కైలాసగిరి, శివాలయంలోంచి బయటికొచ్చాడు మధు.
మెట్లమీద కూర్చున్నాడు.
సుల్తాన్ వచ్చాక, అతనితో మాట్లాడాక, తనేం చెయ్యాలో నిర్ణయించు కోవాలనుకున్నాడు మధు.
కొండమీంచి సముద్రం, ఆ సముద్రపు అలలమీద తేలుతూ వెళుతున్న పడవలు, సంజీవదేవ్ వేసిన వర్ణచిత్రాల్లా కన్పిస్తున్నాయి.
"హలో...." ఆ పిలుపుకి తల తిప్పి చూశాడు మధు.
ఎడమపక్కన, ధ్వజస్తంభం దగ్గర అన్విత.
ఆ సమయంలో ఆమె అక్కడికి రావటం ఆశ్చర్యాన్నీ, ఆనందాన్నీ కలిగించింది.
ఎర్రంచు తెల్లచీరలో, వెన్నెలతో గీసిన మంచుబొమ్మలా వుంది. ఆమె ప్రక్కన శ్రావణి.
"ఏమిటీ? ఒంటరిగా కూర్చున్నారు...... యోగా చేస్తున్నారా.........?" అడిగింది నవ్వుతూ దగ్గరికి వస్తూ.
"అవును....." పేలవంగా నవ్వాడు.
వచ్చి మెట్లకు రెండోవైపున కూర్చుంది అన్విత.
శ్రావణి గుడిచుట్టూ ప్రదక్షిణాలు చేస్తోంది.
"ఎంతవరకొచ్చింది..... మీ బిజినెస్?"
"నాకు ఉత్సాహంగా వుంది! కానీ బిజినెస్ ఎలా చెయ్యాలో తెలీదు. అంచేత.... ఏలూరు వెళ్ళిపోదామనుకుంటున్నాను ...." చాలా నిరాశగా అన్నాడు మధు.
"నేను ఓడిపోతాననీ, నేను ఓటమిని చవిచూస్తాననీ మానసికంగా బలవంతులు కాని వారు అనుకుంటారు. దృఢ సంకల్పం కలిగినవాళ్ళు ఓటమి పరిస్థితులని విజయంవైపు మలుచుకుంటారు."
"కొటేషన్లు చెప్పడానికి బావుంటాయి" అన్నాడు చిరాగ్గా.
"కరెక్ట్ వేలో మరోసారి ట్రై చెయ్యండి. యూవిల్ గెట్ సక్సెస్.... ఆత్మవిశ్వాసం వుండాలి దేనికైనా. అప్పుడే దేనినైనా, ఎవరినైనా సాధించగలుగుతారు. మా ఇంటికెప్పుడొస్తారు?" అందామె.
మధులో తిరిగి ఏదో ఆశ..... చిన్న విత్తనం మొలకెత్తినట్లుగా.
తనంటే ఆమెకు అసలు ఇష్టంలేకపోతే, ఎందుకు అభిమానంగా మాట్లాడుతుంది?
లేక- ఎంతో అభిమానంగా వున్నట్లు నటిస్తోందా? ఆలోచిస్తున్నాడు అతను.
అదే సమయంలో-
రోడ్డు కెదురుగా వున్న రెస్టారెంట్ లోంచి బయటికొచ్చిన వ్యక్తి, దూరంగా మెట్లమీద కూర్చున్న అన్వితను, ఆ పక్కనున్న మధును చూశాడు.
అన్విత తననెందుకు ప్రేమించడంలేదో తనకు ఎందుకు దూరంగా వుంచుతుందో అతనికర్థమై పోయింది.
కిందికొచ్చి, టాటాసుమోలో కూర్చుని గ్లాస్ విండోస్ క్లోజ్ చేసి వాళ్ళను అబ్జర్వ్ చేయసాగాడు.
అన్విత అతనితో నవ్వుతూ మాట్లాడటం, అతనికెందుకో అసహనంగా వుంది. దుర్భరంగా,దుస్సహంగా వుంది.
అరగంట తర్వాత......
మధు, అన్విత, శ్రావణి మెట్లు దిగి గుడి బయటికొచ్చారు. అన్విత, శ్రావణి ఆటో ఎక్కారు.
మధు హీరోహోండాని స్టార్ట్ చేశాడు.
ఆ హీరో హోండాని టాటాసుమో ఫాలో అవుతోంది.
పావుగంట తరువాత మధు శివాజీపాలెంలో తన ఫ్లాట్ పార్కింగ్ ప్లేస్ లో హీరో హోండాని పార్క్ చేసి ఫలాట్ లోకి వెళ్ళాడు.....
ఆ వ్యక్తి టాటా సుమోని రోడ్ పక్కన పార్క్ చేసి, ఆ ప్లాట్ లోని పార్కింగ్ ప్లేస్ లో వుంచిన హీరోహోండా దగ్గరికొచ్చాడు.
అటూ ఇటూ చూశాడు.
హీరో హోండాని ధ్వంసం చేశాడు.
