Previous Page Next Page 
శుభోదయం పేజి 41


    "రేఖా! నీకు చెప్పిందంతా మర్చిపోయావా? ఆ విషయం మరిచిపొమ్మని చెప్పానా.... యింతపని చేస్తావా యీ విషయానికి..."
    "ఇంకా ఏం జరగాలి ఆంటీ? శ్యాంని హేళన చేసినందుకు శ్యాంలాంటి వాడిని నేనూ కంటాను. పెళ్ళికానితల్లినవుతాను. అంతా నవ్వుతారు. ఆంటీ.....నా గర్వానికి దేముడు ఇలా శిక్షించాడు" మళ్ళీ ఏడవడం ఆరంభించింది రేఖ.
    "ష్...రేఖా, నీవిలా ఏడిస్తే నేను వెళ్ళిపోతాను. నీవిలా బాధపడితే నాకు చాలా కోపంవస్తుంది. రేఖా, చూడు. నావంక చూసి ముందా కళ్ళు తుడుచుకో" అంటూ పమిటకొంగుతో కళ్ళు వత్తింది.
    "నా కూతురి బతుకు అన్యాయం అయిపోయింది..... యింక దాన్ని ఎవడు పెళ్ళాడుతాడక్కయ్యా" శారద ఏడ్చింది.
    "శారదా, నీవింక ఒక్కమాట మాట్లాడకు. నీవే అసలు రేఖకి పిరికిమందు పోస్తున్నావు" గదమాయించింది.
    వాళ్ళమాటలు వింటున్న మాధవ్ కి రాధాదేవిని వదలుకుని తనెంత పొరపాటుచేశాడో మరోసారి బాగా తెలిసివచ్చింది. గత యిరవయ్యేళ్ళలో రాధాదేవిని వదిలి తనెంత నష్టపోయాడో ఎన్ని వందలసార్లో తెలిసింది. రాధాదేవి అందం, రాధాదేవి మంచితనం, రాధాదేవి సంస్కారంతో... ప్రతిదానికి శారదని పోల్చిచూసుకుని ప్రతిక్షణం తను కోల్పోయినదాని విలువ గ్రహించి బాధపడ్డాడు. దేని విలువా దగ్గిర వుండగా తెలియదు. రాధాదేవి వెళ్ళాక, శారదని పెళ్ళిచేసుకున్నాక, ఆ అమాయకురాలితో కాపురం నిప్పులమీది నడకలాగే వుండి ప్రతి చిన్నపని, పెద్దపని, ఆడపని, మగపని అన్నీ చేసుకుని సంసారం నడుపుకుంటున్నప్పుడల్లా రాధాదేవి గుర్తువచ్చేది. పిల్లలు తల్లి ఆసరా లేకుండా పెరిగారు. ఈరోజు.... రాధాదేవి రేఖని ఓదార్చి కన్నతల్లిలా బుజ్జగిస్తుంటే.... పిల్లలకి కావాల్సింది ఇలాంటి తల్లి, తనకి కావాల్సింది ఇలాంటి భార్య అనిపించింది. ఇలాంటి భార్యని చేతులారా దూరం చేసుకున్న తనకీశిక్ష సరిఅయిందే. ఆలోచిస్తూ కుమిలిపోయాడు మాధవ్. రేఖా... చూడమ్మా.... మనకి అక్కరలేదనుకుంటే గర్భం తీయించుకోవడం మూడునిముషాల పని. ఎబార్షన్ లీగలైజ్ అయింది. అందులో ఇలాంటి స్థితిలో అసలు అభ్యంతరం లేదు. రేఖా! దీనికోసం ఇంత బెంగపడ్డావా?" కాని యింక పెళ్లవుతుందా అక్కయ్యా? యిప్పటికే వూరూవాడా తెలిసింది" దైన్యంగా అంది శారద.
    "శారదా.... జీవితానికి పెళ్ళి ముఖ్యమేకాని, పెళ్ళి లేకపోతే జీవితం లేదనుకోవడం వెర్రి. అసలు రేఖకి ఆ బాధలేదు. నేను పెళ్ళికొడుకుని వెదికాను. మీకిష్టం అయితే ఆ పెళ్ళి రేపే జరుగుతుంది.
