"జనవరినాటికి...."
"మన ప్రొడక్టు సక్సెస్ కావాలంటే.... రైవల్ గ్రూప్స్ ని కూడా ఓ కంట కనిపెడుతుండాలి. అర్ధమైందా.....బిజినెస్ అంటే మనదారిలో మనం వెళ్ళడమే కాకుండా, మన దారికి ఎవడూ అడ్డు రాకుండా కూడా చూసుకోవడంలోనే వుంది." వ్యాపార సూత్రం చెప్తున్నట్లుగా అన్నాడు కుమార్.
ఏట్లో, తేట నీటిలో హాయిగా తిరిగే చేపపిల్ల, ఆకస్మాత్తుగా 'ఎక్వీరియం'లో చిక్కుకుపోయినట్లుగా అయిపోయింది వికాస్ కి.
వ్యాపారమంటే ఇన్ని మడత పేచీలా? ఆశ్చర్యంగా వుంది!
* * * * *
"ఇదిగో బ్లాంక్ చెక్.... ఎంత ఎమౌంట్ వేసుకుంటావో నీ ఇష్టం..." చెక్ బుక్ లోంచి 'చెక్'ని చింపి ముందుకు తోశాడు భానోజీరావు.
"నువ్వు డబ్బు చేతిలో పడందే.... ఏ పనీ చెయ్యవని నాకు తెలుసు కాబట్టి...." మళ్ళీ అన్నాడాయన.
ఇద్దరిదీ సరి సమాన వయస్సు.
"ఏంటండీ బాబూ.... చూస్తుంటే ఇదేదో పెద్ద పనిలా వుంది. మీ లాంటివారు డైరెక్ట్ గా రంగంలోకి దిగిపోతున్నారంటే... చెప్పండి.....చెప్పండి...." ఆసక్తిగా అన్నాడు జగన్నాధమిశ్రా.
"అదే.... మీ ఏరియాలోంచి ఒక కారొస్తోందట విన్నావా...." చెప్పబోయాడు.
"ఆగండాగండి.... కోడిపిల్లని గెద్ద ఎంత దూరం నుంచి చూస్తుందో మీకు తెలుసా.... అంతెత్తు నుంచి చూస్తుంది. అప్పుడే ఎప్పుడో కనిపెట్టేస్సేను నేను. అసలోడితో మాట్లాడలేదు కానీ వివరాలన్నీ తెల్సు.... వికాస్ అని... మన కంపెనీలోంచి వెళ్ళినోడే..... హైపవర్ ఎలక్ట్రిక్ కారట.... పెట్రోలు, డీజిలూ ఏమీ అక్కర్లేదట- బాడీ అద్భుతమట... ఇంజన్ అద్భుతమట... చెప్పగా విన్నాను. భారీ ఎత్తున లాంచ్ చేస్తున్నారట." ఆపాడు జగన్నాధమిశ్రా.
"ఆ కారు మార్కెట్ లోకి రాగూడదు. నువ్వేం చేస్తావో చెయ్యి.... ఆ కంపెనీ అక్కడుండగూడదు. అదే సమయానికి మన కారొస్తుంది. ఎక్కడ చూసినా రోడ్డుమీద మన కార్ కన్పించాలి.... తెల్సిందా...."
"కారు తయారుచెయ్యడమంటే మనవల్ల కాదు గానీ, ధ్వంసం చెయ్యడమంటే రెండు నిమిషాల్లో పని..."
"ఎక్కడా మన పేరు బైటికి రాగూడదు. అర్ధమైందా..."
"మన ప్రతాపం అప్పుడే మరిచిపోయారు మీరు..." అని గతాన్ని ఒకసారి జ్ఞాపకం చేశాడు జగన్నాధమిశ్రా.
ఒకసారి కలకత్తాకు చెందిన ఒక గ్రూప్ కొత్తగా మోపెడ్ ని తయారు చేసింది. ఆంద్రప్రదేశ్ లో ఒక డీలర్ ని ఏర్పాటు చేసుకుంది. బొంబాయిలోని ఒక గ్రూప్ కూడా ఇంకోరకం మోపెడ్ ని తయారుచేసింది. దానికి మెయిన్ డీలర్ భానోజీరావు. భానోజీరావు కొత్తగా ఆటోమోబైల్ వ్యాపారంలోకి దిగిన సమయం అది.
కలకత్తా కంపెనీ మోపెడ్ లు ఆంధ్రాలోకి అసలు రాగూడదు- అదీ భానోజీరావు పంతం.
లక్ష మోపెడ్ల లారీలు దారిలో తప్పిపోయాయి.
ఎక్కడకెళ్ళిపోయాయో, ఎటెళ్ళిపోయాయో తెలీదు.