అతని కసి ఇంకా తీరలేదు. ఫ్లాట్స్ వేపు నడిచాడు.
అటూ ఇటూ చూస్తున్నాడు.....
ఆ సమయంలో మధు డ్రాయింగ్ రూమ్ లో కూర్చుని సిగరెట్ కాలుస్తున్నాడు ఏవో ఆలోచిస్తూ.
సడన్ గా డోరు తెరుచుకుని లోనికొచ్చి, డోర్ పైన గెడపెట్టి- తన వైపుచూస్తున్న ఆ వ్యక్తివైపు చూశాడు మధు ఆశ్చర్యంగా.
ఎక్కడో చూసినట్లు జ్ఞాపకం..... కానీ గుర్తుకు రావడంలేదు.
"నేను నీతో మాట్లాడటానికీ, డిస్ కస్ చేయడానికీ రాలేదు...... నువ్వు ఇరవై నాలుగుగంటల్లో, వైజాగ్ వదిలి వెళ్ళిపోవాలి. అందుకు నీకెంతోకావాలో అడుగు...... ఇదిగో బ్యాంక్ చెక్" అంటూ చెక్ బుక్ తీసి బ్యాంక్ లీఫ్ ని మధువేపు విసిరాడు కోపంగా.
ఈ ఆకస్మిక పరిణామానికి నిరుత్తరుడైపోయాడు మధు.
"మీరెవరు.......?"
"నీకనవసరం."
"నేనెందుకు వెళ్ళిపోవాలి?" సూటిగా ప్రశ్నించాడు మధు.
"ప్రశ్నలు వొద్దు..... నో మోర్ క్వశ్చన్స్..... ప్రశ్నలు వేసేవాడు అంటే నాకసహ్యం. వెళ్ళిపో" అరిచాడు ఆ వ్యక్తి.
"ఎందుకు వెళ్ళిపోవాలి?"
"ఇందుకు....."
జేబులోంచి ఒక ఫోటో తీసి చూపించాడు ఆ వ్యక్తి.
ఆ ఫోటోలో అన్విత!
"షి ఈజ్ మైన్...... నాకు కాబోయే భార్య! అన్వితను నవ్వు నీలాగే మరికొంతమంది ఇడియట్స్ ఆమెకోసం వల వేస్తున్నారు. అయ్ డోంట్ లైక్ దిస్..... నిన్ను, వాళ్ళని అవసరమయితే చంపేస్తాను...... నా టార్గెట్ లో నువ్వు ఫస్ట్. అర్థమైందా?"
"నీకు గట్స్ వుంటే అన్వితను పెళ్ళి చేసుకో! నన్ను బెదిరించడం వల్ల ఉపయోగం లేదు" కోపంగా అన్నాడు మధు.
"వెళ్ళవా?"
"వెళ్లను."
ఆ వ్యక్తి గబుక్కున ముందుకొచ్చి, కోపంగా మధు కంఠాన్ని పట్టుకుని, కాలెత్తి పొట్టమీద తన్నాడు.
మధు బాధతో మెలికలు తిరిగిపోయాడు. అంతలో నిలదొక్కుకుని పిడికిలి బిగించి, ఆ వ్యక్తి నుదుటిమీద ఒక్కటిచ్చాడు. ఆ దెబ్బకి ఆ వ్యక్తి వెనక్కి పడిపోయాడు.
కిందపడిన ఆ వ్యక్తి మీదపడి దబదబా నాలుగిచ్చుకున్నాడు మధు.
బరబరా లాక్కొచ్చి-
డోర్ దగ్గర వదిలేశాడు.
"చూడు మిస్టర్! మరోసారి నా జోలికొచ్చావో..... మర్డర్ చేసేస్తాను. పోలీసులకి ఫోన్ చెయ్యకముందే వెళ్ళిపో."
కిందపడిపోయిన ఆ వ్యక్తి ఉగ్రంగా అతనివేపు చూస్తూ-
"మరోసారి చెప్తున్నాను....... నా గురించి నీకు తెలీదు! నేనేమైనా చెయ్యగలను. ట్వంటీఫోర్ అవర్సు టైమిస్తున్నాను ఇప్పుడు ఓడిపోయి, భయపడి వెళ్లడం లేదు. గుర్తుంచుకో" చాలా కూల్ గా చెప్పి, లేచి వరండా మీద కెళ్ళిపోయాడు ఆ వ్యక్తి.
ఆ వ్యక్తి అనురాగ్.....
* * *
సముద్రం వైపునున్న బాల్కనీలో కూర్చుని, కుక్కపిల్లతో ఆడుకుంటోంది అన్నపూర్ణమ్మ.
ఆమెకెదురుగా అనురాగ్....... ఆవేశంతో అటూ ఇటూ పచార్లు చేస్తున్నాడు.
"ఇంతకీ మీ మనవరాలు అన్వితకు ఎలాంటి భర్త రావాలనుకుంటున్నావు?"
కుక్కపిల్లని ఒళ్ళోనుంచి కిందకి దింపింది అన్నపూర్ణమ్మ.
