Previous Page Next Page 
సంకల్పం పేజి 41

 

     తను రూపొందించుకున్న కలల్ని తనే తలచుకుని, డ్రింక్ ని సిప్ చేస్తూ, తనలో తనే నవ్వుకుంటున్నాడు మధుకుమార్.
   
    "ఏంటండీ.... మీలో మీరు నవ్వుకుంటున్నారు" ఆ మాటంటూ లోనికొచ్చింది లేఖిని.
   
    "ఏం లేదు.... మీ చెల్లెలు వ్యవహారం జ్ఞాపకానికొచ్చింది" మాట మార్చేశాడు మధు.
   
    "ఏం... దానిమీద పడింది మీ దృష్టి" ఒకింత ఆశ్చర్యంగా అడిగింది లేఖిని.
   
    "ఈ ఎమ్.బి.ఏ. అమ్మాయి ప్రేమలో పడితేనూ...."
   
    "లిఖిత ప్రేమలో పడిందా.... ఎవరా కుర్రాడు..." వెంటనే అడిగింది లేఖిని.
   
    "అనుమానంగా ఉంది.... కన్ ఫమ్ చెయ్యాలి."
   
    "ఇప్పుడు గూఢచారి విభాగం చేపట్టారా తమరు." గదిలో ఓ పక్కనున్న ఉయ్యాల మీద కూర్చుంటూ అంది లేఖిని. ఆ ఉయ్యాలకు చిన్న వెండి మువ్వలున్నాయి. కదులుతూ చిన్న శబ్దం చేస్తున్నాయవి. ఆ నిశ్శబ్ద సమయంలో ఆ శబ్దం చాలా మనోహరంగా ఉంది.
   
    లిఖిత ప్రేమలో పడిందా? ఏ చిన్న విషయాన్నైనా తనతో చెప్పే లిఖిత దీన్నెందుకు రహస్యంగా దాచింది?
   
                                       *    *    *    *    *
   

    చేతులు నొప్పి పుడుతున్నాయి లిఖితకు.
   
    ఎంగేజ్.... ఎంగేజ్... ఎంగేజ్....
   
    'శివానీ' ఫోన్ ఎప్పుడూ ఎంగేజ్ లోనే ఉంటోంది.
   
    ఆ రోజు వికాస్ ని అంతవరకూ తెచ్చి తను గెలిచింది. కానీ వికాస్ చేత ఏమీ చెప్పించలేక పోయింది. మధ్యలో ఎవడో వచ్చాడు.
   
    అప్పన్నించి అడపా దడపా ప్రయత్నిస్తూనే వుంది.
   
    ఫోన్ దొరకడం లేదు- ఫోన్లో మనిషి దొరకడం లేదు.
   
    ప్రయత్నించి, ప్రయత్నించి విసుక్కుంటున్న లిఖిత అట్నించి 'రింగ్' వినబడడంతో ముఖం విప్పారింది.
   
    "హలో..."
   
    ఎవరో ఫోన్ కట్ చేసినట్టు అనిపించడంతో వెనక్కి తిరిగి చూసింది లేఖిని.
   
    "అబ్బా... అక్కా... దొరక్క, దొరక్క ఫోన్ దొరికితే.... నువ్విదా చేసేది" మళ్ళీ ట్రై చేస్తోంది.
   
    "ముందు నాకో విషయం చెప్పు బేబీ..... ఎవరికా ఫోను.... ఉదయం నుంచీ చూస్తున్నాను..... ఎప్పుడు చూసినా ఫోన్ని పట్టుకొని వదలడం లేదు. ఏవిటి విశేషం." రెండు భుజాల్నీ పట్టుకుని చెల్లి కళ్ళల్లోకి చూస్తూ అడిగింది అక్కడ.
   
    "ఓ ఫ్రెండుకి... చాలా..."
   
    "ఫ్రెండా.... ఆడ ఫ్రెండా.... మగ ఫ్రెండా...." వెంటనే అడిగింది లేఖిని.
   
    "మగ ఫ్రెండే...."
   
    "అంటే.... ఏదో వుంది.... నా దగ్గర నీకు రహస్యమా..."
   
    "రహస్యం లేదూ.... పాడూ లేదు... ఫోన్ దొరక్క చస్తుంటే నువ్వేంటి మధ్య." మరి మాట్లాడలేదు లేఖిని.
   
