Previous Page Next Page 
ఎర్ర సముద్రం పేజి 41


    "నామాటేం చేస్తారు?" అంది బెడ్ మీదకు కాళ్ళను లాక్కుంటూ.
    "ఓ......కొత్త యూనియన్ సెక్రెటరీ పోస్టా?"    
    "అవును" అంది సరస్వతి తమకంగా సత్యరాజ్ ప్రక్కన వాలిపోతూ.
    సత్యరాజ్ ఆ ధ్యాసలో లేడు.
    సరస్వతి అనుమానించింది.    
    "రోజుకు రెండుగంటలు ఎక్సర్ సైజ్ చేస్తూ, డయిటింగ్ చేస్తూ నా శరీరాన్ని కసిగా పుంచుకొనేది మీకోసమే గదా?"    
    "అనుమానించకు. నీకా పోస్టు ఖాయం. పనిలో పని ఓ అందమయిన అమ్మాయిని తెచ్చి సామంత్ దగ్గర అపాయింట్ చేయ్, అతన్ని చెడగొట్టటానికి ఎక్కువ టైమ్ తీసుకోవద్దు" అన్నాడు సరస్వతి మీద వాలిపోతూ.
    సరస్వతికి కొండెక్కినంత సంబరంగా ఉంది. తాను ఎన్నాళ్ళ గానో ఎదురు చూస్తున్న యూనియన్ సెక్రెటరీ పోస్ట్  తన చేతిలోకి రానుంది. ఆ ఆనందంలో సత్యరాజ్ స్వర్గం అంచుల్లోకి తీసుకెళ్ళి వదిలింది.

    
                                                                    *    *    *

    యూనియన్ ఆఫీసులో ముందు నేషనల్ ఇండస్ట్రీస్ టెక్స్ టైల్ యూనిట్స్ లో పనిచేసే కార్మికులంతా పోగైపోయి సామంత్ కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు.
    సామంత్ ను ఎక్కించుకున్న యూనియన్ జీప్ ఆఫీసు వైపు వేగంగా దూసుకువస్తోంది.
    మరో పదినిమిషాలకు సామంత్  జీప్  సభాస్థలికి చేరుకుంది.
    కొత్త లీడర్ ని చూసిన సంతోషంతో కార్మికుల మొఖాలు ఆనందంతో వెలిగిపోయాయి.
    అప్పటికే సత్యరాజ్ ఏర్పాటు చేసిన మనుష్యులు "సామంత్  జిందాబాద్" "కార్మిక ఐక్యత వర్ధిల్లాలి" అంటూ నినాదా లిచ్చారు.
    అంతే....పది నిమిషాలపాటు ఆ ప్రాంతమంతా నినాదాలతో మార్ర్మోగిపోయింది.
    సామంత్ వినయంగా చేతులు దగ్గరకు తెచ్చి ముకుళిత హస్తాలతో అందరికి నమస్కరిస్తూ వచ్చి స్టేజీ ఎక్కి నలువైపులా ఓసారి చూసి  కుడిచేయి గాల్లోకి లేపి ఊపాడు లీడర్ షిప్ టెక్నిక్!
    అంతటా నిశ్శబ్దం___వేలాది కళ్ళు రెప్ప వేయటం  మర్చిపోయి సామంత్ నే తదేకంగా చూస్తున్నాయి
    సామంత్ మైక్  ముందుకు వచ్చి ఓసారి గొంతు సవరించుకున్నాడు.
    ప్రియ కార్మికులారా!"
    సామంత్ ని గతంలో ఎరిగున్నవారు ఉలిక్కిపడ్డారు. సామంత్ వేషమే కాదు భాష, కదలికలు అన్నీ మారిపోయాయి. ఎంతలో ఎంతటి మార్పు!! అనుకున్నారు మనసులోనే.
    "నేనెక్కువ మాట్లాడను, చేసి చూపిస్తాను ఈ క్షణం నుంచి యాజమాన్యం గుండెల్లో నిద్రపోతాను. వారి కలలో కూడా నేనే  గుర్తుకు వచ్చేలా చేస్తాను.
    నిశ్శబ్దం ఒక్కసారి బద్దలయింది.
    "వన్స్ మోర్.....జిందాబాద్......లాంగ్ లివ్ ....." స్లోగన్స్ తో మరోసారి  ఆ ప్రాంతం అదిరిపోయింది.
    "పట్టేశాడురా.....జనం నాడి పట్టేసాడు. ఇక వీడికి తిరుగులేదు" సత్యరాజ్  మనుష్యులుతమలో తామే గుస గుస లాడుకున్నారు.
    "మిమ్మల్ని యాజమాన్యం అవమానించింది. అంతకంతకు చేయాలి....." కొందరు  ఉద్రేకపరులు అరిచారు పెద్దగా.
    సామంత్ చిరునవ్వు నవ్వాడు. అతని ఆలోచనా విధానం పూర్తిగా మారిపోయింది. కార్మికుల నాడిని బట్టి, మనస్తత్వాన్ని బట్టి ఎలా వారిని తన గుప్పిట్లోకి తెచ్చుకోవాలో అప్పటికి ఔపోసన పట్టాడు.
    వద్దు సోదరులారా..... వద్దు..... మీకోసం నేను నా రక్తం ధారబోయాడానికే సిద్ధపడుతోండగా, నాకు జరిగిన అవమానం ఒక లెక్కలోదా?" ప్రసంగం ప్రవాహంలా సాగిపోతోంది.


