Previous Page Next Page 
శుభోదయం పేజి 40


    "అమ్మా..... నా కప్పుడే పెళ్ళేమిటమ్మా.... ఇరవైఏళ్లకే.... యిప్పటినుంచి చేసుకుని ఏం చేస్తాను? చదువన్నా కాలేదు."
    "శ్యాం చూడు, నాకున్నది నీ వొక్కడివి. నా సంపాదన ముగ్గురికి సరిపోదంటావా, ఇద్దరం హాయిగా బతుకుతున్నాం, ఇంకొకరు మనకి బరువా. శ్యాం.... నీకిప్పుడు పెళ్ళి అవసరం అని కాదు. రేఖకి అవసరం, ఆమె పూర్వపు రేఖ అవాలంటే తనేదో పాడయిందని, తనకింక పెళ్ళికాదని, తను ఇంక మోడులా బతకాలని ఏవేవో ఊహించి మనసు పాడుచేసుకుంటున్న రేఖకి, 'కాదు నీకేం కాలేదు, నేనున్నాను నీకు' అని దగ్గరకు తీసుకునే సహృదయుడు కావాలి. ఎప్పుడో నీ చదువయి ఉద్యోగం చేసేవరకు రేఖని అలా వదిలేస్తే యీ పిచ్చిపిచ్చి ఆలోచనలతో మనసు పాడుచేసుకుని ఆ చదువన్నా తిన్నగా చదవలేదు. శ్యాం! మీ ఇద్దర్ని నా రెండుకళ్ళలా చూసుకుంటాను. ఆడపిల్ల లేనిలోటు రేఖతో తీర్చుకుంటాను.." ఆరాటంగా అంది.
    శ్యామ్ ఏదో ఆలోచనలతో సతమతమవడం రాధాదేవి గుర్తించింది. "శ్యామ్, ఏమిటా ఆలోచన! రేఖ నీకు తగదని అనుకుంటున్నావా, నా బలవంతంవల్ల జవాబు ఏం చెప్పాలా అని ఆలోచిస్తున్నావా? శ్యాం, ఆఖరికి నీవూ... యిలాగే ఆలోచిస్తున్నావా! ఎంతో అభ్యుదయంతో, ఆదర్శంతో పెంచాననుకుంటున్నాను. హు.... నీవూ మగవాడివేగా.... మీ జాతి అంతే. స్త్రీకి నీతులు, శీలాలు, పవిత్రతలు కావాలనే వారిలో నీవూ ఒకడివే గదూ...." బాధగా అంది రాధాదేవి.
    "అమ్మా!" హర్ట్ అయ్యాడు శ్యాం. "అమ్మా, ప్లీజ్! అలా  మాట్లాడకు. నా ఆలోచన అది కాదమ్మా.... రేఖ.... ప్రెగ్నెంట్.... రేపు బిడ్డ పుడితే... నన్ను.... మాధవరావుగారు చీదరించుకుని నీచంగా, హీనంగా చూచినట్లు నేనూ చూడనా.... ఎవరికో పుట్టినబిడ్డని భరించే ఔదార్యం నాకుందా అని ప్రశ్నించుకుంటున్నాను."
    "శ్యాం....నే నా విషయం ఆలోచించలేదనుకుంటున్నావా? వద్దు శ్యాం. నీలాంటి ,మరో శ్యాం ని ఈ లోకంలోకి తీసుకురావద్దు మనం. నీవన్నట్టు ఎంత కబుర్లు చెప్పినా తనది కాని బిడ్డని ఎవరూ ప్రేమించరు. అందులో పురుషులసలు సహించలేరు. ఆ బిడ్డ కారణంగా మీ జీవితాలు నరకం కాకూడదు. నిన్నీ విషయంలో బలవంతపెట్టి వప్పించే ఉద్దేశం నాకులేదు శ్యాం. ఆ హింస, ఆ నరకం నేననుభవించి మళ్ళీ మిమ్మల్ని బాధకి గురి చెయ్యను. రేఖకి ఎబార్షన్ చేయిద్దాం. జరిగింది పీడకల అని మరిచిపోయి మీరు నూతన జీవితం ఆరంభించాలి" రాధాదేవి ఉత్సాహంగా అంది.
    "ఏమో, ఇంతకీ రేఖ, వాళ్ళ నాన్న వప్పుకుంటారనుకోను."
    "అడిగి చూద్దాం. రేఖ నీకంటే సంవత్సరమే చిన్నది. మైనారిటీ తీరింది. ఆమెకిష్టమయితే మీరిద్దరూ పెళ్ళి చేసుకోవచ్చు. మాధవ్ అంగీకరించకపోయినా" అంది రాధాదేవి.
    
