"చాలు ఇంక అసలు విషయానికి వద్దాము. ఎర్రగీరల షర్ట్ లో పెట్టిన నా లెటర్ వల్లనే కదూ మీ యీ కొత్త అవతారం! లెటర్ చదివి ఆశ్చర్యపోయారా కృష్ణా!" అడిగింది అమల.
అసలు విషయం విజయ్ కుమార్ మల్ హోత్ర భగవాన్ మనిషి కాడు. ఆ పేరుతో మారు వేషంలో వున్నది గ్రేట్ డాక్టర్ కృష్ణ. భుజంగరావు మేనల్లుడు కృష్ణ. ఆరోజు వూరికి అర్జంట్ ఫోన్ కాల్ విని వెళ్లినవాడు విజయ్ కుమార్ మల్ హోత్ర అవతారం ధరించి దిగాడు.
"నిజం తెలిస్తే ఆశ్చర్యపోతావ్ అమలా! నేనా లెటర్ అప్పుడు చదవలేదు" కృష్ణ చెప్పాడు.
నిజంగానే ఆశ్చర్యపోయింది అమల. "మరి?" అంది.
కృష్ణ భారంగా నిట్టూర్పు విడిచి మొదలుపెట్టాడు.
"నీవు రోజావి కాదన్న తెలుసుకున్న మరుక్షణం నుంచీ నీమీద అంతులేని కోపం, కసి ఏర్పడ్డాయి. అప్పుడే నాలుగు వుతికి నీ వెవరు? అని అడుగుదామంటే మామయ్య హార్ట్ పేషెంట్ అయిపోయారు. పైగా రోజా స్థానంలో వున్నావు. రోజాని ఏం చేశావ్. రోజా స్థానంలో నీవు వచ్చావంటే ఒక ఆడది ఇంత సాహసం చేయలేదు కదా! నీ వెనుక ఎవరో వుండి వుండాలి. నిన్ను పడితే వాళ్ళంతా మాయం అవుతారు. నా ఇన్స్ స్పెక్టర్ ఫ్రెండ్ సాయం తీసుకుని నీ ఆట కట్టించాలనుకున్నాను.
రోజా స్థానంలో వున్న నీమీద కోపం ఆగేది కాదు. బాధపెట్టి కసి తీర్చుకునేవాడిని. మళ్ళీ బాధాకరంగావున్న నీ జాలిముఖం చూడంగానే ఈ పిల్ల అలాంటిది కాదేమో అనిపించేది. ఆ అదేం లేదు. మహానటి అనుకునే వాడిని. నీతో చాలా అసభ్యంగా ప్రవర్తించాను. సారి వెరీ సారీ అమలా!"
అమల నవ్వుతూ "కధకానీండి ముందు" అంది.
"నా స్నేహితుడికి ప్రమాదంగా వుందని అర్జంట్ ఫోన్ రాంగానే గత్యంతరం లేక బయలుదేరి వెళ్లాను. ట్రైన్ దిగి హోటల్లో రూమ్ తీసుకున్నాను. ఆ మర్నాడు తెల్లవారుఝాము బస్సుకి నా స్నేహితుడి ఊరు వెళ్ళాలి అన్నమాట. సాయంత్రం అలా బజారుకెళ్ళాను. నా మరో స్నేహితుడు హేమరాజ్ పేకాటలో డబ్బుతోపాటు ఒంటిమీద బట్టలు కూడా కోల్పోయి బజారులో కనిపించాడు. వాడిని మందలించి నా రూమ్ కి తీసుకువచ్చాను. వాడిని నా రూమ్ లో వుంచి మళ్ళీ బైటికి వెళ్లి నా పనులు చేసుకుని రాత్రి పదకొండు గంటలకి తిరిగి వచ్చాను. బైటికెళ్ళి వచ్చిం తరువాత స్నానం చేయడం నా అలవాటు.
స్నానం చేసి బాత్ రూం లోంచి బైటికి రావటానికి కొద్దిగా తలుపుతీశాను ఎవరివో కఠినంగా మాటలు వినిపించాయి. అంతే అక్కడే ఆగిపోయి చెవి వగ్గాను. మిష్టర్ కృష్ణా నీవు మా ఆపరేషన్ కి అడ్డుగా వచ్చావు. రోజా స్థానంలో వకమ్మాయిని ప్రవేశపెడితే కనుక్కున్నావు. మాకు తెలిసింది వకటే మా దారికి అడ్డొచ్చిన వాళ్ళని అంతం చేయటం మేము ఏపని ఎందుకు చేస్తున్నామో చెప్పము, నీకు ఎంత వరకు తెలుసో అంతవరకు చెప్పాము. బస్, ఫోన్ కాల్ మా ఏర్పాటు మైండిట్!
"అమలా నాకు ఈ మాటలు వినిపించాయి. వెంటనే చాలా చిన్న శబ్దం హిస్ హిస్ అన్నట్లు వినిపించింది. ఆ తరువాత అంతా నిశ్శబ్దం నేను నెమ్మదిగా తలుపు తీసుకుని బైటికి వచ్చాను."
"ఎవరూ లేరు!" కృష్ణ బాధగా చెప్పాడు.
"మరి!"
"హేమరాజ్ నోటికి ప్లాస్టర్ అంటించబడి వుంది. వాడిని కుర్చీకి కట్టేశారు. వరదలై రక్తం పారుతున్నది. ఆనవాలు తెలియని విధంగా ముఖం యాసిడ్ తో కాలిపోయి ముద్దగా వుంది. పరుగున వాకిలి తలుపు తీసి చూశాను. అంతటా నిశ్శబ్దం కారిడార్ మూల తిరుగుతూ బట్లర్ కనిపించాడు వెంటనే లొపలికి వచ్చాను. నా స్నేహితుడు హేమరాజ్ మరణించి వున్నాడు. జరిగింది నాకు అర్ధమయింది.
"నాకు అర్ధమైంది, హేమరాజ్ ని నిన్నే అనుకుని చంపారు అంతేనా!"
"అవును జరిగింది అదే."


