అనురాగ్ కు ఏం చేయాలో కొద్దిక్షణాలు అర్థం కాలేదు.
ఈ ముసల్ది ఒక పట్టాన బయటపడేలా లేదు.
కొద్దిక్షణాలు మౌనంగా సముద్రంకేసి చూస్తూ వుండిపోయాడు అనురాగ్.
పోనీ..... నందిగామ వెళ్ళి, రమణ జీవన విధానం ఎలా వుందో తెలుసుకుని వచ్చి ,ఆ విధంగా ఫాలో అవ్వాలంటే మరొక ప్రమాదం- మధుకిరణ్ రూపంలో పొంచి వుంది.
ఏం చేయాలి....?
ఎలా చేయాలి.....?
అన్వితను ఎలా దక్కించుకోవాలి.....?
ఆలోచిస్తూనే బయటికెళ్ళిపోయాడు.
అనురాగ్ ఎందుకొచ్చాడో......
ఎందుకు వెళ్ళాడో.....
అన్నపూర్ణమ్మకు ఏం అర్థంకాలేదు.
* * *
తన గెస్ట్ హౌస్ ముందు టాటాసుమోను ఆపి, లోనికి నడిచాడు అనురాగ్.
ఫ్యూన్ ఎదురొచ్చాడు అతనికి.
"సార్.....! మీకోసం ఎవరో వచ్చారు" చెప్పాడు.
డ్రాయింగ్ రూమ్ లోకి నడిచాడు అనురాగ్.
నలుగురు వ్యక్తులు.....
"మిస్టర్ అనురాగ్.....! నా పేరు రవి..... ఇతడు రమణ, వాళ్ళిద్దరు బుచ్చిబాబు, షాజహాన్ లు."
"ఏం కావాలి.....?"
"చందా కాదు.....!"
"మరి.....?"
"డైరెక్టుగా పాయింట్ లో కొచ్చేస్తున్నాను, అన్వితను నేను ప్రేమిస్తున్నాను. ఆమెను నువ్వు పెళ్ళి చేసుకోవాలని ఉవ్విళ్ళూరుతున్నావ్......నువ్వు ఆవిడని తప్ప, ఎవ్వరినయినా పెళ్ళి చేసుకొని, అమెరికా వెళ్ళిపో..... అది చెప్పడానికే వచ్చాను. నువ్వు అన్వితను మార్చిపోవడానికి నీకెంత కావాలో చెప్పు..... లేకపోతే నీ శాల్తీ వుండదు" అన్నాడు రవి.
"అన్వితకు మీలానే పరాయివాడి కాను..... సొంత....
"నాకు తెలుసు..... నిన్ను అన్విత ప్రేమించటం లేదని కూడా నాకు తెలుసు"
"నన్ను హెచ్చరించటం అనవసరం..... అసలు అన్వితను తనవేపు తిప్పుకోవడానికి ప్రయత్నిస్తోంది ఎవరో తెలుసా....?" మీ క్లాస్ మేట్ మధు. ముందు వాణ్ని సీన్ లోంచి తప్పించండి."
"మధూగాడా... వాడో పిచ్చివెధవ..... పిరికివాడు. వాడివల్ల నాకేం ప్రమాదం లేదు" అన్నాడు రవి ధీమాగా.
"గద్దలు కోడిపిల్లల కోసం తన్నుకుంటుంటే, కాకులు ఎత్తుకెళ్ళిపోతాయి.... గుర్తుంచుకో" అన్నాడు అనురాగ్.
"మిస్టర్ అనురాగ్! నువ్వు నాతో చేతులు కలుపు. అన్విత నాకు దక్కేలా చూడు. నీకెంత కావాలన్నా నేనిస్తాను" రవి ప్రపోజల్ కి వెంటనే అంగీకరించినట్టు నటించాడు అనురాగ్.
అనురాగ్ మాటల్ని నమ్మినట్టు నటించాడు రవి.
లవ్ - బిజినెస్ అయినప్పుడు - నమ్మకాలన్నీ, ఆ బిజినెస్ లో భాగాలే అవుతాయి.
అన్విత, శ్రావణితోపాటు దసపల్లా రెస్టారెంట్ లోకి వెళ్ళడం గమనించి డిటెక్టివ్ తేజ, కారు పార్క్ చేసి, తను లోపలికి నడిచాడు.
తేజను చూడగానే నవ్వింది అన్విత.
"మీకు ఫోన్ చేయాలనుకున్నాను. అనుకున్నప్పుడల్లా మీరు కనిపిస్తున్నాను" అన్నాడు తేజ ఆమెకు ఎదురుగా కూర్చుంటూ.
"నేను మీకు చాలాసార్లు కనిపించానా..... ఆశ్చర్యంగా వుందే....." అందామె.
"అవును..... కలలో....." నవ్వుతూ ఆమె రియాక్షన్ కోసం చూస్తూ అన్నాడు.