"చేసేపని ఏదైనా దానిమీద ఏకాగ్రత, అంకితభావంలేని వెధవలంటే నాకు చాలా అసహ్యం. వాళ్ళెప్పటికీ ఎదగలేరు. ఏం సాధించలేరు. ఒక పని చేస్తూ, వేరొకటి ఆలోచించేవాడి మూలంగానే మనదేశం యిలా తగలబడి పోతోంది.....
నేను ఆ అమ్మాయిని ప్రేమించాను, ఈ అమ్మాయిని ప్రేమించాను అని చెప్పే అర్భకులే కాని తనకున్న భావాల్ని గట్టిగా నాలుగు తెలుగు ముక్కల్లో ఉత్తరం రాయటం రాణి భాషాద్రోహులెక్కువ పోతున్నారు."
"కొంచెం సూటిగా చెప్పకూడదూ" చిరాకును అణుచుకుంటూ అన్నాడు అనురాగ్.
అతని మాటలకు అన్నపూర్ణమ్మ పెద్దగా నవ్వింది.
"ప్రజలు దేవుడిలా పూజించే దేవినేని రమణలాంటి వాళ్ళు దిరికితేనే నా మనవరాలికి పెళ్ళి చేస్తా. లేదంటే అసలు పెళ్ళే చేయను" అని ఆమె ఆవేశంగా అంటుంటే బిత్తరపోయాడు అనురాగ్.
"ఇదెక్కడి గొడవ...... అన్నిరకాల మంచి లక్షణాలు ఒకే వ్యక్తిలో వుండటమనేది అసాధ్యమైన విషయం. దేవినేని రమణాలాంటి వ్యక్తి కోటికొకరు వుంటారో లేదో......? ఆయన తమ్ముడు ఉమామహేశ్వరరావుకి కూడా పెళ్ళయిపోయిందట. ఇక నీ మనువరాలికి భర్త దొరకడం చాలా కష్టం" కోపాన్ని దాచుకుంటూ అన్నాడు అనురాగ్.
"పోనీ..... ఇంకో తమ్ముడు చంద్రశేఖర్ అనే అతనున్నాడట కదా? అతనికి నా మనవరాలినిచ్చి పెళ్ళి చేస్తాను" గర్వంగా అంది అన్నపూర్ణమ్మ.
"అతనిక్కూడా పెళ్ళయిపోయింది" చిరాకును దాచుకుంటూ అన్నాడు అనురాగ్.
"ఏమిటో..... మంచి వాళ్ళందరికీ ముందు పెళ్ళిళ్ళయిపోతాయి..... పనికిరాని వెధవలే పెళ్ళిళ్ళు కాకుండా ముదిరిపోతారు" నిట్టూరుస్తూ అంది అన్నపూర్ణమ్మ.
"నీకు చాదస్తం ఎక్కువైపోయింది. కావాలనుకున్న వాళ్ళు దొరకనప్పుడు, దొరికిన వాడ్నే కావాలనుకున్నవాడు అని అనుకుంటే తృప్తిగా వుండదా?" ఎలాగయినా తనామె దృష్టిలో పదాలని అనురాగ్ విశ్వ ప్రయత్నం చేస్తున్నాడు.
"నా దగ్గర నీ మాటల గారడీ చెల్లదు. దొరికినవాడితో తృప్తి పడాల్సిన అవసరం నా మనవరాలికి లేదు. నా మనవరాలికి ఏం తక్కువైంది? ఆస్థి వుంది. అంతస్థు వుంది. అందం వుంది. ఆరోగ్యకరమయిన అలవాట్లు వున్నాయి. చదువుంది. సంస్కారం వుంది. అన్నిటికీ మించి మంచి గొప్ప వ్యక్తిత్వం వుంది.
దొరికినవాడితో తృప్తిచెందాల్సిన అవసరం మాకేముంది? ఏమిటో ఈ రోజుల్లో సరయిన ప్రేమికుడే కనిపించడం లేదు" నిస్పృహగా అంది అన్నపూర్ణమ్మ.
"పోనీ ఓ పని చేయకూడదూ.... నీ మనవరాలిని చంద్రబాబు నాయుడికిచ్చి పెళ్ళి చేయకూడదూ.....?" వెటకారంగా అన్నాడు అనురాగ్.
అన్నపూర్ణమ్మ వెంటనే అనురాగ్ వీపుమీద ఒక దెబ్బ వేసి-
"నీక్కూడా బుర్రంది. అది పనిచేస్తోంది కూడా. జాతీయ, అంతర్జాతీయ ప్రశంసలు పొందుతున్నచంద్రబాబు అంటే..... అణాకు చాలా ఇష్టం. అంత గొప్ప మంచి వ్యక్తి చంద్రబాబుకి నా మనవరాలిని ఇవ్వటానికి నాకేం అభ్యంతరం లేదు. కానీ ఆయనకి పెళ్ళయిపోయింది. అదే వచ్చిన చిక్కు" ఎక్కడో ఆలోచిస్తూ అంది అన్నపూర్ణమ్మ.