అతను మరింత వేగం పెంచాడు. నక్కల అరుపులు వెంబడిస్తున్నాయి. ఆ అరుపులమధ్య లీలగా మనుషుల మాటలు. అతను వెనక్కి తిరిగిచూస్తే ఎవరూ కనిపించడంలేదు.
భయం శరీరాన్ని వూపేస్తుంది. నాలుక ఎండిపోయి లోపలికి ముడుచుకుపోతోంది. దాహం గొంతును నొక్కేస్తోంది.
అతను నీళ్ళకోసం చూస్తున్నాడు. ఆ ప్రాంతంలో బావి వుండాలి. మన ఊరిలోవాళ్ళ పశువులను అక్కడకెళ్ళి మేపుతుంటారుకదా, లోకనాథం కూడా తన ఎద్దులను అప్పుడప్పుడూ అక్కడికి తోలుకెళ్ళేవాడు. అందువల్ల ఆ ప్రాంతమంతా పరిచయం.
తను ముందుకుపోతుంటే బావి వెనక్కి పరిగెడుతున్నట్లు అది కనపడటంలేదు. దాహం నాలుకను పొట్లంలా మడిచేస్తోంది.
అతను నడకవేగాన్ని మరింతగా పెంచాడు. ఎవరో తన వెనుకే నడుస్తున్నట్లు, పుల్లలు విరుగుతున్న చప్పుడు.
ఏమీ అర్ధంకావడంలేదు అతనికి. ఒంట్లోని నీళ్ళన్నీ ఆవిరైపోతున్నట్లు చెమట మనిషిని తడిపేస్తోంది.
అతను ధైర్యం తెచ్చుకుంటూ గుండెను అరచేత అదుముకుని ముందుకి నడిచారు. కాలును కదిల్చాడో లేదో తిరిగి మాట్లాడుతున్న శబ్దాలు.
మాంసం పొట్లాన్ని దూరంగా విసిరికొడదామనుకున్నాడు. కానీ మనసొప్పడం లేదు. ముప్పొద్దులా ముగ్గురు నలుగురు తినగలిగినంత మటన్. దాన్ని దెయ్యాలకిచ్చి వెళ్ళడానికి ఇచ్చగించడంలేదు.
అతని మొండి ధైర్యాన్ని గుండెల్లో కూరుకుని నడుస్తున్నాడు ఆ తోపు దాటేస్తే మరిక భయంలేదు. కానీ ఈ దాహం గొంతును తూట్లు పెడుతోంది.
బావికోసం పక్కన చూస్తున్నాడు.
కొద్ది దూరంలో బావి వున్నట్లు తెలుస్తోంది. అది కనిపించడం తోనే ప్రాణం లేచొచ్చింది.
గబగబా పరిగెత్తాడు.
వాడకంలేని బావి కాబట్టి చెట్లు మొలిచి ఆకుల వలలాగా వుంది మెట్లు కూడా సరిగా లేవు.
అక్కడక్కడా పగిలిపోయి మొక్కబోయిన మెట్లు రాక్షసుడి నళ్ళంలా వికారంగా వున్నాయి.
అయినా ఇవేమీ అతనిని భయపెట్టడంలేదు. దాహం తప్ప మరొకటి తెలియడంలేదు.
అతను మాంసం పొట్లాన్ని గట్టుమీద పెట్టి కిందికి దిగాడు. నీళ్ళు తాగాక దాహం తీరిందిగానీ తను చేసిన పొరపాటు గుర్తొచ్చింది. మాంసం అలా గట్టుమీద పెట్టడం తప్పు. దెయ్యం ఈసరికే దాన్ని తినేసి తన మీద వాలిపోతుంది.
అతను భయం భయంగా పైకి చేరుకున్నాడు.
ఎలా వుంచిన పొట్లం అలానే వుందిగానీ దాన్ని విప్పినట్లు దారం వూడిపోయింది.
దగ్గరికి వెళ్ళాలంటే కాళ్ళు వణుకుతున్నాయి.
పొట్లంలో మాంసం అలానే వుంది. దాన్ని తీసుకున్నాడుగానీ చేతుల్లో పట్టుకోలేకపోతున్నాడు. కానీ వదిలేసి వెళ్ళడానికి మనసొప్పడం లేదు. అలా భయంగానే తోటదాటి మైదానం చేరుకున్నాడు.
రెండోరోజు ఇంటికి తిరిగొచ్చాడుగానీ తీవ్రమైన జ్వరం అంటుకుంది. దాంతో అతనికి దెయ్యం పట్టిందని నలుగురూ అనుకోవడం మొదలుపెట్టారు. వాళ్ళ అనుమానాలు నిజం చేస్తున్నట్లు అతను మధ్య మధ్యలో పిచ్చిపిచ్చిగా అరుస్తున్నాడు.
ఇక లాభంలేదని దామాచారిని పిలిపించారు. ఆయన నిమ్మకాయలు కోసి, మంత్రాలు చదివి ఎట్టకేలకు లోకయ్యమీద వాలిన దెయ్యాన్ని మాట్లాడించాడు.
అతనిపై వాలిన దెయ్యం మునీంద్ర.
ఆమె చిన్నప్పట్నుంచీ పశువుల్ని మేపేది. మేతకోసం పశువుల్ని ఎక్కడికంటే అక్కడికి తోలుకెళ్ళేది.
ఆమెతోపాటు ఇంకా నలుగురున్నారు. వాళ్ళలో ఇద్దరు యువకులు కూడా వున్నారు ఏమైందేమో తెలియదుగానీ ఓరోజు ఆమె బావిలో శవమై తేలింది. లోకయ్య నీళ్ళు తాగింది ఆ బావిలోనే.