Previous Page Next Page 
యమదూత పేజి 40

 

    దానిని తిరగేసి చూశాడు అతను.
    
    ప్రతి పేజీలోనూ ఏవేవో అంకెలు వున్నాయి. కోడ్ లో రాసినట్లు ఎంట్రీలు వున్నాయి. ఒక్క ఎంట్రీ కూడా అర్ధం కాలేదు అతనికి.
    
    అయినా కూడా దాన్ని జేబులో పెట్టుకున్నాడు అతను. అంతలో -
    
    వెనుకనుంచి హఠాత్తుగా అతని మీదికి లంఘించాడు ఒక వ్యక్తి.
    
    ఆ విసురుకి పట్టుతప్పి కిందపడ్డాడు జలీల్.
    
    జలీల్ మీదికి దూకిన వ్యక్తి అతన్ని షూట్ చెయ్యడానికి రివాల్వర్ తీశాడు. తర్వాత మనసు మార్చుకుని, రివాల్వర్ ని బెల్టులో దోపేసుకున్నాడు. అక్కడే అందుబాటులో వున్న ఒక కుర్చీని లేవనెత్తి జలీల్ దగ్గరికి వచ్చాడు. అతని కళ్ళలో కసి కనబడుతోంది.
    
    "మా వాళ్ళు అయిదుమందిని అకారణంగా చావ చితగ్గొట్టావు. అందుకు బదులుగా ముందు నీకాళ్ళు విరక్కొట్టి ఆ తర్వాత అరడజను బుల్లెట్స్ నీ తల్లోకి పంప్ చేస్తా!" అన్నాడు రౌద్రంగా.
    
    కంటి కొనల్లోంచి పరిస్థితిని గమనిస్తున్నాడు జలీల్.
    
    అరక్షణంలో ఒక నిశ్చయానికి వచ్చి, అక్కడ ఉన్న కార్పెట్ అంచు పట్టుకుని లాగాడు.
    
    కార్పెట్ జర్రుమని జరగడంతో దానిమీద నిలబడి వున్న ఆ వ్యక్తి ధన్ మని కిందపడ్డాడు. అతని తల బలంగా నేలని తాకింది. అచేతనంగా ఉండిపోయాడు అతను.
    
    కిందనుంచి ఇంకొంతమంది మనుషులు పైకి పరిగెత్తుకొస్తున్న శబ్దాలు వినబడ్డాయి.
    
    జేబులోవున్న డ్రగ్స్ ప్యాకెట్లని ఓ సారి తడిమి చూసుకుని, త్వరత్వరగా మెట్లెక్కేస్తూ టాప్ ఫ్లోర్ వైపు పరిగెత్తడం మొదలెట్టాడు ఇన్ స్పెక్టర్ జలీల్.
    
    ఆరో అంతస్తు పై భాగంలో ఓపెన్ స్పేస్ వుంది.
    
    దానిమీదికి జారుకున్నాడు జలీల్. అక్కడ క్రీనీడల్లో దాక్కుని ఉన్న మనిషి కనబడ్డాడు జలీల్ కి. చటుక్కున రివాల్వర్ అతనిమీదికి గురిపెట్టాడు.
    
    రివాల్వర్ ని చూడగానే ఆ వ్యక్తి అదిరిపడి బావురుమని ఏడ్చినంత పనిచేశాడు.
    
    "ఎరక్కపోయి దొంగతనాని కొచ్చి ఇరుక్కు పోయాను బాబోయ్! ఇక్కడేదో పదో పరకో దొరుకుతుందని ఆశపడి వచ్చా! అంతేగానీ మీరు ఇంత అఘాయిత్యంగా తుపాకులు పేలుస్తూ నా వెంట పడతారనుకోలేదు."
    
    అని చొక్కాతో కళ్ళు తుడుచుకుని, "నన్ను చంపకు నీకు దణ్ణం పెడతా!" అన్నాడు దీనంగా.
    
    జలీల్ మొహంలో రిలీఫ్ కనబడింది.
    
