ఆ విధంగా తను ఫూలయిపోయాడు.
తను రెయిడ్ చేయబోతున్నాడన్న సమాచారం మెకానిక్ కి తన డిపార్ట్ మెంట్ నుంచే అంది ఉంటుంది.
అందులో సందేహమేమీ లేదు! ఏమాత్రం లేదు!
సో! తను గనుక ఈ ఫైట్ ని ఇంకా కొనసాగించాలనుకుంటే, మెకానిక్ గ్యాంగులతోనే కాదు -
సొంత డిపార్ట్ మెంట్ తో కూడా పోరాటం సాగించాలన్న మాట తను!
వెల్! వెల్! వెల్!
తనుఉన్న పరిస్థితిని తలచుకుని తన మీద తనే జాలిపడలేదు జలీల్.
అది అతని తత్వం కాదు.
కానీ-
దేశం ఉన్న పరిస్థితిని తలచుకుని దేశం కోసం దిగులుపడ్డాడు ఇన్ స్పెక్టర్ జలీల్.
* * *
తను చెబుతున్నది ఆశ్చర్యంగా వింటున్న దినకర్ తో అంది వైశాలి.
"దినకర్! ఇప్పుడు నేను కొన్ని విషయాలు నీతో చెప్పాను. కొన్ని చెప్పలేదు. కొన్ని విషయాలు చెబుదామన్నా కూడా వివరాలు నాకు తెలియవు. ఇంకొన్ని విషయాలు తెలిసినా కూడా ఇప్పుడే నీతో చెప్పడం ఇష్టంలేదు నాకు! సరైన సమయం వచ్చినప్పుడు అన్ని విషయాలు నీకు చెబుతాను. అంతవరకూ నువ్వు ఓపిక పట్టక తప్పదు. కానీ దినకర్! ఇప్పుడు మాత్రం నీకు తక్షణం అవసరమైన సమాచారం ఒకటి చెప్పగలను!"
"ఏమిటది?" అన్నాడు దినకర్ ఉత్సుకతతో.
"నిన్ను హత్యానేరంలో నుంచి బయటపడెయ్యగల ఒక సమాచారం!" అంది వైశాలి ఊరిస్తున్నట్లు.
"వివరాలు చెప్పు!"
ఒకసారి దీర్ఘంగా శ్వాస తీసుకొని చెప్పడం మొదలెట్టింది వైశాలి.
ఆరోజు కోర్టులో విక్కీ అనే ఒక పిల్లవాడు చెప్పిన దాని ప్రకారం నువ్వు అతని తల్లిని హత్య చేశావు. అందుకే పోలీసులు నీ కోసం వెదుకుతున్నారు. అవునా?"
అవునన్నట్లు తల పంకించాడు దినకర్.
డ్రమెటిక్ గా అంది వైశాలి "కానీ చనిపోయిన స్త్రీ విక్కీ తల్లి కాదు."
విక్కీ తల్లి పేరు ఇందిర. మర్డర్ కాబడిన స్త్రీ పేరు వైదేహి."
"ఇది నీకెలా తెలుసు?" అన్నాడు దినకర్ సంభ్రమంగా.
ఎలా తెలుసంటే అని కొద్దిగా ఆగి, రుద్దమవుతున్న గొంతుని స్వాధీనంలోకి తెచ్చుకుని మళ్ళీ అంది వైశాలి...."ఎలా తెలుసంటే.....విక్కీ నా సొంత తమ్ముడు గనక...మా ఇద్దరికీ అమ్మ అయిన ఇందిరా చాలా సంవత్సరాల క్రితమే మనో వ్యధతో మంచంపట్టి చనిపోయింది గనుక!" అంది కర్చీఫ్ తో కళ్ళు తుడుచుకుంటూ.
"దిసీజ్ ఇన్ క్రెడిబుల్!" అన్నాడు దినకర్ ఆశ్చర్యం విచారం కలిసిన గొంతుతో. తర్వాత ఆమె చెప్పిన విషయాలు బేరీజు వేస్తున్నట్లు కొద్ది క్షణాలపాటు ఆలోచించి తర్వాత అన్నాడు.
"కానీ వైశాలీ! ఈ కథలో కొన్ని లూజ్ ఎండ్స్ మిగిలి పోయాయి.
"లైక్ వాట్?" అంది ఆమె.
"నువ్వు చెప్పినట్లు చనిపోయిన స్త్రీ విక్కీ తల్లి కాకపోతే మరి ఆ స్త్రీ ఎవరు? ఆమే తన తల్లి అని విక్కీ ఎందుకు అబద్దం చెప్పాడు? నన్ను హత్య కేసులో ఇరికించవలసిన అవసరం విక్కీకి ఏముంది?"
భారంగా నిట్టూర్చి అంది ఆమె. ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం నేను కోర్టులో చెబుతాను."
"కోర్టులోనా? అంటే ఏమిటి నీ ఉద్దేశ్యం?"
"దినకర్!" అంది ఆమె నచ్చ చెబుతున్నట్లు.
"నా మాటమీద నమ్మకముంచి నువ్వు వెళ్ళి పోలీసులకి లొంగిపో! అప్పుడు అక్కడ అందరిముందూ అన్ని విషయాలూ చెప్పేస్తాను నేను."
"ఆ చెప్పేది ఏమిటో ఇప్పుడే, ఇక్కడే ఎందుకు చెప్పెయ్యకూడదు?" అన్నాడు దినకర్.
అతని కళ్ళలోకి సూటిగా చూస్తూ అంది ఆమె.