                                                                      *    *    *


    "సమ్మె ఇప్పుడొద్దని స్టేజీ మీద సొంత నిర్ణయం ఎందుకు తీసుకున్నావ్......?" సత్యరాజ్ కోపంగా  పచార్లు చేస్తూ అన్నాడు.
    అది సత్యరాజ్ గెస్ట్ హౌస్ . ఊరి శివార్లలో మరో కంటికి తెలియకుండా అత్యాధునికంగా కట్టించుకున్న బంగ్లా.
    సమయం రాత్రి పది.
    ఆ హల్లో సత్యరాజ్, సామంత్ , సరసత్వి, లాల్ సింగ్  బిర్క్, దీపక్ రాజ్, హసీంఖాన్ సమావేశమై ఉన్నారు.
    "తొందర పడొద్దు సత్యరాజ్ సాబ్. ఇప్పుడు పూర్తి సమ్మెకి నేను నా అంగీకారం తెలియజేస్తే కొద్దిగా రేషనల్ గా, వివేకంగా ఆలోచించే కార్మికులు తన వ్యక్తిగత అవమానం తీర్చుకోవటం కోసం మనల్ని వాడుకుంటున్నాడురా అని అనుకునే ప్రమాదం ఉంది......"
    సత్యరాజ్ ఉలిక్కిపడి చూసాడు సామంత్ వైపు.
    సామంత్ వినయంగా సోఫాలో చేతులు దగ్గరకు చేర్చుకొని కూర్చున్నాడు.
    "సబబైన కారణం ఉంటేనే సమ్మెకు దిగడనే నమ్మకం నామీద ఏర్పడుతుంది. నేను మీకు, మీరు కోరుకుంటున్న విధంగా సహకరించా లంటే సోదర కార్మికులకు నామీద పూర్తి విశ్వాసం ఉండాలి......"
    సత్యరాజ్ సామంత్ వైపు నమ్మలేనట్లుగా చూసాడు. "అవును సార్, మరొక విషయం- మొన్న  జరిగిన గందరగోళంలో భూపతిరావు ఫ్యాక్టరీ, ఆస్తులు ధ్వంసమయ్యాయి ఆయన ఇప్పుడు మీమీద కోపంతో చిందులు తొక్కుతుంటాడు. ఇప్పుడు సమ్మె  కొనసాగిస్తే అగ్నికి ఆజ్యంపోసినట్లవుతుంది. అసలే కోపిష్టి. కంపెనీ  లాకౌట్  ప్రకటించినా ప్రకటించగలడు. సమ్మెంటే ఫర్వాలేదుగాని లాకౌట్ అంటే మనవాళ్ళు బేజారెత్తిపోతారు. పైగా ఇప్పుడు మనం- అంటే నేను- భూపతిరావుతోసమావేశమవుతాను. లీడర్ నైన తొలి దశలోనే ఆయనకి మేలు చేసిన వాడిలా నాపై సదభిప్రాయం ఏర్పడితేనే మన బేరసారాలకి మేలు....."
    సత్యరాజ్ కళ్ళ ఎదుట ఉన్న వాస్తవాన్ని నమ్మలేకపోయాడు.

 Previous Page Next Page