    "అయితే నువ్వు ఆ మెకానిక్ తాలూకు మనిషివి కావన్నమాట! యూ ఆర్ ఏ స్మాల్ టైం క్రూక్! రామాయణంలో పిడకల వేటలా నువ్వొచ్చి ఈ గన్ ఫైట్ లో ఇరుక్కుపోయావన్నమాట!" అని చిన్నగా నవ్వి, అతని భుజం తట్టి, తన రివాల్వర్ అతనికి అందించాడు ఇన్ స్పెక్టర్ జలీల్. "ఇది నీదగ్గర వుంచుకో! నీ ప్రాణాలు రక్షించుకోవడానికి పనికి వస్తుంది. ఒకవేళ వాళ్ళు గనక నన్ను లొంగదీసుకోగలిగితే వాళ్ళని దీనితో బెదిరించగలవేమో చూడు! మనం ఒకళ్ళకి ఒకళ్ళ తోడు!" అని వెనక్కి తిరిగాడు.
    
    తక్షణం జలీల్ ఇచ్చిన రివాల్వర్ జలీల్ మీదికే గురిపెట్టాడు ఆ వ్యక్తి.
    
    "చేతులెత్తు!" అన్నాడు కఠినంగా.
    
    ఆ మాటలు విని నెమ్మదిగా వెనక్కి తిరిగాడు జలీల్.
    
    పరిహాసంగా నవ్వుతూ నిలబడి వున్నాడు ఆ వ్యక్తి.    
    
    అతను ఎవరో చిన్నసైజు దొంగ కాదనీ, అతను కూడా మెకానిక్ తాలూకు మనిషేనని అర్ధమయింది ఇన్ స్పెక్టర్ జలీల్ కి.
    
    "వినబడ్డం లేదా? చేతులు పైకెత్తు!" అన్నాడు ఆ వ్యక్తి.
    
    చేతులు పైకెత్తి ఒక్కొక్క అడుగే ముందుకు వెయ్యడం మొదలు పెట్టాడు ఇన్ స్పెక్టర్ జలీల్.
    
    "చస్తావ్! దగ్గరికి రాకు!" అన్నాడు ఆ వ్యక్తి గట్టిగా.
    
    ఇంకో అడుగు ముందుకు వేశాడు జలీల్.
    
    రివాల్వర్ సేఫ్టీకాచ్ రిలీజ్ చేశాడు ఆ మనిషి.
    
    మరో అడుగు ముందుకు వేశాడు జలీల్.
    
    ట్రిగ్గర్ నొక్కాడు ఆ మనిషి.

 

    "క్లిక్" మన్న శబ్దం వచ్చింది.
    
    అంతే!
    
    రివాల్వర్ పేలలేదు.
    
    నవ్వాడు జలీల్. "ఆ రివాల్వర్ లో బుల్లెట్లు లేవు. చివరి బుల్లెట్ ఇందాకే పేల్చేశా! నువ్వు ఎవరో ముందే గ్రహించాను తమ్మీ నేను! నా అనుమానాన్ని తేల్చుకోవడానికే నేను నీకు ఆ రివాల్వర్ ఇచ్చింది." అన్నాడు.
    
    తెరిచిన నోరు ముయ్యడం మర్చిపోయాడు ఆ మనిషి అతని మొహంలో ప్రేత కళ కనబడింది.
    
    ఈలోగా-
    
    వెనకనుంచి ఇంకెవరో వస్తున్న అలికిడి వినబడింది.
    
    చటుక్కున వెనక్కి తిరిగాడు ఇన్ స్పెక్టర్ జలీల్.
    
    అక్కడ నిలబడి వున్నాడు అతను!
    
    క్రీం కలర్ సూటు! తెల్లటి ఉంగరాల జుట్టు! ఉక్కుముక్కలా దృఢంగా వున్న శరీరం!
    
    "మెకానిక్!" అన్నట్లు కదిలాయి ఇన్ స్పెక్టర్ జలీల్ పెదిమలు.
    
    "యస్! ఇన్ పర్సన్! ఇన్ ఫ్లష్ అండ్ బ్లడ్!" అని నవ్వుతూ దగ్గరికి వచ్చాడు మెకానిక్. కరస్పర్శ కోసం చెయ్యి జాపాడు.
    