ఆటోమోబైల్ ఇండస్ట్రీలో ఒక సంచలనమైన కధ అది.
బొంబాయి గ్రూపు మోపెడ్ లు రెండింతలు అమ్ముడుపోయాయి. చాలా రోజుల తర్వాత-కలకత్తా కంపెనీ లారీలొచ్చాయి.
ఆ లారీలు ఒరిస్సా అడవుల్లో వున్నాయట- పోలీసులకు కన్పించాయి.
డ్రైవర్లు లేరు- ఎటెళ్ళిపోయారో తెలీదు.
ఆరోజుకీ, ఈ రోజుకీ ఆ డ్రైవర్ల జాడ ఎవరికీ తెలీదు. ఇద్దరికి తప్ప ఒకరు భానోజీరావు- రెండవవారు జగన్నాధమిశ్రా.
పట్టుదల వస్తే భానోజీరావు ఎంతటివాడో జగన్నాధమిశ్రాకు బాగా తెలుసు.
"ఎప్పటికప్పుడు నాకు ప్రోగ్రెస్ తెలియాలి..." చెప్పాడు భానోజీరావు.
చైర్మెన్ ఛాంబర్ లోంచి జగన్నాధమిశ్రా బయటికొస్తున్న సమయంలోనే లోనికి అడుగుపెట్టాడు మధుకుమార్.
"ఎప్పుడొచ్చావ్.... రా.... ఏమిటీ విశేషాలు...." అడిగాడు భానోజీరావు.
"మీకొచ్చింది రాంగ్ ఇన్ ఫర్ మేషనండి. శివానీ గ్రూపు వాళ్ళేం చేస్తారు? సరయిన ఫైనాన్స్ లేదు. ఏమీ లేదు. దాని గురించి వర్రీ కావలసిన పనేం లేదు.... ఇంధనం అవసరంలేని కారు కానుక విదేశీ మారక ద్రవ్యం ఆదా అవుతుందని ఆర్ధికమంత్రి మన్ మోహన్ సింగ్ పర్సనల్ ఇంట్రస్ట్ తో వెంటనే లైసెన్స్ ఇచ్చారట- కనీసం ఫార్మాలిటీస్ కూడా పూర్తి చేయకుండా కాని సక్సెస్ కావొద్దు...." అన్నాడు మధుకుమార్.
"అంతేనంటావా....?"
అదే సమయంలో ఫోన్ మ్రోగింది.
"వైజాగ్ నుంచి సార్...." పి.ఏ. చెప్పాడు.
"హలో!"
"గుడ్ మాణింగ్ సర్..... మధుకుమార్ ఇక్కడ కొచ్చారు సార్.... ఆ వికాస్.... మధూ.... కలుసుకున్నారు సర్.... ఏం మాట్లాడుకున్నారో తెలీదు సర్.... ఉంటాను సార్!"
ఫోన్ పెట్టేశాడు భానోజీరావు.
భానోజీరావు ముఖంలో ఏ మార్పూలేదు. ఇందాక 'అంతేనంటావా' అన్న ముఖమే ఉంది. ఇప్పుడు కూడా.
"అయినా సరే.... మనం జాగ్రత్తగా ఉండాలి.... మళ్ళెప్పుడెళ్తున్నావ్?" అన్నాడాయన.
"రెండ్రోజుల్లో... చెప్పాడు" మధుకుమార్. తర్వాత మధుకుమార్ వెళ్ళిపోయాడు.
తన అంచనా ఎప్పుడూ తప్పదని సాక్ష్యాలతో రుజువైనందుకు మరోసారి ఆత్మ విశ్వాసం పెరిగిందాయనకు.
పులి మెడకు గుర్రపు కళ్ళెం కట్టొచ్చని పిచ్చిగా ప్రయత్నాలు చేసే వాళ్ళెందరో!