"మీరు నిజంగా ఎలక్ట్రీషియనేనా..... అని నా డౌటు" అందామె నవ్వుతూ.
"ఏం...."
"మీ బ్లాక్ డ్రస్.... మెజీషియన్స్ డ్రస్..... మీరు మెజీషియనా?"
అనుకోండి. మీరేమనుకుంటే నేనదే....."
"బైదిబై... నాకీ మధ్య ఓ విచిత్రమయిన వ్యక్తి పరిచయమయ్యాడు. ఏదో బిజినెస్ విషయంలో, అతను మీ క్లాస్ మేటట. పేరు....." జ్ఞాపకం తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్నవాడిలా కాసేపు నటించి-
"మిస్టర్ మధు. అతను మీ గురించి ఇష్టమొచ్చినట్లుగా మాట్లాడాడు. అతణ్ని మీరు ప్రేమించారా?" ఆ ప్రశ్నకు ఉలిక్కిపడింది అన్విత.
"నేనా..... ఎవరు చెప్పారు?"
"అతనే....!"
"ఇంకా ఏం చెప్పాడు?"
"మోసం చేశారట."
"నేనా..... అతణ్నా....?"
"అతణ్ని వదిలేసి ఇంకెవరితోనో....." ఆ మాట్లాకి అన్విత ముఖం కందగడలా ఎర్రగా అయిపోయింది.
ఆ రియాక్షన్నే అన్వితలో కోరుకునేది. ఆమెను సిన్సియర్ గా ప్రేమిస్తున్న మధును సీన్ లోంచి తప్పిస్తే, మిగతావాళ్ళు తనకో పెద్ద లెక్క కాదు.
"మిస్ అన్వితా... ఒడ్డు, పొడవు, వేషభాషలు, వీటినిబట్టి మనిషిని అంచనా వెయ్యకూడదు. అందంగా కనిపించే పువ్వుల పక్కనే పురుగులుంటాయి. అందంగా కనిపించే మనుషుల మనసుల్లో పురుగులాంటి నీచమైన ఆలోచనలుంటాయి, మీ ప్రేమ...."
ఏవో చెప్పబోతున్నాడు తేజ.
"అతను నన్ను ప్రేమించాడా? మీకా విషయం తెలుసా?" అడిగింది సీరియస్ గా అన్విత.
"అతనే చెప్పాడు. లేకపోతే నాకెలా తెలుస్తుంది?"
"గమ్మత్తుగా వుందే- కలిసి మాట్లాడినంత మాత్రాన ఫ్రెండ్ షిప్ తో ఇంటికొచ్చినంత మాత్రాన , దానికి ప్రేమ అని పేరు పెట్టేసుకుంటే, సరిపోతుందా? నో నెవర్..."
"పర్సనల్ విషయం అడుగుతున్నానని మరోలా అనుకోకండి. మీరింత వరకూ ఎవర్నీ ప్రేమించలేదా?"
ఆ ప్రశ్నకు ఆమె వెంటనే జవాబు చెప్పలేదు.
"సారీ....." అన్నాడు తేజ.
అతను, ఆమె జవాబు చెప్పలేకపోవడంతో చాలా ఆనందించాడు.
ఎక్కువ పరిచయం లేని ఒక వ్యక్తి, తన ప్రేమ గురించి మాట్లాడటం ఏమిటీ? తనని ఇంటర్వ్యూ చేయటం ఏమిటి..... అబ్జర్డ్....
"సారీ..... నే వెళుతున్నాను" అని సీటులోంచి లేచిపోయింది- బిల్ పే చేసి.
"నేను మిమ్మల్ని డ్రాప్ చేస్తాను" అన్నాడు తేజ.
"థాంక్స్..... కారుంది....." అందామె.
కారులో కూర్చుంది.
పక్కన శ్రావణి కూర్చుంది.
తన కారు దగ్గిర నిలబడి అన్వితవేపే చూస్తున్నాడు తేజ.
సరిగ్గా అదే సమయంలో, ఆ కారుకి దూరంగా ఆగిన ఇద్దరు వ్యక్తులు, అన్వితను ఫాలో అవుతూ వచ్చి అక్కడ నలభై నిమిషాల నుంచి ఎదురుచూస్తున్నరన్న విషయం తేజకు తెలియదు.
వాళ్ళిద్దరూ ఒకరు మధు - మరొకరు సుల్తాన్.
అన్వితతో తేజ రెస్టారెంట్ లోంచి బయటకు రావడం మధు ఊహించని పరిణామం.
'ఈ కాంబినేషన్ ఎలా కల్సింది?'
మధుకు బుర్ర తిరిగిపోతున్నట్టు వుంది. అన్విత, తేజ రెస్టారెంట్లో ఎందుకు కలుసుకున్నారు? కలుసుకోవలసిన అవసరం ఏమిటి?
