Previous Page Next Page 
కలగంటినే చెలీ పేజి 41

    ఇలా అన్ని ఆధారాలూ దొరకడంతో లోకయ్యకు పట్టిన దెయ్యం మునీంద్రేనని నిర్ధారించారు.

    దామాచారి మంత్రాల మహాత్యంవల్ల కాబోలు లోకయ్యకు స్వస్థత చేకూరింది. కానీ దెయ్యం వదల్లేదు. అప్పుడప్పుడూ వాలుతూనే వుంది.

    లోకయ్య ఈ మధ్యనే కొత్త వ్యాపారం ప్రారంభించాడు. అది దొంగసారా. సాయంకాలమైతే దుకాణం తెరిచేస్తాడు. ఈ పల్లెటూర్లో రోజూ తాగాలంటే డబ్బు లెక్కడివి?  అందుకే తాగుబోతులు అప్పుడప్పుడూ అరువు అడిగినా లోకయ్య ఇచ్చేవాడు కాదు.

    దాంతో తాగుబోతులంటా కసిగా వాళ్ళింటిముందు తచ్చాడుతూ వుండేవాళ్ళు.

    వారం లో రెండు మూడు రోజులైనా లోకయ్యకు దెయ్యం వాలేది. దెయ్యం పట్టడం తరువాయి ఈ తాగుబోతులంతా వేపమండలు తీసుకుని లోకయ్యను తెగకొట్టేవాళ్ళు. అప్పు పోయని లోకయ్య మీద ఇలా కసి తీర్చుకోవడం ప్రారంభించారన్న మాట.

    "దెయ్యం సాకుతో ఇలా చావబాదుతున్నారన్నమాట" అంతా విని యోగీంద్ర అన్నాడు.

    మిగిలిన వాళ్ళంతా లోకయ్య అవస్థ గుర్తొచ్చి నవ్వుకుంటున్నారు.

    కుర్రకారంతా ఇలా నవ్వుల్లో తేలుతుండగా చంద్రరేఖ వీధిలో పోతూ వాళ్ళను గమనించింది.

    అందులో రమణ వున్నాడేమోనని చూసిందికానీ లేడు. ఆ రాత్రి చూసిందే. ఆ తరువాత కనిపించనేలేదు. గురుదక్షిణ ఇచ్చాడో లేదో తెలుసుకుంటే బావుండు. ఆ లోపం సరిచేసుకునే వుంటాడు అనుకుంటూ ముందుకి నడిచింది. మరో అయిదు నిముషాలకి ఆమె ప్రవీణ ఇంటికి చేరుకుంది.

    ఆమె వెళ్ళేసరికి ప్రవీణ బెడ్ రూమ్ లో వుంది.

    కారణం తెలిసింది కనుక బాగుచేయడం సులభమే ఆమెకి లెక్కల పిచ్చి ఎలా పట్టిందో అర్ధమైంది.

    కానీ ట్రాన్స్ లో వున్నప్పుడు చంద్రరేఖ ఇస్తున్న సంకేతాలు పని చేయడంలేదు. లెక్కలపిచ్చి ఇంకా ప్రవీణకు వదల్లేదు. అందుకే చంద్రరేఖ చాలాసార్లు అక్కడికి రావాల్సి వస్తోంది.

    "హల్లో" అంటూ బెడ్ రూమ్ లోకి వెళ్ళింది ఆమె.

    భాగవతం చదువుతున్న ప్రవీణ పుస్తకం మూసి తలుపువైపుకి తిరిగింది.

    "రా అక్కా" మంచం దిగుతూ ఆహ్వానించింది.

    చంద్రరేఖ వెళ్ళి మంచంమీద కూర్చుంది.

    ప్రవీణ పక్కనే కూర్చుని "ఏమిటక్కా! నిన్న వస్తానని రాలేదు" అని అడిగింది.

    "ఫ్యాక్టరీలోనే లేటయింది. ఇంటికి వచ్చేటప్పటికి బాగా ఆలస్యమైంది. అందుకే రాలేకపోయాను?" అంది. అంతకుముందు రెండు రోజులుగా చికిత్స మొదలు పెట్టింది చంద్రరేఖ.

    సెక్స్ ఎంత సహజమో చెప్పింది. అదేమీ పాపం కాదని, అలాంటి పనులు చేస్తే దేవుడికి కోపం వస్తుందన్నది ఒట్టి అబద్దమని చెప్పింది.

    "నువ్వు రవితో ప్రవర్తించింది ఏమీతప్పుకాదు. దానివల్ల నీశరీరం, నీ ఆత్మ మైలపడిందని అనుకోవద్దు. నీ స్థానంలో వున్న ఏ ఆడపిల్లయినా అలానే ప్రవర్తిస్తుంది. నీ తల్లి దండ్రులు ఎంత చెప్పినా నీ శరీరం తన ధర్మాలను తను నిర్వర్తిస్తుంది.

    ఆకలేసినప్పుడు కడుపులో నకనకలు మొదలవుతాయి. అలానే ఓ అబ్బాయి నిన్ను స్పృశించినప్పుడు నీలో స్త్రీత్వం మేల్కొంటుంది. నువ్వు రవితో వున్నప్పుడు అతన్ని నీ భర్తగా ఊహించుకున్నావు. అందుకే నీలో స్పందనలు కలిగాయి. దాన్ని బలవంతంగా ఆపుకోవడానికి లెక్కలు వేశావు. అదే అలవాటయిపోయింది. ఇక దాన్ని నిలిపేయాలి"

    ప్రవీణ బుద్దిగా వింది.

    ఆమెను అలానే మంచంమీద పడుకోబెట్టి ట్రాన్స్ లోకి నెట్టింది చంద్రరేఖ.

    ఆమెను మగత కమ్మేసినప్పుడు సజెషన్ ఇచ్చింది.

    "ఇక ఎప్పుడూ అలా లెక్కపెట్టవు" అని వచ్చేసింది.

    రెండోరోజుకి ప్రవీణకు బాగవలేదు.

    ఆ సజెషన్ పనిచేయలేదు.

    మరుసటిరోజు మళ్ళీ ప్రవీణను హిప్నటైజ్ చేసింది. ఎంతకి లెక్కల పిచ్చి మానకపోవడంతో చంద్రరేఖకి కోపం వచ్చింది.

    ఎంతచెప్పినా పాఠం నేర్చుకొని స్టూడెంట్ మీద టీచర్ కి వచ్చే కోపం లాంటిది.
   

 Previous Page Next Page