    అక్కడే చెల్లి ముఖం వేపు చూస్తూ కూర్చుంది.
   
    ఫోన్లో మాట్లాడినప్పుడైనా తనకు తెలుస్తుంది కదా! అదీ లేఖిని ఐడియా,
   
    నిన్ను నేను ప్రేమిస్తున్నానని వికాస్ తో ముందు చెప్పి తర్వాత అక్కకి చెప్దామనుకుంది లిఖిత.
   
    శివానీలో ఎట్టకేలకు ఫోన్ మోగుతోంది.
   
    వికాస్ రిసీవర్ తీశాడు.
   
    "హలో... వికాస్ హియర్..."
   
    ఎట్టకేలకు వికాస్ దొరికాడు. కానీ పక్కనే లేఖిని ఉంది. ఎలా మాట్లాడటం అక్క పక్క నుండగా తనేం చెప్తుంది!
   
    అక్కవేపు చురచుర చూస్తూ ఫోన్ పెట్టేసింది. కవ్వింపుగా నవ్వుతూ అక్కడ నుంచుందే తప్ప లేఖిని కదల్లేదు.
   
    లాభం లేదు. 'వైజాగ్'లో మంచి మూడ్ క్రియేట్ చేసి వికాస్ తో చెప్పాలి' పడుకునే ముందు అనుకుంది లిఖిత.
   
                                    *    *    *    *    *
   
    జగన్మోహన్ ఫోనందదుకున్నాడు.
   
    "హలో.... శివానీ మోటార్స్..."
   
    "కెన్.....ఐ....స్పీక్ టూ మిస్టర్ వికాస్...."
   
    "హి ఈజ్ నాట్ ఎవైలబుల్....ఎవరు మాట్లాడుతున్నారు...."
   
    "మీరు ఒక కొత్త కారుని మార్కెట్లోకి తీసుకొస్తున్నారని తెల్సింది వాటి గురించి వివరాలు కావాలి. ఇవ్వగలరా!"
   
    "మీరెక్కడనుంచి మాట్లాడుతున్నారు." హోటల్ సరోవర్.... రూం నెంబర్ 203" చెప్పాడు అవతలి వ్యక్తి.
   
    "నా పేరు జగన్మోహన్.... సేల్స్ మేనేజర్ని.... నేనే మిమ్మల్ని కలుస్తాను..."
   
                                   *    *    *    *    *
   
    తలుపు తోసుకుని లోనికి హడావుడిగా వచ్చాడు జగన్మోహన్.
   
    తలెత్తాడు వికాస్.
   
    "వికాస్.... వుయ్ ఆర్ లక్కీ.... ఒక పెద్ద పార్టీ వచ్చింది హైద్రాబాద్ నుంచి.... నువ్వు లేనప్పుడు ఫోనొస్తే నేనే వెళ్ళాను.... మనం కరెక్టుగా డీల్ చేస్తే మన ప్రొడక్ట్ మొత్తం వాళ్ళే తీసుకుంటారు...." ఎక్సైట్ అవుతూ చెప్పాడు జగన్.
   
    "ఎవరాయన..." సంయమనంతో నెమ్మదిగా అడిగాడు వికాస్.
   
    "మధుకుమార్."
   
                                      *    *    *    *    *
   
    రెస్టారెంట్ లో వాళ్ళిద్దరే కూర్చున్నారు.
   
    మధుకుమార్ స్కాచ్ తాగుతున్నాడు- వికాస్ కూల్ డ్రింక్ తాగుతున్నాడు.
   
    "చతికిలబడ్డ ఫ్యాక్టరీని మళ్ళీ లేపి, మీరు 'స్ట్రీట్ రైడర్' అనే ఆయిల్ అవసరం లేని కారుని ఇంట్రడ్యూస్ చేస్తున్నారనే విషయం తెలిసి చాలామంది గుండెలు బాదుకుంటున్నారు.... మీకా విషయం తెల్సా...?"
   
    మార్కెట్లో 'టాక్' రావడం విన్నాడు. కాని ఒక అపరిమితమైన వ్యక్తి ద్వారా వినడం ఇదే ప్రధమం.
   
