కంఠంలో ప్రాణం వుండగా అతన్ని వంటరిగా కల్సుకోను అనుకున్న అమల ఒంటరిగా కల్సుకుంటుంది కల్సుకుతీరాల్సిందే.
విజయ్ కుమార్ మల్ హోత్ర సామాన్యుడు కాదు అంతే.
23
విజయ్ కుమార్ మల్ హోత్ర సామాన్యుడు కాడు.
అమలకి ఆ ఉదయం ఓ లెటర్ అందించాడు.
అమల దానిని చదవకూడదనుకుంటూనే చదివింది.
భగవాన్ తో మొండిగా ఎదురు తిరిగి తన నిర్ణయం చెప్పాలి. విజయ్ కుమార్ మల్ హోత్రని తన జోలికి రాకుండా చేశాడా సరేసరి. లేకపోతే యింతే సంగతులు. ఇప్పటికే ఒక పాడుపనికి వొప్పుకుంది. ఇంకా తాను పతనం కాదల్చుకోలేదు. కాదు. కాబోదు.
ఈ విషయం లెటర్ ద్వారా భగవాన్ కి తెలియజేయాలనుకుంది.
ఇప్పుడు అవసరం లేదు.
ఆపదగాని, అదృష్టం గాని ఎవరికీ చెప్పి రాదు.
అమలకిప్పుడు అయోమయ పరిస్థితి ఏర్పడింది.
విజయ్ కుమార్ మల్ హోత్ర రాసిన లెటర్ చదివి ముక్కలుముక్కలుగా చేసి తూములో పడేసి నీళ్ళు కొట్టింది.
ఆ రాత్రికి విజయ్ కుమార్ మల్ హోత్రని కల్సుకోటానికి అమల యిష్టపూర్వకంగా సిద్ధపడింది. అంతకు క్రితంవరకూ కార్చిన కన్నీళ్లు, తీసుకున్న నిర్ణయం గాలికి కొట్టుకుపోయింది.
ఆ సాయంత్రం నుంచి త్వరగా రాత్రి ఎప్పుడు అవుతుందా అని యెదురుచూస్తూ కాలుకాలిన పిల్లిలా యింట్లో అటూ ఇటూ తిరుగుతూ అన్యమనస్కంగా గడిపింది అమల.
రాత్రి అయింది.
సరీగ పన్నెండు కాంగానే అమల లేచింది మంచం మీంచి. దుప్పట్లు, దిండ్లు మనిషి ఆకారంలో మంచంమీద పేర్చి నిండా దుప్పటి కప్పింది. ఆ గదికి ఇటువేపు వున్న తలుపుగాక అటువేపు వున్న తలుపు తీసుకుని నెమ్మదిగా గదిబైటకు వచ్చి బైట గడియవేసింది.
అడుగులో అడుగేస్తూ వెనుక వరండావేపు బైలుదేరింది.
ఇప్పుడు అమలకి చాలా థ్రిల్లింగ్ గా వుంది.
వరండా చివరిదాకా వచ్చి అక్కడ వున్న చిన్న అరుగుమీద కూర్చుంది.
గోడపక్క నుంచి యివతలికి వస్తూ "ఏమిటి ఆలస్యం" అన్నాడు విజయ్ కుమార్ మల్ హోత్రా.
"రాకూడదనుకున్నాను కాని మీ మాటే నెగ్గింది" అంది అమల.
"నా కంఠంలో ప్రాణం వుండగా రానన్నావు?"
"పిలిచింది విజయ్ కుమార్ మల్ హోత్ర కాదుకదా! అందుకని వచ్చాను."
"మరి ఎవరుట?" అరుగుమీద కూర్చుంటూ అడిగాడు.
"ఇంక విషయానికి వద్దాము. ఇదంతా నాకు చాలా ఆశ్చర్యంగా వుంది."
"నిజం తెలిసిందాకా అంతే మరి నా లెటర్ చదివి ఏమనుకున్నావ్?"