    "వాట్ ఇన్ స్పెక్టర్! ఏమిటీ హడావిడి? మీకు ఏదన్నా సమాచారం కావాలంటే నన్నడిగి వుండవచ్చు కదా! వివరంగా చెప్పి ఉండేవాడిని." అన్నాడు పొలైట్ గా.
    
    జేబులోనుండి డ్రగ్స్ ప్యాకెట్స్ తీశాడు జలీల్.
    
    "ఐ వాంట్ టూ నో సమ్ థింగ్ అబౌట్ దీస్ ప్యాకెట్స్!" అన్నాడు ముక్తసరిగా.    

 

    వాటివైపు యదాలాపంగా చూసి, "అవా?" అని చిన్నగా నవ్వాడు మెకానిక్. "ఐరన్ ఎన్ రిచ్ డ్ సాల్ట్! అంటే ఇనుము కలిపిన లవణం! మిస్టర్ జలీల్! మీకు తెలుసు. మన ఇండియా పూర్ కంట్రీ! మన ఆహారంలో వుండవలసిన మినరల్స్ అంటే ఖనిజాలూ అవీ ఉండవు. దట్స్ వై యాజ్ ఏ సోషల్ సర్వీస్, న్యూట్రిషన్ సైంటిస్టులు కనుక్కున్న సరికొత్తరకం లవణాన్ని చవగ్గా సప్లయ్ చేయాలని నా తాపత్రయం. ఇవి శాంపిల్ ప్యాకెట్లు! ఒక చిటికెడు ఉప్పు నోట్లో వేసుకుని చూసి ఎలా ఉందో చెబితే సంతోషిస్తాను" అన్నాడు. అతని గొంతులో లీలగా వ్యంగ్యం వినబడుతోంది.
    
    తన చేతిలోని ప్యాకెట్ ల వైపూ, మెకానిక్ వైపూ మార్చి మార్చి చూశాడు ఇన్ స్పెక్టర్ జలీల్.
    
    తర్వాత ఒక ప్యాకెట్ ఓపెన్ చేసి ఆ తెల్లటి పొడి ఒక చిటికెడు నోట్లో వేసుకున్నాడు.
    
    అది ఉప్పు!
    
    కేవలం ఉప్పు!

 

    అంతే!

 

    "షిట్!" అనుకున్నాడు ఇన్ స్పెక్టర్ జలీల్.
    
    చిన్నగా నవ్వాడు మెకానిక్. "డ్రింక్ మిస్టర్ జలీల్!" అన్నాడు మర్యాదగా.
    
    వద్దన్నట్లు తల పంకించి వెళ్ళిపోవడానికి వెనక్కి తిరిగాడు జలీల్.
    
    "మిస్టర్ జలీల్!" అన్నాడు మెకానిక్.
    
    ఆగాడతను.
    
    "నెక్స్ట్ టైం మీరు మా ప్లేస్ ని పావనం చేసినప్పుడు దయచేసి మా వాళ్ళ మీద కాస్త కనికరం చూపించండి. మళ్ళీ ఇంకోసారి ఇలా మీ చేతిలో చావు దెబ్బలుతింటే, మావాళ్ళు మంచినీళ్ళడక్కుండా చావడం ఖాయం! నమ్మకమయిన పనివాళ్ళు దొరకడం కష్టం కదా! మీరు ఆలోచించాలి! సోలాంగ్ మిస్టర్ జలీల్!" అన్నాడు అతని పెదిమల మీద చిరునవ్వు.
    
    చరచర మెట్లు దిగడం మొదలు పెట్టాడు జలీల్. అతని మనసు మండిపోతోంది.
    
    తను మెకానిక్ స్థావరాన్ని రెయిడ్ చేయబోతున్నట్లు అప్పుడే సమాచారం అందిపోయిందన్నమాట అతనికి!

 

    అందుకే అల్మారాల్లో డ్రగ్స్ ప్యాకెట్స్ కి బదులు ఉప్పు పొట్లాలు ప్రత్యక్షమయ్యాయి.

 Previous Page Next Page