    "ఈ ఆటోమోబైల్ ఇండస్ట్రీలోనే నేను చాలాకాలం నుంచి ఉన్నాను. నా పేరు కుమార్.... నేను మీ కంపెనీలో పార్ట్ నర్ గా వుండాలనుకుంటున్నాను....నేను హైద్రాబాద్ లోనే వుంటాను..... నా బిజినెస్ నేను చేసుకొంటుంటాను. నావల్ల మీకే మాత్రం ఇబ్బంది కలుగదు.... ఆలోచించండి...." అన్నాడు కుమార్.
   
    "మా పార్ట్ నర్ తో నేను మాట్లాడాక గానీ.... నేను చెప్పలేను.... అయినా మీరెంత పెడదామనుకుంటున్నారు..." అడిగాడు వికాస్.
   
    "మీరెంత షేర్ ఇస్తే అంత... ఇంకో విషయం.... నేను మీ 'శివానీ'లో పార్ట్ నర్ ననే విషయం మనలోనే వుండాలి.... ఎక్కడా, ఎవరికీ తెలియగూడదు. నలుగురికీ తెలిసే రకంగా బిజినెస్ చెయ్యడం నాకిష్టం లేదు...." ఆగాడు కుమార్.
   
    "ఒకవేళ మా ప్రొడక్ట్ సక్సెస్ కాలేదనుకోండి.... లాసే వస్తే...."
   
    "మీతోపాటే.... నేనూ..." ఏమాత్రం ఆలస్యం చెయ్యకుండా చెప్పాడు కుమార్.
   
    "ఒక గంటలో ఫోన్ చేస్తాను..." అక్కడ్నించి వచ్చాడు వికాస్.
   
    ఈ పరిస్థితిలో బొటాబొటీ ఫైనాన్స్ తో కంటే, కుమార్ ని 'పార్ట్ నర్' గా తీసుకుంటే-
   
    ఏమాత్రం సంకోచం లేకుండా-
   
    "స్ట్రీట్ రైడర్ని" మార్కెట్లో విడుదల చెయ్యచ్చు.... భారీ ఎత్తున ఎడ్వర్టేజ్ మెంట్ చెయ్యొచ్చు..... టీ.వీ.లో, పత్రికలలో భారీ ఎత్తున 'యాడ్ కాంపైన్' చెయ్యాలన్నా, తను అనుకున్న పద్దతిలో కారుని ఇంట్రడ్యూస్ చెయ్యాలన్నా- అదనంగా ఫైనాన్స్ కావాలి.
   
    అదే మాటన్నాడు శివమూర్తితో వికాస్.
   
    శివమూర్తి ఎంతయినా అనుభవజ్ఞుడు- ఢక్కామొక్కీలు తిన్నవాడు.
   
    "ఇంట్రస్ట్ తోనే రావచ్చు.... సదుద్దేశంతోనే రావచ్చు... అయినా కొత్తవాడు. తెలియకుండా కొత్తవాడితో స్నేహం చేస్తే కష్టం. ఆలోచించు.....బిజినెస్ అన్నాక మంచీ చెడూ అన్నీ ఆలోచించాలి.... కొన్నాళ్ళు ఆగితే మంచిది. ఈలోపల ఏదయినా అవసరమయితే 'ఫైనాన్స్' సర్దుబాటు చెయ్యమను.... మనిషిని టెస్ట్ చేసినట్టూ వుంటుంది.... మన పనీ అవుతుంది...." సలహా ఇచ్చాడు శివమూర్తి.
   
    శివమూర్తి చెప్పినదానినే చాలా జాగ్రత్తగా చెప్పాడు మధుకుమార్ తో వికాస్.
   
    "చూడండి వికాస్... శివానీ గ్రూపులో ఏరకంగా వున్నా నాకు చాలు....అంతే తప్ప.... మిగతాదేం లేదు. మీరెప్పుడు ఆర్ధిక సహాయం కావాలన్నా ఒక్క ఫోన్ చాలు... కొరియర్ లో 'చెక్' పంపిస్తాను.... ఓ.కె." మధుకుమార్ మొదటి ఎత్తు- వికాస్ తో కలవడం-
   
    "మీ కారు ఎప్పటికి మార్కెట్లోకి వస్తుంది?" అడిగాడు మధుకుమార్.

 Previous Page Next Page