* * *
"ఏంట్రా యిదంతా?" తనలో తను అనుకున్నట్లుగా అన్నాడు మధు సుల్తాన్ తో.
"నాకూ అర్థం కావడంలేదు. అనురాగ్ ని అన్విత ప్రేమిస్తోందని, నువ్వు ప్రేమించడం అనవసరమని నీతో తేజా చెప్పిన విషయం నిజమేనా? అని నాకు డౌటొస్తోంది" అన్నాడు సుల్తాన్.
"నిజం కాకపొతే ఎందుకు చెపుతాడు?" అన్నాడు మధు.
"చూడు మధూ! జీవితంలో అతి ప్రమాదకరమయినది మనిషి మనసు. అది ఒకప్పుడు దూదికన్నా మెత్తగా వుండొచ్చు. ఇంకొక్కప్పుడు పాముకన్నా భయంకరమయింది. స్వార్థం, అసూయ ఆ మనసులోకి ప్రవేశించినప్పుడు మనిషి భయంకరమయిన విష జంతువులా మారిపోతాడు.
నువ్వు తేజను నమ్మావు,
వాడు నీకిప్పుడు వ్యతిరేకంగా తయారయ్యాడని నాకనిపిస్తోంది.
ఎందుకో తెలుసా?"
"ఎందుకు?"
"నేను చెపితే నీకు కోపం వస్తుందేమో?"
"చెప్పు."
"వాడు కూడా అన్వితను ప్రేమిస్తున్నాడని నా అనుమానం."
ఆ మాట వినగానే తాగుతున్న కాఫీ చేదుగా అన్పించింది మధుకి.
"వాడింత నమ్మకద్రోహం చేస్తాడా?" అన్నాడు కోపంగా మధు.
"ఆవేశపడకు. ఇందులో నమ్మకమూ లేదు- ద్రోహమూ లేదు. అన్విత, అన్విత ఆస్తిపాస్తులు, ఆమె అందం చూశాక నేనే ఈ అమ్మాయిని పెళ్ళి చేసుకుంటే బావుండనిపించింది. అలాంటప్పుడు రవితేజకి మాత్రం ఎందుకనిపించదు? నిన్ను తప్పించడానికి ప్లాన్ వేశాడని నా అనుమానం" అన్నాడు సుల్తాన్.
"ఇప్పుడేం చేద్దాం?" అడిగాడు అసహనంగా మధు.
"అన్విత మనసును తెల్సుకుంటే తప్ప మనమేం చేయలేం. తేజ స్వరూపం గురించి అన్విత తెల్సుకుంటే, నీ నిజమయిన ప్రేమ విలువ అన్వితకు తెలుస్తుంది."
"ఎలా తెలుస్తుంది?"
"ఓపికపట్టు అంతే..... మన మైదానం నారాయణ మాస్టారు మీ నాన్నకు రెండుసార్లు ఫోన్ చేశారట. బహుశా డబ్బు విషయం మాట్లాడ్డానికే అయి వుంటుంది" చెప్పాడు సుల్తాన్.
"మా నాన్నతో నారాయణ మాట్లాడితే తీసుకున్న డబ్బు విషయం తెల్సిపోతుంది..... మా నాన్న రంకెలు వేస్తాడు" అన్నాడు మధు కంగారు పడిపోతూ.
"అయితే ఏం చేద్దాం?"
"మన పాత పద్దతి ఉంది కదా? ఫోన్ చెయ్యి" అన్నాడతను.
ఇద్దరూ హోటల్లోంచి బయటికొచ్చి, ఎస్. టి.డి. బూత్ వైపు నడిచారు.
బూత్ లోకి సుల్తాన్ వెళ్ళి ఏలూరుకి ఫోన్ చేశాడు.
* * *
ఆరోజు ఆదివారం....
ఇంట్లో వున్న తాళాలూ, కప్పలూ అన్నిట్నీ వరసగా నేలమీద పరిచి, ఒక్కొక్కదాన్ని నూనెతో తుడిచి, ఎండలో పెడుతున్నాడు మైదానం నారాయణ.
"ఏమేవ్! నీ సూట్ కేస్ తాళం కూడా తీసుకురా- దాన్ని తుడవాలి" అరుస్తున్నాడు నారాయణ.
"కొత్తగా మొన్ననే కొన్నది కదండీ..... అది వద్దులెండి..... పాత వాటిని తుడవండి" లోన్నుంచి జవాబిచ్చింది అతని భార్య.
"పాత కప్పల్నీ, తాళాల్నీ ఎలాగూ తుడుస్తాం. కొత్తవాటిని తుడిచినప్పుడే మనసుకు తృప్తి.....మన జీవితానికి భద్రతనిచ్చే తాళాలు కొత్తవయినా, పాతవయినా ఒకటే- తీసుకురా" మళ్ళీ లోనికి కేకేశాడు.