Previous Page Next Page 
కలగంటినే చెలీ పేజి 42

    అందుకే ఆ రోజు తీవ్రంగా చెప్పింది. "రేపు నువ్వు నీ అలవాటు ప్రకారం లెక్క పెడుతుంటావ్. అప్పుడు నీకు నువ్వే నీ నాలుక కొరుక్కుంటావ్ రక్తం వస్తుంది. ఇక అప్పట్నుంచి లెక్కపెట్టవు"

    అలా అని ఇంటికొచ్చేసింది చంద్రరేఖ. ప్రవీణను అలా కోప్పడినందుకు బాధగా వుంది, కానీ ఏం చేస్తుంది? తను ఎన్నిసార్లు సజెషన్ ఇచ్చినా లాభం లేకపోయింది. దాంతో కోపం వచ్చింది.

    అమాయకంగా, అప్పుడే విరిసిన గులాబీలాగా వున్న ప్రవీణతో అంత కఠినంగా వ్యవహరించానన్న బాధ ఆమెను కలవరపరుస్తూనే వుంది.

    మరుసటిరోజు ఆమె అటు వెళ్ళలేదు.

    ఇక ఎందుకు వెళ్లడం? సజెషన్స్ పనిచేయనపుడు వెళ్ళి ప్రయోజనం ఏముంటుంది?

    అందుకే ప్రవీణ ఇంటికి వెళ్ళకుండా స్నానం చేశాక ఆరుబయట మంచం వాల్చుకుని పడుకుంది.

    ఆకాశంలో చంద్రవంక వెండివంకిలా వుంది ఇంకా రాత్రి కాకపోవడంతో దాని ప్రభావం ఏమీ లోకంమీద లేదు. చీకట్లు యింకా పగటితో దోబూచులాడుతున్నాయి. గాలి కర్నాటక సంగీతపు రాగంలా విరామం లేకుండా వీస్తోంది.

    చిట్టి వంట చేస్తున్నాడు.

    చంద్రరేఖ ఏదో ఆలోచిస్తూ వుండగా ప్రవీణ తల్లి వచ్చింది. ఆమె ఎప్పుడూ ఇతర ఇళ్ళకు రాదు. అలాంటిది ఆమే స్వయంగా వచ్చిందంటే ఏదో కారణం ఉండాలి.

    చంద్రరేఖ కంగారుగా లేచి కూర్చుంది.

    " ఏమిటక్కా?" ఆందోళనతో అడిగింది.

    ఆమె ముఖం సంతోషంతో వెలిగిపోతోంది.

    "ప్రవీణకు బాగయింది. లెక్కలపిచ్చి వదిలింది." అంది చంద్రరేఖ పక్కనే మంచంమీద కూర్చుంటూ.

    "నిజమా!" ఆశ్చర్యపోయింది చంద్రరేఖ.

    "ఆఁ నిన్నరాత్రి యథాప్రకారం భోజనం తింటూ తినే ముద్దల్ని లెక్క పెడుతోంది. మధ్యలో ఏమైందో ఏమోగానీ లెక్క పెడుతూ నాలుక కొరుక్కుంది. రక్తం వచ్చింది. నోరంతా ఎర్రగా, భయపడిపోయాం. అంతే -లెక్కపెట్టడం మానేసింది. ఆ తర్వాత ఇప్పటివరకు ఇరవయ్ నాలుగు గంటలు దాటినా లెక్కల జోలికి పోలేదు" ప్రవీణ తల్లికి సంతోషం పొంగుతోంది.
 
    అంటే తను కోపంగా ఇచ్చిన సజెషన్ పనిచేసిందన్నమాట. పేషెంట్ ను అలా కోపగించుకున్నందుకు బాధపడ్డా, అదిప్పుడు పనిచేయటంతో ఆనందంగా వుంది చంద్రరేఖకి.

    "పోనీలే మీ అమ్మాయి పెళ్ళికావాల్సిన పిల్ల - ఆ పిల్లకు బాగవడం ఎంతో సంతోషాన్నిస్తుంది" అని ప్రారంభించి ఓ అమ్మాయిని ఎలా పెంచాలో గంటసేపు చెప్పింది చంద్రరేఖ.

    "ఓ అమ్మాయి, ఓ అబ్బాయి కలిసుండడం మహా పాపం అని మీ భార్యాభర్తలిద్దరూ అలా వూదరగొట్టడం మంచిదికాదు. రేపు పెళ్ళయ్యాక కూడా ఆ భావనే కంటిన్యూ అయిపోతే ఆ పిల్ల పడకలో సుఖపడకపోయే ప్రమాదముంది. దాంతో లేనిపోని సమస్యలొస్తాయి" అని ముగించింది.

    అంతా అర్ధమైనట్టు ప్రవీణ తల్లి తలూపింది.

    వెళ్ళేటప్పుడు "నీమేలు జన్మజన్మలకి మరిచిపోలేను. మా ఆయనతో చెప్పి నీకు మంచి పట్టుచీర పెట్టిస్తాలే" అంది.

    "అవేమీ వద్దు  -వూరంతా బావుంటే నాకంతే చాలు"

    ప్రవీణ తల్లి మరోమారు చంద్రరేఖకి కృతజ్ఞతలు చెప్పి వెళ్ళిపోయింది.

    చంద్రరేఖకి ఎంతో సంతృప్తిగా వుంది. ప్రవీణకు బాగవడం తను సాధించిన విజయంలా తోచింది.

    అలా కళ్ళు మూసుకుని ఆ ఆనందాన్ని అనుభవిస్తుండగా చిట్టి భోజనానికి రమ్మని పిలిచాడు.

    భోజనం ముగించుకుని తిరిగొచ్చి మంచంమీద పడుకుంది. ఏదో ఆలోచనలో వుండగా రాధ వచ్చింది.

    "ఏం అక్కా! నిద్రపోతున్నావా?" అనడిగింది రాధ మంచం పక్కన కింద కూర్చుంటూ.

    "లేదే" అని తిరిగి లేచి కూర్చుంది.

    "ఏమిటే విశేషాలు? శశి ఎలా వుంది?" అనడిగింది.

    రాధ భూపతిరెడ్డి ఇంటిలో పనిచేస్తోంది. పాచిపనంతా చేసినందుకు సంవత్సరానికి రెండువేల రూపాయలు ఇస్తారు. ఇరవయ్ నాలుగ్గంటలూ ఆ యింటిలో వుండడంవల్ల రాధకి అన్ని విషయాలూ తెలుస్తాయి.

    "అదేనక్కా బాధగా వుంది. అమ్మాయి పరిస్థితి బావుండలేదు" రాధ ఎంత బాధపడుతుందో తెలుస్తూనే వుంది.

 Previous Page Next Page