* * * * *
వికాస్ నిద్రాహారాలు మానేశాడు. పెయింటింగ్ దగ్గర్నుంచి, అప్ హోలస్టరీ వరకు... గాలి ఒత్తిడిని తగ్గించుకుంటూ ముందుకు దూసుకెళ్ళగల బాడీ రూపకల్పన... డిస్క్ బ్రేక్స్... డ్యూటీలో సర్క్యూట్ బ్రేకింగ్ సిస్టమ్... ఎంత వేగంలోనైనా బ్రేక్ వేస్తే ఎలాంటి వైబ్రేషన్స్ లేకుండా ఆగిపోయే శక్తిగల బ్రేక్స్... హైలీ సోఫిస్టికేటేడ్ ఎలక్ట్రికల్ సిస్టమ్స్... ఫెంటాస్టిక్ సస్ పెన్షన్.....పవర్ ఫుల్ వాటర్ కూల్డ్ ఇంజన్.... క్షణాల్లో పికప్ తీసుకోగల 40.5 BHP/5600 RPM.....2,00,000 కిలోమీటర్ల వరకు ఓవర్ హాలింగ్ లేకుండా పనిచేయగల అతిశక్తివంతమైన ఇంజన్ అక్కడ పనిచేస్తున్న సీనియర్ ఇంజనీర్లు, వర్కర్స్ ఒకప్పుడు హిందూస్తాన్ ప్రీమియర్, మారుతీలో పనిచేసి రిజైన్ చేసి వచ్చినవాళ్ళే, వాళ్ళు సయితం వికాస్ లోని పట్టుదలకు, తెలివితేటలకు విస్మయం చెందుతున్నారు.
వాళ్ళు సయితం నిద్రాహారాలు మానేశారు. పని... పని... పని....ఒక సంచలనానికి ఊపిరిపోసే పని... పని... 'STREET RIDER' కారు బాడీ నిర్మాణం పనులు కూడా చురుగ్గా సాగుతున్నాయి. అమేజింగ్ స్పేషియస్ ఇంటీరియర్, డ్రైవర్ కి, ప్యాసింజర్స్ కి కావలసినంత లెగ్ రూమ్, లగేజీకి స్పేస్, కౌంటర్డ్ బకెట్ సీట్స్, విండ్ స్క్రీన్, విండోస్ ఆల్ రౌండ్ విజబిలిటీకి డిజైన్ చేయటం జరిగింది. కంప్రెస్ట్ పోలీ ప్రొఫైలైన్ డాష్ బోర్డ్, గ్లేర్ ఫ్రీ ఇన్ స్టృమెంట్ ప్యానల్, ఎయిరో డైనమిక్ డిజైన్ తో స్ట్రీట్ రైడర్.... అంతవరకూ ఇంజనీరింగ్ విభాగం ఓపెన్ గా ఉండేది. దానిచుట్టూ గోడ కట్టించేశాడు వికాస్. లోపల ఏం జరుగుతున్నది బయట వాళ్ళకెవరికీ తెలీదు.
స్ట్రీట్ డ్రైవర్ కారు.... గంటకి నూట ముఫ్ఫై కిలోమీటర్ల గరిష్ట వేగం ఇంధనం అవసరం లేదు.... హైఓల్టేజి బ్యాటరీ సహాయంతో నడుస్తుంది. చార్జింగ్ పూర్తి చేసుకుని పరుగెత్తడానికి సిద్దమౌతుంది.... మూడు సంవత్సరాల గ్యారంటీ!
అరవింద నాయర్ వచ్చి తగిన సలహాలిచ్చి వెళ్ళాడు.
పదిహేను రోజుల్లో కార్లన్నీ రెడీ అవుతాయి.... ముందు అనుకున్న ప్రకారం పాతిక కార్లు కాకుండా, యాభై కార్లను ఉత్పత్తి చేస్తోంది శివానీ కంపెనీ.
'టెస్ట్ ఫీల్డ్'ని నిర్ణయించి, కార్లన్నిటినీ 'టెస్ట్' చెయ్యాలి ఇంజనీర్లు చేసిన టెస్ట్ లు తర్వాత-
యూత్ ని ఎట్రాక్ట్ చెయ్యడానికి ఏదైనా పధకం ఆలోచించాలి....దాని ద్వారా పెద్ద పేపర్ పబ్లిసిటీ వస్తుంది. అది ముఖ్యం.
* * * * *
ఆ సమయంలో జగన్నాధ మిశ్రా శివానీ మోటార్స్ ఆఫీసులోకి అడుగు పెట్టాడు.
అక్కడొక అద్భుతమైన వాతావరణం కన్పిస్తోందతనికి.
శ్రమైక శక్తితో రూపుదిద్దుకుంటున్న ఒక యాంత్రిక స్వర్గంలా కనిపించిందతనికి.
"నా పేరు జగన్నాధ మిశ్రా... చాలా రోజుల్నుంచి మిమ్మల్ని కలవడానికి ప్రయత్నం చేస్తున్నారు. అవసరమైన సమయంలో కలిస్తేనే బావుంటుందని ఇప్పుడొచ్చాను. సీనియర్ డీలర్ ని నేను.... ఒరిస్సా, వెస్ట్ బెంగాల్ లో కూడా మాకు బ్రాంచీలున్నాయి. మొదటి బ్యాచీగా మీరెన్ని కార్లను రిలీజ్ చేస్తున్నారు..." అడిగాడు జగన్నాధమిశ్రా.