. నేను చిన్నపిల్లని కాను. ఆలోచించే శక్తి వుంది. డాడీ..... ఈ పరిసరాలలో నేనింక వుండలేను. ఆంటీ..... శ్యాంలాంటి ప్రేమమూర్తులుండేచోట వుండాలని వుంది. నన్ను క్షమించండి డాడీ" రేఖ గద్గదంగా అంది.
మాధవ్ మొహం నల్లబడింది.
"అక్కయ్యా! రేఖ శ్యాంని చేసుకోవడం నాకిష్టమే. కాని... కాని.... వాళ్ళిద్దరూ అన్నాచెల్లెళ్ళవరూ..." శారద కామాత్రం తెలివితేటలున్నందుకు ఆనందమే కలిగింది.
"ఎలా అవుతారు శారదా? ఒక తల్లికీ పుట్టలేదు, ఒక తండ్రికీ పుట్టలేదు. ఆ అనుమానం వద్దునీకు. పిచ్చిదానివనుకున్నా పరిస్థితి అర్ధం చేసికొన్నావు గాని, అతి తెలివితేటలున్న నీ భర్త ఆలోచన మారనందుకు విచారంగా వుంది." మాధవ్ వంక చూస్తూ అంది రాధాదేవి. మొహం మాడ్చుకున్నాడు మాధవ్.
"రేఖా! శ్యాం నీవు ఒకసారి కలిసి మాట్లాడుకోండి. మీ యిద్దరూ ఇష్టపడి చేసుకుంటే ఎవరూ చేయగలిగింది ఏమీలేదు" మాధవ్ మొహం గంటు పెట్టుకున్నాడు.
"రాధా.... ఆఖరికి గెల్చావు. నామీద కసి తీర్చుకున్నావు" అంటూ అక్కడినుంచి గదిలోకి వెళ్ళి తలుపు మూసుకున్నాడు దభాలున.
"మాధవ్... ఎప్పటికన్నా నీవు నన్నర్ధం చేసుకునేరోజు వస్తుంది" అంది బాధగా రాధాదేవి.
"ఆంటీ! బాధపడకండి. నేను డాడీకి చెపుతాను. ఆయనకు మతిపోయింది" అంది రేఖ.
"అక్కయ్యా... నీవెంత మంచిదానివి? నీ భర్తని నాకిచ్చావు. నీ కొడుకుని నా కూతురికిచ్చావు" అంటూ శారద అమాయకంగా రాధాదేవిని కౌగలించుకుని అంది.
25
"ఏమిటి రాధా... పేపరు పట్టుకుని అలా కూర్చున్నావు" పరధ్యానంగా ఏదో ఆలోచిస్తూ కూర్చున్న రాధాదేవి స్కూటరు ఆపి లోపలికి వచ్చిన రాజారాంని కూడా గమనించకపోవడంతో రెండునిముషాలు చూసి అతనే పలకరించాడు. రాధాదేవి ఉలిక్కిపడి తేరుకుని పేపరుమడిచి దీర్ఘంగా నిట్టూర్చి "రా కూర్చో.... ఏముంది... ఎక్కడ చూసినా ఆడవాళ్ళకి జరిగే అన్యాయాలే. పేపరు తెరిస్తే చాలు, మానభంగాలు, కట్నాలు తేలేదని భర్త, అత్తగారు హింసిస్తే భరించలేక ఆత్మహత్యలు చేసుకునే ఆడపిల్లలు..... కనీసం ఒక రేప్ కేసన్నా లేని రోజుండదు పేపరులో. ఏమిటో రాను రాను మనం పురోగమిస్తున్నామో, తిరోగమిస్తున్నామో అర్ధం కావడంలేదు. స్త్రీ చదువుకుంది ఉద్యోగాలు చేస్తుంది. యీ ఆధునికయుగంలోకూడా స్త్రీని కించపరిచే సంఘటనలు రోజుకు యిన్ని జరుగుతుంటే స్త్రీ సాధించిందేమిటన్న ప్రశ్న వస్తుంది నాకు. యీ సమానత్వం కబుర్లు అన్నీ కాగితాలమీదనేనా? స్త్రీకి ఈనాటికీ రక్షణలేని మనసమాజం సాధించిన ప్రగతి ఏమిటి?" ఆవేశంగా, ఆవేదనగా అంది రాధాదేవి.
"రాధా! నీ పిచ్చిగాని యీ స్త్రీ, పురుష రెండుతెగలు వున్నంతవరకు ఇలాంటివి తప్పవు. ఏ చట్టాలూ ఏమీ చెయ్యలేవు. అయినా యివన్నీ చదివి మనసెందుకు పాడు చేసుకుంటావు? బాధపడి నీవేం చెయ్యగలవు? నీ చేతిలో వున్నది నీవు చేశావు. ఒక ఆడపిల్ల జీవితం నాశనం కాకుండా సహృదయంతో ఆమెని కోడలిగా తెచ్చుకొనే ఏర్పాటు చేశావు. ఈ లోకంలో అందరికీ మనం సాయపడలేంగదా."
"అవుననుకో! కాని యీ వార్తలు చదువుతూంటే ఆవేశం వస్తుంది. ఏదో చెయ్యాలన్న ఆరాటం కలుగుతుంది. పాపం మరీ చదువుసంధ్యలులేని తక్కువకులాల స్త్రీలు బాలి అవుతున్నారు. రోజుకి ఎన్నికేసులు జరుగుతున్నాయో పల్లెలనిండా. ఆ స్త్రీల గొడు వినిపించుకునేవారెవరు! న్యాయం చేకూర్చవలసిన పోలీసులే, రక్షించాల్సినవారే భక్షిస్తున్నారు. కంచె చేను మేసినట్లు పోలీసులే ఇళ్ళల్లో జొరబడి పబ్లిక్ గా ఆడవాళ్ళమీద అత్యాచారాలు చేస్తుంటే ఇంక ఆ స్త్రీలకి రక్షణ ఎక్కడుంది? చెప్పినా వారిగోడు వినేవారు లేరు. న్యాయంకోసం పోరాడడానికి అర్ధబలం, అంగబలం రెండూ లేనివారికి దిక్కెవరు?