"అమ్మ పుట్టిల్లు ముందా మేనమామ ముందా అన్నట్లు నువ్వేవరివో తెలిసిం తర్వాత యింక అడిగే పని ఏముంది?" నిజం తెలియకపోయినా దబాయింపుగా అంది అమల.
విజయ్ కుమార్ మల్ హోత్ర బిత్తరపోయాడు.
"నన్ను తక్కువ అంచనా వేయకు మిష్టర్ మల్ హోత్రా?" అంది అమల.
కాస్త సర్దుకున్నాడు విజయ్ కుమార్ మల్ హోత్రా.
"ఎలా తెలుసుకోగలిగావ్?"
"వెరీ సింపిల్. భగవాన్ మనుషులకి మాత్రమే అమల పేరు తెలుస్తుంది."
విజయ్ కుమార్ మల్ హోత్ర ముఖంలో గొప్ప రిలీఫ్ ఏర్పడింది. భారంగా నిట్టూర్పు విడిచాడు.
"నీతో చాలా మాట్లాడాలి, అర్ధరాత్రి పెరట్లోకిరా."
"నేను రాను."
"అదేం?"
"నేను భగవాన్ మాట తప్ప ఎవరి మాటా వినే అవసరం లేదు. నాకు తెలుసు మిస్టర్! చాటుగా నన్నెందుకు కల్సుకోమంటున్నావో!"
"ఎందుకుట?"
"ఎందుకో నీకు తెలియదా? తెలుసు అవునా? అందుకే"
"మరి తెలిసి ఎందుకు రావు?"
"వెధవ బుద్ధులు, వెధవ వేషాలు, వెధవ కోరికలు నాకు లేవు. వెళ్ళండి."
"ఉప్పూ- కారం తింటున్న శరీరం మిసమిస పొంగిన వొళ్ళు."
అమల కళ్ళల్లో గిర్రున నీళ్ళు తిరిగాయి.
"ప్లీజ్ రావా?" విజయ్ కుమార్ మల్ హోత్ర అన్నాడు.
"రాను-రాను-రాను.....దయచేసి వెళ్ళకపోతే పిచ్చిదానిలా నటించి నిన్ను రక్కాల్సి వస్తుంది" అంది అమల.
అతను బంగారు పన్ను కనపడేలా ఫక్కున నవ్వాడు.
:చూస్తాను ఎలా రావో, నా చేతిలో వున్న పని అది."
"రావటం రాకపోవటం నా యిష్టం. చాటుగా ఒంటరిగా కల్సుకోటం అనేది జరగని పని. వెళ్ళు" అని అమల అటు తిరిగి కిటికీలోంచి బైటికి చూస్తూ నుంచుంది.
అతను పిల్లిలా అడుగులు వేస్తూ అమల వెనుకకు వచ్చాడు.
"వస్తావు నిన్ను రప్పించుకుంటాను. తప్పదు, రెడీగ వుండు" అంటూ అమల చేతిని అందుకుని గబుక్కున ఆ చేతిని ముద్దుపెట్టుకు వదిలేసి చరచర వెళ్ళిపోయాడు బైటికి.
అమలకి ఏం జరిగిందో తెలిసేలోపలే అతను వెళ్ళిపోయాడు
అమల ఒక్కసారిగా భోరుమంది.
అందరినీ తప్పించుకోటం తెలీక పిచ్చి వేషం తనని సగం రక్షిస్తున్నది. వీడు భగవాన్ మనిషి. ముందే లొంగదీసుకోవాలని చూస్తున్నాడు. డైరెక్టుగా అడిగేశాడు. తన బ్రతుకు ఏం కానున్నది? వీడు తన్ని వదలడు. భగవాన్ కి చాలా ఆప్తుడయి వుంటాడు లేకపోతే అంత ధైర్యం ప్రదర్శించలేడు. వీడి బారి నుంచి తప్పించుకోవడం ఎలా?
అమల దుఃఖంతో బాధపడుతూ అంది.
"వాడు ఏ ఎత్తువేసినా సరే భగవాన్ నుంచి రికమండేషన్ తెచ్చినా సరే, ఒంటరిగా అతన్ని తను కల్సుకోదు. ఈ విషయంలో తల ప్రాణం పోయినాసరే, పోను-పోను-పోను. వాడి దగ్గరకు పోను" అనుకుంది అమల.
తానొకటి అనుకుంటే దైవం మరొకటి అనుకుని పని చేయిస్తాడు. అన్న సత్యం అమలకి బొత్తిగా తెలియదు.