    రేఖ, శారద ఆశ్చర్యంగా చూశారు. వింటున్న మాధవ్ అంతకంటే విస్తుబోయాడు. రేఖని.... యింత జరిగాక పెళ్ళిచేసుకుంటానని ముందుకు వచ్చిన ఆ ఔదార్యవంతుడెవరు?... నిజంగా అతనే అభ్యంతరం లేకుండా పెళ్ళి చేసుకుంటాడు? ఒకదాని తరువాత ఒకటిగా జరిగిన సంఘటనలు అతనిని మతి పోగొట్టాయి. ముందు ఎబార్షన్ చేయించాలి. రేఖ విషం మింగి చావు బతుకుల మధ్య ఊగిసలాడి ఒక్కరోజులో గుర్తుపట్టలేనంత బలహీనంగా అయింది. డాక్టరు ముందు కాస్త కోలుకున్నాక అబార్షన్ చేస్తాం అన్నారు. వర్రీ అవడానికి ఏంలేదని అందరు డాక్టర్లు ధైర్యంచెప్పారు. ముందు అబార్షన్ చేయించి, రేఖని బాగా చదివించాలి. ఉద్యోగం చేయించాలి. పెళ్ళి అంత సులువుగా అవదని అతనికీ తెలుసు. ఈ దేశంలో మానం పోగొట్టుకుని, గర్భం వచ్చిన స్త్రీకి అంత సులువుగా పెళ్ళి జరగదని తెలుసు. ఏమో, ఎప్పుడో, ఎన్నేళ్ళు పోయాక. ఏ ఉద్యోగమో చేసుకుంటూండగా ఎవరన్నా కోరి చేసుకుంటే చేసుకోవచ్చు. యిప్పుడు, ఈ జరిగింది అందరి మనసుల్లో వుండగా రేఖకి పెళ్ళి కావడం దుర్లభం. పెళ్ళిమాట మరిచిపోయి రేఖని బాగా చదివించాలి. అని గుండె దిటవు చేసుకున్నాడు. ఆ ఆలోచనలు వచ్చినప్పుడల్లా రాధాదేవిని తను ఎంత నిర్ధయగా దూరం చేశాడో, భార్యని తాకడానికి కూడా యిష్టపడకుండా ఎంత నిరాదరణ చూపాడో.... అన్నీ గుర్తు వచ్చి గుండెల్లో ముల్లు గుచ్చుకున్నట్లుండేది. పెళ్ళిచేసుకున్న భార్యతో సంసారం చేయడానికే తనకిష్టం లేకపోయినప్పుడు - ముందుకు వచ్చి తన కూతుర్ని చేసుకునే వాడెవడు? రాధ బాధ, ఆవేదన అర్ధంఅయి రేఖకి జరిగిన దానికంటే గతంలో తను రాధకి చేసిన అన్యాయం గుర్తువచ్చి మనిషి కృంగిపోయి కృశించి పోయాడు. ఇంత జరిగినా, పోలీసు కంప్లయింట్ యిచ్చి ఆమె పరువుని రోడ్డుకెక్కించి అవమానించినా, తన కూతుర్ని  అభిమానించి, ఓదార్చి, ధైర్యంచెప్పి పెళ్ళి సంబంధం తీసుకొచ్చిన రాధ మంచితనం అతని గుండెని కోసింది. అతనికి తెలియకుండానే కుతూహలంగా లేచి గుమ్మం దగ్గిరకి వచ్చి నిల్చుని ఆరాటంగా చూశాడు.
    "నిజమా అక్కయ్యా! ఎవరక్కయ్యా అతను?" శారద ఆనందంగా అడిగింది. రేఖ విభ్రాంతురాలై చూడసాగింది.
    "రేఖా.... నీ కిష్టమైతే... మాధవ్... మీ అందరి కిష్టం అయితే మా శ్యాం రేఖని చేసుకుంటాడు" రాధాదేవి అందరి మొహాలవంక చూస్తూ అంది.
    ఒక్క నిముషం అంతా నిశ్శబ్దం అయిపోయింది. ఫేను తిరుగుతున్నచప్పుడు తప్ప ఏమీ వినపడలేదు. అందరిలోకి ముందుగా తేరుకున్నది మాధవరావే.
    "శ్యాం... శ్యాంతో పెళ్ళా? వీల్లేదు. నేను వప్పుకోను.... రేఖకి పెళ్ళికాకపోయినా ఫరవాలేదు. కాని... కాని... ఎవడో రౌడీకి పుట్టినవాడికి.....ఆ నల్లవాడికి నా కూతుర్నీయను" ఆవేశంగా అన్నాడు.
    రాధాదేవి మొహం ఎర్రబడింది. అయినా రేఖకోసం ఆవేశం అణచుకుంది. "మాధవ్, శ్యాం నా కొడుకు. వాడిని ఒక్కమాట ఏదన్నా అంటే వూరుకోను. ఇంత జరిగినా నీకింకా ఉచితానుచితాలు తెలుసుకునే జ్ఞానం రాలేదంటే విచారంగా ఉంది. కాని.... రేఖకి జరిగింది మరిచిపోయావా?... కట్టుకున్న పెళ్ళానికి శీలభంగం కల్గిందని వదిలేసిన నీలాంటి పుణ్య పురుషుడున్న దేశం యిది. అలాంటిది శీలంపోయిన ఆడదాన్ని కట్టుకోవడానికి ముందు కొచ్చే మగాళ్ళు వెయ్యికి ఒకరన్నా ఉండరేమో. నిన్ను నీవే అడుగుకో! చాటుమాటుగా ఎన్నెన్ని చెయ్యచ్చు? బయటపడనంతవరకు అందరూ పవిత్రులే. కానీ, తెలిసి తెలిసి బట్టబయలై నలుగురినోట పడిన ఓ ఆడపిల్లని పెళ్ళాడడానికి వచ్చే ఉదారులు ఎవరు? ఈ సంగతి ఆలోచించు."
    "అంటే నీ కొడుకు ఉదారుడన్నమాట. నీవు త్యాగం చేసి నన్ను ఉద్ధరించి నీ త్యాగనిరతి లోకానికి చెప్పాలనుకున్నావన్నమాట" అతనితోతిరిగి పాత అహం తలెత్తింది. తీరా అన్నాక అంత కటువుగా మాట్లాడకపోవల్సింది అనిపించింది అతనికి.

 Previous Page Next Page