"నువ్వన్నట్లే నేను నాకు తెలిసిన విషయాలనీ పూసగుచ్చినట్లు ఇప్పుడే నీకు చెప్పేశాననుకో! ఆ తర్వాత నువ్వు-నిన్ను తరుముతున్నారీ నీ శత్రువులు వాళ్ళకి దొరికిపోయావనుకో! నిన్ను చంపేముందు వాళ్ళు నిన్ను చిత్రహింసలు పెట్టి, నీకు తెలిసిన రహస్యాలన్నీ బయటకు కక్కించడానికి ప్రయత్నిస్తారు. అందులో సందేహం లేదు. అలా గనక జరిగిందంటే, నీతోబాటు నేను కూడా పెద్ద రిస్కులో పడిపోతాను. అవునా? కాదా?"
"వైశాలీ! వైశాలీ!" అన్నాడు దినకర్ సహనం కోల్పోతూ. "అసలు నేనెవరు, నా శత్రువులు ఎవరు. నువ్వు ఎవరు ఇవేమీ తెలియకుండా నీ మాటలు నమ్మి పోలీసులకి లొంగిపోయి కోర్టులో ఎలా హాజరుకాను?"
చిన్నగా నవ్వి అన్నది ఆమె. "అలా అయితే ఇంకొక్క విషయం కూడా చెప్పగలను."
"ఏమిటది?"
"నిన్ను చంపాలని చూస్తూ తరుముకొస్తున్నది మెకానిక్ మనుషులు!" అని రియాక్షన్ కోసం వెదుకుతున్నట్లు దినకర్ మొహంలోకి చూసింది ఆమె.
అతని మొహంలో ఏ భావమూ కనబడలేదు.
"మెకానిక్కా? అతడెవరు ? అతనికి నాకు ఎందుకు విరోధం?" అన్నాడు.
అలా అంటూ ఉండగానే అతనికి చటుక్కున ఒక ఆలోచన తోచింది.
తను ఇందాక అరడజను మంది గూండా గాళ్ళని మట్టి కరిపించాడు. వాళ్ళలో గొరిల్లాలా ఉన్నవాడు, తన చేతికి వేసిన సంకెళ్ళని విడిపించుకోవాలని తెగ తాపత్రయపడుతూ కొంచెం దూరంలో నిలబడే వున్నాడు ఇంకా.
వాడిని గనక పటపట నాలుగు వాయిస్తే ఆ మెకానిక్ గురించి తనకు తెలిసిందంతా కక్కడం మొదలెడతాడు.
దినకర్ మనసులోని భావాలని చదివేస్తున్నట్లు అంది ఆమె.
"దినకర్ నువ్వు ఆ గూండా గాన్ని పట్టుకుని బాదితే, వాడు తనకు తెలిసిందంతా కక్కేస్తాడు నిజమే! కానీ అసలు వాడికి తెలిసింది ఎంత? అన్నది ఇక్కడ ప్రశ్న. వాడు మెకానిక్ ఆర్గనైజేషన్ లో అట్టడుగు పొరలో వున్న ఒక నాటు గూండా! వాడికి తెలిసింది ఆవగింజలో అరవయ్యోవంతు కూడా వుండదు!"
అది కరక్టే అనిపించింది అతనికి.
కొద్దిగా ఆగి, సంకోచంగా అన్నాడు అతను.
"వైశాలీ! కనీసం ఈ ఒక్క విషయం చెప్పు! నేనెవరిని?"
సానుభూతిగా అంది ఆమె.
"దినకర్! అది కూడా కోర్టులోనే తెలుస్తుంది నీకు!
అన్ని విషయాలూ కోర్టులోనే చెబుతాను నేను. దానిలో అందరి సమస్యలూ పరిష్కారం అయిపోతాయి. దిసీజ్ ఏ ప్రామిస్!"
"మరి ఈ కేసులో నీకు ఇప్పటి దాకా సంబంధం లేదు కదా! నువ్వెలా వస్తావు కోర్టుకి?" అన్నాడు అతను.
"సింపుల్! నువ్వు నన్ను నీ సాక్షిని పిలిపించుకోవచ్చు. స్టార్ విట్ నెస్ ని అవుతాను నేను డిఫెన్స్ తరఫున! నీకోసం ఏ వన్ లాయర్ని కూడా తీసుకొస్తాను నేను."
తల పంకించి ఆ తర్వాత పరిస్థితిని అంచనా వేస్తున్నట్లు అన్నాడు దినకర్.
"నువ్వు చెప్పినదాని ప్రకారం మెకానిక్ అనబడే ఒకడి తాలూకు మనుషులు నాకోసం తీవ్రంగా వెతుకుతున్నారు. దొరికితే నా దగ్గరనుంచి ఏదో ఇన్ ఫర్మేషన్ లాగాలనీ, లేదా నాతో ఏదొపని చేయించుకోవాలని వాళ్ళ ఉద్దేశ్యం అయివుండాలి. అలా గనక కుదరకపోతే నన్ను చంపెయ్యడానికి కూడా వాళ్ళకి అభ్యంతరం లేదు. యామ్ ఐ రైట్?"
"రైట్!" అంది ఆమె.
"తన తల్లిని చంపిన హంతకుడిని నేనే అని కోర్టులో చెప్పిన విక్కీ నీ సొంత తమ్ముడు! మీ తల్లేమో చాలా సంవత్సరాల క్రితమే చనిపోయింది."
"వెరీ ట్రూ!"
"చనిపోయిన ఎవరో ఒక స్త్రీని పట్టుకుని విక్కీ తన తల్లి అని ఎందుకు అంటున్నాడో, ఆ హత్యా చేసింది నేనే అని ఎందుకనుకుంటున్నాడో, కూడా నాకు తెలియదు. ఒకవేళ తెలిసినా, ఇప్పుడు నాతో చెప్పనని కూడా నువ్వే అంటున్నావు.