                             24
    
    రాధాదేవి వెళ్ళేసరికి మాధవరావు ముందు వరండాలో వాలుకుర్చీలో పడుకుని వున్నాడు. రాధాదేవిని చూడగానే దిగ్గునలేచాడు. ఆ రెండురోజులలో అతనిమొహం గుర్తుపట్టలేనంతగా మారిపోయింది. రేఖమీద అత్యాచారం జరిగినదగ్గిరనుంచి అతనెంత కుమిలిపోయాడో కోర్టులో చూసి రాధాదేవి మనసు చివుక్కుమంది. ఇప్పుడు రేఖ నెలతప్పడం, సూయిసైడ్ కమిట్ చెయ్యడం యివన్నీ అతడ్ని ఎంత దెబ్బతీశాయో గుర్తించగలిగింది. అతనిమీద సానుభూతి కలిగింది. రాధాదేవిని చూస్తూనే "ఏం, యింకా ఏమన్నా మిగిలిందేమో చూసి సంతోషించాలని వచ్చావా?" అన్నాడు. అతను కోపంగా అన్నా అతని గొంతులో యిదివరకటి కరుకుతనం, కటినత్వం, తిరస్కారంలేదు. ఆ గొంతులో వ్యధ, ఆవేదన కనిపించాయి, ఈసారి రాధాదేవికి కోపం రాలేదు. మాధవ్ స్థానంలో వున్న ఏ తండ్రన్నా అలాగే మాట్లాడుతాడు అనిపించింది.
    "మాధవ్...." ఇరవైఏళ్ల తరువాత అలా పిలుస్తుంటే ఆమెగొంతు వణికింది. మాధవ్ ఆశ్చర్యంగా చూశాడు.
    "మాధవ్.....నీ కెందుకింత కోపం నామీద? రేఖ నా కూతురులాంటిది. ఆమెకంత అన్యాయం జరిగితే చూసి సంతోషించడానికి నేను మానవత్వం లేని పశువుననుకున్నావా? అందులో ఆ బాధ అనుభవించిన నేను ఇంకో స్త్రీపై జరిగిన అవమానికి సంతోషిస్తానని, నిన్ను అవమానించడానికి, హేళన చెయ్యడానికి వచ్చానని ఎలా అనుకోగలుగుతున్నావు? ప్రేమించుకుని, పెళ్ళిచేసుకుని రెండేళ్ళు కాపురం చేసిన భార్యని ఆ మాత్రం అర్ధం చేసుకోలేవా? ప్రేమ, అభిమానం పోయినా, అంత కసి, కక్ష పెరగడానికి నేనేం చేశాను? మాధవ్, యింత జరిగినా నీకు యింకా సహాయపడాలనే వచ్చాను..." వణుకుతున్న గొంతుతో అంది రాధాదేవి.
    ఆమె మాటలకి మాధవ్ కూడా కాస్త విచలితుడయ్యాడు. అంతలోనే పౌరుషంగా "నాకెవరి సహాయం అక్కరలేదు. బింకంగా అన్నాడు.
    "నీకక్కరలేదు. కాని రేఖకి కావాలి" లోపల్నుంచి రాధాదేవి గొంతు గుర్తుపట్టిన రేఖ ఒక్క ఉదుటున పక్కమీదనుంచి లేచివచ్చి రాధాదేవిని కౌగలించుకుని 'ఆంటీ' అంటూ బావురుమంది. ఈ హడావిడికి శారదకూడా  లోపల్నుంచి వచ్చి "అక్కయ్యా, ఎంతపని జరిగిందో చూశావా, నీలాగే అయింది దాని బతుకూ... నిన్ను పెట్టిన ఉసురు మాకు కొట్టింది చూశావా" అంటూ రాధాదేవిని పట్టుకు ఏడ్చింది.
    "ఏమిటీ ఏడుపులు రోడ్డుమీద, లోపలికెళ్ళండి" మాధవ్ కసిరాడు.
    "ష్.... రేఖా.... ఏమిటమ్మా? ఏం జరిగిందని యీ ఏడుపు. శారదా నీకసలు బుద్దిలేదు. పిల్లకి ధైర్యం చెప్పాల్సిందిపోయి నీవే యిలా అంటావేమిటి?" యిద్దర్నీ మందలిస్తూ లోపలిగదిలోకి నడిపించుకు వెళ్ళింది. మాధవ్..... ఈసారి రాధని కర్కశంగా వెళ్ళిపో అని నిందించలేక, ఆవేదనగా కళ్ళు మూసుకు అలా వుండిపోయాడు.

 Previous Page Next Page